• facebook
  • whatsapp
  • telegram

నీరు 

‣ భూగోళంపై నీరు 3 వంతులు ఆవరించి ఉంది.

‣ నీరు లభించే స్థలాలను జలవనరులు లేదా నీటివనరులు అంటారు. ఉదా: సముద్రాలు, నదులు, చెరువులు, బావులు, కాలువలు, సరస్సులు మొదలైనవి.

స్థానిక నీటివనరులు

మన నిత్యావసరాలకు నీరు ఎక్కడ నుంచి లభిస్తుందో వాటిని స్థానిక నీటి వనరులు అంటారు. ఉదా: నదులు, చెరువులు, బావులు.

‣ భూమిపై ఉన్న నీటిలో అత్యధికం సముద్రాల్లో ఉంది.

‣ 97 శాతం సముద్రాల్లో, 2 శాతం ధ్రువ ప్రాంతాల్లో మంచు రూపంలో, ఒక శాతం మాత్రమే మానవుడి అవసరాలకు ఉపయోగపడుతోంది.

‣ సముద్రపు నీరు ఉప్పునీరు. ఇది మానవుడి అవసరాలకు, పంటలు పండించడానికి ఉపయోగపడదు. ఈ నీటిని ఉప్పు తయారీకి, చేపలు, రొయ్యల పెంపకానికి వాడతారు.

‣ మనదేశంలో పెద్ద నగరాలన్నీ నదుల ఒడ్డునే ఉన్నాయి. 

‣ యమునా - ఢిల్లీ

‣ హుగ్లీ - కోల్ కతా

‣ మూసీ - హైదరాబాద్

‣ డాల్ సరస్సు - శ్రీనగర్

మంచినీరు 

‣ మానవుడి అవసరాలకు, పంటలు పండించడానికి ఉపయోగపడే నీరు.

‣ నదులు, చెరువులు, సరస్సులు, బావుల్లో ఇలాంటి నీరు ఉంటుంది. మంచినీటికి రంగు, రుచి, వాసన ఉండదు.

‣ భూమిపై నీరు 3 రకాలుగా విస్తరించి ఉంది లేదా లభిస్తుంది. అవి 1) గాలిలోని నీటి ఆవిరి 2) భూ ఉపరితల జలం 3) భూగర్భ జలం.

‣ ఉపరితల నీటివనరులకు ఉదాహరణ సముద్రాలు, నదులు, చెరువులు, సరస్సులు మొదలైనవి.

‣ భూగర్భజలం: బావులు, బోరు పంపులు/ గొట్టపు బావులు మొదలైనవి. వర్షపునీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలంగా మారుతుంది. అయితే నీటి వాడకం పెరగడంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి.

‣ భూమిమీద ఉన్న అన్ని నీటి వనరులకు ముఖ్య ఆధారం - వర్షం.


గొట్టపు బావులు/ బోర్లు: భూమిలో చాలాలోతులో ఉన్న నీటిపొరల వరకు రంధ్రాలు వేసి, గొట్టాలు దించి నీటిని పైకి తోడుతున్నారు. వీటినే బోర్లు అంటారు.

‣ నేలపై పొరల్లో లభించే నీటివనరులు - చెలమలు, ఊటలు.

‣ ఎడారి ప్రాంతాలలోని నీటి వనరులను 'ఒయాసిస్‌లు' అంటారు.

నీటిలో జీవించే మొక్కలు - జంతువులు

‣ తామర, కలువ, గుర్రపుడెక్క, నాచు లాంటివి సాధారణ నీటి మొక్కలు. ఇవి సముద్రంలో జీవించే జంతువులకు ఆహారంగా ఉపయోగపడతాయి.

‣ చేపలు, కప్పలు, పెద్దపెద్ద చేపలు, బ్లూ వేల్, షార్క్‌చేపలు (సొరచేపలు) నీటిలో నివసించే పెద్ద జంతువులు.

‣ ప్రపంచంలో అతిపెద్ద జంతువు - నీలి తిమింగలం. 

నీటి ఉపయోగాలు

‣ జీవుల్లో జీవక్రియలు జరగడానికి ఉపయోగపడుతుంది.

‣ నీరు ఎక్కువ పదార్ధాలను కరిగించుకుంటుంది, అందుకే దీన్ని 'సార్వత్రిక ద్రావణి' అంటారు.

‣ మొక్కలు ఆహారం తయారు చేసుకోడానికి నీరు అవసరం.

‣ మొక్కలు, జంతువులు బతకడానికి/ జీవించడానికి నీరు కావాలి.

‣ గింజలు మొలకెత్తడానికి నీరే కారణం.

నీటి వనరులు - పంటలు

నీటి వినియోగాన్ని బట్టి పంటలు రెండు రకాలు...

‣ వర్షం ఆధారంగా పండే పంటలు.

‣ సాగు నీటి ద్వారా పండే పంటలు.

వర్షాధార/ మెట్ట పంటలు: ఇవి తక్కువ నీటిని ఉపయోగించుకుంటాయి (వర్షపు నీరు). వీటినే 'మెట్ట పంటలు' అని కూడా అంటారు. ఉదా: సజ్జ, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర మొదలైనవి.

సాగునీటి పంటలు: వీటికి నిరంతరం నీరు అవసరం. ఉదా: వరి, చెరకు, గోధుమ, పత్తి, కూరగాయల పంటలు.

ఎడారి మొక్కలు: వర్షం చాలా తక్కువ ఉండే ప్రాంతాల్లో పెరిగే మొక్కలు. ఉదా: కలబంద, నాగజెముడు, బ్రహ్మజెముడు, కాక్టస్ మొదలైనవి.

నీటిని శుభ్రపరిచే పద్ధతులు: నీటిలో కరిగిన మలినాలను, సూక్ష్మజీవులను తొలగించడాన్నే 'నీటిని శుభ్రపరచడం' అంటారు. దీనికి అనుసరించే పద్ధతులు...

‣ వడబోత

‣ మూడంచెల పద్ధతి

‣ తేర్చడం, తేర్చడం వేగవంతం చేయడం

‣ వాటర్ ఫిల్టర్

‣ రక్షిత మంచినీటి పథకం

వడపోత: నీటిలో కరగకుండా, అందులో తేలియాడే పెద్దపెద్ద నలుసులు, చెత్తాచెదారం తొలగించడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు.

‣ గ్రామీణ ప్రాంతాలలో నీటిని వడపోయడానికి ఈ పద్ధతినే ఎంచుకుంటారు.

‣ ప్రయోగశాలలో వ్యర్థ పదార్థాలను వడపోయడానికి 'ఫిల్టర్ పేపర్‌'ను ఉపయోగిస్తారు.

‣ గుడ్డ/ బట్ట వడపోత కన్నా ఫిల్టర్ పేపర్ వడపోత మెరుగ్గా ఉంటుంది.

మూడంచెల పద్ధతి/ సంప్రదాయ విధానం 

‣ ఈ విధానంలో గులకరాళ్లు, కర్రబొగ్గు, సన్నని ఇసుకను ఉపయోగించి నీటిని శుభ్రపరుస్తారు.

తేర్చడం: ఈ విధానం 'మట్టికణాల బరువుపై ఆధారపడి' పని చేస్తుంది.

‣ ఈ విధానంలో 'మడ్డి నీటిని కదలకుండా కొన్ని గంటలపాటు అలాగే ఉంచడం వల్ల మట్టి కణాలు అడుగుకు చేరుకుంటాయి'.

‣ ఈ ప్రక్రియ వేగంగా జరగాలంటే మడ్డిగా ఉన్న నీటిలో పటిక లేదా చిల్లగింజల గంధం కలపాలి.

‣ ఇలా కలపడం వల్ల మట్టికణాలు, పటిక కణాలకు అంటుకుని మరింత బరువు పెరిగి త్వరగా అడుగుకు చేరుకుంటాయి.

వాటర్ ఫిల్టర్: వాటర్ ఫిల్టర్‌లో సూక్ష్మరంధ్రాలతో కూడిన 'సిరామిక్ క్యాండిల్స్' ఉంటాయి.

‣ ఈ క్యాండిల్స్ నీటిలో ఉన్న సన్నని మట్టికణాలు, ఇతర పదార్థాలను వడపోస్తాయి.

‣ నీటిని మరిగించి, చల్లార్చి ఫిల్టర్‌లో పోయడం వల్ల నీటిలోని సూక్ష్మజీవులు చనిపోతాయి.

రక్షిత మంచినీటి పథకం: గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ పెద్దమొత్తంలో మంచినీటిని సరఫరా చేసే వ్యవస్థను 'రక్షిత (మంచి) నీటి పథకం' అంటారు.

‣ ఈ వ్యవస్థలో నీటిని శుభ్రపరిచే విధానం - మూడంచెల పద్ధతిని పోలి ఉంటుంది.

‣ ఈ సుదీర్ఘమైన విధానంలో 3 దశలుంటాయి. అవి 1. నిల్వ చేయడం, 2. శుభ్రపరచడం, 3. సరఫరా చేయడం.

నిల్వచేయడం: నీటిని నిల్వచేయడానికి నదులు, చెరువులు, సరస్సుల్లో ఉన్న మంచి నీటిని రిజర్వాయరులోకి పంపుతారు. నీటిని నిల్వచేయడానికి వీలుగా రిజర్వాయర్‌లను లేదా పెద్దట్యాంకులను కడతారు. ఈ పద్ధతిలో బరువుగా ఉండే మలిన పదార్థాలను తొలగిస్తారు.

నీటిని శుభ్రపరచడం

1. తేర్చడం (సెడిమెంటేషన్):

‣ ఫిల్టర్ బెడ్స్‌కు నీటిని పంపే ముందు సెడిమెంటేషన్ ట్యాంకుకు పంపిస్తారు.

‣ ఇక్కడ నీటికి పటిక (ఆలం)ను కలపడం వల్ల కొన్ని మట్టికణాలు అడుగు భాగానికి చేరతాయి.

2. వడపోయడం: తేర్చడం ద్వారా వచ్చిన నీటిని సన్నని చీలికలు ఉన్న వడపోత ట్యాంకులోకి పంపిస్తారు.

‣ ఈ ప్రక్రియలో నీటిని గులకరాళ్లు, చార్‌కోల్ (బొగ్గు), సన్నని ఇసుక పొరల ద్వారా వడకడతారు.

‣ ఇందులో వాడే బొగ్గు నీటిలోని దుర్వాసన, కాలుష్య కారకాలను గ్రహిస్తుంది.

‣ వడపోత వల్ల సూక్ష్మజీవులను నిర్మూలించలేం.

క్లోరినేషన్: వడపోసిన నీటిని క్లోరినేషన్ ట్యాంకుల్లోకి పంపి, ఆ నీటిలోకి క్లోరిన్ గ్యాస్ లేదా బ్లీచింగ్ పౌడర్ లేదా పొటాషియం పర్మాంగనేట్‌ను పంపుతారు.

‣ క్లోరిన్ వాయువు నీటిలోని సూక్ష్మజీవులను సంహరిస్తుంది. దీన్నే క్లోరినేషన్ అంటారు.

ఏరేషన్: నీటిలోని సూక్ష్మజీవులను నిర్మూలించడానికి ఈ విధానాన్ని కూడా ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో నీటిని తుషార రూపంలో గాలిలోనికి పంపు చేస్తారు. నీటిలోని సూక్ష్మజీవులు సూర్యరశ్మికి చనిపోతాయి.

‣ ఇది నీటిలోని సూక్ష్మజీవులను సూర్యరశ్మి సహాయంతో నిర్మూలించే పద్ధతి.

పంపు చేయడం: క్లోరినేషన్ ట్యాంకుల నుంచి నీటిని ఓవర్‌హెడ్ ట్యాంకుల్లోకి పంపు చేస్తారు.

‣ వీటి నుంచి సురక్షితమైన నీటిని పైపుల ద్వారా ఇళ్లకు, పాఠశాలలకు, హాస్పిటల్స్‌కు సరఫరా చేస్తారు.

‣ ఎత్తయిన స్తంభాలపైన నిర్మించిన పెద్ద ట్యాంకును 'ఓవర్‌హెడ్ ట్యాంక్' అంటారు.

రక్షిత మంచినీరు అందుబాటులో లేనివారు UV (అల్ట్రావైలెట్) వాటర్ ఫిల్టర్స్‌ని ఉపయోగించవచ్చు.

U.V. వాటర్ ఫిల్టర్స్: ఇది కూడా 3 అంచెల పద్ధతినే పోలి ఉంటుంది. దీనిలో నీరు 3 దశలలో శుభ్రపడుతుంది.

‣ పింగాణీ స్తూపాల ద్వారా వడపోస్తారు.

‣ ఉత్తేజింపచేసిన బొగ్గు ద్వారా నీటిలో ఉన్న లవణాలు దుర్వాసన్ని పీలుస్తాయి.

‣ U.V. కిరణాలు వెదజల్లే గది - వెలుగుతున్న విద్యుత్ బల్బు ద్వారా U.V. కిరణాలు విడుదలై నీటిలో ఉన్న బ్యాక్టీరియా, వైరస్ చనిపోతాయి.

రివర్స్ ఆస్మాసిస్: నీటిని శుభ్రపరిచే మరో పద్ధతి రివర్స్ ఆస్మాసిస్... (బాటిల్స్ రూపంలో) అమ్ముతున్న నీరు. ఈ పద్ధతిలో ఉప్పునీటిని మంచినీటిగా మారుస్తారు.

నీటి కాలుష్యం

‣ మన ఆరోగ్యానికి హాని కలిగించని నీటిని 'తాగునీరు' అంటారు.

‣ అధిక మోతాదులో ఉండకూడని వ్యర్థ పదార్థాలు (కరగని ఘన పదార్థ రేణువులు, కరిగిన లవణాలు, పారిశ్రామిక వ్యర్థాలు, చెత్తాచెదారాలు, ఆల్గే) నీటిలో ఉన్నట్లయితే లేదా రసాయనిక / జీవరసాయనిక పదార్థాలు నీటిలో కలిసి ఉంటే దాన్ని 'నీటి కాలుష్యం' అంటారు.

‣ నీటిలో వివిధ రకాల మలినాలు కలిసి ఉంటే దాన్ని 'కలుషిత నీరు' అంటారు. 

నీటి కాలుష్యం - కారణాలు

‣ గృహ వ్యర్థాలు

‣ పరిశ్రమ వ్యర్థాలు (పరిశ్రమలు వదిలే నీటిలో పాదరసం, ఆర్సెనిక్, సీసం లాంటి విష రసాయనాలు ఉంటాయి. ఇవి 'నాడీ వ్యవస్థపై' తీవ్రమైన ప్రభావం చూపుతాయి)

‣ వ్యవసాయ వ్యర్థాలు.

కలుషిత నీరు - ఆరోగ్యంపై ప్రభావం

‣ కలుషిత నీరు తాగడం వల్ల 'కలరా, టైఫాయిడ్, కామెర్లు, పోలియో, నీళ్ల విరేచనాలు' కలుగుతాయి.

‣ ఫ్లోరిన్ ఎక్కువగా ఉన్న నీటిని తాగడం వల్ల ఫ్లోరోసిస్ అనే వ్యాధి వస్తుంది.

‣ ఈ వ్యాధి సోకినవారి 'ఎముకలు దృఢత్వం కోల్పోయి వంకరపోతాయి'.

డయేరియా - అతిసారవ్యాధి

‣ ఇది వర్షాకాలంలో కలుషిత నీరు తాగడం ద్వారా అతి సాధారణంగా వచ్చే వ్యాధి.

‣ విరేచనాలు, వాంతులు దీని లక్షణాలు.

‣ శరీరం నుంచి ఎక్కువ మోతాదులో నీరు బయటకు పోతుంది.

‣ ఇలాంటి సందర్భంలో రోగికి ఓఆర్ఎస్ ద్రావణాన్ని తాగించాలి.

‣ ఈ ప్యాకెట్లను ప్రభుత్వ పీహెచ్‌సీల్లో ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

‣ ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషనల్ సొల్యూషన్.

‣ ఓఆర్ఎస్ తయారీ: 1 లీటర్ కాచి చల్లార్చిన నీరు + 3 చెంచాల పంచదార + ఒక చెంచా ఉప్పు + 1/2 చెంచా తినే సోడా.

‣ రోగికి ప్రతి 20 - 30 నిమిషాలకు ఒక్కసారి కొద్ది కొద్దిగా ఈ ద్రావణాన్ని తాగిస్తూ ఉండాలి.

పంటలు - నీటి సరఫరా

తక్కువ నీటి వసతితో మెట్టపంటలు పండిచడానికి అనుసరిస్తున్న ఆధునిక పద్ధతులు:

‣ నేలవాలుకు అడ్డంగా దున్ని విత్తనాలు వేయడం.

‣ చెక్‌డ్యాంలు కట్టడం

‣ కాంటూర్ కట్టలు కట్టడం.

‣ ఇంకుడు గుంటలు తవ్వడం.

ఈ పద్ధతుల ద్వారా వర్షపు నీరు నేలలో ఇంకిపోయి భూగర్భ నీటిమట్టం పెరుగుతుంది. 

పంటలకు నీటి సరఫరా పద్ధతులు

‣ భూగర్భజలం ఉన్నచోట బావులు, గొట్టపు బావుల ద్వారా నీటిని వ్యవసాయానికి ఉపయోగించాలి.

‣ చెరువుల ద్వారా.

‣ నదులకు ఆనకట్టలు కట్టి కాలువల ద్వారా పల్లపు ప్రాంతాలకు నీటి సరఫరా.

‣ రిజర్వాయర్, నది, కాలువల నుంచి నీటి మట్టం కన్నా ఎక్కువగా ఉన్న భూములకు లిఫ్ట్ పద్ధతి ద్వారా నీటిని అందిస్తారు. ఉదా: మన రాష్ట్రంలో అతిపెద్ద జలాశయమైన నాగార్జున సాగర్ డ్యాం ఎడమ కాలువ నుంచి ఏర్పాటు చేసిన (లాల్‌బహుదూర్ శాస్త్రి) లిఫ్ట్ పద్ధతి.

‣ పూర్వం ఏతాం, మోట, ఫ్రెంచి చక్రంతో బావుల నుంచి, వాగుల నుంచి నీటిని తోడి వ్యవసాయం చేసేవారు. నేడు వీటి స్థానంలో విద్యుత్ మోటార్లు, గాలిమరలు వచ్చాయి.

వ్యవసాయంలో నీటిపొదుపు: వ్యవసాయంలో నీటిని పొదుపుగా వాడటానికి అనుసరించే ఆధునిక పద్ధతులు.

‣ కుండ పద్ధతి   

‣ బిందు సేద్యం   

‣ తుంపర సేద్యం

ఇవి వ్యవసాయంలో నీటి వృధాను అరికట్టడానికి ఉపయోగపడతాయి.

‣ తక్కువ నీటితో వరి పండించే శ్రీవరి సాగు పద్ధతి రైతులకు ఎంతో లాభదాయకం.

కరవు: వర్షం కురవని, పంటలు పండని, ఆహారం దొరకని పరిస్థితినే కరవు అంటారు.

వలస: ఆహారం, నీరు దొరికే ప్రదేశాలకు ప్రజలు పశువులతో సహా వెళ్లిపోవడమే వలస. పూర్వం మన నాగరికత అంతా నదులు, సరస్సులు, సముద్ర తీరాల్లోనే అభివృద్ధి చెందింది. నదులు, సరస్సులు లేని ప్రదేశాల్లో వ్యవసాయానికి చెరువులు, బావులను నీటివనరులుగా ఉపయోగించేవారు.

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌