• facebook
  • whatsapp
  • telegram

ఆఫ్రికా - ఒక చీకటి ఖండం

    ఖండాలన్నింటిలో రెండో అతి పెద్ద ఖండం ఆఫ్రికా. ఇది   37° ఉత్తర అక్షాంశం నుంచి 35° దక్షిణ అక్షాంశం వరకు, 24° పశ్చిమ, 58° తూర్పు రేఖాంశాల మధ్య సుమారు 30.33 మిలియన్ల చ.కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఆఫ్రికా ఖండం ఉత్తర, దక్షిణాలుగా 8 వేల కి.మీ. పొడవు, తూర్పు, పడమరలుగా 7,400 కి.మీ. వెడల్పు ఉంది. ఆఫ్రికా ఖండం మీదుగా 0° అక్షాంశరేఖ అయిన భూమధ్యరేఖ, 23 1/2° ఉత్తర అక్షాంశమైన కర్కటరేఖ, 23 1/2° దక్షిణ అక్షాంశమైన మకరరేఖలు ప్రయాణిస్తున్నాయి.

     ఆఫ్రికా యూరప్ ఖండానికి అతి సన్నిహితంగా ఉన్నప్పటికీ దాన్ని చీకటి ఖండంగా పరిగణిస్తారు. 19వ శతాబ్దం చివరి వరకూ ఆఫ్రికా ఖండం గురించి పెద్దగా తెలియకపోవడం వల్ల ఐరోపావాసులు దాన్ని చీకటి ఖండం అని పిలిచేవారు. క్రీ.శ. 1840లో స్కాటిష్ మిషనరీ అన్వేషకుడైన లివింగ్‌స్టన్ మొదటిసారిగా ఆఫ్రికా అన్వేషణ మొదలుపెట్టాడు. ఆ తర్వాత 'రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ' కామెరూన్ అనే మరో అన్వేషకుడిని ఆఫ్రికాకు పంపింది.
* లివింగ్‌స్టన్ మధ్య ఆఫ్రికా, టాంగాన్యికా, నియస్సా ప్రాంతాలను ఆవిష్కరించాడు.
* కామెరూన్ కాంగో ప్రాంతాన్ని కనుక్కున్నాడు.
* బెల్జియం రాజు లియోపోల్ట్ - II క్రీ.శ. 1879లో స్టాన్లీని ఆఫ్రికాకు పంపించడంతో అతడు తూర్పు ఆఫ్రికాకు సంబంధించిన విషయాలను ప్రపంచానికి తెలియజేశాడు.
* యూరోపియన్‌లు 'నీగ్రో బానిసల' కోసం ఆఫ్రికాకు వచ్చేవారు. 19వ శతాబ్దం నాటికి ఐరోపావాసులు ఆఫ్రికా గురించి పూర్తిగా తెలుసుకున్నారు.

ఆఫ్రికాలోని ముఖ్య పర్వతాలు
* ముడత పర్వతాలైన అట్లాస్ పర్వతాలు
* ఖండ పర్వతాలైన డ్రాకెన్స్‌బర్గ్ పర్వతాలు


 

ఎక్సోటిక్ నదులు

          ఉష్ణమండల ఎడారుల్లో నీటిని జీవానికి మారుపేరుగా పేర్కొంటారు. ఎడారుల మీదుగా ప్రవహించే నదులను ఎక్సోటిక్ (Exotic) / జీవనదులు అని పిలుస్తారు.
* సహారా ఎడారి మీదుగా ప్రవహించే జీవనది     - నైలు.
* కలహరి ఎడారి మీదుగా ప్రవహించే జీవనది    - ఆరెంజ్.
* ఎడారుల్లో అక్కడక్కడ ఒయాసిస్సులు ఏర్పడతాయి. ఈ ప్రాంతాల్లో ఖర్జూరపుజాతి చెట్లు, గడ్డి పెరుగుతాయి.
శీతోష్ణస్థితి

        ఆఫ్రికా ఖండంలో ప్రధానంగా ఉష్ణమండల శీతోష్ణస్థితి ఉంటుంది. ఈ ఖండం ఉత్తరార్ధ, దక్షిణార్ధ గోళాలు రెండింటిలో వ్యాపించి ఉండటం వల్ల ఆఫ్రికా ఖండంలో వైవిధ్యమైన శీతోష్ణ పరిస్థితులు ఉన్నాయి.
* ఉత్తరార్ధ గోళంలో మే నుంచి అక్టోబరు వరకు వేసవికాలం ఉంటే దక్షిణార్ధ గోళంలో చలికాలం ఉంటుంది.
* ఉత్తరార్ధ గోళంలో నవంబరు నుంచి ఏప్రిల్ వరకు చలికాలం ఉంటే దక్షిణార్ధ గోళంలో వేసవి కాలం ఉంటుంది.
* ఆఫ్రికా ఖండం సరాసరి ఉష్ణోగ్రత: 20°C.
* ఆఫ్రికా ఖండంలో నాలుగు రకాల శీతోష్ణస్థితులు ఉన్నాయి.

 

భూమధ్యరేఖా శీతోష్ణస్థితి

        ఈ ఖండంలో కాంగోనది హరివాణంలోని దేశాలు గేబన్, కాంగో, జైరే, కెమెరూన్, టాంజానియా, సెంట్రల్ రిపబ్లిక్, మొజాంబిక్, లైబీరియా, ఐవరీకోస్టు దేశాల్లో భూమధ్యరేఖా శీతోష్ణస్థితి ఉంటుంది. భూమధ్యరేఖ ప్రాంతంలో భూగోళం చుట్టూ ఏర్పడిన అల్పపీడన మేఖలను 'డోల్డ్రమ్స్' అంటారు. డ్రోల్డమ్స్ అంటే ప్రశాంత పవనాలు. ఆఫ్రికా ఖండంలోని కెమెరూన్ శిఖరం ప్రపంచంలో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రదేశాల్లో నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. ఈ ప్రాంతంలో పర్వతీయ వర్షపాతం ఎక్కువగా సంభవిస్తుంది.
 

సుడాన్ రకపు శీతోష్ణస్థితి
          భూమధ్యరేఖ శీతోష్ణస్థితికి ఇరువైపుల ఉన్న పర్వతాల వెలుపల సుడాన్ రకపు శీతోష్ణస్థితి ఉంది.

 

ఉష్ణమండల సవన్నా రకపు శీతోష్ణస్థితి
          ఆఫ్రికా ఖండంలోని సెనెగల్, గినియా, మాలి, నైజర్, ఛాడ్, సుడాన్, నైజీరియా, అంగోలా, జింబాబ్వే, ఇథియోపియా, మడగాస్కర్ ద్వీపం పశ్చిమ తీరంలో ఉష్ణమండల సవన్నారకపు శీతోష్ణస్థితి ఉంది. ఉష్ణమండల ఎడారుల నుంచి వేడిగా, పొడిగా ఉండే దుమ్ముతో కూడిన బలమైన గాలులు వీస్తాయి. ఈ ప్రాంతంలో సరాసరి ఉష్ణోగ్రత 32° c కంటే ఎక్కువ.      

 

మధ్యధరా శీతోష్ణస్థితి

          మధ్యధరా సముద్రతీర ప్రాంత దేశాలైన 1. ట్యునీషియా, 2. అల్జీరియా, 3. మొరాకో దేశాల్లో మధ్యధరా శీతోష్ణస్థితి ఉంది. ఈప్రాంతం సరాసరి ఉష్ణోగ్రత 22°C కంటే తక్కువ. 

ఆఫ్రికాలో ప్రవహించే నదులు

నైలు నది: ప్రపంచంలో పొడవైన నది నైలు. ఆఫ్రికాలోని విక్టోరియా నుంచి ప్రారంభమై సహారా ఎడారి మీదుగా ప్రయాణించి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. ఈజిప్ట్‌ను 'నైలునదీ వరప్రసాదం' అని పిలుస్తారు.
 

ఆరెంజ్ నది: డ్రాకన్స్‌బర్గ్ పర్వతాల్లో జన్మించి, కలహరి ఎడారి మీదుగా ప్రయాణించి అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది.
జాంబెజీ నది: కటంగా పీఠభూమిలో జన్మించి, హిందూ మహాసముద్రంలో కలుస్తుంది. జాంబెజీ నదిపై ఉన్న విక్టోరియా జలపాతం 108 మీటర్ల ఎత్తు నుంచి జాలువారుతూ సందర్శకులను ఆకర్షిస్తుంది.

* ఇవేకాకుండా ఆఫ్రికా ఖండంలో కాంగోనది, నైజర్, లింపోపో నదులు ప్రవహిస్తున్నాయి.

ఆఫ్రికా - ఉప్పునీటి సరస్సులు

        ఆఫ్రికా ఖండంలోని ఎడారి ప్రాంతంలో సరస్సులు ఉండటం వల్ల, తక్కువ వర్షపాతం వల్ల, ఎడతెరపి లేకుండా సరస్సులోని నీరు ఆవిరై లవణాలు మిగిలిపోతున్నందువల్ల, సరస్సుల నుంచి బయటకు ప్రవాహాలు లేనందు వల్ల, నీటిలో కరిగిన లవణాల గాఢత ఎక్కువై నీటికి ఉప్పదనం ఎక్కువవుతుంది.
       ఈ ఖండంలో న్యాసా, విక్టోరియా, గామి, చాద్ సరస్సులు ఉన్నాయి. వీటిలో 'చాద్, గామి' ఉప్పునీటి సరస్సులు.

విక్టోరియా జలపాతం

       జాంబెజీ నదిపై ఉన్న విక్టోరియా జలపాతం వెడల్పు 1.7 కి.మీ. ఇది 108 మీటర్ల ఎత్తు నుంచి జాలువారుతూ పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. జాంబియా, జింబాబ్వే దేశాల్లోని జాతీయ పార్కుల్లో నుంచి చూస్తే విక్టోరియా ప్రకృతి సౌందర్యం సంపూర్ణంగా కనిపిస్తుంది.      

ఆఫ్రికా ఖండం - జనాభా

            ఆఫ్రికా ఖండం జనాభా ప్రపంచ జనాభాలో 13 శాతం. ఆఫ్రికా ఖండం జనసాంద్రత ఒక చదరపు కిలోమీటరుకు 65 మంది మాత్రమే. భూమధ్యరేఖ ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఆదిమ, ఆటవిక జాతులవారు తక్కువ సంఖ్యలో నివసిస్తున్నారు.

ఆఫ్రికా ఖండం

 ఎడారులు            
భూ ఉపరితలంపై వ్యవసాయానికి ఉపయోగపడని, ప్రజలు పెద్దగా నివసించని విశాలమైన ప్రాంతాలను ఎడారులు అంటారు. 'నీరు లభించకపోవడం' ఎడారుల ప్రత్యేక లక్షణం. ఆఫ్రికా ఖండంలో ప్రధానంగా రెండు ఎడారులు విస్తరించి ఉన్నాయి. అవి
1) సహారా
2) కలహరి. 
 సహారా ఎడారి

        సహారా ఎడారి ఆఫ్రికా ఖండం పశ్చిమ తీరం నుంచి, తూర్పుతీరం వరకు విస్తరించి ఉంది. దీని విస్తీర్ణం అమెరికా సంయుక్త రాష్ట్రాల కంటే రెట్టింపు. అరబ్బుల భాషలో 'సహారా' అంటే ఎడారి అని అర్థం. ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణమండల ఎడారి - సహారా ఎడారి. భూ ఉపరితలంపై 1922 సెప్టెంబరు 13న సహారా ఎడారిలోని లిబియా దేశంలోని అజీజియా ప్రాంతంలో అత్యధిక పగటి ఉష్ణోగ్రత 58° నమోదైంది. ఇప్పటివరకూ భూ ఉపరితలం మీద నమోదైన అత్యధిక పగటి ఉష్ణోగ్రత ఇదే.    


కలహరి ఎడారి 
ఆఫ్రికా ఖండం నైరుతి ప్రాంతంలో ఉన్న కలహరి ఎడారి నమీబియా, బోట్స్‌వానా, అంగోలా, దక్షిణాఫ్రికా దేశాల్లో విస్తరించి ఉంది. ఇది హమడాకి మంచి ఉదాహరణ

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌