• facebook
  • whatsapp
  • telegram

జీవవైవిధ్యం

ఆరోగ్యవంతమైన ఆవరణ వ్యవస్థకు ఆధారం!
 


భూమిపై జీవుల మధ్య ఉన్న వైవిధ్యాన్నే జీవవైవిధ్యం అంటారు. ప్రకృతిలో జీవుల మధ్య సహజంగా కనిపించే భిన్నత్వం, నిర్దిష్ట ప్రాంతంలోని వివిధ జాతుల సముదాయాన్ని కూడా జీవవైవిధ్యంగా చెప్పవచ్చు. సహజ ఆవరణ వ్యవస్థలోని ప్రతి జీవి, జీవావరణ సమతౌల్యతకు దోహదపడుతుంది. స్థిరమైన, ఆరోగ్యవంతమైన ఆవరణ వ్యవస్థను నిర్మించడంలో  జీవవైవిధ్యం తోడ్పడుతుంది. జన్యు, జాతి, ఆవరణ వ్యవస్థల వైవిధ్యాలుగా మూడు స్థాయుల్లో ఉండే ఈ అంశంపై పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. జీవ, జన్యుపరమైన వైవిధ్యం వల్ల ఉన్న విస్తృత ప్రయోజనాలు, జీవవైవిధ్య క్షీణతకు ప్రధాన కారణాలు, పర్యవసానాలు, నివారణ చర్యలు, ఈ దిశగా కుదిరిన జాతీయ, అంతర్జాతీయ ఒప్పందాల గురించి తెలుసుకోవాలి.

జీవరాశుల్లోని భిన్న జాతులకు.. వాటి చుట్టూ ఉండే జీవ, నిర్జీవ కారకాలతో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ప్రకృతిలో ఏ జీవి కూడా ఒంటరిగా జీవించలేదు. ప్రతి ప్రాణి తన పరిసరాలపై, ఇతర జీవరాశుల మీద; ఆవాసం, ఆహారం, ప్రత్యుత్పత్తి కోసం ఆధారపడి ఉంటుంది. ఈ భావనే ‘జీవవైవిధ్యం’ అనే పదం ఆవిష్కరణకు దోహదపడింది. జీవవైవిధ్యం అతి సూక్ష్మస్థాయిలోని జన్యువుల నుంచి ప్రారంభమై, జాతులు, ఆవరణ వ్యవస్థల స్థాయుల్లో స్పష్టతను సంతరించుకుంటుంది. జీవవైవిధ్యం జాతీయ సంపదకు సూచిక. మానవ జీవనానికి, వికాసానికి ఆధారమైంది. జీవవైవిధ్యం అనే పదాన్ని మొదటిసారిగా 1986లో వాల్టర్‌ రోసెన్‌ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టారు. 1988లో ఇ.ఓ.విల్సన్‌ ‘బయోడైవర్సిటీ’ అనే పుస్తక రూపంలో జీవవైవిధ్యతకు విశేష ప్రాచుర్యం కల్పించారు.

బ్రెజిల్‌లోని రియోడిజెనిరో (1992)లో జరిగిన ధరిత్రీ శిఖరాగ్ర సమావేశం తీర్మానం ప్రకారం ‘‘వివిధ జీవరాశుల మధ్య భూమి మీద, సముద్రంలో జలావరణంలో, జాతిలో, జాతుల్లో కనిపించే వైవిధ్యమే జీవవైవిధ్యం’’.

* భూమిపై సుమారు 10 నుంచి 80 మిలియన్ల   (8 కోట్లు) జాతులు నివసిస్తున్నాయి. ఇందులో కేవలం 1.5 మిలియన్‌ (15 లక్షలు) జాతులనే ఇంతవరకు అధ్యయనం చేశారు.

జీవవైవిధ్యం గురించి తెలుసుకోవడానికి రెండు అంశాలు ఉపయోగపడతాయి. అవి: 1) జీవ వైవిధ్యం - స్థాయులు 2) జీవ వైవిధ్యం - గుర్తింపు

1) జీవ వైవిధ్యం - స్థాయులు:  జీవ వైవిధ్యాన్ని మూడు వైవిధ్యాలుగా/స్థాయులుగా విభజించవచ్చు. 

ఎ) జన్యు వైవిధ్యం (Genetic Diversity) 

బి) జాతి వైవిధ్యం (Species Diversity)

సి) జీవావరణ వైవిధ్యం (Ecosystem Diversity)


జన్యు వైవిధ్యం: ఒక జాతికి చెందిన జీవి జన్యువుల్లోని వ్యత్యాసాలను జన్యు వైవిధ్యాలుగా పేర్కొంటారు. ఇవి ఒకేజాతికి చెందిన భిన్న జనాభాల మధ్య, ఒకే జనాభాకు చెందిన భిన్న జన్యువుల మధ్య ఉండే వ్యత్యాసాలను ప్రతిబింబిస్తాయి. ఇలాంటి వైవిధ్యాలు తర్వాత తరాలకు సంక్రమిస్తాయి. ఇవే వరిలో అనేకరకాల ఉత్పత్తికి దోహదపడ్డాయి.

జాతి వైవిధ్యం: ఒక ప్రదేశంలో ఉండే వివిధ జాతుల రకాలను జాతి వైవిధ్యాలుగా పేర్కొంటారు. ఈ జాతి వైవిధ్యాన్ని ఆ ప్రదేశంలో ఉండే జాతుల సంఖ్య, వాటి పరిమాణం ఆధారంగా పేర్కొంటారు. ఒక ప్రమాణ వైశాల్యంలో నివసించే పలు జాతుల మధ్య ఉన్న శారీరక తేడాలు, వైవిధ్యాలే జాతి వైవిధ్యం. అంటే ప్రమాణ వైశాల్యం ఉన్న భూభాగంలో ఎన్ని జాతులు జీవిస్తున్నాయో ఇది తెలియజేస్తుంది.

* భూమిపై అత్యధిక సంఖ్యలో జాతులు భూమధ్యరేఖకు ఇరువైపులా 23 1/2 డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ప్రాంతాల్లో నివసిస్తున్నాయి.

సముద్ర ఆవరణ వ్యవస్థలో ఖండతీరపు అంచులో జాతుల సంపన్నత్వం ఎక్కువగా ఉంటుంది.

* ఈ జాతుల వైవిధ్యం ఆవరణ వ్యవస్థ స్థిరత్వాన్ని సూచిస్తుంది. 

జీవావరణ వైవిధ్యం: ఒక ప్రదేశంలోని జీవ సముదాయం, అక్కడ ఉండే నిర్జీవ పరిసరాలను కలిపి ఆవరణ వ్యవస్థ అంటారు. విభిన్న జీవరాశులతో కూడిన ఆవాసాల్లో కనిపించే వైవిధ్యాలను ‘ఆవరణ వ్యవస్థ వైవిధ్యాలు’ అంటారు.

క్రియా వైవిధ్యం: జీవావరణ వ్యవస్థలోని వివిధ జీవ జాతుల ప్రవర్తన, ఆహారపు అలవాట్లు, వనరుల   వినియోగాన్ని ‘క్రియా వైవిధ్యం’ అంటారు. 

2) జీవ వైవిధ్యం - గుర్తింపు:  ఒక ఆవరణ వ్యవస్థలో వివిధ జీవజాతులు నివసించే అనేక జీవ సమాజాల్లో నెలకొన్న మార్పులను తెలియజేసేదే ‘సహజ వైవిధ్యం’.

* 1972లో విట్టేకర్‌ అనే శాస్త్రవేత్త జీవ వైవిధ్య గణనకు మూడు రకాల కొలమానాలను ప్రతిపాదించారు. జీవవైవిధ్యాన్ని గుర్తించడానికి 3 భిన్నత్వ సూచికలు/కొలమానాలు తోడ్పడతాయి.

అవి..

ఎ) ఆల్ఫా వైవిధ్యం

బి) బీటా వైవిధ్యం

సి) గామా వైవిధ్యం.

జీవ వైవిధ్యం ప్రాముఖ్యం:

* ప్రపంచంలోని ఆహార ఉత్పత్తిలో 85% ఆహార ఉత్పత్తి 20 రకాల వృక్షజాతుల నుంచి, 15% జంతు జాతుల నుంచే జరుగుతోంది.

* జీవవైవిధ్యం నుంచి సేకరించిన జన్యు పదార్థం ఆధునిక ఔషధాల తయారీకి ఉపయోగపడుతుంది. ఉదా:  సింకోనా చెట్టు బెరడు నుంచి తయారుచేసిన క్వినైన్‌ అనే ఔషధాన్ని మలేరియా వ్యాధి నివారణలో ఉపయోగిస్తారు. మ్యూ మొక్కను యాంటీ కాన్సర్‌ డ్రగ్‌ తయారీలో వినియోగిస్తారు.

* ఆవరణ వ్యవస్థల సమతౌల్యాన్ని కాపాడటంలో నేల క్రమక్షయ నివారణలో జీవవైవిధ్యం ఉపయోగపడుతుంది.

* సహజమైన జంతు ఆవాసాలు,అడవులు, పర్వతాలు, సముద్రతీరాలు మొదలైనవన్నీ మనసుకు ఆహ్లాదం కలిగిస్తాయి. జీవవైవిధ్యం ఒక స్థిరమైన, ఆరోగ్యవంతమైన ఆవరణ వ్యవస్థను నిర్మించడంలో తోడ్పడుతుంది.

* జీవవైవిధ్యానికి అనేక  వాణిజ్యపరమైన విలువలున్నాయి. పరిశ్రమలకు  కావాల్సిన ముడిపదార్థాలను అందజేస్తుంది.

* కాలుష్య నివారణలో కీలకపాత్ర వహిస్తుంది. వాతావరణంలోని కార్బన్‌డైఆక్సైడ్‌ వాయువు స్థిరీకరణలో తోడ్పడుతుంది.

జీవ వైవిధ్యం - హాని/ముప్పు:  జాతుల విలుప్తతకు 4 ప్రధాన  కారణాలున్నాయి.

అవి..

* ఆవాస క్షీణత - శకలీకరణం లేదా ముక్కలవ్వడం

* వనరుల అతి వినియోగం

* స్థానికేతర జాతుల చొరబాటు

* సహ విలుప్తతలు.

జీవవైవిధ్య నష్టం - కారణాలు:  

సహజ కారణాలు: వరదలు, భూకంపాలు, కొండచరియలు    విరిగిపడటం, జాతులపోటీ, పరాగసంపర్కం తగ్గడం.

మానవనిర్మిత కారణాలు: ఆవాసక్షీణత - శకలీకరణం/ముక్కలవ్వడం, అనియంత్రిత వాణిజ్య దోపిడీ, వన్యప్రాణుల వేట,పారిశ్రామిక అభివృద్ధి, కాలుష్యం, వ్యవసాయ విస్తరణ, చిత్తడి నేలల విధ్వంసం, తీరప్రాంతాల విధ్వంసం.

* ఐక్యరాజ్యసమితి జీవవైవిధ్య సంవత్సరం: 2010

* ఐరాస జీవవైవిధ్య దశాబ్దం: 2011 - 2020

* భారత జీవవైవిధ్య చట్టం: 2002

* అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం: మే 22

* ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవం-2023 థీమ్‌: ‘ఫ్రమ్‌ అగ్రిమెంట్‌ టూ యాక్షన్‌: బిల్డ్‌ బ్యాక్‌ బయోడైవర్సిటీ’  

* 1995లో జపాన్‌ పరిశోధనే ధ్యేయంగా,  పరిరక్షణ లక్ష్యంగా ‘బయోడైవర్సిటీ సెంటర్‌’ను స్థాపించింది.

* 1996, జనవరి నాటికి ధరిత్రీ సదస్సు (1992) ఒడంబడికపై 170 దేశాలకు పైగా సంతకాలు చేశాయి. మన దేశం 1994లోనే ఈ ఒడంబడికకు అంగీకరించింది.

* 1999-2000లో ‘ప్రపంచ జీవవైవిధ్యం’పై  ప్రపంచ బ్యాంకు ఓ నివేదికను ప్రచురించింది.

‘పర్యావరణ సదస్సులు - జీవవైవిధ్యం’ కార్యాచరణ పథకాలు

సంవత్సరం కార్యాచరణ పథకాలు
1972 పర్యావరణ హక్కుల పరిరక్షణ కోసం మొదటిసారిగా స్టాక్‌హోమ్‌లో ఐక్యరాజ్య సమితి సదస్సు  నిర్వహించింది.
1992 బ్రెజిల్‌ రాజధాని రియో డి జెనిరోలో ధరిత్రీ సదస్సు జరిగింది.
1993  దక్షిణ భారతదేశంలో ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది.
1994 పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం పర్యావరణ కార్యాచరణ పథకం (EAP) ప్రారంభించింది.
1997 179 దేశాలు జపాన్‌లో క్యోటో ప్రోటోకాల్‌ రూపొందించాయి. క్యోటో సదస్సులో గ్లోబల్‌ వార్మింగ్, గ్రీన్‌ హౌస్‌ వాయువులను నిరోధించడంపై చర్చించారు.
2000 పలు రకాల జీవులను సంరక్షించడానికి 2000,  జనవరిలో ‘కార్జెజీనా ప్రొటోకాల్‌ ఆన్‌ బయోసేఫ్టీ’ ఒప్పందం కుదిరింది. 2003, సెప్టెంబరు 11 నుంచి అమల్లోకి వచ్చింది.
2002 2002, ఆగస్టు 26న దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌ బర్గ్‌లో ధరిత్రీ సదస్సు జరిగింది. నీరు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, ఆరోగ్యం, వ్యవసాయం, జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ లాంటి అంశాల గురించి చర్చించారు.
2010 జపాన్‌లోని నగోయా నగరంలో 2010లో జీవ   వైవిధ్య సంరక్షణ కోసం ఒక వ్యూహాత్మక ప్రణాళికను సభ్య దేశాలు ఆమోదించాయి.


    
 

 

 

 

 

రచయిత: ఈదుబిల్లి వేణుగోపాల్‌

Posted Date : 03-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌