• facebook
  • whatsapp
  • telegram

పర్యాటకం - ప్రభుత్వ ప్రోత్సాహకాలు

సేవలు.. సౌకర్యాల విస్తరణలో సర్కారు సాయం!

 

భారతదేశంలో వినోదం, విజ్ఞానం, ఆధ్యాత్మిక అనుభూతిని పంచే పర్యాటక ప్రాంతాలకు లోటు లేదు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు చూసి తీరాల్సిన చారిత్రక, వారసత్వ కట్టడాలు, పురాతన సంస్కృతికి ప్రతీకగా నిలిచే కళారూపాలు వేటికవే ప్రత్యేకం. ప్రకృతి ఒడిలో సేదతీరే ప్రాంతాలు, సుదీర్ఘ సముద్రతీరాలు, ఆహ్లాదానికి, సాహస కృత్యాలకు అనువైన వనరులెన్నో ఉన్నాయి. ఇటీవలి కాలంలో వైద్య పర్యాటకం కూడా ఈ వరుసలో చేరింది. అందుకే దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే శక్తిగా పర్యాటక - ఆతిథ్య రంగాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఆ రంగాన్ని వ్యవస్థాగతంగా అభివృద్ధి చేసేందుకు రూపొందించిన విధానాలు, ప్రోత్సాహక పథకాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. దేశీయ, విదేశీ పర్యాటకులకు సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలు, అందుకు సంబంధించి ఇస్తున్న పలు రకాల ప్రోత్సాహకాలపై అవగాహన పెంచుకోవాలి.

జాతీయ పర్యాటక అభివృద్ధి సంస్థ: దేశంలో పర్యాటకం అభివృద్ధి, విస్తరణ కోసం 1966, అక్టోబరులో ఈ సంస్థ ఏర్పాటైంది. పర్యాటకుల కోసం హోటళ్లు, రెస్టారెంట్లు, బీచ్‌ రిసార్ట్‌లు నిర్మించడం; వాటి సేవలను మార్కెట్‌ చేయడం దీని ప్రధాన లక్ష్యం. రవాణా, వినోదం, విక్రయం, సంప్రదాయ పర్యాటక సేవలు అందించడంతోపాటు పర్యాటక ప్రచారానికి సంబంధించిన కన్సల్టెన్సీ, నిర్వహణ సేవలు, కరెన్సీ మార్పిడి సేవలను అందిస్తోంది. దేశంలో 4 అశోకా గ్రూపు హోటళ్లను నడుపుతోంది. సంయుక్త రంగంలో ఒక హోటల్, ఒక రెస్టారెంటు నిర్వహిస్తోంది. 12 రవాణా యూనిట్లతోపాటు అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాల్లో ఒక టాక్స్‌ఫ్రీ ఔట్‌లెట్‌ ఈ సంస్థకు ఉన్నాయి. దృశ్య శ్రవణ ప్రదర్శనలు, 13 డ్యూటీ ఫ్రీ దుకాణాలను కూడా నడుపుతోంది.


భారతీయ పర్యాటక విత్త సంస్థ: ప్రణాళికా సంఘం ఏర్పాటు చేసిన యూనస్‌ కమిటీ సిఫార్సుల మేరకు 1988లో ఈ సంస్థ పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీగా ఏర్పాటైంది. 2020-21 సెప్టెంబరు నాటికి దీని వాటా మూలధనం రూ.80.72 కోట్లు. పర్యాటకానికి సంబంధించిన సౌకర్యాలు, సేవల అభివృద్ధికి విత్త సహాయం చేస్తుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, హాలిడే రిసార్ట్‌లు, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, మల్టీప్లెక్స్‌లు, సఫారీ పార్కులు, సాంస్కృతిక కేంద్రాలు, రవాణా, పర్యాటక విక్రయశాలలు మొదలైన వాటికి విత్త సహాయాన్ని అందిస్తుంది.


ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా: భారత్‌లోని పర్యాటక సేవల సమాచారాన్ని అంతర్జాతీయ పర్యాటకులకు అందించడం కోసం కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన మార్కెటింగ్‌ కార్యక్రమమే ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా. ఈ ప్రచారానికి సంబంధించిన వెబ్‌సైట్‌ 2002లో ప్రారంభమైంది. ప్రయాణం, పర్యాటక ప్యాకేజీలు, పర్యాటక కేంద్రాలు, వర్తకం, వీసా లాంటి అనేక అంశాలకు సంబంధించిన సమాచారం, సేవలు ఇందులో ఉంటాయి. ఈ పదం ఒక నినాదంగా వాడుకలోకి వచ్చింది.


సాధి (ఎస్‌ఏఏ టీహెచ్‌ఐ):  దీని పూర్తి పేరు సిస్టం ఫర్‌ అసెస్‌మెంట్‌ అవేర్‌నెస్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఫర్‌ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. సంక్షిప్తనామం సాధి. కొవిడ్‌-19 నిబంధనల గురించి ఆతిథ్య పరిశ్రమ ఉద్యోగులకు తెలియజేయడం, ఆతిథ్య ప్రదేశాల్లో పరిశుభ్రత, భద్రతకు చర్యలు తీసుకుని పర్యాటకులకు విశ్వాసం కలిగించడం లాంటి లక్ష్యాలతో క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సహకారంతో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన వ్యవస్థ.


టూరిస్టు గైడ్‌లకు రుణాలు:  కొవిడ్‌ వల్ల పర్యాటక రంగం దెబ్బతిన్నప్పుడు ఆదాయం కోల్పోయిన 10,700 మంది టూరిస్టు గైడ్‌లకు, వెయ్యి మంది పర్యాటక రంగ వాటాదారుల (స్టేక్‌ హోల్డర్లు)కు ప్రభుత్వం రుణాలు ఇచ్చింది. జాతీయ పరపతి హామీ ట్రస్టీ కంపెనీ ద్వారా ఈ రుణాలు అందాయి.


నిధి (ఎన్‌ఐడీహెచ్‌ఐ):  ‘నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ డేటాబేస్‌ ఆఫ్‌ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ’ సంక్షిప్త నామమే నిధి. ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యంగా ఆతిథ్య పరిశ్రమ వ్యాపార వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోర్టల్‌. ఆతిథ్య పరిశ్రమ అవకాశాలకు గేట్‌ వేగా ఉపయోగపడుతోంది.  ప్రపంచ పర్యాటక దినం సందర్భంగా నిధి 2.0ను లోక్‌సభ స్పీకర్‌ 2021, సెప్టెంబరు 27న ప్రారంభించారు. భారత పర్యాటక శాఖ, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం, రెస్పాన్సిబుల్‌ టూరిజం సొసైటీ ఆఫ్‌ ఇండియా మధ్య పర్యాటక అభివృద్ధి, సుస్థిర చొరవ కోసం ఒప్పందం కుదిరింది.


పర్యాటక పురస్కారాలు:  భారతదేశంలో పర్యాటక రంగం వృద్ధిని ప్రోత్సహించే విధంగా కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ అనేక అవార్డులను ప్రకటించింది. ఏటా ఎంపిక కమిటీలను ఏర్పాటుచేసి వాటి సిఫార్సుల మేరకు అవార్డులు ప్రదానం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలకు, హోటళ్లకు, ట్రావెల్‌ ఏజెంట్లకు, పర్యాటక ఆపరేటర్లకు, వ్యక్తులకు, సంస్థలకు ఈ అవార్డులను అందిస్తోంది.


ఈ-వీసా: భారత్‌ను సందర్శించేందుకు విదేశీయులకు ఇచ్చే అనుమతిని సులభతరం చేస్తూ 2014, నవంబరు 27 నుంచి ఎలక్ట్రానిక్‌ ట్రావెల్‌ ఆథరైజేషన్‌ పథకాన్ని ప్రారంభించారు. తొలుత 40 దేశాల పౌరులకు అవకాశం ఇవ్వగా, 2016, ఆగస్టు నాటికి 163 దేశాలకు వర్తింపజేశారు. 2017, ఏప్రిల్‌ నుంచి ఈ పథకానికి   ఈ-వీసా పథకం అని పేరు పెట్టారు. దీని కింద ఈ-టూరిస్ట్‌ వీసా, ఈ-బిజినెస్‌ వీసా, ఈ-మెడికల్‌ వీసా అని మూడు తరగతులు   ఉంటాయి. దేశంలోని 24 విమానాశ్రయాలు, 3 ఓడరేవుల్లో ఈ-వీసా పొందిన విదేశీ పర్యాటకులు ప్రవేశించవచ్చు. 2021-22లో ఈ-వీసా  ఉపయోగించుకున్న విదేశీ పర్యాటకులు 72,870 మంది. వీరిలో హైదరాబాదు విమానాశ్రయం ద్వారా ప్రవేశించినవారు 7 శాతం. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు 2022-23లో విదేశీ పర్యాటకులకు 5 లక్షల ఈ-వీసాలిచ్చారు. ఈ సౌకర్యం ఉపయోగించుకున్న దేశాల్లో అమెరికా, రష్యా, జర్మనీ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.


రైల్వే పర్యాటకం: భారతీయ రైల్వేకు సంబంధించిన ఐఆర్‌సీటీసీ దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ అనేక ప్యాకేజీలను రూపొందించింది. ప్రత్యేకంగా కొన్ని పర్యాటక రైళ్లను నడుపుతోంది. అవి మహారాజ ఎక్స్‌ప్రెస్, ఆస్థా సర్క్యూట్‌ ప్రత్యేక రైలు, భారత దర్శన్, స్టీమ్‌ ఎక్స్‌ప్రెస్, బుద్దిస్ట్‌ సర్క్యూట్‌ పర్యాటక రైలు, టైగర్‌ ఎక్స్‌ప్రెస్, డెజర్ట్‌ సర్క్యూట్‌ సెమిలగ్జరీ రైలు.* అరకు సందర్శనకు విశాఖపట్నం నుంచి ఒక టూరిస్టు రైలు నడుస్తోంది. దీని పైకప్పు డోమ్‌ మాదిరిగా ఉంటుంది.


భారతదేశంలో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు: 10 ప్రమాణాల    ఆధారంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలను ఎంపిక చేస్తుంది.  ఇప్పటివరకు మన దేశంలోని 40 ప్రదేశాలు ఈ జాబితాలో చేరాయి. ఉదా: అజంతా ఎల్లోరా (మహారాష్ట్ర), ఆగ్రా కోట (ఉత్తర్‌ప్రదేశ్‌),   తాజ్‌మహల్, సూర్యదేవాలయం (ఒడిశా), మహాబలిపురం (తమిళనాడు), రామప్ప గుడి (తెలంగాణ), లేపాక్షి నంది (సత్యసాయి జిల్లా - ఆంధ్రప్రదేశ్‌)...


హోటళ్లు: 2022-23 నాటికి భారత ప్రభుత్వం పర్యాటక శాఖ ఆమోదించిన హోటళ్లు 1880. వీటిలో మొత్తం గదులు 1,05,344. * 1 స్టార్‌ హోటళ్లు 10, * 2 స్టార్‌ - 23, *3 స్టార్‌ హోటళ్లు - 564, *4 స్టార్‌ - 423, *5 స్టార్‌ - 185, *5 స్టార్‌ డీలక్స్‌ - 149, *వారసత్వ హోటళ్లు - 55.


పర్యాటకానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు

1) పర్యాటన్‌ పర్వ్‌: దేశీయ పర్యాటకం అభివృద్ధి కోసం 2016లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమమే పర్యాటన్‌ పర్వ్‌. దేశంలోని అన్ని ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి సాంస్కృతిక ప్రదర్శనలు, క్రాఫ్ట్‌ బజార్లు, జానపద, శాస్త్రీయ నృత్యం, సంగీతం, హస్తకళలు, చేనేత, వంటకాల ప్రదర్శనలు ఇందులో ఉంటాయి. ఈ కార్యక్రమంలో మూడు భాగాలున్నాయి.

దేఖో అప్నా దేశ్‌: భారతీయులను తమ దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించమని ప్రోత్సహించే కార్యక్రమం.

అందరికీ పర్యాటకం: ఈ పథకం కింద దేశంలోని పర్యాటక ప్రదేశాలను దీపాలతో అలకంరిస్తారు. సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తారు.

పర్యాటకం పాలన: ఇందులో భాగంగా పర్యాటక రంగానికి సంబంధించిన పలువురు వాటాదారులతో వివిధ అంశాలపై వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు.


2) స్వదేశ్‌ దర్శన్‌ యోజన: కేంద్ర ప్రభుత్వం 2015, మార్చి 9న ప్రారంభించింది. దీని ప్రధాన లక్ష్యం దేశంలో ప్రపంచస్థాయి పర్యాటక మౌలిక సదుపాయాలు కల్పించడం. ఈ పథకం కింద దేశం మొత్తం 76 ప్రాజెక్టులున్నాయి. 2023-24 బడ్జెట్‌లో దీని కోసం రూ.1,412 కోట్లు కేటాయించారు.


3) ప్రసాద్‌: ఈ పథకం పూర్తి పేరు ‘పిలిగ్రిమేజ్‌ రెజువెనేషన్‌ అండ్‌ స్పిరిచ్యువల్‌ ఆగ్మెంటేషన్‌ డ్రైవ్‌’. 2015, మార్చి 9న ప్రారంభించారు. దేశంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలను గుర్తించి, అభివృద్ధి చేసి, తీర్థయాత్రికులకు మతపరమైన పర్యాటక అనుభవాన్ని సుసంపన్నం చేయడం ఈ పథకం ఉద్దేశం. ఇందుకోసం ఎంపిక చేసిన నగరాలు.. అమరావతి (ఆంధ్రప్రదేశ్‌), గయా (బిహార్‌), ద్వారక (గుజరాత్‌), అమృత్‌సర్‌ (పంజాబ్‌), ఆజ్మీర్‌ (రాజస్థాన్‌), కాంచీపురం (తమిళనాడు), వేలాంకన్ని (తమిళనాడు), పూరి (ఒడిశా),  వారణాసి (ఉత్తర్‌ప్రదేశ్‌), మధుర (ఉత్తర్‌ప్రదేశ్‌), కేదార్‌నాథ్‌ (ఉత్తరాఖండ్‌), కామాఖ్య (అస్సాం).


4) వారసత్వ దత్తత పథకం: ఇది 2017, సెప్టెంబరు 27న ప్రారంభమైంది. దేశంలోని ప్రధాన చారిత్రక, పురాతన కట్టడాలను దత్తత తీసుకుని వాటిని సంరక్షిస్తూ అభివృద్ధి చేసే బాధ్యతను చేపట్టమని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను, కార్పొరేట్‌ రంగ వ్యక్తులను ప్రభుత్వం కోరింది. ఆ విధంగా దత్తత తీసుకున్న సంస్థలను చారిత్రక కట్టడాల మిత్రులు అని పిలుస్తారు.


రచయిత: ధరణి శ్రీనివాస్‌ 

Posted Date : 31-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు