• facebook
  • whatsapp
  • telegram

వ్యక్తి అధ్యయన పద్ధతులు

అంతపరిశీలనాపద్ధతి (Introspection Method)
    మనోవిజ్ఞానశాస్త్ర పద్ధతుల్లో ఇది అతి ప్రాచీనమైంది. రోమ్ దేశానికి చెందిన సెయింట్ అగస్టీన్ ఈ పద్ధతిని రూపొందించాడు. అంతఃపరిశీలన అంటే వ్యక్తి తన అనుభవాలను, అనుభూతులను తనకు తానుగా పరిశీలించుకోవడమే. మనోవిజ్ఞానశాస్త్రంలో మాత్రమే ఉండే ఒక అద్వితీయమైన పద్ధతిగా దీన్ని పేర్కొంటారు. ఈ పద్ధతిలో పరిశీలించుకునేవారు, పరిశీలించేవారు ఇద్దరూ ఒక్కరే. ఈ పద్ధతిని ఊంట్ తన ప్రయోగశాలలో విరివిగా ఉపయోగించాడు.
ఉదా: * విహారయాత్రకు వెళ్లిన విద్యార్థి విహారయాత్రలోని సంఘటనలను తన తల్లి వద్ద పంచుకోవడం.
* అనారోగ్యంతో బాధపడుతున్న ఒక రోగి తన సమస్యను వైద్యుడి వద్ద నిన్నటి కంటే నేడు నా ఆరోగ్యం కుదుటపడింది అని చెప్పడం.

 

ఉపయోగాలు:
* ఇతరుల వద్ద వ్యక్తపరచలేని మానసిక ప్రక్రియలైన బాధ, సంతోషం, లైంగిక అనుభవాలు వ్యక్తి తనకు తానుగా పరిశీలించుకోవచ్చు.
* ఈ పద్ధతి అత్యంత అనుకూలమైంది. ఎప్పుడైనా, ఎక్కడైనా ఖర్చు లేకుండా ఉపయోగించుకోవచ్చు.

*  వ్యక్తి ఉద్వేగాలను వ్యక్తపరచడానికి అత్యంత ఉపయోగకరమైన పద్ధతి.
*  ముఖ్యంగా ఉపాధ్యాయులు అంతఃపరిశీలనా పద్ధతి ద్వారా తమ బోధనలోని లోపాలను తెలుసుకుని నూతన పద్ధతుల ద్వారా సరిదిద్దుకోవడానికి అనుకూలమైంది.

 

లోపాలు/ పరిమితులు:
*  ఈ పద్ధతిలోని ముఖ్యమైన లోపం ఆత్మాశ్రయత (లేదా) వ్యక్తి నిష్ఠత. ఎందుకంటే దీని ద్వారా సేకరించిన సమాచారం సరిచూడటానికి అవకాశం లేదు.
*  వ్యక్తిలోని అచేతన మనసును పరిశీలించడానికి ఈ పద్ధతి ఉపయోగపడదు.
*  ఈ పద్ధతి చిన్న పిల్లలు, భాషాలోపాలు ఉన్నవారికి, మానసిక బుద్ధిమాంద్యులకు ఉపయోగపడదు.
 * ఉద్వేగాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఒకసారి చెప్పిన విషయాన్ని మళ్లీ మళ్లీ అదేవిధంగా చెప్పలేం.

 

పరిశీలనా పద్ధతి (Observation Method)
     ఏదైనా ఒక దృగ్విషయాన్ని సన్నద్ధతతో, ఆసక్తితో, ఏకాగ్రతతో చూడటమే పరిశీలన. ఈ పద్ధతి ద్వారా ఇతరుల మానసిక ప్రక్రియలను వారి బాహ్య ప్రవర్తన ద్వారా అధ్యయనం చేస్తారు. ఈ ప్రవర్తనను ఉన్నది ఉన్నట్లుగా గ్రహించడమే పరిశీలన అని చెప్పవచ్చు. ఇది

నాలుగు రకాలు
1. సహజ పరిశీలన/ అనియంత్రిత పరిశీలన:
ఒక జీవి ప్రవర్తన లక్షణాలను సహజ స్థితుల్లో ఆ జీవికి తెలియకుండా పరిశీలించడమే సహజ పరిశీలన.

ఉదా: * అడవికి వెళ్లి జంతువులను పరిశీలించడం.
* విద్యార్థులు పరీక్ష హాలులో ఏ విధమైన కుంఠనం కలిగి ఉంటారో తెలుసుకునేందుకు నేరుగా పరీక్ష హాలు వద్దనే పరిశీలించడం.
* సముద్రంలోని చేపపిల్ల ప్రవర్తనను పరిశీలించడం.

 

2. నియంత్రిత పద్ధతి/ అసహజ పద్ధతి/ కృత్రిమ పద్ధతి:
    సహజ పరిస్థితిలో విషయాన్ని పరిశీలించలేమని నిర్ధారణకు వస్తే ఒక ప్రత్యేక పరిస్థితిని కల్పించి పరిశీలించడం. ఈ పరిశీలనలో జీవికి తాను పరిశీలిస్తున్నారనే విషయం తెలుస్తుంది.
ఉదా: * అక్వేరియంలోని చేపను పరిశీలించడం.
* బోనులోని పులిని పరిశీలించడం.
* తరగతిలోని ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధిస్తూ విద్యార్థులను పరిశీలించడం.
* మనోవిజ్ఞానశాస్త్రంలో నిర్వహించిన పావ్‌లోవ్, బి.ఎఫ్. స్కిన్నర్, థారన్‌డైక్, కోహెలర్ ప్రయోగాలన్నీ నియంత్రిత స్థితిలో జరిగినవే.

 

3. సంచరిత పరిశీలన
    ఈ పరిశీలనను సహభాగి పరిశీలన అని కూడా అంటారు. ఇందులో పరిశీలకుడు తాను పరిశీలించాల్సిన సమూహంలో కలసిపోయి వారికి తెలియకుండా వారి ప్రవర్తనను తెలుసుకోవడం.

ఉదా: * ఉపాధ్యాయుడు విద్యార్థుల్లోని సహజమైన ఉద్వేగాలను పరిశీలించడానికి వారితో కలిసిపోయి వారికి తెలియకుండా వారి ఉద్వేగాలను తెలుసుకోవడం.
* పిసినారి అయిన స్నేహితుడిలో మార్పు వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి ఇది అనువైన పద్ధతి.
* పూర్వకాలం గూఢచారులు ప్రజల సమస్యలను వారితో కలిసిపోయి తెలుసుకుని రాజుకు తెలియజేయడం కూడా సంచరిత పరిశీలనే.

 

4. అసంచరిత పరిశీలన:
     ఈ పరిశీలనలో పరిశీలకుడు పరిశీలనా సన్నివేశంతో కలవకుండా దూరంగా ఉండి, ముందుగా నిర్ణయించిన అంశాలను పరిశీలనాంశాలకు తెలియకుండా పరిశీలిస్తాడు.
ఉదా: * అమెరికాలోని యేల్, అయోవా విశ్వవిద్యాలయంలో 'గెసెల్' అనే శాస్త్రవేత్త పిల్లల్లోని వికాస కృత్యాలను పరిశీలించడానికి 'One way Vision Screen' కలిగిన observation domeను ఏర్పరచి వెలుపల ఉన్న శాస్త్రవేత్త పిల్లలకు కనిపించకుండా వారిని పరిశీలించడం.
* చిన్న పిల్లల ప్రవర్తన, పశుపక్ష్యాదుల ప్రవర్తనను అధ్యయనం చేయడం దీనికి ఉదాహరణ.

 

ఉపయోగాలు:
*  తరగతి గదిలో ఉపాధ్యాయుడు వివిధ ప్రజ్ఞా తేడాలు ఉన్న పిల్లలను పరిశీలించి వారికి అనువైన బోధనను కల్పించడం.

*  పిల్లల్లో జరిగే వివిధ రకాల వికాస దశలను తెలుసుకోవడానికి ఈ పద్ధతి అనువైంది.
*  ఈ పద్ధతిలో దత్తాంశ సేకరణ సులభమైంది.

 

పరిమితులు:
*  పరిశీలించేవారి (ప్రయోక్త) ప్రమేయం అత్యంత అధికంగా ఉంటుంది. దీన్నే Ego Involvement అంటారు.
*  పరిశీలనలో కచ్చితమైన వస్తునిష్ఠత లేకపోవచ్చు.
*  జీవుల బాహ్య ప్రవర్తనను పరిశీలించగలం. కానీ అంతర్గత ప్రవర్తనను పరిశీలించలేం.
*  జీవులను నియంత్రించి పరిశీలించడం ద్వారా దాని సహజ ప్రవర్తన మరుగయ్యే అవకాశం ఉంది.
*  పరిశీలకుడికి శిక్షణ అవసరం లేకపోతే కొన్ని పరిశీలనాంశాలు తప్పిపోవచ్చు.

 

వ్యక్తి అధ్యయన పద్ధతి (Case study)
     ఒక వ్యక్తి గురించి సంపూర్ణమైన సమాచారాన్ని నిశితంగా, కూలంకషితంగా, సమగ్రంగా ఒక క్రమమైన పద్ధతిలో అధ్యయనం చేయడాన్నే వ్యక్తి అధ్యయన పద్ధతి అని అంటారు. ఈ పద్ధతిని మొదట వైద్యశాస్త్రంలో ఉపయోగించేవారు. తర్వాత విద్యారంగంలోకి ప్రవేశించింది. అందుకే ఈ పద్ధతిని క్లినికల్ మెథడ్ (చికిత్సా పద్ధతి) అని అంటారు.
   ''సాధారణంగా సమస్యాత్మక ప్రవర్తన కలిగిన శిశువు సమగ్ర ప్రవర్తనను అధ్యయనం చేసి ఆ సమస్యకు తగిన కారణాలను తెలుసుకుని తగిన నివారణను సూచించే పద్ధతి" అని బోని అండ్ హలపిన్ మాన్ నిర్వచించారు.

వ్యక్తి అధ్యయన పద్ధతి ఎవరికి అవసరం?
*  పాఠశాలకు తరచుగా ఆలస్యంగా వచ్చే పిల్లలు
*  ఏదో కారణంతో అకారణంగా పాఠశాలకు రానివారు
*  పాఠశాలలో బూతులు మాట్లాడేవారు
*  దొంగతనం చేసే పిల్లలు
*  హఠం చేసే పిల్లలు తద్వారా తల్లిదండ్రులను ఒక రకంగా ఇబ్బందిపెట్టేవారు
వ్యక్తి అధ్యయన పద్ధతిలో 2 దశలు ఉన్నాయి.
    (A) సమస్య నిర్ధారణ దశ
    (B) సమస్య నివారణ దశ

 

వ్యక్తి అధ్యయన పద్ధతిలో సేకరించే అంశాలు:
*  విద్యార్థి ప్రాథమిక సమాచారం
ఉదా: పేరు, తరగతి, పుట్టిన తేది, పాఠశాల మొదలైనవి.
*  విద్యార్థి కుటుంబ సభ్యులు, వారి పుట్టుపూర్వోత్తరాలు
*  విద్యార్థి సమవయస్కులు, స్నేహితుల గురించి సాంఘిక సమాచారం
*  విద్యార్థి ఉద్వేగాలను నమోదు చేయడం
*  కుటుంబం, పాఠశాలలో విద్యార్థి క్రమశిక్షణ
*  విషయాన్ని క్రమంగా తయారుచేసి నివేదించడం

ఉపయోగాలు:
*  విద్యార్థి సమస్యను నిర్ధారించి సరైన పరిష్కార మార్గాలను చూపవచ్చు.
*  ప్రతి వ్యక్తిని క్షుణ్నంగా అధ్యయనం చేయడం వల్ల ఆ వ్యక్తి లోపాన్ని కచ్చితంగా చెప్పవచ్చు.
*  వివిధ రకాలైన వ్యక్తులు వివిధ రకాలుగా ప్రవర్తించడానికి ఉన్న కారణాలను తెలుపుతుంది.
*  వ్యక్తి ప్రవర్తనను, మూర్తిమత్వ లక్షణాలను సమగ్రంగా అధ్యయనం చేయవచ్చు.

 

పరిమితులు:
*  ఈ పద్ధతి వ్యక్తి నిష్ఠతతో కూడుకుంది.
*  ఈ పద్ధతి ప్రకారం సమస్యా పరిష్కారాన్ని సాధారణీకరించలేం.
*  అధికంగా సమయం వృథా కాగలదు.
*  మూర్తిమత్వ సమస్యలు, ప్రవర్తనా సమస్యలను గుర్తించి నివారణా మార్గాలను కనుక్కోవడం కష్టంతో కూడుకున్న పని.
*  ఈ పద్ధతిని నిర్వహించే వ్యక్తికి తగిన శిక్షణ అవసరం.

 

పరిపృచ్ఛా పద్ధతి (Interview Method)
     ఒక వ్యక్తి మరో వ్యక్తితో లేదా మరికొంతమంది వ్యక్తులతో ముఖాముఖి సంభాషించి వారి నుంచి కావాల్సిన సమాచారాన్ని రాబట్టడమే పరిపృచ్ఛ. ఇందులో కనీసం ఇద్దరు వ్యక్తులు పాల్గొంటారు. ప్రశ్నలు అడిగే వారిని పరిపృచ్ఛకుడు అనీ, సమాధానాలు చెప్పేవారిని పరిపృచ్ఛతుడు అని పిలుస్తారు. ఇది రెండు రకాలుగా జరుగుతుంది. ఈ పద్ధతిని ప్రాచుర్యంలోకి తెచ్చినవారు మెకాబే.

1. సంరచిత పరిపృచ్ఛ:
     సేకరించాల్సిన సమాచారానికి సంబంధించిన ప్రశ్నలను ముందుగానే తయారుచేసుకుని ఒక ప్రణాళిక ప్రకారం జరిపేదే సంరచిత పరిపృచ్ఛ. అందుకే దీన్ని నిర్దేశిత పరిపృచ్ఛ అని కూడా అంటారు. ఈ పద్ధతి గురించి చెప్పినవారు 'విలియంసన్'.
ఉదా: * పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంపై సమాచారం సేకరించడానికి ముందుగానే ప్రశ్నలను సిద్ధం చేసి సేకరించడం.
* ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నవారు, మంచి పేరు ప్రఖ్యాతులు సాధించిన ప్రముఖులతో జరిపే పరిపృచ్ఛలు.

 

2. అసంరచిత పరిపృచ్ఛ:
    ఈ పద్ధతిలో సేకరించాల్సిన సమాచారానికి సంబంధించిన అన్ని ప్రశ్నలను ముందుగా ప్రణాళికాబద్ధంగా తయారుచేసుకోరు. సందర్భానుచితంగా ప్రశ్నలు వేస్తూ సమాచారాన్ని సేకరిస్తారు. అందుకే ఈ పద్ధతిని అనిర్ధేశిక పరిపృచ్ఛ అంటారు. దీని గురించి మొదట వివరించిన శాస్త్రవేత్త కార్ల్ రోజర్స్.
ఉదా: * వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కొనసాగించే సంభాషణ.
* సమాచార హక్కు చట్టం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజల నుంచి సమాచారం తెలుసుకోవడం కోసం సందర్భానుచితంగా ప్రశ్నలు వేయడం.
* 'రమేష్' అనే వ్యక్తి తన బాల్య మిత్రుడితో జరిపే సంభాషణ.

ప్రయోజనాలు:
 సమాచారం వ్యక్తి నుంచి సేకరించడానికి ఇది ఒక మంచి ఉపయుక్తమైన పద్ధతి.
ఉదా: * వరకట్న నిషేధిత అంశాలు.
       * విద్యావిధానంలో అమలవుతున్న వివిధ పథకాలు
       * మూఢనమ్మకాలపై అభిప్రాయం మొదలైనవి.

 

పరిమితులు:
*  సేకరించే వ్యక్తికి సరైన శిక్షణ ఉండాలి. లేకపోతే నిజాలను సక్రమంగా రాబట్టలేం.
*  ఈ పద్ధతి ద్వారా భాషరానివారు, వ్యాధి పీడితులు, చిన్న పిల్లలు, జంతువుల నుంచి సమాచారాన్ని రాబట్టలేం.

 

సర్వే పద్ధతి (Survey Method)
     ఎక్కువ సమాచారాన్ని తక్కువ సమయంలో సేకరించడానికి ఈ పద్ధతి అనుకూలమైంది. ఈ పద్ధతినే అమెరికాలో గేలప్ పోల్ పద్ధతి అని అంటారు.

 

ప్రయోగాత్మక పద్ధతి (Experimental Method)
     ఏదైనా ఒక దృగ్విషయాన్ని సహజ పరిస్థితుల్లో పరిశీలన చేయలేనప్పుడు ఆ విషయాన్ని నియంత్రిత పరిస్థితుల్లో సూక్ష్మంగా పరిశీలించడమే ప్రయోగ పద్ధతి. శాస్త్రీయ పద్ధతుల్లో ఈ పద్ధతికి ప్రత్యేకమైన హోదా ఉంది. మనోవిజ్ఞాన శాస్త్రానికి ఒక శాస్త్రీయతను కల్పించడానికి ఈ పద్ధతే అతి ముఖ్యమైన కారణం అని చెప్పవచ్చు. మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగాలన్నీ జీవులపై జరిపే సందర్భంలో కింది ప్రయోగ పదాలను పరిశీలించాల్సి ఉంటుంది.

1. ఉద్దీపన (Stimulus): ఒక జీవి ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చే ఏ పరిస్థితినైనా ఉద్దీపన అనవచ్చు.
2. ప్రతిస్పందన (Response): ఉద్దేపనకు జీవి చూపే నూతన ప్రవర్తననే ప్రతిస్పందన అంటారు.
ఉదా: * చింతకాయను కొరకగానే నోరు ఊరడంలో ఉద్దీపన - చింతకాయ, ప్రతిస్పందన - నోరూరడం.
        * వేడి వస్తువు చేతికి తగలగానే చేతిని వెనక్కి లాగడం.
  *   ఈ ప్రక్రియలో ఉద్దీపన - వేడి వస్తువు తగలడం
   * ప్రతిస్పందన - వెంటనే చేయి వెనక్కి తీయడం.
 *  తరగతి గదిలో ఉపాధ్యాయుడు పరీక్షలకు ముందు బహుమతులను ప్రకటించి పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థుల మార్కులు పెరగడం.
   * ఉద్దీపన - ఉపాధ్యాయుడు ఏర్పాటు చేసిన బహుమతులు
   * ప్రతిస్పందన - విద్యార్థుల్లో పెరిగిన మార్కులు.

 

3. ప్రయోక్త (Experimenter): ప్రయోగాన్ని చక్కగా నిర్వహించే వ్యక్తి.
4. ప్రయోజ్యుడు (Subject): ప్రయోగంలో పాల్గానే వ్యక్తి (లేదా) ఎవరిపై ప్రయోగాన్ని నిర్వహిస్తున్నామో వారే ప్రయోజ్యుడు.

5. చరాలు (Variables): ప్రయోగంలో మారడానికి వీలుగా ఉండేది లేదా తనంతట తానే మారే అంశాలనే చరాలు అంటారు. ఈ చరాలు 3 రకాలు.
A) స్వతంత్ర చరం (Independent Variable): ప్రయోగాన్ని నిర్వహించేటప్పుడు ప్రయోక్త తన ప్రయోగానికి అనువుగా మార్చే చరాలనే స్వతంత్ర చరాలు లేదా ఉద్దీపనా చరాలు అని అంటారు. ఇది ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం.
B) పరతంత్ర చరం (Dependent Variable): ప్రయోక్త ఆధీనంలో ఉండే చరాలను స్వతంత్ర చరాలనీ వీటి ఆధీనంలో ఉండే చరాలను (లేదా) ప్రయోగం వల్ల మార్పు చెందే చరాలను పరతంత్ర చరాలు లేదా ప్రతిస్పందనా చరాలని కూడా అంటారు.
C) మధ్యస్థ చరం(Intervening Variable): స్వతంత్ర చరాలకు, పరతంత్ర చరాలకు మధ్యలో వచ్చి ప్రయోగాన్ని ఆటంకపరిచే చరాలను మధ్యస్థ చరాలంటారు. ఇవి ఎవరి ఆధీనంలోనూ ఉండక ప్రయోగాన్ని జరగనివ్వక అడ్డుకుంటాయి.
ఉదా:  'తల్లిదండ్రుల ప్రోత్సాహకం - పిల్లల్లో పెరిగే అభ్యసనా సామర్థ్యం' అనే ప్రయోగానికి సంబంధించి
       స్వతంత్ర చరం - తల్లిదండ్రుల ప్రోత్సాహం
       పరతంత్ర చరం - పిల్లల అభ్యసనా సామర్థ్యం
       జోక్య చరం - పిల్లల్లోని ప్రజ్ఞ, పిల్లల ఆసక్తి.
       (మధ్యస్థ చరం)

 'విద్యార్థిలోని పరిసరానుగుణ్యత - అతడిలోని ప్రజ్ఞ' అనే ప్రయోగంలో
     *  స్వతంత్ర చరం - విద్యార్థిలోని ప్రజ్ఞ
      *  పరతంత్ర చరం - విద్యార్థి పరిసరాలతో చేసుకునే సర్దుబాటు
      *  జోక్య చరం - విద్యార్థిలోని అనాసక్తత.
 పాఠశాలలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకం - విద్యార్థుల్లో పెరిగిన హాజరు శాతం
      *  స్వతంత్ర చరం - మధ్యాహ్న భోజన పథకం
      *  పరతంత్ర చరం - విద్యార్థుల్లో పెరిగిన హాజరు శాతం
      *  జోక్య చరం - విద్యార్థికి విద్యపై ఉండే వైఖరి.
(గమనిక: ఏ ప్రయోగంలోనైనా జోక్య చరాన్ని నేరుగా ఇవ్వరు. ఈ చరాన్ని పరిస్థితిని బట్టి ఎన్నుకోవాలి)

 

6. సమూహాలు (Groups): ప్రయోగాన్ని చక్కగా నిర్వహించడానికి రెండు సమూహలు అవసరం.
A) నియంత్రిత సమూహం (Controlled Group): సమూహంపై ప్రయోగం నిర్వహించినప్పటికీ ఏమాత్రం ప్రయోగాత్మక పరిస్థితుల ప్రభావానికి గురికాకుండా స్వేచ్ఛగా ఉండే సమూహం. ఇది సహజస్థితి. స్వతంత్ర చరాలకు లోనుకాదు.
ఉదా: ఉపన్యాస బోధనా పద్ధతి
B) ప్రయోగాత్మక సమూహం (Experimental Group): ప్రయోగానికి లోనయ్యే సమూహన్ని ప్రయోగ సమూహం అంటారు. ఇక్కడ స్వేచ్ఛ తక్కువగా ఉండి ఒత్తిడి ఉంటుంది. ఈ సమూహం స్వతంత్ర చరాలకు లోనవుతుంది.
ఉదా: పాఠ్యాంశాన్ని కృత్యాధార పద్ధతి ద్వారా బోధించినప్పుడు విద్యార్థుల్లో కలిగే స్థితి.

జోక్య చరాలను నివారించే పద్ధతులు: ప్రయోగం సక్రమంగా, నియమబద్ధంగా జరగడానికి ఆ ప్రయోగానికి ఇబ్బంది కలిగించే జోక్య చరాలను అదుపు చేయాలి. దీన్నే ప్రయోగాత్మక నియంత్రణ అంటారు. ఇందులో రెండు ప్రధాన పద్ధతులు ఉన్నాయి.
A) నివారణ పద్ధతి: ఇది సాధారణమైన పద్ధతి. ప్రయోగంలోని ప్రయోజ్యులు పరిసర పరిస్థితులను నివారించడం.
ఉదా: ఒకే తరగతి గదిలోని అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఆంగ్లం నేర్చుకోవడంలో ఉండే భేదాలను అర్థం చేసుకోవడంలో వారి వయసు, వాతావరణాన్ని మార్చడం.
B) నియంత్రణా సమూహ పద్ధతి: ఈ పద్ధతిలో మూడు ఉపపద్ధతులు ఉన్నాయి.
(i) సమజోడీ పద్ధతి: నివారించాల్సిన జోక్య చరానికి సంబంధించి విద్యార్థులకు ఒక ప్రజ్ఞా పరీక్షను నిర్వహించి, ఒకే ఫలితం పొందిన ఇద్దరిలో ఒక్కొక్కరిని ఒక్కో సమూహంలో చేర్చడం.
(ii) సమ సమూహ పద్ధతి: నివారించాల్సిన జోక్య చరానికి సంబంధించి విద్యార్థులకు కేంద్రీయ ప్రవృత్తి మాపన పరీక్షలు (అంకగణితం, మధ్యగతం, బాహుళకం), చరశీలతలను (వ్యాప్తి, QD, SD, సగటు విచలనం) పోల్చి వాటి విలువలో చెప్పుకోదగిన మార్పు లేని పక్షంలో ఆ రెండు సమూహాలను పోల్చదగినవిగా భావించి ప్రయోక్త ప్రయోగాన్ని నిర్వహిస్తాడు.
(iii) యాదృచ్ఛిక సమూహ పద్ధతి: జోక్య చరాల తొలగింపు చాలా వరకు ఇబ్బందిగా ఉన్నప్పుడు యాదృచ్ఛికంగా వ్యక్తులను సమూహాలకు కేటాయిస్తారు.

ప్రయోగాత్మక నమూనాలు: ఏదైనా ఒక సమస్యను లేదా నూతన పరిస్థితిని తెలుసుకోవడానికి నమూనాలు అవసరం. వీటి ద్వారా కచ్చితమైన ఫలితాన్ని వెల్లడించగలం. 1963లో ఫెదరర్ ప్రయోగ నమూనాలను 2 నమూనాలుగా విభజించారు.
      1) క్రమబద్ధమైన నమూనా        2) యాదృచ్ఛిక నమూనా
     పై రెండు పద్ధతుల ద్వారా
1. ఏకసమూహ పద్ధతి: తరగతి గదిని ఒకే సమూహంగా ఏర్పాటుచేసి ఆ సమూహాన్నే నియంత్రిత సమూహం (A), ప్రయోగ సమూహం (B) గా నిర్వహించడం, ఫలితం రాబట్టడం.


                         
2. రెండు సమూహాల సమూనా: తరగతి గదిని రెండు సమూహలుగా ఏర్పాటు చేసి ఒకే సమయంలో మొదటి సమూహాన్ని నియంత్రిత సమూహం (A) గానూ, రెండో సమూహాన్ని ప్రయోగ సమూహం (B) గా ఏర్పాటు చేసి ఫలితం రాబట్టడం.


                   

3. అనేక సమూహాల నమూనా: తరగతి గదిని రెండు కంటే ఎక్కువ సమూహాలుగా చేసి వాటిపై నియంత్రిత (A), ప్రయోగ (B) సమూహాలను ఏర్పాటు చేసి ఫలితం రాబట్టాలి.


       
ఉపయోగాలు:
*  అన్ని అధ్యయన పద్ధతుల్లో కంటే అత్యంత విశ్వసనీయత, సప్రమాణత ఉన్న పద్ధతి.
*  అన్ని పద్ధతుల్లోకెల్లా వస్తు నిష్ఠత శాస్త్రీయత కలిగిన పద్ధతి.
*  ఫలితాలను ఎన్నిసార్లయినా తిరిగి చేయవచ్చు.
*  కార్యకారణ సంబంధం ఉండేది.
*  ఫలితాలను కచ్చితంగా నిర్ధారించవచ్చు.

 

పరిమితులు/ లోపాలు:
*  అసహజ వాతావరణంలో జరుగుతుంది. కాబట్టి జీవి ఒక్కోసారి తన సహజ పరిస్థితిని కోల్పొయే అవకాశం ఉంది.

*  ఈ పద్ధతిని నిర్వహించేవారు కచ్చితంగా తర్ఫీదు పొందినవారై ఉండాలి.
*  జోక్య చరాలను అదుపులో ఉంచి ప్రయోగం నిర్వహించడం కష్టం.
*  ఉద్వేగ సంఘటనలు, యుద్ధాలకు ప్రయోగాన్ని నిర్వహించలేం.
*  ప్రయోగాన్ని మొదట జంతువులపై చేసి, మానవులకు అనుప్రయుక్తం చేయడం కొంత వరకు సమంజసం కాదు.

 

అనుధైర్ఘ్య పద్ధతి (Longitudinal Method)
    జన్మించిన శిశువులో క్రమేణా వయసు పెరిగే కొద్దీ శారీరక, మానసిక వికాసంలో అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ వికాసాత్మక మార్పులను వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అనుధైర్ఘ్య, తిర్యక్ పద్ధతుల ద్వారా అంచనా వేస్తారు. అందులో అనుధైర్ఘ్య పద్ధతి గురించి పరిశీలిద్దాం.
    ఏదైనా ఒక దశలో శిశువు వికాసాన్ని అంచనా వేయడానికి ఆ శిశువును క్రమపద్ధతిలో దీర్ఘకాలం పరిశీలించి అంచనా వేయడమే అనుధైర్ఘ్య పద్ధతి/ఆయత/ దీర్ఘకాల పద్ధతి అని అంటారు.
 ఒకే వ్యక్తిపై ఎక్కువ కాలం పరిశోధిస్తారు.
 పరిశీలన విశ్వసనీయంగా జరుగుతుంది.
 సమయం అధికంగా వెచ్చించినప్పటికీ కచ్చితంగా లక్షణాలను వెలికి తీయవచ్చు.
ఉదా: కౌమార దశలోని లక్షణాలను తెలుసుకోవడానికి ఒక వ్యక్తిని 13వ సంవత్సరం నుంచి 18 సంవత్సరాల వరకు అంటే దాదాపు 6 సంవత్సరాల పాటు పరిశీలించడం.

తిర్యక్ పద్ధతి (Cross Sectional Method)
     వ్యక్తిలోని ఏదైనా ఒక దశ వికాసాన్ని అంచనా వేయడానికి వివిధ వయసుల్లోని వారిని ఒక సంవత్సర కాలం పరిశీలించి లక్షణాలను వెల్లడించడమే తిర్యక్/ అడ్డుకోత/ సంకీర్తన పద్ధతి అని అంటారు.
 సమయం ఆదా అవుతుంది.
 ఫలితాలను నిర్ణీత సమయంలో వెల్లడించవచ్చు.
ఉదా: కౌమారదశ లక్షణాలను ఈ పద్ధతిలో తెలుసుకోవడానికి 13, 14, 15, 16, 17, 18 సంవత్సరాల్లోని 6 మంది వ్యక్తులను ఒక సంవత్సరంపాటు పరిశీలించి ఫలితం తెలపడం.

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌