• facebook
  • whatsapp
  • telegram

ఏపీలో నీటిపారుదల వనరులు

సుస్థిర సాగు సాధనాలు!

వ్యవసాయాధారిత సమాజంలో సామాజిక, ఆర్థిక వృద్ధి సాధనాల్లో సాగునీరు కీలకం. దేశంలో సాగునీటి వనరులు, వసతి అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. ఇక్కడ అత్యధిక ప్రాంతానికి సాగునీటి వసతి ఉంది. నైసర్గిక స్వరూపం, చారిత్రక నేపథ్యం, స్వాతంత్య్రానికి ముందు, తర్వాత పలు నదులపై నిర్మించిన ప్రాజెక్టులు ఇందుకు కారణం. నదుల రాష్ట్రంగా, అన్నపూర్ణగా  ప్రసిద్ధికెక్కిన ఈ ప్రాంతంలో  ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టులు, వాటి ఆయకట్టు విస్తీర్ణం, లబ్ధి పొందుతున్న జిల్లాల గురించి పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. జిల్లాలు, ప్రాంతాల వారీగా సాగును నిర్దేశిస్తున్న ఇతర వనరుల గురించి అవగాహన పెంచుకోవాలి. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నీటి పారుదల లభ్యత సంతృప్తికరంగా ఉంది. నీటి పారుదల లేని ప్రాంతాలతో పోలిస్తే అది ఉన్న ప్రాంతాల్లో ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా అనిశ్చితిని, కరవును నియంత్రించవచ్చు. బహుళ పంటలు సాధ్యమవుతాయి. నీటి పారుదల పెరిగే కొద్దీ వ్యవసాయ ఉత్పత్తి, ఉపాధి పెరిగి వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధి జరిగి ప్రభుత్వానికి రాబడి పెరుగుతుంది. వ్యవసాయదారుల ఆదాయం అధికం కావడంతో వ్యవసాయ భద్రత, స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రాచీన కాలంలో చెరువుల వాటా అధికంగా ఉండేది. ప్రస్తుతం వాటి వాటా తగ్గుతోంది. పర్యావరణ పరిరక్షణ, వాన నీటి సంరక్షణ, భూగర్భజలాల పెంపు లాంటి ప్రయోజనాలను చెరువులు అందిస్తాయి. కాలువల ద్వారా ప్రవహించే నీటిలో 45 నుంచి 50 శాతం వరకు వృథా అవుతుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు వల్ల బావుల వాటా పెరుగుతోంది.

రాష్ట్రంలో నీటిపారుదల వసతి 4 మార్గాలుగా జరుగుతుంది.

1) కాలువలు 

2) బావులు 

3) చెరువులు 

4) ఇతర మార్గాలు

కాలువలు అధికంగా ఉన్న జిల్లాలు 1) గుంటూరు 2) కృష్ణా. కాలువలు తక్కువగా ఉన్న జిల్లా - అనంతపురం

చెరువులు ఎక్కువగా ఉన్న జిల్లాలు 1) నెల్లూరు 2) విజయనగరం. తక్కువగా ఉన్న జిల్లా - కడప

బావులు ఎక్కువగా ఉన్న జిల్లాలు 1) పశ్చిమ గోదావరి 2) అనంతపురం. తక్కువగా ఉన్న జిల్లా - శ్రీకాకుళం

ఇతర సాగునీటి మార్గాలు అధికంగా ఉండే జిల్లాలు 1) విశాఖ 2) కర్నూలు. తక్కువగా ఉన్న జిల్లా - కడప

మొత్తం అన్ని మార్గాల ద్వారా నీటిపారుదల ఎక్కువ ఉన్న జిల్లాలు 1) గుంటూరు 2) పశ్చిమ గోదావరి. తక్కువ - విశాఖపట్నం

రాష్ట్రంలో బిందుసేద్యం, తుంపర సేద్యం ఎక్కువ ఉన్న జిల్లాలు 1) చిత్తూరు 2) కడప 3) అనంతపురం 4) పశ్చిమ గోదావరి

సాగునీటి ప్రాజెక్టుల వర్గీకరణ

భూమికి నీటిని అందించే సామర్థ్యాన్ని బట్టి సాగునీటి ప్రాజెక్టులను 3 రకాలుగా వర్గీకరిస్తారు.

1) చిన్ననీటి పారుదల ప్రాజెక్టులు: 2 వేల హెక్టార్ల భూమికి నీటిని అందించే ప్రాజెక్టులు.

2) మధ్యతరహా ప్రాజెక్టులు: 2 వేల నుంచి 10 వేల హెక్టార్ల భూమికి నీటిని అందించే ప్రాజెక్టులు.

3) భారీ నీటిపారుదల ప్రాజెక్టులు:10 వేల హెక్టార్లకు మించి భూమికి నీటిని అందించే ప్రాజెక్టులు.

రాష్ట్రంలో మొత్తం 40 నదులున్నాయి. వీటిలో 15 అంతర్రాష్ట్ర నదులు. అందువల్ల రాష్ట్రాన్ని 'River in state' అంటారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల ద్వారా నీటిపారుదల వినియోగం 1301.127 టీఎమ్‌సీలు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నిర్మాణంలోని ప్రాజెక్టుల ద్వారా నీటిపారుదల వినియోగం 721.532 టీఎమ్‌సీలు.

నోట్‌: సాగునీటిని టీఎమ్‌సీ (Thousand Million cubic feets) (శతకోటి ఘనపుటడుగులు) ల్లో కొలుస్తారు.

ఒక టీఎమ్‌సీ = 28.317 క్యూబిక్‌ మీటర్లు. ఒక టీఎమ్‌సీ నీటితో 6 నుంచి 8 వేల ఎకరాల్లో వరి సాగు చేయవచ్చు.

జలయజ్ఞం

2004 అక్టోబరులో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర విభజనకు ముందు ఈ పథకంలో ఉన్న మొత్తం ప్రాజెక్టుల సంఖ్య 86. రాష్ట్ర విభజన తర్వాత ఉన్న ప్రాజెక్టుల సంఖ్య 54. ఇందులో ఇంతవరకు పూర్తిచేసిన ప్రాజెక్టులు 14 కాగా మరో 2 ప్రాజెక్టులు మొదటి దశ పూర్తి చేసుకున్నాయి (2020- 2021 వరకు). అవి 1) జంఝావతి రబ్బర్‌ డ్యామ్‌ - విజయనగరం 2) చాగల్‌నాడు ఎత్తిపోతల - తూర్పు గోదావరి.

మిగతా 40 ప్రాజెక్టులను వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేసి 28.54 లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం అందించాలన్నది లక్ష్యం. వీటిద్వారా 38.4 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. ఈ 40 ప్రాజెక్టుల్లో ఆరింటికి ఆధునికీకరణ, నాలుగు ప్రాజెక్టుల వరద గట్ల నిర్మాణం జరుగుతోంది.

నీటిపారుదల ప్రాజెక్టులు

ఆంధ్రప్రదేశ్‌లో 2017, డిసెంబరు నాటికి నీటిపారుదల సౌకర్యం కల్పించిన భూమి 103.91 లక్షల హెక్టార్లు. 2021 నాటికి ఇది 106.13 లక్షల హెక్టార్లకు పెరిగింది. ఇందులో భారీ ప్రాజెక్టుల ద్వారా 66.42 లక్షల హెక్టార్లు, మధ్యతరహా ప్రాజెక్టుల ద్వారా 5.55 లక్షల హెక్టార్లు, చిన్నతరహా ప్రాజెక్టుల ద్వారా 25.60 లక్షల హెక్టార్లు, మిగిలిన భూమి ఇతర పద్ధతుల ద్వారా సాగవుతుంది. ఏపీఎస్‌ఐడీసీ ద్వారా మరో 8,566 లక్షల హెక్టార్లు సాగులోకి వచ్చాయి. అన్నీ కలిపి మొత్తం 106.13 లక్షల హెక్టార్లకు నీటి వసతి సమకూరింది.

నోట్‌: ఎగువ ప్రాంతాలకు ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిపారుదల అందించే ఉద్దేశంతో 1974లో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌డీసీ) ఏర్పాటైంది. 2019 నాటికి ఈ సంస్థ ద్వారా 8.34 లక్షల హెక్టార్లకు నీటివసతి సమకూరింది.

2019 వరకు నీటిపారుదల సామర్థ్యం కల్పించిన భూమి గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో అధికంగా ఉంటే చిత్తూరు, అనంతపురం, విశాఖపట్నం జిల్లాల్లో అత్యల్పం.

చిన్ననీటి పారుదల (మైనర్‌ ఇరిగేషన్‌)

ఈ శాఖ ఆధీనంలో 40,817 చెరువులున్నాయి. వీటిద్వారా 25.60 లక్షల హెక్టార్ల భూమి సాగవుతోంది. చెరువులు అధికంగా ఉన్న జిల్లాలు 1) విజయనగరం (9,262); 2) శ్రీకాకుళం (8,554); 3) కడప (8,063). తక్కువ చెరువులున్న జిల్లా గుంటూరు (294).

చెరువుల కింద సాగు అధికంగా ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలవనరులను జాగ్రత్తగా వినియోగించడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు ఏపీ కమ్యూనిటీ బేస్డ్‌ ట్యాంకు మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టు. దీనిలో భాగంగా 6 జిల్లాల్లో 71 మండలాల్లో ఉన్న 142 చెరువులను ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు సహాయం చేసింది.

స్వాతంత్య్రానికి ముందు నిర్మించిన కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు

ధవళేశ్వరం: గోదావరి నదిపై తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద 1847-1852 సర్‌ ఆర్దర్‌ కాటన్‌ ఆధ్వర్యంలో నిర్మించారు. దీని ద్వారా ఉభయగోదావరి జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది.

ప్రకాశం బ్యారేజ్‌: కృష్ణానదిపై విజయవాడ వద్ద 1850-55 మధ్యకాలంలో ఆనకట్ట నిర్మించారు. దీన్ని కూడా సర్‌ ఆర్దర్‌ కాటన్‌ ఆధ్వర్యంలో నిర్మించారు. 1952లో ఆనకట్టకు ప్రత్యామ్నాయంగా ప్రకాశం బ్యారేజ్‌ నిర్మించిన సంస్థ గాన్సన్‌ కన్‌స్ట్రక్షన్‌. ఈ ప్రాజెక్టు ద్వారా 2,46,050 హెక్టార్లకు నీరు అందుతుంది.

పెన్నా రిజర్వాయర్లు: నెల్లూరు జిల్లాలోని పెన్నా నదిపై సంగం వద్ద, నెల్లూరు వద్ద రెండు ఆనకట్టలు ఆంగ్లేయులు నిర్మించారు. వీటి నుంచి దువ్వూరు, కలిగిరి, సర్వేపల్లి చెరువులకు నీరు అందుతుంది. వీటి కింద 43,400 హెక్టార్ల భూమి సాగవుతోంది.

మోపాడు రిజర్వాయర్‌: ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో మన్నేరు నదిపై రిజర్వాయర్‌ నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2500 ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం కల్పించారు.

కె.సి.కెనాల్‌: దీన్ని 1866 ప్రారంభించి 1871-72లో పూర్తిచేశారు. కర్నూలు జిల్లా తుంగభద్ర నదిపై సుంకేశుల వద్ద నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2.6 లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం లభిస్తుంది. 

నాగావళి: శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మండలంలోని తీరటిపల్లి వద్ద నాగావళి నదిపై 1909లో ఒక రెగ్యులేటర్‌ నిర్మించారు.

స్వాతంత్య్రం తర్వాత నిర్మించిన కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు

నాగార్జున సాగర్‌: దీన్ని నల్గొండ జిల్లాలోని నందికొండ గ్రామానికి రెండు కిలోమీటర్ల దిగువన కృష్ణానదిపై నిర్మించారు. 1955, డిసెంబరు 10న నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు 1967లో పూర్తయింది. ఈ ప్రాజెక్టు కింద 8.95 లక్షల హెక్టార్లకు సాగునీరందుతోంది. ఈ ప్రాజెక్టుకు రెండు ప్రధాన కాలువలు ఉన్నాయి.

1) కుడి కాలువ (జవహర్‌ కాలువ): గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 11.70 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

2) ఎడమ కాలువ (లాల్‌బహదూర్‌ కాలువ): నల్గొండ, కృష్ణా, ఖమ్మం జిల్లాల్లోని 10.40 లక్షల ఎకరాలకు సాగునీరు చేరుతోంది.

వంశధార: శ్రీకాకుళం జిల్లాలోని గొట్టా గ్రామం వద్ద 1967 - 68లో నిర్మించారు. దీనిద్వారా 41.83 వేల హెక్టార్లకు సాగునీరు అందుతోంది.

తుంగభద్ర: దీన్ని 1956లో ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలు ప్రారంభించాయి. దీనిద్వారా 98 వేల హెక్టార్లకు సాగునీరు అందుతుంది.

సోమశిల (1976): నెల్లూరుకు దక్షిణంగా ఉన్న భూములను ఆయకట్టు కిందికి తెచ్చే నిమిత్తం పెన్నానదిపై నిర్మించారు. దీనివల్ల 44 వేల హెక్టార్లకు నీరందుతుంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 78 టీఎంసీలు.

ఏలేరు రిజర్వాయర్‌: ఈ ప్రాజెక్టును 1991లో పూర్తిచేశారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం గ్రామం వద్ద ఏలేరు నదిపై నిర్మించారు. 58.3 వేల హెక్టార్లకు సాగునీరు అందిస్తుంది.

శ్రీశైలం: 1963లో కర్నూలు జిల్లాలోని శ్రీశైలం వద్ద శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో మొదటి భారీ హైడ్రో ఎలక్ట్రికల్‌ ప్రాజెక్టుగా కృష్ణా నదిపై నిర్మించారు. దీని ద్వారా 76.890 వేల హెక్టార్లకు నీటి పారుదల వసతి కల్పించారు.

ఎన్టీఆర్‌ తెలుగు గంగ: కృష్ణానది జలాలను చెన్నై నగరానికి తరలించడానికి 1980లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు తమ వాటా నుంచి 5 టీఎమ్‌సీల చొప్పున 15 టీఎమ్‌సీలను తమిళనాడుకు కేటాయించాయి.

పోతిరెడ్డిపాడు H రెగ్యులేటరీ: శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి రాయలసీమకు కృష్ణా జలాల తరలింపు కోసం ఈ ప్రాజెక్టును నిర్మించారు. 45.5 టీఎమ్‌సీల నిల్వ సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని నల్గొండ జిల్లా గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి.

మాదిరి ప్రశ్నలు

1. 2021 - 22 ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లా ఏది?

1) విజయనగరం 2) తూర్పు గోదావరి 3) నెల్లూరు  4) 1, 2

2. నార్త్‌ కోస్ట్‌ జోనల్‌లోని జిల్లాలు

1) శ్రీకాకుళం 2) విజయనగరం 3) విశాఖపట్నం 4) అన్నీ

3. 2021 - 22లో ఆంధ్రప్రదేశ్‌లో అడవుల శాతం

1) 22.63% 2) 33% 3) 25.6% 4) 24.2%

4. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎప్పుడు ఏర్పడింది?

1) 1976 2) 1974 3) 1977 4) 1978

5. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక నీటిపారుదల సౌకర్యం ఉన్న జిల్లా ఏది?

1) చిత్తూరు 2) నెల్లూరు 3) గుంటూరు 4) పశ్చిమ గోదావరి

6. కిందివాటిలో సగటు కమతానికి సరైంది.

1) సొంత భూమి + కౌలుకు తీసుకున్న భూమి - కౌలుకు ఇచ్చిన భూమి

2) సొంత భూమి - కౌలుకు తీసుకున్న భూమి + కౌలుకు ఇచ్చిన భూమి

3) సొంత భూమి/కౌలుకు తీసుకున్న భూమి

4) సొంత భూమి/కౌలుకు ఇచ్చిన భూమి

7. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువల ద్వారా లబ్ధి పొందే జిల్లాలు ఏవి?

1) నల్గొండ 2) కృష్ణా 3) ఖమ్మం 4) అన్నీ

8. ఎన్టీఆర్‌ తెలుగుగంగ ప్రాజెక్టుకు నీటిని అందించే రాష్ట్రాలు.

1) మహారాష్ట్ర 2) కర్ణాటక 3) ఆంధ్రప్రదేశ్‌ 4) అన్నీ

జవాబులు: 1-4,   2-4,   3-1,   4-2,   5-3,   6-1,   7-4,   8-4.
 

Posted Date : 13-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌