• facebook
  • whatsapp
  • telegram

భారత భూభాగం - రాష్ట్రాలు

భిన్న సంస్కృతుల  సమాఖ్య స్వరూపం!

భారత రాజ్యాంగం దేశాన్ని రాష్ట్రాల సమాఖ్యగా పేర్కొంది. విశాల భూభాగం, వివిధ భాషలు, విభిన్న సంస్కృతులు, ఆచార వ్యవహారాలకు నిలయమైన ఉపఖండాన్ని పరిపాలనా సౌలభ్యం, ప్రాంతీయ ఆకాంక్షల మేరకు పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది.  దేశ భౌగోళిక రాజకీయ ముఖచిత్రాన్ని ప్రతిబింబించే ఆ విభజన, కూర్పుపై పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. స్వాతంత్య్రానంతరం నుంచి నేటి వరకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు దారితీసిన పరిస్థితులు, ఎప్పుడు, ఏ ప్రభుత్వ హయాంలో ఏ రాష్ట్రం   ఏర్పడింది, ఆ క్రమంలో జరిగిన భూభాగాల మార్పుచేర్పులను వివరంగా తెలుసుకోవాలి.

భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి నిలయం. కేంద్ర భూభాగాన్ని ‘ఇండియా’గా పేర్కొన్నారు. భారత భూభాగ పరిధి అంటే భారత సార్వభౌమాధికారం వర్తించేంత   వరకు అని అర్థం. దీని ప్రకారం ప్రస్తుతానికి భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.


నేపథ్యం: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశ రాజకీయ ముఖచిత్రం రెండు రకాలుగా ఉండేది. 

1) బ్రిటిష్‌ ప్రభుత్వ ప్రత్యక్ష పాలనలో ఉండే ‘బ్రిటిష్‌ ప్రావిన్సులు’. 

2) స్వదేశీ రాజుల పాలన కింద, బ్రిటిష్‌ సర్వసమున్నతాధికార పరిధిలోని ‘స్వదేశీ సంస్థానాలు’. 1950, జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి మన దేశ భూభాగ పరిపాలనా పరిధిని నాలుగు రకాలుగా వర్గీకరించారు.


పార్ట్‌-ఎ రాష్ట్రాలు: గతంలో బ్రిటిష్‌ పాలిత ప్రాంతాలుగా ఉండేవి. వీటి సంఖ్య-9. అవి 

1) అస్సాం 

2) బిహార్‌  

3) బాంబే

 4) ఒరిస్సా 

5) మధ్యప్రదేశ్‌ 

6) మద్రాస్‌ 

7) పశ్చిమ బెంగాల్‌ 

8) పంజాబ్‌ 

9) యునైటెడ్‌ ప్రావిన్స్‌.


పార్ట్‌-బి రాష్ట్రాలు: శాసన సభలు లేని 9 స్వదేశీ సంస్థానాలను ఇందులో చేర్చారు..అవి 

1) హైదరాబాద్‌  

2) జమ్ము-కశ్మీర్‌ 

3) మధ్య భారత్‌ 

4) సౌరాష్ట్ర 

5) వింధ్యప్రదేశ్‌ 

6) ట్రావెన్‌కోర్‌ కొచ్చిన్‌

 7) రాజస్థాన్‌ 

8) మైసూర్‌ 

9) పాటియాలా, తూర్పు పంజాబ్‌


పార్ట్‌-సి రాష్ట్రాలు: గతంలో చీఫ్‌ కమిషనరేట్‌ ప్రాంతాలుగా ఉన్నవాటిని, కొన్ని స్వదేశీ సంస్థానాలను ఇందులో పేర్కొన్నారు. వీటి సంఖ్య 10. 

1) భోపాల్‌ 

2) అజ్మీర్‌ 

3) దిల్లీ

 4) కూర్గ్‌ 

5) కూచ్‌ బిహార్‌ 

6) బిలాస్‌పుర్‌ 

7) మణిపుర్‌ 

8) త్రిపుర 

9) కచ్‌ 

10) హిమాచల్‌ ప్రదేశ్‌ 

పార్ట్‌-డి రాష్ట్రాలు: అండమాన్‌ నికోబార్‌ దీవులు. 

 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం-1956 :

 భారత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఫజుల్‌ అలీ కమిషన్‌ సిఫార్సుల మేరకు జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వ కాలంలో భారత పార్లమెంటు 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ద్వారా పార్ట్‌- ఎ, బి, సి, డి లుగా ఉన్న రాష్ట్రాలన్నింటినీ పునర్వ్యవస్థీకరించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. దీని ప్రకారం అప్పట్లో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటయ్యాయి.

1956లో ఏర్పాటైన రాష్ట్రాలు: 

1) అస్సాం

 2) బెంగాల్‌ 

3) బిహార్‌ 

4) మద్రాస్‌ 

5) ఒరిస్సా

 6) కేరళ 

7) ఆంధ్రప్రదేశ్‌ 

8) మైసూర్‌ 

9) బొంబాయి 

10) ఉత్తర్‌ప్రదేశ్‌  

11) మధ్యప్రదేశ్‌ 

12) పంజాబ్‌ 

13) రాజస్థాన్‌ 

14) జమ్ము-కశ్మీర్‌


1956లో ఏర్పాటైన కేంద్రపాలిత ప్రాంతాలు: 

1)దిల్లీ 

2) హిమాచల్‌ ప్రదేశ్‌ 

3) అండమాన్‌ నికోబార్‌ దీవులు

 4) త్రిపుర

 5) మణిపుర్‌ 

6) అమోనీ, మినికాయ్, లాక్‌దీవులు. 

1956 తర్వాత - భారత రాజకీయ ముఖచిత్రంలో వచ్చిన మార్పులు : ఉమ్మడి చరిత్ర, సంస్కృతి, భౌగోళిక సామీప్యత ఉన్న కొన్నిప్రాంతాలవారు తమ మనుగడ కోసం ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు కోరుకున్నారు. ఇందుకోసం ప్రజాఉద్యమాలను నిర్వహించారు. దీనికి రాజకీయ దృక్కోణం కూడా తోడవడంతో కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియను కొనసాగించింది.


15వ రాష్ట్రం - గుజరాత్‌:  కేంద్రంలో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం కొనసాగుతున్న సమయంలో బొంబాయి రాష్ట్రంలో ‘భూమిపుత్రుల సిద్ధాంతం’ మొదలైంది. మరాఠా ప్రాంతం మరాఠీయులకే చెందాలని, గుజరాతీ భాష మాట్లాడేవారిని ఆ ప్రాంతం నుంచి వేరుచేసి వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ‘బాంబే’లో భారీ ఉద్యమం కొనసాగింది. 1960లో ద్విభాషా రాష్ట్రమైన బొంబాయిని విభజిస్తూ ‘గుజరాతీ’ భాష మాట్లాడేవారి కోసం ప్రత్యేకంగా సౌరాష్ట్రను కలిపి 15వ రాష్ట్రంగా   ‘గుజరాత్‌’ను ఏర్పాటు చేశారు. ‘మరాఠీ’ మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్న ‘బొంబాయి’ రాష్ట్రాన్ని ‘మహారాష్ట్ర’గా పేరు మార్చారు.


16వ రాష్ట్రం-నాగాలాండ్‌: ఎ.జి.పిజో నేతృత్వంలోని నాగా తెగలవారు ‘అస్సాం’ రాష్ట్రం నుంచి తమకు ప్రత్యేక స్వయంప్రతిపత్తితో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని భారీ ఉద్యమం చేపట్టారు. దీంతో నాగా తెగల ఆకాంక్షలకు అనుగుణంగా నెహ్రూ ప్రభుత్వం ‘అస్సాం’ రాష్ట్రం నుంచి ‘నాగాహిల్స్‌’, ‘ట్యూన్‌సాంగ్‌’ని వేరు చేసి, 1963లో నాగాలాండ్‌ను 16వ రాష్ట్రంగా ఏర్పాటు చేసింది.


17వ రాష్ట్రం-హరియాణా: సిక్కుల మాతృభూమి (పంజాబ్‌ సుబా) పంజాబీయుల (సిక్కుల)కే చెందాలని, హిందీ భాష మాట్లాడేవారిని వేరు చేయాలని మాస్టర్‌ తారా సింగ్‌ నేతృత్వంలోని ‘అకాలీదళ్‌’ ప్రజాఉద్యమం చేపట్టింది. ఈ ఉద్యమం హింసాత్మకంగా మారడంతో, సమస్యపై అధ్యయనం కోసం కేంద్రం ‘షా’ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 1966లో ‘షా’ కమిషన్‌ సిఫార్సుల మేరకు పంజాబీ భాష మాట్లాడే ప్రాంతాలను ‘పంజాబ్‌’ రాష్ట్రంగా ఉంచి, హిందీ మాట్లాడే ప్రాంతాలను వేరుచేసి 17వ రాష్ట్రంగా ‘హరియాణా’ను ఏర్పాటు చేశారు. ఆ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ‘చండీగఢ్‌’ని నిర్దేశించి, దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు.

18వ రాష్ట్రం-హిమాచల్‌ ప్రదేశ్‌: 1956లో చేసిన రాష్ట్రాలపునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హిమాచల్‌ ప్రదేశ్‌ కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించింది. అయితే ప్రజల ఆకాంక్షలు, పరిపాలనా సౌలభ్యం ఆధారంగా ఇందిరా గాంధీ ప్రభుత్వం దీనిపై విస్తృత అధ్యయనం జరిపి, హిమాచల్‌ ప్రదేశ్‌కు బిలాస్‌పుర్‌ ప్రాంతాన్ని కలిపి, 1971లో 18వ రాష్ట్రంగా హిమాచల్‌ ప్రదేశ్‌ను ఏర్పాటు చేసింది.


19వ రాష్ట్రం-మణిపుర్‌: 1956 నాటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ‘మణిపుర్‌’’ కేంద్రపాలిత ప్రాంతంగా ఉండేది. అయితే స్థానికుల ఆకాంక్షలు, పరిపాలనా సౌలభ్యం ఆధారంగా ఇందిరాగాంధీ ప్రభుత్వం 1972లో మణిపుర్‌ను 19వ రాష్ట్రంగా ఏర్పాటు చేసింది.


20వ రాష్ట్రం-త్రిపుర: 1956, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం త్రిపుర కేంద్రపాలిత ప్రాంతంగా ఉండేది. ఇందిరా గాంధీ ప్రభుత్వ కాలంలో ప్రజాభిప్రాయం, పరిపాలనా సౌలభ్యం ఆధారంగా 1972లో త్రిపురను 20వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.


21వ రాష్ట్రం-మేఘాలయ: ఇందిరా గాంధీ ప్రభుత్వ కాలంలో 1972లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ‘అస్సాం’ రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించారు. అస్సాంలో ఉపప్రాంతంగా ఉన్న మేఘాలయను 21వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. ఇదే సందర్భంలో మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు.


22వ రాష్ట్రం-సిక్కిం: స్వాతంత్య్రానికి ముందు ‘సిక్కిం’ చోగ్యాల్‌ అనే వారసత్వపు రాజు పరిపాలనా నియంత్రణలో ఉండేది. ఇందిరా గాంధీ ప్రభుత్వ కాలంలో 35వ రాజ్యాంగ సవరణ చట్టం-1975 ద్వారా సిక్కిం భారత్‌లో సహరాష్ట్ర హోదా పొంది విలీనమైంది. ఇది పలు విమర్శలకు దారి తీయడంతో 1975లో ఇందిరా గాంధీ ప్రభుత్వం 36వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది. దాని ద్వారా దేశంలో 22వ రాష్ట్రంగా సిక్కిం ఆవిర్భవించింది.


23వ రాష్ట్రం-మిజోరం: 1986లో ‘మిజో నేషనల్‌ ఫ్రంట్‌’తో రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం మిజో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. దాని ఫలితంగా కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న ‘మిజోరం’ 53వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1987లో 23వ రాష్ట్రంగా మారింది.


24వ రాష్ట్రం-అరుణాచల్‌ ప్రదేశ్‌:  రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం కేంద్రపాలిత ప్రాంతమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ను పరిపాలనా సౌలభ్యం కోసం 1987లో 55వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 24వ రాష్ట్రంగా ఏర్పాటు చేసింది.


25వ రాష్ట్రం-గోవా:  గోవా పోర్చుగీసువారి నియంత్రణలో ఉండేది. భారత ప్రభుత్వం ‘ఆపరేషన్‌ విజయ్‌’ పేరుతో సైనిక చర్య జరిపి 1961లో గోవా, డయ్యూ, డామన్‌లను స్వాధీనం చేసుకుంది. అనంతరం ఈ ప్రాంతాలను 10వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటుచేసింది. రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 56వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించి, 1987లో గోవాను 25వ రాష్ట్రంగా ఏర్పాటు చేసింది. డయ్యూ, డామన్‌లను కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగించింది.


26వ రాష్ట్రం-ఛత్తీస్‌గఢ్‌: అటల్‌ బిహారీ వాజ్‌పేయీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మధ్యప్రదేశ్‌ రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించి, 2000 నవంబరు 1న ఛత్తీస్‌గఢ్‌ను 26వ రాష్ట్రంగా ఏర్పాటు చేసింది.


27వ రాష్ట్రం-ఉత్తరాంచల్‌:  వాజ్‌పేయీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించి, 2000, నవంబరు 9న ఉత్తరాంచల్‌ను 27వ రాష్ట్రంగా ఏర్పాటు చేసింది. దీనిని 2007 నుంచి ఉత్తరాఖండ్‌గా పేరు మార్చారు.


28వ రాష్ట్రం-ఝార్ఖండ్‌:  వాజ్‌పేయీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం బిహార్‌ రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించి 2000, నవంబరు 15న ఝార్ఖండ్‌ను 28వ రాష్ట్రంగా ఏర్పాటు చేసింది.


29వ రాష్ట్రం-తెలంగాణ:  మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2014లో ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని రూపొందించింది. దాని ద్వారా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజించడంతో 2014, జూన్‌ 2న   తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది.


నోట్‌: నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం 2019లో జమ్ము-కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం జమ్ము-కశ్మీర్‌ రాష్ట్ర హోదాను రద్దు చేసి జమ్ము- కశ్మీర్, లద్దాఖ్‌ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు.ఈ చట్టం 2019, అక్టోబరు 31 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.


 

రచయిత: బంగారు సత్యనారాయణ 

Posted Date : 05-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌