• facebook
  • whatsapp
  • telegram

విద్యుత్తు ఉత్పత్తి - పంపిణీ

శక్తి వినియోగంలో సంస్కరణల వెలుగులు

సరికొత్త ఆర్థిక సంస్కరణలకు అనుగుణంగా విద్యుత్తు రంగాన్ని సంస్కరించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, దేశానికి ఆదర్శంగా నిలిచింది. అందులో భాగంగా విద్యుత్తు ఉత్పత్తి, పంపిణీ విభాగాలను వేరుచేయడంతో పాటు సరఫరాలో పొదుపు కోసం ప్రగతిశీల, వ్యవస్థాగత  విధానాలను అమలు చేసింది. మారుతున్న పరిస్థితులు, సాంకేతికతల ప్రకారం సంప్రదాయేతర విద్యుత్తు ఉత్పత్తినీ గణనీయంగా పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు నుంచి నేటి వరకు విద్యుత్తు ఉత్పత్తి, పంపిణీ తీరుతెన్నులు, అవలంబిస్తున్న ఆధునిక పద్ధతులు తదితరాల గురించి పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. విద్యుత్తు రంగం ఆధునికీకరణకు కేంద్రం ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతున్న పథకాలను అందిపుచ్చుకుంటూ, సమర్థంగా ప్రజలకు చేర వేస్తున్న వైనాన్ని గణాంకాల సహితంగా తెలుసుకోవాలి.

పనికి మూలమైన శక్తిని అందించే వనరులను ఇంధనాలు అంటారు. శక్తి ఇంధనాలు రెండు రకాలు 1) వాణిజ్య    ఇంధనాలు 2) వాణిజ్యేతర ఇంధనాలు.

వాణిజ్య ఇంధనాలు: 1) బొగ్గు, లిగ్నైట్‌ 2) పెట్రోలియం   3) సహజవాయువు 4) అణుఇంధనం.

వాణిజ్యేతర ఇంధనాలు: 1) సూర్యరశ్మి 2) నీరు        3) వాయువు 4) వంట చెరకు 5) పశు వ్యర్థాలు 6) పండ్లు, కూరగాయల తొక్కలు.
విద్యుత్తు ఒక శక్తివాహకం లేదా శక్తి రకాల్లో అతి ప్రధానమైంది. భారత రాజ్యాంగం ప్రకారం విద్యుత్తు ఉత్పత్తి, పంపిణీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితా పరిధిలోకి వస్తాయి. 1926-27లో మద్రాసు రాష్ట్ర విద్యుత్తు మండలి ఏర్పాటైంది. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు పూర్వం మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు అక్కడి నుంచే విద్యుత్తు లభించేది. నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నంలో థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలు పనిచేసేవి. ఈ మూడు కేంద్రాల మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 24,000 కిలోవాట్లు. ఇవికాకుండా 13 ఇతర ప్రదేశాల్లో డీజిల్‌ విద్యుత్తు కేంద్రాలు పనిచేసేవి. వాటి మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 11,000 కి.వా. మైసూరు జోగ్‌ విద్యుత్తు కేంద్రం నుంచి 2000 కి.వా., మద్రాస్‌ మెట్టూరు కేంద్రం నుంచి 3400 కి.వా., మైసూరు శివసముద్రం కేంద్రం నుంచి 700 కి.వా. విద్యుత్తు లభించేది. ప్రభుత్వ విద్యుత్తు  శాఖతోపాటు ప్రైవేటు రంగంలో 12 అనుమతి పొందిన విద్యుత్తు సంస్థలు సరఫరా చేసేవి. 1953-54లో ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్తు వినియోగదారుల సంఖ్య 53,839.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్తు మండలి (ఏపీఎస్‌ఈబీ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 1959, ఏప్రిల్‌ 1న హైదరాబాద్‌ ప్రధాన కార్యాలయంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్తు మండలి ఏర్పాటైంది. విద్యుత్తు మండళ్లు నష్టాల నుంచి బయటపడటానికి రాష్ట్రాలు సంస్కరణలు చేపట్టాలన్న కేంద్రం సిఫార్సును అనుసరించి అప్పటి ఏపీ ప్రభుత్వం 1995లో కాటేన్‌భయ్యా కమిటీని నియమించింది. 1998లో విద్యుత్తు సంస్కరణల చట్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ): ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు సంస్కరణల చట్టం-1998 కింద 1999, మార్చి 31న ఈ నియంత్రణ మండలి ఏర్పాటైంది. రాష్ట్రంలో విద్యుత్తు రంగం పనితీరు మెరుగుపరిచేందుకు ఇది చొరవ తీసుకుంటుంది. విద్యుత్తు ఛార్జీలను నిర్ణయించడంతోపాటు,  వినియోగదారుల ప్రయోజనాలు కాపాడటం దీని బాధ్యత.

జెన్‌కో, ట్రాన్స్‌కో: సంస్కరణల్లో భాగంగా 1998, డిసెంబరులో ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు ఉత్పాదక సంస్థ (ఏపీ జెన్‌కో), ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు సరఫరా సంస్థ (ఏపీ ట్రాన్స్‌కో) ఏర్పాటయ్యాయి. 1999, ఫిబ్రవరి నుంచి ఇవి పనిచేయడం ప్రారంభించాయి.

ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ - 2006 (ఏపీపీడీసీఎల్‌):  ఇది ఏపీ జెన్‌కో ఇన్‌ఫ్రాస్టక్చర్‌ లీజింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌తో కలిసి సగం సగం ఈక్విటీతో ఏర్పాటు  చేసిన సంయుక్త సంస్థ. ట్రాన్స్‌కో, జెన్‌కో ఉత్పత్తి చేసిన విద్యుత్తును వివిధ ప్రాంతాలకు సరఫరా చేయడం దీని బాధ్యత. అంతేకాకుండా కేంద్ర విద్యుత్తు గ్రిడ్‌ నుంచి, ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్తు కొని సరఫరా చేసే ఏకైక సంస్థ. 1999 నుంచి 2005 వరకు ఈ సంస్థ మాత్రమే విద్యుత్తు కొనుగోళ్లు చేసేది. 2005లో ఈ బాధ్యతను పంపిణీ సంస్థలకు అప్పగించారు. దీని  ప్రధాన కార్యాలయం విజయవాడలో ఉంది. 

రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు: 2022-23 నాటికి రాష్ట్రంలో పనిచేస్తున్న మొత్తం విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు 20. ఇందులో 2 ప్రభుత్వ సంస్థలు, 18 ప్రైవేటు రంగానికి చెందినవి. ప్రస్తుతం ప్రభుత్వ సంస్థల కింద 19, ప్రైవేటు సంస్థల పరిధిలో 49, మొత్తం 68 సంస్థలు పనిచేస్తున్నాయి.

విద్యుత్తు పంపిణీ సంస్థలు: విద్యుత్తు సంస్కరణల్లో భాగంగా ఏపీ ట్రాన్స్‌కోను 2000, ఏప్రిల్‌లో ‘ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్‌’ పేర్లతో ప్రాంతాల వారీగా నాలుగు పంపిణీ సంస్థలుగా పునర్వ్యవస్థీకరించారు. 2014లో రాష్ట్ర పునర్విభజన తర్వాత తూర్పు విద్యుత్తు పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌), దక్షిణ విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్‌) నవ్యాంధ్ర పరిధిలోకి వచ్చాయి. తూర్పు విద్యుత్తు పంపిణీ సంస్థ పరిధిలో అప్పటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ    పట్నం, ఉభయగోదావరి జిల్లాలు ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉంది. దక్షిణ పంపిణీ సంస్థ పరిధిలోకి నాటి అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలు వచ్చాయి. దీని ప్రధాన కార్యాలయం తిరుపతిలో ఉంది.

మొత్తం ఉత్పత్తి స్థాపితశక్తి: ఏపీలో మొత్తం విద్యుత్తు స్థాపితశక్తి 18,518.062 మెగావాట్లు. అందులో ఏపీ జెన్‌కో 5,589.03 మెగావాట్లు (30.3%), ఏపీ పవర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ 1600 మెగావాట్లు (8.6%), ప్రైవేటు రంగం 9,675.656 మెగావాట్లు (52.2%), కేంద్రం నుంచి వచ్చే వాటా 1,978.806 మెగావాట్లు (10.7%).

మొత్తం విద్యుత్తు ఉత్పత్తి 2022-23 లెక్కల ప్రకారం 47,648.34 మెగా యూనిట్లు. అందులో ఏపీ జెన్‌కో (హైడల్, థర్మల్‌) 18,710.63 మెగా యూనిట్లు (39.3%), పవన విద్యుత్తు 5,927.03 మెగా యూనిట్లు, సౌర విద్యుత్తు 5,066.39 మెగా యూనిట్లు, ఇతర సంప్రదాయేతర వనరుల ద్వారా 585.49 మె.యూ., ఇతర సంస్థలు 17,358.80 మెగా యూనిట్లు (36.4 శాతం.) సమకూర్చాయి.

ట్రాన్స్‌ఫార్మర్లు: 2021-22 మార్చి నాటికి రాష్ట్రంలో సబ్‌స్టేషన్ల వద్ద 5,872 ట్రాన్స్‌ఫార్మర్లు పనిచేస్తున్నాయి. వీటిలో 400, 220, 132, 33 కె.వి.ఎస్‌. ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. అలాగే పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లు 11,01,651 ఉన్నాయి.

విద్యుత్తు డిమాండ్, వినియోగం: రాష్ట్రంలో 2022-23 నాటికి విద్యుత్తు గరిష్ఠ డిమాండ్‌ 12,293 మెగావాట్లు, తీర్చిన కనిష్ఠ డిమాండ్‌ 12,293 మెగావాట్లు. గరిష్ఠ గ్రిడ్‌ వినియోగం 234.15 మెగా యూనిట్లు. మొత్తం వినియోగదారులు 205.77 లక్షలు. వ్యవసాయ సర్వీసులు 18.87 లక్షలు. తలసరి వినియోగం 1,349 కి.వా. మొత్తం వినియోగం 53,541.21 మెగా యూనిట్లు. అందులో లో టెన్షన్‌ వినియోగం 34,234.21 మెగా యూనిట్లు (63.9 శాతం), హైటెన్షన్‌ వినియోగం 19,307 మెగా యూనిట్లు (35.1%).

ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ హైవోల్టేజీ పంపిణీ వ్యవస్థ ప్రాజెక్టు: ఈ ప్రాజెక్టులో లో వోల్టేజీ నెట్‌వర్క్‌ స్థానంలో హై వోల్టేజీ నెట్‌వర్క్‌ ఏర్పాటు ద్వారా నష్టాలు తగ్గించడం లక్ష్యం. 100 కేవీఏ/63 కేవీఏ లాంటి ఎక్కువ సామర్థ్యం ఉన్న పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో 25 కేవిఏ/16 కేవీఏ లాంటి తక్కువ సామర్థ్యం ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను అధికసంఖ్యలో ఏర్పాటు చేస్తారు. దీనివల్ల నష్టాలను 10% తగ్గించొచ్చు. 2022-23 నవంబరు వరకు 44,055 వ్యవసాయ సర్వీసులకు ఈ పథకాన్ని అమలుచేశారు. ఇప్పటి వరకు మొత్తం 12,66,685 సర్వీసులకు పథకం అమలైంది.

బాహ్య సహాయ ప్రాజెక్టులు: ప్రపంచ బ్యాంకు పథకమైన ‘అందరికీ విద్యుత్తు’, కింద రాష్ట్రానికి 69 పనులు మంజూరయ్యాయి. అందులో 30 పూర్తవగా, మిగిలిన 39 పురోగతిలో ఉన్నాయి.
విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక నడవా ప్రాజెక్టు: ఆసియా అభివృద్ధి బ్యాంకు సాయ మందించే ఈ ప్రాజెక్టులో భాగంగా విద్యుత్తుకు సంబంధించి 6 ప్యాకేజీలు మంజూరయ్యాయి. అందులో 3 పనులు పూర్తవగా, మిగిలినవి పురోగతిలో ఉన్నాయి.
వేగవంతమైన విద్యుత్తు అభివృద్ధి, సంస్కరణ కార్యక్రమం: 2020-21లో కేంద్రం ఈ పథకం ప్రారంభించింది. దీనికి ప్రపంచ బ్యాంకు సాయం అందిస్తుంది. రాష్ట్ర విద్యుత్తు శాఖలు వాణిజ్యపరంగా నిలదొక్కుకునేలా తోడ్పడటం దీని లక్ష్యం.

హరితశక్తి నడవా 1, 2: పన్నెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో అదనంగా 32,713 మెగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యం తరలింపు, ఏకీకరణ కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు.

జాతీయ ఎల్‌ఈడీ కార్యక్రమం: విద్యుత్తుని తక్కువ వ్యయంతో పొదుపుగా, సమర్థంగా వాడటం కోసం 2005, జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో రెండు భాగాలున్నాయి. ‘ఉన్నత్‌ జ్యోతి జీవన్‌ బై అఫోర్డబుల్‌ ఎల్‌ఈడీ ఫర్‌ ఆల్‌’ కింద దేశంలో గృహ వినియోగదార్లకు సంబంధించిన 77 కోట్ల సాధారణ బల్బులకు బదులు ఎల్‌ఈడీ బల్బులు అమరుస్తారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో  2.32 కోట్ల ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ లక్ష్యం కాగా, 2.20 కోట్ల మందికి అందించారు. దీంతో వార్షికంగా 1,621 మెగా యూనిట్ల విద్యుత్తు పొదుపుతో, రూ.1,131 కోట్లు ఆదా అయ్యింది. కుటుంబానికి 60 వాట్ల బల్బు స్థానంలో ఒక్కొక్కటి రూ.10లకు 7 వా. /9 వాట్ల బల్బులు రెండు అందజేశారు. దీనివల్ల కుటుంబానికి ఏడాదికి  73.7 యూనిట్లు విద్యుత్తు ఆదా అవుతుంది.
వీధిదీపాల కార్యక్రమం: ఈ కార్యక్రమం ద్వారా 2019, మార్చి నాటికి దేశంలో 1.34 కోట్ల సంప్రదాయ వీధిదీపాలకు బదులు ఎల్‌ఈడీ దీపాలు అమరుస్తారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 13,065 గ్రామ పంచాయతీల్లో 30 లక్షల ఎల్‌ఈడీ వీధిదీపాలను ఏర్పాటుచేశారు. 279 మి.యూనిట్ల విద్యుత్తు, రూ.195 కోట్లు ఆదా అయ్యాయి.

రచయిత: ధరణి శ్రీనివాస్‌ 
 

Posted Date : 17-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌