• facebook
  • whatsapp
  • telegram

సంసర్గ (సమాచార ప్రసార) వ్యవస్థలు

కంప్యూటర్ - ప్రధాన నియమాలు - పనితీరు

* అధిక సంఖ్యలో డయోడ్లు, ట్రాన్సిస్టర్లు ఉండే అర్ధ వాహకాన్ని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ (IC) లేదా చిప్ అంటారు.
* ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌ల కలయికతో మైక్రోప్రాసెసర్ ఏర్పడుతుంది. మైక్రోప్రాసెసర్‌లను కంప్యూటర్‌తో సహా అనేక ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో ఉపయోగిస్తారు.
* మైక్రోప్రాసెసర్ గణిత ప్రక్రియలను చేయగలుగుతుంది. నివేశ సాధనం ద్వారా దానికి ఇచ్చే ఆదేశాలను అర్థం చేసుకుంటుంది. మైక్రోప్రాసెసర్‌కు కావాల్సిన దత్తాంశం (డేటా), ఆదేశాలను ఇవ్వడానికి ఉపయోగించే సాధనాన్ని నివేశ సాధనం (Input device) అంటారు. నివేశ సాధనం ద్వారా దానికి కావాల్సిన దత్తాంశం, ఆదేశాలను ఇవ్వాలి. సాధారణంగా కీబోర్డు లేదా మౌస్‌లను నివేశ సాధనాలుగా ఉపయోగిస్తారు.
*  ఇచ్చిన ఆదేశాల మేరకు దత్తాంశం కార్యసరణం అవుతుంది. ఆదేశాల సముదాయాన్ని ప్రోగ్రాం(Program) అంటారు. మైక్రోప్రాసెసర్‌లో 'కంట్రోల్ యూనిట్' (CU) అనే ఒక సాధనం ఉంటుంది. ఈ కంట్రోల్ యూనిట్ పంపే సంకేతాలను డీకోడర్ అనే సాధనం అర్థ వివరణ (Interpret) చేస్తుంది. దీనిలో దత్తాంశాన్ని, ప్రోగ్రాంను తాత్కాలికంగా నిల్వ చేసేందుకు మెమొరీ అనే రెండో సాధనం ఉంటుంది. మైక్రోప్రాసెసర్‌లోని చివరి సాధనం అర్థిమెటిక్ లాజిక్ యూనిట్ (ALU). అన్ని రకాల గణిత, తార్కిక, సంబంధ గణనలన్నింటినీ ALU చేస్తుంది.
*  ఈ గణనలన్నీ పూర్తికాగానే ఫలితాలను నిర్గమ సాధనాలకు (output device) పంపుతాయి. సాధారణంగా ప్రింటర్ లేదా మానిటర్ అనే సాధనాలు నిర్గమ సాధనాలుగా ఉపయోగపడతాయి.
*  మైక్రో ప్రాసెసర్‌లో మూడు సాధనాలు ఉంటాయి.
      i) కంట్రోల్ యూనిట్
      ii) మెమొరి
      iii) అర్థిమెటిక్ లాజిక్ యూనిట్
ఈ మూడింటిని కలిపి ప్రధాన కార్యసరణ భాగం (Central Processing Unit - CPU) అంటారు.
*  ఎలక్ట్రానిక్ వలయాల ప్రధాన విధి గణించడం. ఇలాంటి పనులు చేసే ఎలక్ట్రానిక్ వలయాల సమూహాన్ని 'కంప్యూటర్' అంటారు.
*  కంప్యూటర్‌లో నివేశ, నిర్గమ సాధనాలు ప్రధాన కార్యసరణ భాగానికి కలిపి ఉంటాయి.

            
* కంప్యూటర్ వేగంగా పనిచేసే ఒక సాధనం. ఇది ఎక్కువ పరిమాణంలో కూడా దత్తాంశాలను ప్రోగ్రాంలతో సహా స్వీకరిస్తుంది, నిల్వ చేసుకుంటుంది, ఫలితాలను నిర్గమ సాధనాల ద్వారా వెలువరిస్తుంది.
* కంప్యూటర్ ద్వి సంఖ్యామానాన్ని ఉపయోగిస్తుంది.
* డయోడ్ వాలు బయాస్ (forward bias)లో మాత్రమే వహనానికి వీలు కల్పిస్తుంది. ఈ స్థితిని ఉన్నది  (ON) లేదా అవును (YES)గా సూచిస్తుంది. అలాగే డయోడ్ ఎదురు బయాస్‌లో వహనానికి వీలు  కల్పించదు. ఈ స్థితిని లేదు (OFF) లేదా కాదు (NO)గా సూచిస్తుంది.
* డయోడ్ ఉన్నది/అవును స్థితిని అంకె '1' తో, లేదు/కాదు స్థితిని '0' తో సూచిస్తారు.
* కంప్యూటర్‌లో మొత్తం సమాచారాన్ని 1 లేదా 0 లతో మాత్రమే సూచిస్తారు.
* 1 లేదా 0 బైనరీ డిజిట్‌ను బిట్ (BIT) అంటారు.
* 4 బిట్‌లను ఒక నిబిల్ అంటారు. ఇది ఒక అర్ధ బైట్.
* 8 బిట్‌ల సముదాయాన్ని ఒక బైట్ (BYTE) అంటారు.
* ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బైట్లు కలిసి ఒక పదం అవుతుంది. కంప్యూటర్ నమూనాను బట్టి ఒక పదంలో రెండు, నాలుగు లేదా ఎనిమిది బైట్లు ఉండవచ్చు.
* BCD (బైనరీ కోడెడ్ డెసిమల్)లో ప్రతి డెసిమల్ అంకెను ఒక నిబిల్ లేదా నాలుగు బిట్‌లతో సూచిస్తారు.
* BCDలోని కోడ్‌లో మొదటి 4 బిట్లను 'జోన్ బిట్లు', మిగిలిన 4 బిట్లను న్యూమరిక్ బిట్లు అని అంటారు.
* జోన్ బిట్లను అక్షరాలు, సంకేతాలను సూచించేందుకు వాడతారు. న్యూమరిక్ బిట్లను 0 నుంచి 9 వరకు ఉండే అంకెలను సూచించడానికి వాడతారు. A, B, C లాంటి అక్షరాల న్యూమరిక్ బిట్లు; 1, 2, 3 లాంటి సంఖ్యల న్యూమరిక్ బిట్లు ఒకటే. వాటి జోన్ బిట్లు వేరు. అదేవిధంగా 0 నుంచి 9 సంఖ్యల జోన్ బిట్లు ఒక్కటే, వాటి న్యూమరిక్ బిట్లు వేరు.

 

కొన్ని అంకెల, అక్షరాల BCD కోడ్‌లు


* BCDలో పేర్కొనే సూచనలను యంత్రభాష అంటారు.
* అసెంబ్లర్ (ASSEMBLER) అనేది ఒక యంత్రభాష.
* కంప్యూటర్‌లోని అన్ని భౌతిక భాగాలు;CPU నివేశ, నిర్గమ సాధనాలన్నింటినీ కలిపి హార్డ్‌వేర్ అంటారు.
* యంత్రభాష కంప్యూటర్ తయారుచేసిన హార్డ్‌వేర్‌పైన ఆధారపడి ఉంటుంది. ఒక క్రమపద్ధతిలో రాసిన ఆదేశాల సముదాయాన్ని ప్రోగ్రాం అంటారు.
* యంత్రభాషలో ప్రోగ్రామ్‌లను రాయడం చాలా కఠినమైన పని. కాబట్టి ప్రోగ్రాంను ఉన్నత స్థాయి భాషలో రాస్తారు. కొన్ని ఇంగ్లిషు పదాలు, సంకేతాలను, కొన్ని సింటాక్స్ నియమ నిబంధనలతో ఉపయోగించే భాషనే ఉన్నత స్థాయి భాష అంటారు. ఈ ఉన్నత స్థాయి భాషను మనం సులభంగా నేర్చుకోవచ్చు కానీ కంప్యూటర్లు అర్థం చేసుకోలేవు. కాబట్టి ఈ ఉన్నత స్థాయి భాషను యంత్రభాషలో మార్చేందుకు కంపైలర్ అనే మరో ప్రోగ్రాంను ఉపయోగిస్తారు.
* కంపైలర్‌ను, మనం రాసే ప్రోగ్రాములను కలిపి కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ అంటారు.
* Basic, Fortran, Cobol, Pascal, C లు ఉన్నత స్థాయి భాషలకు కొన్ని ఉదాహరణలు. యంత్రభాషలా ఉన్నత స్థాయి భాష కంప్యూటర్ హార్డ్‌వేర్‌పైన ఆధారపడదు.
* ఒక సమస్యను సాధించడానికి అవసరమైన ప్రోగ్రాంను ఉన్నత స్థాయి భాషలో రాయాలి. ఇలా రాసిన ప్రోగ్రాంను కంప్యూటర్‌కు నివేదిస్తే అది ఫలితాలను ప్రింటర్ లేదా మానిటర్ లాంటి నిర్గమ సాధనాల ద్వారా అతి తక్కువ సమయంలో తెలియజేస్తుంది.
* కంప్యూటర్ ఉపయోగించి సమస్యను సాధించడానికి అనేక అంచెలు ఉంటాయి. అవి:
     i) కంప్యూటర్, సాధించే సమస్యను అర్థం చేసుకోవడం.
     ii) యంత్రభాష లేదా ఉన్నత స్థాయి భాషలో ప్రోగ్రాంను రాయడం.
     iii) ప్రోగ్రాంను, నివేశ దత్తాంశాన్ని సరఫరా చేయడానికి వినియోగించడం.
     iv) ఫలితాలను నిర్గమ దత్తాంశంగా రాబట్టడం.
వీటంన్నిటినీ కలిపి కంప్యూటర్ ద్వారా దత్తాంశ కార్యచరణ లేదా సమాచార ప్రక్రియ అంటారు.

 

కంప్యూటర్ ప్రాముఖ్యం - ఉపయోగాలు:
* కంప్యూటర్లు బ్యాంకింగ్, పరిశ్రమలు, వాణిజ్యం, విజ్ఞానం, వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశోధనలు, శాసన, వాతావరణ భవిష్యవాణి, ఉపగ్రహ సంచారం, యుద్ధం లాంటి రంగాల్లో సహాయపడుతున్నాయి.
* కంప్యూటర్ వల్ల సమాచార సాంకేతిక శాస్త్రం (Information Technology) అనే కొత్త తరహా విజ్ఞానం అభివృద్ధి చెందుతుంది.
* కంప్యూటర్‌కు ఉండే వేగం, సమాచారాన్ని నిల్వ చేసుకునే దక్షత, కచ్చితంగా పనిచేసే సామర్థ్యం ఉండటం వల్ల వీటిని అనేక రంగాల్లో ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం నిత్యజీవితంలో కంప్యూటర్లు అనివార్యమయ్యాయి.
* కంప్యూటర్ ఆధునిక మానవుడికి ఉత్తమ సేవకుడు కానీ మానవుడు తెలివైన, అర్థవంతమైన ఆదేశాలను ఇచ్చి దాని సేవలను పొందాల్సి ఉంటుంది.
* తరం (generation) పెరిగే కొద్దీ కంప్యూటర్ సాంకేతికత అభివృద్ధి చెంది పని వేగం పెరుగుతుంది.

 

టెలిఫోన్: 1897లో గ్రహంబెల్ టెలిఫోన్ సాధనాన్ని కనుక్కోవడం వల్ల దూరశ్రవణ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. దీని ద్వారా దూరప్రాంతాల్లోని మనుషులతో స్వయంగా సంభాషించవచ్చు.

 

                టెలిఫోన్ NS- విద్యుదయస్కాంతం, D - డయాఫ్రమ్
* టెలిఫోన్‌కు డయాఫ్రమ్ (D) అనే పల్చని లోహపు రేకు ఉంటుంది. అది దానిపై పతనమైన ధ్వని తరంగాలకు అనుగుణంగా కంపిస్తుంది. అంటే ఒక వ్యక్తి ఫోన్‌కు ఎదురుగా మాట్లాడినప్పుడు ధ్వని తరంగాలేర్పడితే, ఆ ధ్వని తరంగాల తాకిడి వల్ల డయాఫ్రమ్ వాటికి అనుగుణంగా కంపిస్తుంది. అందువల్ల దానికి కలిపిన ఒక చిన్న తీగ చుట్ట కూడా గుర్రపు నాడ అయస్కాంతం (NS) ధృవాల మధ్య అదే రీతిలో కంపిస్తుంది.


            టెలిఫోన్ - గ్రాహకం R - గ్రాహకం, EM - విద్యుదయస్కాంతం
*  పై చర్య వల్ల తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ప్రేరేపితమవుతుంది. ఈ విధంగా టెలిఫోన్ ధ్వని తరంగాలను విద్యుత్ ప్రవాహాలుగా మారుస్తుంది. ఈ విద్యుత్ ప్రవాహాలు టెలిఫోన్ తీగల ద్వారా ప్రవహిస్తాయి. ఈ తీగలను దూర ప్రాంతంలో ఉన్న గ్రాహకం (R)లోని విద్యుదయస్కాంతానికి కలుపుతారు. ఈ విధంగా గ్రాహకంలోని డయాఫ్రమ్ తదనుగుణంగా కంపించి ధ్వని పునరుత్పాదిస్తుంది.
నిస్తంత్రీ విధానం (Wireless system): కేబుల్స్ ద్వారా తీగలు లేకుండా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వార్తలను ప్రసారం చేయవచ్చు. ఈ పద్ధతిని 1901లో మార్కొని కనుక్కున్నాడు. దీన్ని రూపొందించడానికి మూలకారణం జేమ్స్ క్లర్స్ మాక్స్‌వెల్ అనే శాస్త్రజ్ఞుడు విద్యుదయస్కాంత తరంగాల ఉనికిని ప్రతిపాదించడమే.
                                             

                        నిస్తంత్రీ విధానం - రేడియో బ్రాడ్ కాస్టింగ్
*  విద్యుత్ క్షేత్రం, అయస్కాంత క్షేత్రాలు తొందరగా మారుతుండటం వల్ల లేదా విద్యుత్ ఆవేశ వాహక కణాలు (ఎలక్ట్రాన్లు) అధిక పౌనఃపున్యంతో కంపిస్తుండటం వల్ల ఈ విద్యుదయస్కాంత తరంగాలను సృష్టించవచ్చు. ఇవి శూన్యంలో సెకనుకు 3 లక్షల కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి. కాంతి తరంగాలు విద్యుదయస్కాంత తరంగాల జాతికి చెందినవి.
*  నిస్తంత్రీ విధానంలో విద్యుత్ ప్రవాహాలు తీసుకెళ్లడానికి తీగలు ఉండవు. అందువల్ల మైక్రోఫోన్ నుంచి వచ్చే విద్యుత్ ప్రవాహాలను ఎక్కువ పౌనఃపున్యం ఉన్న విద్యుదయస్కాంత తరంగాలుగా మార్చి ప్రసారం చేస్తారు. ఈ విద్యుదయస్కాంత తరంగాలను దూర ప్రాంతంలోని గ్రాహకం (R) గ్రహించి ధ్వని తరంగాలను పునరుత్పాదన చేస్తుంది.

 

రేడియో ప్రసారం, గ్రాహకం: రేడియో విద్యుదయస్కాంత తరంగాల ప్రసారంపై ఆధారపడి పని చేస్తుంది. రేడియో ప్రసార కేంద్రంలో ధ్వని తరంగాలను విద్యుదయస్కాంత తరంగాలుగా మార్చి, ప్రత్యేకంగా తయారుచేసిన లోహపు యాంటెన్నా సహాయంతో ప్రసారం చేస్తారు. రేడియో సెట్టు (గ్రాహకం) విద్యుదయస్కాంత తరంగాలను గ్రహించి, స్పీకర్ సహాయంతో ధ్వని తరంగాలను పునరుత్పాదన చేస్తుంది. ఆ విధంగా ఎక్కువ దూరం నుంచి ప్రసారమవుతున్న కార్యక్రమాలను వినగల్గుతున్నాం.
 

టెలివిజన్: దీన్ని జె.ఎల్. బయర్డ్ అనే శాస్త్రజ్ఞుడు కనుక్కున్నారు. ఇది కాంతి విద్యుత్ ఫలితం అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. కాంతి కిరణాలు కొన్ని లోహపు తలాలపై పడినప్పుడు ఎలక్ట్రాన్లు ఉత్పత్తి కావడాన్ని కాంతి విద్యుత్ ఫలితం అంటారు. ఈ ఎలక్ట్రాన్‌లను ఫొటో ఎలక్ట్రాన్లు అంటారు.
*  టీవీ ప్రసార కేంద్రంలో ఒక మనిషి మాట్లాడుతున్నపుడు అతడి ఫొటో లేదా ఏదైనా దృశ్యానికి సంబంధించిన చిత్రాన్ని విద్యుత్ ప్రవాహాంశాలుగా మార్చి వాటిని విద్యుత్ అయస్కాంత తరంగాల రూపంలో ప్రసారం చేస్తారు. ఈ విద్యుదయస్కాంత తరంగాలను వీడియో తరంగాలు అంటారు. అదే సమయంలో ధ్వని తరంగాలను కూడా విద్యుదయస్కాంత తరంగాలుగా (ఆడియో తరంగాలుగా) మారుస్తారు. ఈ ఆడియో, వీడియో తరంగాలను జోడించి ఒకే యాంటెన్నా ద్వారా ప్రసారం చేస్తారు.

 

  
                             టీవీ బ్రాడ్‌కాస్టింగ్, గ్రాహకం
 

గ్రాహకం (Receiver): టీవీ సెట్టు విద్యుదయస్కాంత తరంగాలను యాంటెన్నా ద్వారా గ్రహిస్తుంది. తర్వాత ఆడియో తరంగాలను వీడియో తరంగాలను వేరు చేస్తుంది. ఆడియో తరంగాలను లౌడ్‌స్పీకర్ ధ్వని తరంగాలుగా పునరుత్పాదిస్తుంది. వీడియో తరంగాలను పిక్చర్ ట్యూబ్ ఎలక్ట్రాన్ల కిరణ సహాయంతో చిత్రంగా మారుస్తుంది. ఆ విధంగా మనం టీవీలోని చిత్రాన్ని, దానికి సంబంధించిన ధ్వనిని ఒకే కాలంలో పొందగల్గుతున్నాం.
 

ధ్వని రికార్డింగు, పునరుత్పాదన
ధ్వనిని యాంత్రికంగా రికార్డు చేయడం: ఈ పద్ధతిలో ధ్వనులను గుండ్రంగా తిరిగే వృత్తాకారపు ప్లేట్లపై గుర్తుల రూపంలో రికార్డు చేస్తారు. ఆ ప్లేటును అదేవిధంగా తిప్పినప్పుడు ధ్వని పునరుత్పాదన అవుతుంది.

 

యాంత్రిక రికార్డింగు, పునరుత్పాదన
* ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ధ్వని తరంగాలు ఏర్పడతాయి. ఈ ధ్వని తరంగాలకు అనుగుణంగా ఒక డయాఫ్రమ్ (D) అనే లోహపు రేకు కంపిస్తుంది. ఈ లోహపు రేకు పదునైన లోహపు పెన్సిల్‌కు (P) కలిపి ఉంటుంది. స్థిరమైన వడితో గుండ్రంగా తిరిగే మెత్తని మైనపు ప్లేటుపై ఈ పెన్సిల్ ఆనుకొని ఉండటం వల్ల దానిపై డయాఫ్రమ్ కంపనాలకు అనుగుణంగా ఆనవాళ్లు కలిగే రికార్డులను తయారుచేస్తారు. మళ్లీ అదే రకమైన సాధనాన్ని ఉపయోగించి ఆ రికార్డులను అదే వడితో తిప్పితే ధ్వని పునరుత్పాదన అవుతుంది.

అయస్కాంత రికార్డింగు, పునరుత్పాదన:

 అయస్కాంత రికార్డింగు, పునరుత్పాదన టేపు రికార్డరు
* ఈ పద్ధతిలో అయస్కాంత పదార్థపు పూత ఉండే ప్లాస్టిక్ టేపును రికార్డింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. మైక్రోఫోన్ ధ్వని తరంగాలను విద్యుత్ ప్రవాహాంశాలుగా మారుస్తుంది. ఈ విద్యుత్ ప్రవాహాలు విద్యుదయస్కాంతం (EM1) ద్వారా ప్రవహిస్తాయి. ప్లాస్టిక్ టేపును భ్రమణం చెందే చక్రాల సహయంతో విద్యుత్ అయస్కాంతం (EM1)కు దగ్గరగా స్థిరవడితో కదిలేలా చేస్తారు. అప్పుడు టేపు మీద ఉండే వడితో అయస్కాంత పదార్థపు పూత అయస్కాంతీకరణం చెందడం వల్ల ధ్వని అయస్కాంతత్వం రూపంలో రికార్డు అవుతుంది, చాలా కాలం నిలుస్తుంది.
* ఈ టేపును మళ్లీ అదేవిధంగా అదే వడితో కదిలేలా చేస్తే రెండో విద్యుదయస్కాంతం (EM2) తిరిగి విద్యుత్ ప్రవాహాంశాలను పునరుత్పాదన చేస్తుంది.
* ఈ విద్యుత్ ప్రవాహాంశాలను స్పీకర్ గ్రహించి ధ్వనిని పునరుత్పాదన చేస్తుంది. ఈ విధంగా టేపు రికార్డర్ ధ్వనిని రికార్డింగు, పునరుత్పాదన చేయడానికి ఉపయోగపడుతుంది.

 

సినిమాటోగ్రఫీ, సినీ ప్రొజెక్టర్:
*  సినిమాలు తీసి ప్రదర్శించే విధానాన్ని సినిమాటోగ్రఫీ అంటారు. ఇది మన కంటి దృష్టి స్థిరత (persistance of vision) అనే ధర్మం ఆధారంగా సాధ్యపడుతుంది. ఏదైనా ఒక వస్తువు ప్రతిబింబం మన కంటి రెటీనా అనే తెరపై పడినప్పుడు అది 1/16 సెకను కాలం నిలిచి ఉంటుంది. ఈ కాల వ్యవధిలో మనం మరొక వస్తువును చూడలేం. ఈ ధర్మాన్ని దృష్టి స్థిరత అంటారు.
* సినిమాటోగ్రఫీలో మాట్లాడుతున్న లేదా పరిగెత్తుతున్న మనుషుల దృశ్యాన్ని లేదా మరేదైనా దృశ్యాన్ని సెకనుకు 16 కంటే ఎక్కువ సార్లు ఫొటోగ్రాఫ్ తీస్తారు లేదా ఫొటోలు తీస్తారు. ఇవన్నీ కలిపి ఒక ఫిల్మ్ చుట్టగా రూపొందుతుంది.


సినిమా ప్రొజెక్టర్ PL - ప్రొజెక్టింగ్ కటకం, S - దీపం లేదా కాంతిజనకం
* సినీ ప్రొజెక్టర్‌లో రీలులోని ఫిల్మును ఒక శక్తిమంతమైన కాంతిజనకంతో కాంతివంతం చేస్తారు. ఈ ఫిల్ములను దృక్‌క్షేత్రం నుంచి సెకనుకు 16 చొప్పున కదిలేలా చేస్తారు. ఈ ఫిల్ము, ప్రొజెక్టర్ కటకానికి (PL) వస్తువుగా పనిచేస్తాయి. ఫిల్ముకు, కటకానికి మధ్య ఉండే దూరం దాని నాభ్యంతరం కంటే కొంచెం ఎక్కువగా, 2F కంటే తక్కువగా ఉంటుంది. అందువల్ల తెరపై వృద్ధీకృత ప్రతిబింబం ఏర్పడుతుంది.
* సెకనుకు 16 కంటే ఎక్కువ ఫిల్ములు కదిలేలా చేయడం వల్ల వస్తువుల గమనం, మనుషుల కదలికలు అవిచ్ఛిన్నంగా కనిపిస్తాయి. ధ్వనిని కూడా ఏక కాలంలో రికార్డు చేసి మళ్లీ పునరుత్పాదన చేస్తారు.
* 1895లో మార్కోని ప్రేరణ చుట్టలోని ఒక చివరను ఎర్త్ చేసి, మరో చివరను గాలిలో ఏరియల్ లేదా యాంటెన్నాలా వేలాడదీసినప్పుడు దాని నుంచి ప్రసారమైన రేడియో తరంగాలను సుదూరాల నుంచి కూడా శోధించవచ్చని గుర్తించాడు. దీనివల్ల రేడియో తరంగాలు అంతరాళంలో చాలా దూరం వరకు ప్రయాణించగలవని, వాటిని సందేశ వాహకాలుగా వినియోగించుకోవచ్చని తెలిసింది.

 

రేడియో, టీవీ ప్రసారాల్లోని ప్రధాన దశలు: దీనిలో మూడు ప్రధాన దశలు ఉంటాయి.
i) సమాచార ఉత్పత్తి
ii) సమాచార ప్రసారం
iii) సమాచారాన్ని గ్రాహకం ద్వారా శోధించడం
* సమాచారాన్ని విద్యుత్ సంకేతాలుగా మారుస్తారు. ఈ సంకేతాలను తగిన, అధిక (రేడియో) పౌనఃపున్యం ఉన్న విద్యుదయస్కాంత తరంగాలపై అధ్యారోహణ చేస్తారు. ఈ విద్యుదయస్కాంత తరంగాలను రేడియో పౌనఃపున్యం ఉన్న వాహకాలు అంటారు. ఇవి సమాచారాన్ని తీసుకువెళతాయి. రేడియో ప్రసారంలో ఈ వాహక పౌనఃపున్యం విలువ సుమారుగా 300 కిలో హెర్ట్జ్ నుంచి 30 మెగాహెర్ట్జ్ వరకు ఉంటుంది. టీవీ ప్రసారంలో వీటి విలువ సుమారు 30 మెగా హెర్ట్జ్‌ల నుంచి 300 మెగా హెర్ట్జ్‌ల వరకు ఉంటుంది.
* సందేశాన్ని రేడియో పౌనఃపున్యం ఉన్న (rf) వాహక తరంగాలతో కలపడాన్ని మాడ్యులేషన్ అంటారు.
* మాడ్యులేషన్ రెండు రకాలు.
    1) డోలన పరిమితి మాడ్యులేషన్ (Amplitude Modulation - AM)
    2) పౌనఃపున్య మాడ్యులేషన్ (Frequency Modulation - FM)
* మాడ్యులేషన్ చేసిన సమాచారాన్ని వాహక తరంగాల నుంచి వేరుచేయడాన్ని డీమాడ్యులేషన్ అంటారు.

 

రేడియో, టెలివిజన్ ప్రసారంలోని ప్రాథమిక నియమాలు:
* స్టూడియోలో ఉత్పత్తి అయ్యే ధ్వని లేదా ప్రతిబింబాన్ని విద్యుదయస్కాంత తరంగ సంకేతాలుగా మారుస్తారు. వీటిని ఆవర్థనం చేస్తారు.
* ఈ విద్యుత్ సంకేతాలు ప్రసారిణి (Transmitter) ఉత్పత్తి చేసే r.f. వాహక తరంగాలపై అధ్యారోపణ చెందుతాయి.
* మాడ్యులేషన్ అయిన తరంగాలు యాంటెన్నాకు చేరతాయి. ఈ యాంటెన్నాను ప్రసార యాంటెన్నా అంటారు. ప్రసార యాంటెన్నా నుంచి విద్యుదయస్కాంత తరంగాలు అన్ని దిశల్లో ప్రసరిస్తాయి.
* వేర్వేరు స్టేషన్‌ల నుంచి ప్రసారమయ్యే r.f. విద్యుదయస్కాంత తరంగాలు సుదూరాలకు ప్రయాణిస్తాయి. ఇవి రేడియో లేదా టెలివిజన్ యాంటెన్నాల (గ్రాహక యాంటెన్నాలు)ను తాకినప్పుడు, అవి ఏకాంతర విద్యుత్‌ను ఏర్పరుస్తాయి. ఈ గ్రాహక యాంటెన్నాలు గ్రాహకాలకు విద్యుత్ ప్రవాహ సంకేతాలను పంపుతాయి.
* రేడియో లేదా టెలివిజన్‌లో ఉండే శృతి వలయం (tuning circuit) వేర్వేరు స్టేషన్‌లు ప్రసారం చేసే మాడ్యులేట్ అయిన తరంగాల్లో ఒకదాన్ని ఎంపిక చేస్తుంది.
* ఇలా ఎంపిక చేసిన తరంగాన్ని రేడియో లేదా టీవీలో ఉండే శోధక వలయంలోకి పంపుతారు. శోధక వలయంలో ఉండే ఒక స్థానిక డోలని (local oscillator) r.f. వాహక తరంగాల నుంచి ధ్వనిని లేదా ప్రతిబింబాన్ని వేరు చేస్తుంది. ఈ ప్రక్రియను 'డీ మాడ్యులేషన్ అంటారు. వేరుచేసిన సమాచార సంకేతం, మరో ఆవర్థన వలయం ద్వారా వెళ్లి శ్రవణ యోగ్యంగా లేదా దృశ్య యోగ్యంగా మారుతుంది.

 

రేడియో ప్రసారణ, గ్రాహణ

  రేడియో ప్రసారాన్ని వివరించే పటం

(a) రేడియో స్టేషన్‌లో మైక్రోఫోన్‌లో ధ్వని సంకేతాలను ఉత్పత్తి చేయడం (స్టూడియో).
1. ఆడియో ఫ్రీక్వెన్సీ ఉత్పాదన 2. వాహక తరంగ ఉత్పాదన 3. ప్రసారిణిలో మాడ్యులేషన్
(b) 4. ప్రసార యాంటెన్నా
(c) గ్రాహకం (రేడియో)
5. గ్రాహక యాంటెన్నా 6. శృతివలయాలు 7. శోధకం (డీమాడ్యులేటర్) 8. ఆవర్థని 9. స్పీకర్

 

a) ధ్వని ఉత్పాదన, మాడ్యులేటెడ్ తరంగం: రేడియో స్టేషన్, స్టూడియోలో ఒక వ్యక్తి పాడిన పాటను లేదా మాటను మైక్రోఫోన్‌తో విద్యుత్ సంకేతాలుగా మారుస్తారు. ఈ సంకేతాలు ఆడియో ఫ్రీక్వెన్సీ అవధి (a.f.) లో ఉంటాయి. ఒక స్థానిక డోలక వలయం తగిన r.f. వాహక తరంగాలను ఉత్పత్తి చేస్తుంది.
 

b) రేడియో ప్రసారిణి: ఆడియో ఫ్రీక్వెన్సీ (a.f.), రేడియో ఫ్రీక్వెన్సీ (r.f.) తరంగాలు మాడ్యులేటర్‌లో కలిపి ఉంటాయి. మాడ్యులేషన్ చేసిన తరంగాలు ప్రసార యాంటెన్నా నుంచి అంతరాళంలోకి ప్రసారమవుతాయి.
 

c) రేడియో గ్రాహకం: రేడియో (గ్రాహకం)కు ఉండే గ్రాహక యాంటెన్నా ద్వారా కావాల్సిన, మాడ్యులేషన్ చేసిన తరంగాలను గ్రహించి శోధక వలయంలో ఆడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను వేరు చేస్తారు. వీటిని ఆంప్లిఫయర్ ద్వారా ఆవర్థనం చేసి స్పీకర్‌కు పంపినప్పుడు విద్యుత్ సంకేతాలు మళ్లీ ధ్వని రూపంలోకి మారతాయి.
 

టెలివిజన్ ప్రసారణ, గ్రాహణ: ధ్వనితోపాటు కదిలే ప్రతిబింబాలను ప్రసారం చేయడం, పునరుత్పాదించడం టెలివిజన్ ప్రసారణ, గ్రాహణల్లోని ముఖ్యాంశాలు.

  

  టెలివిజన్ ప్రసారంలోని దశలను వివరించే పటం
(a) 1. టీవీ కెమెరా
       2. వీడియో - ఆంప్లిఫయర్
       3. వాహక తరంగాన్ని ఉత్పాదించే డోలని
       4. AM పిక్చర్ ప్రసారిణి
       5. ఆవర్థనం చేసిన ఆడియో సంకేతం
       6. r.f. వాహక తరంగాలను ఉత్పాదించే డోలని
       7. F.M. ధ్వని ప్రసారిణి
(b) 8. ప్రసార యాంటెన్నా
(c) 9. గ్రాహక యాంటెన్నా
       10. టీవీ

a) ఆడియో, వీడియో సంకేతాలను ఉత్పాదించడం - మాడ్యులేషన్: ఒక వస్తువుకు సంబంధించిన వీడియో సంకేతాలను ఉత్పాదించడంలోని ప్రధాన దశ 'స్కానింగ్'. సాంకేతిక అభివృద్ధి జరగక ముందు నిప్కాన్ డిస్క్‌తో యాంత్రికంగా వస్తువును స్కానింగ్ చేసేవారు ఇప్పుడు 'ఐకనోస్కోప్‌ను ఉపయోగిస్తున్నారు. ఐకనోస్కోపు కాథోడ్ కిరణాలు, కాంతి - విద్యుత్‌ఘటం(Photo electric cell) ఉన్న ఒక కెమెరా లాంటిది. ఐకనోస్కోపును ప్రసారం చేయాల్సిన వస్తువు వైపుకి గురిపెడతారు. కెమెరాలో ఉండే కటకం ద్వారా వస్తువు ప్రతిబింబం ఒక తెరపై కేంద్రీకృతమవుతుంది.

 
కెమెరా తెరపై ప్రతిబింబ స్కానింగ్
    ప్రతిబింబాన్ని టీవీ కెమెరా తెరపై నిలువు, అడ్డుగీతలతో ఏర్పడే చిన్న చిన్న గళ్లలో ఏర్పడే ప్రక్రియను స్కానింగ్ అంటారు. ప్రతిబింబంలోని వివిధ భాగాల్లో ఉండే కాంతి తీవ్రతలోని తేడాలను కాంతి ఘటాలు శోధిస్తాయి. ఈ కాంతి ఘటాలు తాము శోధించిన కాంతి సంకేతాలను తత్సమానమైన విద్యుత్ సంకేతాలుగా మారుస్తాయి. ఈ విద్యుత్(వీడియో) సంకేతాలను ఆవర్థనం చేసిన తర్వాత మాడ్యులేషన్ చేస్తారు.
      దీంతో (వీడియో) పాటు గ్రహించిన ధ్వని (ఆడియో) తరంగాన్ని కూడా విద్యుత్ సంకేతాలుగా మార్చి ఆవర్థనం చేసిన తర్వాత మాడ్యులేషన్ చేస్తారు.

b) టీవీ ప్రసారిణి: A.M పిక్చర్ ట్రాన్స్‌మిటర్ అనే భాగంలో ఆవర్థనం చేసిన వీడియో సంకేతాలను సరైన r.f. వాహక తరంగాలతో కలిపి ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ చేస్తారు. ఇదేవిధంగా ఆవర్థనం చేసిన ధ్వని తరంగాలను సరైన F.M. వాహక తరంగాలతో కలిపి నీ.లీ. ధ్వని ట్రాన్స్‌మీటర్ భాగంలో ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ చేస్తారు.
            మాడ్యులేషన్ చేసిన వీడియో, ఆడియో తరంగాలు రెండింటినీ ఒకేసారి ప్రసార యాంటెన్నా అంతరాళంలోకి ప్రసారం చేస్తుంది. వేర్వేరు టీవీ కేంద్రాలు వేర్వేరు అవధులున్న r.f. వాహక తరంగాలను ఉపయోగించుకుంటాయి. వీటిని 'ఛానల్స్ అంటారు. సాధారణంగా టీవీ ప్రసారాలకు ధ్వని, చిత్రం రెండింటికీ కలిపి 6 మెగా హెర్ట్జ్ అవధి (ఛానల్)ని కేటాయిస్తారు. దీనిలో ఆడియో r.f. వాహక తరంగం విలువ 4.5 మెగా హెర్ట్జ్ వీడియో వాహక తరంగం విలువ కంటే ఎక్కువగా ఉంటుంది.

c) టీవీ గ్రాహకం: వేర్వేరు టీవీ కేంద్రాలు మాడ్యులేషన్ చేసి ప్రసారం చేస్తున్న తరంగాన్ని టీవీ గ్రాహక యాంటెన్నా గ్రహిస్తుంది. 'ఛానెల్ సెలక్టర్' అనే శృతివలయం కావాల్సిన టీవీ కేంద్ర సంకేతాలను ఎంపిక చేస్తుంది. ఇలా ఎంపిక చేసిన విద్యుత్ సంకేతాలను ఆవర్థనం చేసిన తర్వాత కాంతి స్పందాలుగా మార్చి తెరపై చిత్రాన్ని పునరుత్పాదిస్తుంది. ఇదే సమయంలో ధ్వని సంకేతాలను కూడా పునరుత్పాదిస్తుంది. సాధారణ టీవీ విద్యుత్ సంకేతాలను కాంతి సంకేతాలుగా మారుస్తుంది. అందువల్ల సాధారణ టీవీని 'కినీస్కోప్ అని అంటారు.

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌