• facebook
  • whatsapp
  • telegram

ప్రజ్ఞ (Intelligence) 

వ్యక్తిలోని సాధారణ మానసిక గుణాన్నే 'ప్రజ్ఞ' అనవచ్చు. వాస్తవంగా అన్ని దైనందిన కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించగలగడాన్ని 'ప్రజ్ఞ' అంటారు.
 

లక్షణాలు:
* ప్రతి వ్యక్తి ప్రజ్ఞను అతడి అనువంశికత ప్రభావితం చేస్తుంది.
* శిశువు పుట్టిన నాటికే ప్రజ్ఞ ఏర్పడి ఉంటుంది. ఇది శిశువులో వయసుతోపాటు కొంత కాలానుగుణ అభివృద్ధిని చూపుతుంది. అయితే ఒకసారి ఏర్పడిన ప్రజ్ఞను మార్చలేం.
* ప్రజ్ఞ అమూర్తమైంది. ఒక వ్యక్తిని చూసిన వెంటనే అతడిలోని ప్రజ్ఞను అంచనా వేయలేం.
* వ్యక్తిలో అంతర్గతంగా ఉండే ఈ ప్రజ్ఞ సాధారణ ప్రవర్తనా రూపంగా వ్యక్తపరచడం జరుగుతుంది.
* ప్రజ్ఞ వ్యక్తులందరిలో ఒకే విధంగా ఉండకుండా, వైయక్తిక భేదాలను చూపుతుంది.
* వ్యక్తి కొత్త పరిస్థితులను సమర్థంగా సర్దుబాటు చేసుకోవడానికి ప్రజ్ఞ ఉపయోగపడుతుంది.
* సాధారణ పరిస్థితుల్లో ప్రజ్ఞ కౌమార దశ వరకు జరుగుతుంది. ఆ తర్వాత ఆగిపోతుంది.
* ప్రజ్ఞకు స్త్రీ, పురుష; జాతి, కుల భేదాలు లేవు.
* ప్రజ్ఞను మాపనం చేయవచ్చు. దీన్ని నిర్దిష్టంగా కొలవగలం.

ప్రజ్ఞ - నిర్వచనాలు:
కొంతమంది మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు ప్రజ్ఞకు రకరకాల నిర్వచనాలను ఇచ్చారు. అవి:

 

ఎస్‌జీటీ సిలబస్‌ను అనుసరించి 

టర్మన్: ''ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ అతడు అమూర్త చింతన చేయగలిగే సామర్థ్యానుపాతంలో ఉంటుంది".
విలియం జేమ్స్: ''వ్యక్తి కొత్త పరిస్థితులకు సఫలవంతంగా సర్దుబాటు చేసుకోగలిగే సామర్థ్యం".
బినే: ''వ్యక్తి ఒక కచ్చితమైన దిశగా సాగి నిర్వచించడం. మనం కోరుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి అవసరమైన రూపాంతరాలను చేసుకోగలిగే సామర్థ్యం, స్వీయ విమర్శ చేసుకోగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ".
వెష్లర్: ''వ్యక్తి పరిసరాలతో ప్రయోజనాత్మకంగా ప్రవర్తించగలిగే, వివేకవంతంగా ఆలోచించగలిగే, ప్రభావవంతంగా వ్యవహరించగలిగే సమష్టి లేదా మొత్తం సామర్థ్యమే ప్రజ్ఞ".
జీన్ పియాజే: ''వ్యక్తి తన పరిసరాలకు అనుగుణంగా మారగల సామర్థ్యమే ప్రజ్ఞ".

 

స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ప్రకారం 

బినే: ''లక్ష్యసాధన వైపు తన ప్రవర్తనను మార్చుకోగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ".
స్టెర్న్: ''చేతన స్థితిలో వ్యక్తి నూతన పరిస్థితులకు సర్దుబాటు కాబడే సాధారణ సామర్థ్యమే ప్రజ్ఞ".
జీన్ పియాజే: ''భౌతిక, సామాజిక పరిసరాలకు అనుగుణ్యతను పొందడమే ప్రజ్ఞ".
ఫ్రీమన్: ''కొత్త పరిస్థితులకు, కొత్త సమస్యల సాధనకు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి వ్యక్తి ప్రవర్తనలో చూడగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ".

స్పియ‌ర్‌మ‌న్‌: ''పరస్పర సంబంధాలను రాబట్టే వ్యక్తి అంతర్గత శక్తియే ప్రజ్ఞ".
టెర్మన్: ''అమూర్త ఆలోచనా సామర్థ్యమే ప్రజ్ఞ".
వెర్నన్: ''మొత్తంగా ఆలోచించే సామర్థ్యం లేదా మానసిక శక్తియే ప్రజ్ఞ".
వెష్లర్: ''ప్రయోజనాన్ని పొందేందుకు, హేతుబద్దతను కలిగి పరిసరాలతో సర్దుబాటు పెంపొందించుకునే సామర్థ్యమే ప్రజ్ఞ".

 

ప్రజ్ఞ కాని అంశాలు 

జ్ఞానం: ప్రజ్ఞకు, జ్ఞానానికి దగ్గర సంబంధం ఉంది. ఒక వ్యక్తిలో ప్రజ్ఞ అధికంగా ఉంటే అతడు ఎక్కువ జ్ఞానం పొందగలడు. అంతేకానీ జ్ఞానం సహాయంతో ప్రజ్ఞను మెరుగుపరచుకోలేడు. కాబట్టి ''ప్రజ్ఞ అనేది ఒక నిర్దిష్ట గమ్యం అయితే జ్ఞానం అనేది ఆ గమ్యాన్ని చేరడానికి సహకరించే మార్గం లాంటిది" అని రాస్ అనే శాస్త్రవేత్త అభిప్రాయపడ్డాడు.
నైపుణ్యం: ఒక పనిని మళ్లీ మళ్లీ చేయడం ద్వారా ఏర్పడే అనాలోచిత కౌశలమే నైపుణ్యం. ఇది ప్రజ్ఞ కాదు.
స్మృతి: నేర్చుకున్న విషయాన్ని అదేవిధంగా వ్యక్త పరచడమే స్మృతి. అధిక ప్రజ్ఞ ఉన్నవారికి స్మృతి సామర్థ్యం ఎక్కువగా ఉంటుందనేది సాధారణ పరిశీలన ద్వారా వ్యక్తమైన భావన.
సృజనాత్మకత: ఒక పనిని విభిన్న రీతుల్లో చేయడమే సృజనాత్మకత. సాధారణంగా ప్రజ్ఞ వ్యక్తికి పుట్టుకతో ఏర్పడితే, పరిసర సంబంధంతో ఏర్పడేదే సృజనాత్మకత. సృజనాత్మకత ఉన్న ప్రతి వ్యక్తిలోనూ కచ్చితంగా ప్రజ్ఞ ఉంటుంది. కానీ ప్రజ్ఞ ఉన్న వారందరిలోనూ సృజనాత్మకత ఉంటుందని చెప్పలేం.

       ''ప్రజ్ఞ ఉన్న వారందరిలోనూ సమైక్య ఆలోచన ఉంటుంది. కాబట్టి వీరు సాధనా పరీక్షల్లో మంచి ప్రతిభను చూపుతారు. అదేవిధంగా సృజనాత్మక ఉన్నవారిలో విభిన్న ఆలోచన ఉంటుంది. అందుకే వీరు పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు" అని 'గిల్‌ఫర్డ్' పేర్కొన్నారు.
 

ప్రజ్ఞ సిద్ధాంతాలు:
       ప్రజ్ఞ స్వభావాన్ని వివరించడానికి విశ్వవ్యాప్తంగా అనేకమంది మనోవిజ్ఞానవేత్తల విశిష్ట కృషి ఫలితంగా పలు సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో ముఖ్యమైనవి.

 

1. ఏకకారక సిద్ధాంతం: (Uni-Factor Theory)
బినే రూపొందించిన ఈ సిద్ధాంతాన్ని టెర్మన్, స్టెర్న్, ఎబ్బింగ్‌హాస్‌ బలపరిచారు. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞ ఒకే ఒక కారకం వల్ల ఏర్పడుతుంది. ఈ ఒక్క కారకమే వ్యక్తి అనేక చర్యలను ప్రభావితం చేస్తుంది. ఒక రంగంలో మంచి ప్రావీణ్యం ఉంటే అన్ని రంగాల్లో కూడా అంతే ప్రావీణ్యాన్ని చూపుతారని వీరి భావన. కానీ ఒక రంగంలో మంచి నైపుణ్యం ఉన్నంత మాత్రాన మిగిలిన అన్ని విషయాల్లో అలానే ఉండాలని లేదు కదా.
ఉదా: * తరగతి గదిలో విద్యార్థికి తెలుగు భాషలో మంచి మార్కులు వస్తే ఇతర అన్ని సబ్జెక్టుల్లో కూడా మంచి మార్కులే రావాలి.
* ఒక క్రీడలో మంచి ప్రతిభను చూపగలిగిన క్రీడాకారుడు అన్ని క్రీడాంశాల్లో అదే ప్రతిభ చూపాలి.
పై ఉదాహరణలు పరిశీలిస్తే సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ఈ సిద్ధాంతం ఆమోదయోగ్యంగా లేదు. అందుకే ఇది కేవలం సంప్రదాయ సిద్ధాంతంగా మిగిలిపోయింది.

2. ద్వికారక సిద్ధాంతం: (Two Factor Theory)
ప్రజ్ఞ అనేది ఒక కారకంతో కాకుండా రెండు కారకాల ద్వారా ఏర్పడుతుందని 'కార్ల్ స్పియ‌ర్‌మ‌న్‌' Abilities of Man అనే గ్రంథంలో ప్రచురించాడు. ఈయన ప్రకారం ప్రజ్ఞ అనేది ప్రతి వ్యక్తిలోనూ పుట్టుకతో వచ్చే సాధారణ కారకం (General Factor), పరిసరాలతో ప్రతి చర్య ద్వారా వచ్చే ప్రత్యేక కారకం/ నిర్దిష్ట కారకాల (Specific Factor) కలయికతో ఏర్పడుతుంది. ఈ ప్రజ్ఞ కారకాల గణనలో ఈయన ''కారక విశ్లేషణ పద్ధతి"ని ఉపయోగించాడు. 'స్పియ‌ర్‌మ‌న్‌' 'G' కారకం పుట్టుకతో అనువంశికత ద్వారా ఏర్పడి స్థిరంగా ఉంటుందని, 'S' కారకం పరిసర ప్రభావంతో ఏర్పడుతుందని... వీటి కలయికే ప్రజ్ఞ అని వివరించాడు.

 

3. బహుకారక సిద్ధాంతం (Multi Factor Theory)
అమెరికాకు చెందిన ఇ.ఎల్. థార్న్‌డైక్ అనే శాస్త్రవేత్త ఈ సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఇది ప్రజ్ఞ స్వభావాన్ని తెలియజేస్తుంది. ఒక వ్యక్తిలో అనేక నిర్దిష్ట సామర్థ్యాలను కలిపి ప్రజ్ఞ అంటారని ఇతడి అభిప్రాయం. అందుకే ఈ సిద్ధాంతాన్ని బహుకారక సిద్ధాంతం అని అంటారు. అంతే కాకుండా వ్యక్తి ఒక రంగంలో చూపే ప్రతిభను బట్టి మిగిలిన రంగాల్లో అతడి ప్రతిభను అంచనా వేయలేం. వ్యక్తికి ఒక రంగంలోని సామర్థ్యం వేరొక రంగంలో అదే స్థాయిలో ఉండదు.
ఉదా: ఒక వ్యక్తిలో భౌతిక శాస్త్రంలోని ప్రావీణ్యం ద్వారా అతడిలోని సంగీతం, భాష, గణిత ప్రావీణ్యాన్ని తెలుసుకోలేం కదా. పై విషయాలను సమగ్రపరిచి Measurement of Intelligence అనే గ్రంథాన్ని థార్న్‌డైక్ రూపొందించారు.

4. సామూహిక కారక సిద్ధాంతం (Group - Factor Theory)
     ఈ సిద్ధాంతాన్ని లూయీ థర్‌స్టన్, ప్రాథమిక మానసిక సామర్థ్యాలు (Primary Mental Abilities) అనే గ్రంథంలో రూపొందించాడు. దీన్ని ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం అని కూడా అంటారు. ఈయన సిద్ధాంతం ప్రకారం ఏడు ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ప్రజ్ఞకు మూలకారణంగా ఉంటాయి.
ఈ సామర్థ్యాలు వాటికవే స్వతంత్రంగా ఉంటాయి. వీటిన్నింటినీ సమష్టిగా కలిపితే అవి వ్యక్తి సామర్థ్యాన్ని లేదా ప్రజ్ఞను నిర్ధారిస్తాయి.

 

5. స్వరూప నమూనా సిద్ధాంతం (Structural of Intelligence)
     అమెరికాకు చెందిన 'గిల్‌ఫర్డ్' ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈయన ప్రకారం ప్రజ్ఞ మూడు ప్రజ్ఞా విశేష అంశాల కలయిక. ప్రజ్ఞను అర్థం చేసుకోవడానికి వ్యక్తి మూడు విశేషకాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రతి విశేషక అంశంలోనూ కొన్ని కారకాలు ఉంటాయని భావించి వాటిని గిల్ ఘనరూపంలో అమర్చాడు.

 

విశేషకాలు
     1) విషయాలు (contents)
     2) ఉత్పన్నాలు (products)
     3) ప్రచాలకాలు (operations)

బహుళ ప్రజ్ఞ (Multiple Intelligence)

    అమెరికాకు చెందిన హోవార్డ్ గార్డినర్ హార్వర్డ్ విశ్వవిద్యాలయ విద్యావిభాగ ఆచార్యులు, మనో విజ్ఞాన శాస్త్రంలో ఆచార్యులుగా పనిచేశారు. 1983లో The Frames of Mind: The Theory of Multiple Intelligence అనే గ్రంథాన్ని ప్రచురించారు.
    ప్రజ్ఞలోని వివిధ కారకాలను పరిశీలించి ప్రతి వ్యక్తిలోనూ పరిస్థితులకు అనుకూలంగా ప్రతిస్పందించే 8 రకాల ప్రజ్ఞలు ఉంటాయని వివరించారు. అవి:
1. భాషా ప్రజ్ఞ: భాషా ప్రజ్ఞ ఉన్నవారు పదాలతో సంభాషణను రక్తికట్టించే విధంగా మాట్లాడతారు, రాయడంలో చాతుర్యాన్ని ప్రదర్శిస్తారు. వీరు ఇతరులను ఒప్పించడంలో నేర్పరులు. వీరినే పదనేర్పరులు (Word Smart) అంటారు.
2. తార్కిక గణితశాస్త్ర ప్రజ్ఞ: వీరు సంఖ్యలను ఉపయోగించడంలో, కొత్త సమస్యలను విశ్లేషణ చేయడంలో ప్రతిభను కనబరుస్తారు. వీరిని సంఖ్యానేర్పరులు (Number Smart) అంటారు.
3. ప్రాదేశిక ప్రజ్ఞ: సమాజంలోని సమస్యలు, పరిస్థితులను గుర్తించి పరిస్థితులకు అనుగుణంగా మారి ఆ అంశాలను కాగితాలపై సృష్టిస్తారు. ఇంజినీర్‌లు, చిత్రనేర్పరుల్లో ఈ ప్రాదేశిక ప్రజ్ఞ ఉంటుంది.
4. శారీరక గతి సంవేదనా ప్రజ్ఞ: సాంఘిక ప్రపంచంలో సర్దుబాటులో భాగంగా భావ వ్యక్తీకరణకు తమ శరీరాన్ని నేర్పుగా ఉపయోగించగలిగేవారే సాంఘిక నేర్పరులు (Body Smart).

5. సంగీత సంబంధ ప్రజ్ఞ: వీరు పద్యాలు, పాటలు రాసి తమంతటతాముగా పాడగల సామర్థ్యాన్ని కూడా ప్రదర్శిస్తారు. సంగీతంలో మంచి ప్రావీణ్యం ఉన్న సంగీత నేర్పరులు (Music Smart).
6. పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ: పరిసరాల్లోని వ్యక్తులతో సక్రమంగా మెలిగే వ్యక్తి. మంచి సాంఘిక సంబంధాలున్న సాంఘిక నేర్పరులు (Social Smart).
7. వ్యక్తంతర్గత ప్రజ్ఞ: వ్యక్తి తనలోని భావాలను, సామర్థ్యాలను, లక్ష్యాలను తెలుసుకుని దానికి తగినట్లుగా జీవించగలిగే నేర్పరితనాన్నే స్వయం నేర్పరితనం (Self Smart) అంటారు.
8. సహజ ప్రజ్ఞ: వీరు ప్రకృతి ప్రేమికులు, ఎక్కువగా ప్రశాంతతను కోరుకుని జంతువులు, మొక్కలను ప్రేమించే స్వభావం ఉన్న ప్రకృతి నేర్పరులు (Nature Smart) గా ఉంటారు.
        వ్యక్తిలో పైన పేర్కొన్న ఎనిమిది ప్రజ్ఞలే కాకుండా ఆధ్యాత్మిక ప్రజ్ఞ, అస్థిత్వ ప్రజ్ఞ, నైతిక ప్రజ్ఞ అనే మరో మూడు ప్రజ్ఞలను కూడా గార్డినర్ పేర్కొన్నాడు.

ఉద్వేగాత్మక ప్రజ్ఞ (Emotional Intelligence) 

        Emotion అనే పదం 'Emovere' అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. జన్మించిన శిశువులో మొదట ఏర్పడే ఉద్వేగం 'ఉత్తేజం' (Excitement). కొంతకాలానికి ఇది అనుకూల, ప్రతికూల ఉద్వేగాలుగా మారుతుంది.


      
          ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదం ఈ మధ్యకాలంలో వాడుకలోకి వచ్చింది. వెయిన్ లియోన్ పెయిన్ 1885లో ఈ పదాన్ని మొదట ఉపయోగించారు. ఆ తర్వాత 1990లో జాన్‌మేయర్, పీటర్‌సలోవె ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పేరుతో వ్యాసాలను ప్రచురించారు. చివరగా 1995లో గోల్‌మన్ Emotional Intelligence: Why it can matter more then IQ అనే గ్రంథం ద్వారా శాస్త్రీయంగా ఉద్వేగాత్మక ప్రజ్ఞను నిర్వచించారు.

       గోల్‌మన్ ప్రకారం వ్యక్తిలోని ఉద్వేగాత్మక ప్రజ్ఞలో 25 నైపుణ్యాలతో కూడిన అయిదు విశేషకాలు ఉంటాయి. అవి:
    1) స్వయం పరిచయం
    2) స్వీయ నిర్వహణ
    3) స్వీయ ప్రేరణ
    4) సాంఘిక పరిచయం
    5) సంబంధాల నిర్వహణ
    ఈ నైపుణ్యాలు జన్మతహా వచ్చినవికావు. ఇవి వ్యక్తిగత సాధన, ప్రతిచర్యల ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి. వ్యక్తి సాధనా స్థాయికి సంబంధించి ఉద్వేగాత్మక ప్రజ్ఞపై గోల్‌మన్ అనేక ప్రయోగాలు చేసి ఒక వ్యక్తి సాధించిన సఫలతలో 80% ఉద్వేగాత్మక ప్రజ్ఞ అయితే కేవలం 20% మాత్రమే అతడి సాధారణ ప్రజ్ఞ అని పేర్కొన్నాడు.

 

ఉద్వేగాత్మక లబ్ధి: (Emotional Quetient):
    EQ అనేది వ్యక్తిలోని ఉద్వేగాత్మక ప్రజ్ఞను తెలిపే ప్రమాణం. వ్యక్తి బాహ్య ఒత్తిడికి గురికాకుండా తన విధులను తాను సంతృప్తిగా నిర్వహించడాన్ని తెలిపే ప్రమాణం. వ్యక్తిలో సాధారణ ప్రజ్ఞను IQ ఎలా తెలుపుతుందో, వ్యక్తి ఉద్వేగ వికాసాన్ని EQ అలా వివరిస్తుంది. కానీ ప్రస్తుతం EQను శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి ఎలాంటి ప్రమాణాలు లేవు.

 

ప్రజ్ఞ - రకాలు:
    Measurement of Intelligence అనే గ్రంథంలో ప్రజ్ఞ మూడు రకాలుగా ఉంటుందని థార్న్‌డైక్ వివరించాడు.

1) అమూర్త ప్రజ్ఞ (Abstract Intelligence): అంకెలు, సంఖ్యలు, పదాలు, వాక్యాలు, మాటలు, భావాలను సక్రమంగా ఉపయోగించే నేర్పరితనమే అమూర్త ప్రజ్ఞ.
ఉదా: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లు, కవులు, రచయితలు, మేధావులు, శాస్త్రవేత్తల్లోని ప్రజ్ఞ.
2) మూర్తప్రజ్ఞ/ యాంత్రిక ప్రజ్ఞ (Mechanical Intelligence): యంత్ర పరికరాలను నేర్పుగా, చక్కగా ఉపయోగించగలిగే సామర్థ్యమే మూర్తప్రజ్ఞ.
ఉదా: శ్రామికులు, నిరక్షరాస్యులు అధికంగా ఉపయోగించుకుంటారు.
3) సాంఘిక/ సామాజిక ప్రజ్ఞ (Social Intelligence): సమాజంలోని మనుషులతో చక్కగా మంచి సంబంధంతో కలివిడిగా ఉండే స్వభావం సాంఘిక ప్రజ్ఞ అవుతుంది.
ఉదా: వ్యాపారస్తులు, సినీనటులు, రాజకీయ నాయకుల్లోని ప్రజ్ఞ.
* ఈ ప్రజ్ఞను మనం కొలవలేం. (కొద్దిగా అంచనా వేయవచ్చు)

ప్రజ్ఞ మాపనం

    ఒకే తరగతి గదిలోని పిల్లల్లో కొంతమంది ప్రజ్ఞావంతులుగా మరి కొంతమంది మందబుద్ధులుగా ఉండటానికి కారణాలను తెలుసుకోవడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం 1903 - 04లో 'ఆల్‌ఫ్రెడ్ బినే' అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తను నియమించింది. మొదట ప్రజ్ఞా ఉద్యమం బినేతో ప్రారంభమైంది కాబట్టి 'బినే'ను ప్రజ్ఞా ఉద్యమానికి పితామహుడు లేదా ప్రజ్ఞా పరీక్షల పితామహుడిగా వ్యవహరిస్తారు.

ప్రజ్ఞా మాపనులు

సంవత్సరం అంశాల సంఖ్య ప్రజ్ఞామాపని పేరు ఏ వయసు వారికి
1905  (30 అంశాలు)                      బినే - సైమన్ ప్రజ్ఞామాపని క్లిష్టత ఆధారంగా రూపొందించారు కానీ ఏ వయసు వారికి అని పేర్కొనలేదు
1908 (59 అంశాలు) బినే - సైమన్ ప్రజ్ఞామాపని 3 - 13 సంవత్సరాల వారికి
1911 (54 అంశాలు) బినే - సైమన్ ప్రజ్ఞామాపని 3 - 13 సంవత్సరాల వారికి
1916 (90 అంశాలు) స్టాన్‌ఫర్డ్ - బినే ప్రజ్ఞా మాపని
(M టెర్మన్ రూపొందించారు)
3 - 14 సంవత్సరాల వారికి
1937 (129 అంశాలు) ఫారం L & M మాపని 2 - 18 సంవత్సరాల వారికి
1973 (129 అంశాలు) టెర్మన్ - మెర్రిల్‌లు కలిసి ఈ మాపనిని ఆధునికీకరించారు. 2 - 18 సంవత్సరాల వారికి


మానసిక వయసు (Mental age:)
    ఒక వ్యక్తి శారీరక వయసును బట్టి తయారుచేసిన ప్రశ్నాంశాల ఆధారంగా నిర్ణయించే వయసును మానసిక వయసు అంటారు. ఇది ఒక వ్యక్తి నిష్పాదనను తెలుపుతుంది. కానీ, అతడి ప్రజ్ఞను తెలియజేయదు. దీన్ని మొదట బినే రూపొందించారు. 'మానసిక వయసు' అనే భావనను మొదట బినే ప్రతిపాదించగా టెర్మన్ బలపరిచాడు. అంతే కాకుండా బినే మొదట ప్రామాణీకరించిన ప్రజ్ఞ మాపనిని కూడా రూపొందించాడు. ఈ క్రమంలో బినే రాసిన గ్రంథం - An Experimental studies on Intellegence.
మానసిక వయసును లెక్కించడం
    ఎనిమిదేళ్ల విద్యార్థి 8 సంవత్సరాల వయోపరిమితి ఉన్న ప్రజ్ఞామాపనిలోని అన్ని అంశాలను సాధించాడు. 9 సంవత్సరాల వయోపరిమితి పరీక్షలో 4 అంశాలు, 10 సంవత్సరాల పరీక్షలో 3 అంశాలు, 11 సంవత్సరాల వయోపరిమితి పరీక్షలో 1 అంశాన్ని సాధించాడు. 12 సంవత్సరాల పరీక్షలో ఏమీ సాధించలేదు. అయితే అతడి మానసిక వయసు ఎంత?
సాధన: విద్యార్థి మొదట 8 సంవత్సరాల శారీరక వయసుకు సమానమైన మానసిక పరీక్షను పూర్తిచేశాడు కాబట్టి,
                8 సంవత్సరాలు × 12 నెలలు = 96 నెలలు
  9 సంవత్సరాల పరీక్షలో = 4 అంశాలు  × 2  = 8 నెలలు
10 సంవత్సరాల పరీక్షలో = 3 అంశాలు  × 2 = 6 నెలలు
11 సంవత్సరాల పరీక్షలో  = 1 అంశం  × 2     = 2 నెలలు
12 సంవత్సరాల పరీక్షలో  = 0 అంశాలు × 2  = 0 నెలలు
                                                                 
                                     112 నెలలు
Note: విద్యార్థులు పూర్తిగా పరీక్ష పూర్తి చేయలేనంత వరకు పరీక్షలు నిర్వహించాలి.

* ప్రతి ఆరు నెలలను ఒక వయోపరిమితిగా గణించాలి.
* పరీక్షలోని ప్రతి అంశానికి 2 నెలలు/ మార్కులు తీసుకోవాలి.
శారీరక వయసు (Chronological Age):
    వ్యక్తి పుట్టిన నాటి నుంచి నేటి వరకు అంటే పరీక్ష నిర్వహించే రోజువరకు ఉండే రోజులను గణించగా వచ్చేదే శారీరక వయసు లేదా నిజ వయసు లేదా వాస్తవిక వయసు అవుతుంది. దీన్ని నెలల్లో గణిస్తారు.
ప్రజ్ఞాలబ్ధి (Intelligence Quotient):
వ్యక్తి తెలివితేటలను కొలవడానికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వాడే కొలమానాన్ని ప్రజ్ఞాలబ్ధి ((IQ) అంటారు.
* దీన్ని (IQ) మొదట ప్రవేశపెట్టినవారు - స్టెర్న్ (జర్మనీ).
* ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతాన్ని రూపొందించినవారు - టెర్మన్ (అమెరికా)
* ప్రజ్ఞాలబ్ధి అనే భావనను మొదటిసారి ఏ పరీక్షల్లో ఉపయోగించారు - స్టాన్‌ఫర్డ్ బినే ప్రజ్ఞామాపని

ఉదా: ఒక వ్యక్తి శారీరక వయసు 10 సంవత్సరాలు, అతడి మానసిక వయసు 11 సంవత్సరాలు, అయితే అతడి ప్రజ్ఞాలబ్ధి (IQ) ఎంత?
IQ = MA/CA × 100 = MA = 11 సంవత్సరాలు × 12 నెలలు = 132 నెలలు
CA = 10 × 12 నెలలు = 120 నెలలు
= 132/120× 100 = 110 పాయింట్లు
ముఖ్యమైన అంశాలు:
1) ఒక వ్యక్తి శారీరక, మానసిక వయసులు సమానమైతే అతడి ప్రజ్ఞాలబ్ధి (IQ) = 100. అంటే సగటు ప్రజ్ఞావంతుడిగా ఉంటాడు. 
2) ఒక వ్యక్తి శారీరక వయసు కంటే మానసిక వయసు అధికమైతే ఆ వ్యక్తి సగటు కంటే అధిక ప్రజ్ఞావంతుడిగా ఉంటాడు.
3) ఒక వ్యక్తి శారీరక వయసు కంటే మానసిక వయసు తక్కువగా ఉంటే ఆ వ్యక్తి సగటు కంటే తక్కువ ప్రజ్ఞావంతుడిగా ఉంటాడు.
4) టెర్మన్, మెర్రిల్‌లు 2 నుంచి 18 సంవత్సరాల వయసున్న 3000 మందిపై పరీక్షలు నిర్వహించి ప్రజ్ఞావిభజన రేఖాపటం తయారుచేశారు. ఇది సామాన్య సంభావ్యత వక్రరేఖను పోలి ఉంది (గంట ఆకారం). అంటే ఎక్కువ మంది సగటు ప్రజ్ఞ కలిగి, తక్కువ మంది అల్ప, అధిక ప్రజ్ఞావంతులుగా ఉన్నారు.

ప్రజ్ఞాలబ్ధి - పరిమితులు
1) ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతపరమైంది, స్థిరమైంది.
2) ప్రజ్ఞాలబ్ధి ఒక వ్యక్తి ప్రజ్ఞకు ప్రమాణం కాదు.
3) ఏదైనా ఒక పరీక్షను నిర్వహించి సూచించిన ప్రజ్ఞాలబ్ధి పూర్తిగా విశ్వసనీయం కాదు.
4) ఏ ఒక్క వ్యక్తి పూర్తిగా ప్రజ్ఞావిహీనంగా ఉండడు. ఎంతో కొంత ప్రజ్ఞ కలిగి ఉంటాడు. ప్రజ్ఞకు సంబంధించి శూన్యస్థానం ఉండదు. కానీ ప్రజ్ఞాలబ్ధి సూచీ గణాంక విలువ కాబట్టి శూన్యస్థానంతో ప్రారంభమవుతుందే కానీ ఇది కేవలం సిద్ధాంతపరమే, కానీ నిజం కాదు.
5) వయోజనుల ప్రజ్ఞాలబ్ధిని గణించేటప్పుడు శారీరక వయసును 18 లేదా 21 సంవత్సరాలుగా తీసుకోవాలి. అందుకే ఇది కొంత వివాదాస్పదమైంది.
6) ప్రజ్ఞా పరీక్షలు ''సాంఘిక ప్రజ్ఞను" కొలవలేవు.
7) ''గారెట్" అనే శాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారం పరిసరాల సంబంధం వల్ల వ్యక్తిలో ప్రజ్ఞాలబ్ధి కొంత ప్రభావితమై 10 పాయింట్ల తేడా ఉంటుంది.
8) చిన్నతనంలో అధిక ప్రజ్ఞావంతులుగా లేని కొందరు శాస్త్రవేత్తలు క్రమంగా ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తలుగా ఎదిగారు.
ఉదా: న్యూటన్, ఐన్‌స్టీన్.

ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా వ్యక్తులను కింది విధంగా వర్గీకరించవచ్చు.

B.Ed SYLLABUS TET - II

ప్రజ్ఞాలబ్ధి

వర్గీకరణ

0 - 25

మూఢులు (Idiots)

26 - 49

బుద్ధిహీనులు (Imbecile)

50 - 70

అల్పబుద్ధి గలవారు (Morons)

70 - 89

నిదాన అభ్యాసకులు లేదా తెలివి తక్కువ (Dullers)

90 - 109

సగటు ప్రజ్ఞగలవారు (Average Intelligence)

110 - 119

అధిక సగటు ప్రజ్ఞ గలవారు (Superiors)

120 - 139

అత్యధిక ప్రజ్ఞ గలవారు (Very Superiors)

140 - ఆపైన

ప్రతిభావంతులు (Genious)

D.Ed SYLLABUS TET - I

ప్రజ్ఞాలబ్ధి

                    వర్గీకరణ

0 - 29

సురక్షణాస్థాయి బుద్ధిమాంద్యత (Custodial)

30 - 49

శిక్షణాస్థాయి బుద్ధిమాంద్యత (Trainable Mentally Retarded)

50 - 69

ప్రాథమిక విద్యాస్థాయి బుద్ధి మాంద్యత (Educable Mentally Retarded)

70 - 89

నిదాన అభ్యాసకులు (Slow Learners)

90 - 109

సగటు ప్రజ్ఞావంతులు (Average)

110 - 119

ఉన్నత అధిక ప్రజ్ఞావంతులు (Superiors)

120 - 139

అత్యున్నత/అధిక ప్రజ్ఞావంతులు (Very Superiors)

140 - ఆపైన

ప్రతిభావంతులు Gifted

ఉదా: ఒక వ్యక్తి శారీరక, మానసిక వయసులు వరుసగా 12, 15 సంవత్సరాలు. అయితే అతడి IQ ఎంత?
IQ = MA/CA × 100 = 15/12× 100 = 125 అయితే
ఈ వ్యక్తి B.Ed Syllabus ప్రకారం - అత్యధిక ప్రజ్ఞావంతుడు

ప్రజ్ఞా పరీక్షలు:
ప్రజ్ఞా పరీక్షలు గణించేదే ప్రజ్ఞ - వెర్నన్
ఒక వ్యక్తి ప్రజ్ఞను కచ్చితంగా, సంపూర్ణంగా కొలిచి చెప్పలేం, కానీ కొన్ని ప్రజ్ఞా పరీక్షలను ఉపయోగించి అంచనా వేయవచ్చు. ప్రజ్ఞా పరీక్షలను కింది రకాలుగా వర్గీకరించారు.

1) శాబ్దిక పరీక్షలు: వ్యక్తిగతంగా లేదా సామూహికంగా నిర్వహించే ఒక పరీక్షలోని అంశాలకు రాతపూర్వకంగా సమాధానాలు ఇచ్చే పరీక్షలే 'శాబ్దిక పరీక్షలు'. ఇందులో ముఖ్యంగా చదవడం, రాయడం ద్వారా ప్రయోజ్యులు ప్రతిస్పందించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలను పేపర్ పెన్సిల్ పరీక్షలు అని కూడా అంటారు.
ఉదా: * ఆర్మీ ఆల్ఫా పరీక్ష
      * ఆర్మీ జనరల్ క్లారిఫికేషన్ టెస్ట్
      * బినే-సైమన్ ప్రజ్ఞా పరీక్ష
      * ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష
       * స్టాన్‌ఫర్డ్ బినే ప్రజ్ఞామాపని
       * WISC పరీక్ష
2) అశాబ్దిక పరీక్షలు: చదవడం, రాయడం తెలియని వారి ప్రజ్ఞను తెలుసుకోవడానికి ఉపకరించే పరీక్షలను అశాబ్దిక పరీక్షలంటారు. ఈ పరీక్షలు చిత్రాలు, చిహ్నాలు, వివిధ ఆకృతుల్లో ఉంటాయి. ఈ పరీక్షలు ఎక్కువగా చిన్నపిల్లలకు, భాషరాని వారికోసం, నిరక్షరాస్యులకు ఉపయోగిస్తారు.
ఉదా: * ఆర్మీ బీటా పరీక్ష
       * గుడ్ ఎనఫ్ పరీక్ష
       * రావెన్స్ స్టాండర్డ్ ప్రొగ్రెసివ్ మాట్రిసెస్ టెస్ట్
       * వెష్లర్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఫర్ చిల్డ్రన్
       * డ్రా-ఎ-పర్సన్ పరీక్ష
       * భాటియా ప్రజ్ఞామాపని

3) వ్యక్తిగత పరీక్షలు: ఒక వ్యక్తిని ప్రత్యేకంగా ఒక సమయంలో ఒకసారి మాత్రమే పరీక్షించేవే వ్యక్తిగత పరీక్షలు. ఈ పరీక్షల ద్వారా ప్రయోజ్యుడికి, ప్రయోక్తకు మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయి.
ఉదా: * భాటియా ప్రజ్ఞామాపని
       * వెష్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్
       * పింట్‌నర్ పాటర్న్‌సన్ పరీక్ష
       * స్టాన్‌ఫర్డ్ - బినే ప్రజ్ఞామాపని
       * బినే-సైమన్ ప్రజ్ఞామాపని
4) సామూహిక పరీక్షలు: ఒకే సమయంలో ఒకరికంటే ఎక్కువ మందికి నిర్వహించడానికి ఉపయోగపడేపరీక్షలు. ఇవి కచ్చితంగా ప్రామాణీకరించిన పరీక్షలు. కాబట్టి పరీక్షించే వ్యక్తుల సామర్థ్యాలపై ప్రత్యేకించి ఆధారపడనవసరం లేదు. వీటి నిర్వహణ తేలిక. ఉద్యోగులను ఎంపిక చేసేందుకుగాను మార్గదర్శక కేంద్రాల్లో ఈ పరీక్షలు బాగా ఉపయోగపడతాయి.
ఉదా:  * ఆర్మీ ఆల్ఫా పరీక్ష
       * ఆర్మీ బీటా పరీక్ష
      * ఓటిస్ గామా పరీక్ష
      * RSPM పరీక్ష
      * కల్చర్ ఫేర్ టెస్ట్
       * డ్రా-ఎ-పర్సన్ టెస్ట్

5) పేపర్-పెన్సిల్ పరీక్ష: ఇవి శాబ్దిక పరీక్షలను పోలి, అన్ని లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటాయి.
ఉదా: శాబ్దిక పరీక్షలన్నీ పేపర్-పెన్సిల్ పరీక్షలై ఉంటాయి.
6) నిష్పాదనా పరీక్షలు: ఏదైనా పనిని చేసి, బహిర్గతంగా వ్యక్తిలోని కౌశలాలను ప్రదర్శించేవే నిష్పాదనా పరీక్షలు. నిరక్షరాస్యులు, మందబుద్ధులు, మూగ, చెవిటివారికి ఇవి అనుకూలంగా ఉంటాయి.
ఉదా: * భాటియా ప్రజ్ఞామాపని
       * చిత్రపూరణ పరీక్ష
       * పింట్‌నర్-పాటర్న్‌సన్ ప్రజ్ఞామాపని
       * పిక్చర్ అసెంబ్లీ పరీక్ష
       * సెగ్విన్ ఫార్మ్‌బోర్డ్ పరీక్ష
7) వేగ పరీక్షలు: ఒక నిర్ణీత సమయంలో పూర్తిచేయాల్సిన పరీక్షలను 'వేగ పరీక్షలు' అంటారు.
ఉదా: * ఆర్మీ ఆల్ఫా పరీక్ష
       * ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష
       * భాటియా ప్రజ్ఞాపరీక్ష
       * ఆర్మీ జనరల్ క్లారిఫికేషన్ టెస్ట్

8) శక్తి పరీక్షలు: పరీక్షలు పూర్తిచేయడానికి నిర్ణీత సమయం ఉండకుండా, ప్రశ్నపత్రం సులభతరం నుంచి కష్టతరానికి పెంచుకుంటూ ఉండే పరీక్షలే 'శక్తి పరీక్షలు'.
ఉదా: * రావెన్స్ స్టాండర్డ్ ప్రొగ్రెసివ్ మాట్రిసెస్ టెస్ట్
       * వెష్లర్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఫర్ చిల్డ్రన్
       * పింట్‌నర్ - పాటర్న్‌సన్ పరీక్ష
       * బినే-సైమన్ ప్రజ్ఞా పరీక్ష
నోట్: ఏ ప్రజ్ఞా పరీక్షకైనా పైన పేర్కొన పరీక్ష రకాల్లో ఏదో ఒక లక్షణం ఉంటుంది.
ఉదా: రావెన్స్ స్టాండర్డ్ ప్రొగ్రెసివ్ మాట్రిసెస్ టెస్ట్
అనేది: * అశాబ్దిక పరీక్ష
        * సామూహిక పరీక్ష
          * పేపర్ పెన్సిల్ పరీక్ష
         * శక్తి పరీక్ష

ప్రజ్ఞా పరీక్షలు - వివరణ

1. జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్
      ఈ పరీక్షను డాక్టర్ ఆర్.పి. శ్రీవాస్తవ, డాక్టర్ కిరణ్ సక్సేనా 7 నుంచి 11 సంవత్సరాల వారికి మన సంస్కృతి ఆధారంగా తయారుచేశారు.
ఈ పరీక్షలు రెండు రకాలు. అవి:
* శాబ్దిక పరీక్షలు
* అశాబ్దిక పరీక్షలు
ప్రతి పరీక్షలో 5 ఉప పరీక్షలు ఉండి ప్రశ్నలన్నీ బహుళైచ్ఛికంగా ఉంటాయి.
1) సాదృశ్యం
2) వర్గీకరణ
3) అంకెల శ్రేణి
4) వివేచనాత్మక సమస్యలు
5) అసమంజసాలు
2. స్టాన్‌ఫర్డ్-బినే స్కేలు
      స్టాన్‌ఫర్డ్ బినే 'బినే-సైమన్ ప్రజ్ఞామాపని'ని రూపొందించాడు. టెర్మన్ 1916లో దీన్ని 'స్టాన్‌ఫర్డ్-బినే రివిజన్ స్కేల్‌'గా మార్చాడు. 'ప్రజ్ఞాలబ్ధి' అనే భావనను తొలిసారిగా ఈ ప్రజ్ఞామాపనిలో ఉపయోగించారు. శాబ్దిక, అశాబ్దిక అంశాలతో అన్ని వయసులవారికి ఉపయోగపడేలా దీన్ని రూపొందించారు.

 ఈ మాపనిలో 5 రకాల అంశాలను మాపనం చేయగలం. అవి:
1) ఫ్లూయడ్ రీజనింగ్           2) నాలెడ్జ్
3) క్వాంటిటేటివ్ రీజనింగ్      4) విజువల్ - స్పేషియల్ ప్రాసెసింగ్       5) వర్కింగ్ మెమరీ
3. రావెన్స్ స్టాండర్డ్ ప్రొగ్రెసివ్ మాట్రిసెస్ టెస్ట్ (RSPMT)
      ఈ పరీక్షను 1938లో జె.సి.రావెన్, జె.హెచ్.కాంట్ రూపొందించారు. అశాబ్దిక వర్గానికి చెందిన ఈ పరీక్షలో కాఠిన్యత ఆధారంగా A, B, C, D, E అనే 5 వర్గాలు ఉంటాయి. ప్రతి వర్గంలో 12 ప్రశ్నలతో మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి.
      ప్రతి కార్డులో ప్రశ్న చిత్రం అసంపూర్ణంగా ఉంటుంది. దానికి సరిపడే బహుళైచ్ఛిక ప్రశ్నలుంటాయి. ఈ పరీక్షల్లో సమస్య ఉన్న చిత్రాలు క్రమం తక్కువ నుంచి ఎక్కువ కఠినస్థాయి దిశగానే కాకుండా అవి పూర్తిచేసే విధానంలో ఒక ప్రామాణిక శిక్షణను పొందే విధంగా రూపొందించడం వల్ల దీన్ని ''ప్రామాణిక క్రమవృద్ధి మాత్రికలు"గా పేర్కొంటారు.
4) భాటియా ప్రజ్ఞామాపని
      ఈ ప్రజ్ఞామాపనిని డాక్టర్ చందర్ మోహన్ భాటియా 1945లో భారతీయుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇది అక్షరాస్యులు, నిరక్షరాస్యులకు ఉపయోగించదగిన వ్యక్తిగత నిష్పాదనా పరీక్ష.
ఈ ప్రజ్ఞా పరీక్షలోని ఉప పరీక్షలు:
(ఎ) కోహ్స్ బ్లాక్ డిజైన్ టెస్ట్: ఈ పరీక్షలో మొత్తం 10 కార్డులుంటాయి.
మొదటి 5 కార్డులకు ఒక్కోదానికి 2 నిమిషాల చొప్పున 10 నిమిషాల కాలం.
చివరి 5 కార్డులకు ఒక్కోదానికి 3 నిమిషాల చొప్పున 15 నిమిషాల కాలం కేటాయించారు.

మొత్తం 25 నిమిషాల్లో వ్యక్తిగతంగా పిల్లలు వివిధ ఘనాకార పెట్టెలను, ఆకారాలను తయారుచేయాలి.

(బి) అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ టెస్ట్: ఈ పరీక్షలో మొత్తం 8 కార్డులు ఉంటాయి.
మొదటి 4 కార్డులకు ఒక్కోదానికి 2 నిమిషాల చొప్పున 8 నిమిషాలు,
చివరి 4 కార్డులకు ఒక్కోదానికి 3 నిమిషాల చొప్పున 12 నిమిషాలు,
మొత్తం 20 నిమిషాల్లో వ్యక్తిగతంగా పిల్లలు నమూనాలు తయారుచేయాలి.

(సి) పాటర్న్ డ్రాయింగ్ పరీక్ష: ఇందులో మొత్తం కార్డులు 8. కార్డులపై ప్రయోజ్యుడు పెన్సిల్‌తో చేయి ఎత్తకుండా నమూనా గీయాలి.
మొదటి 4 నమూనాలు గీయడానికి ప్రతిదానికి 2 నిమిషాలు, మొత్తం 8 నిమిషాలు.
చివరి 4 నమూనాలు గీయడానికి ప్రతిదానికి 3 నిమిషాలు, మొత్తం 12 నిమిషాలు.

మొత్తం 20 నిమిషాల సమయం అవసరం

4) తక్షణ స్మృతి పరీక్ష: ఇది అక్షరాస్యులకు, నిరక్షరాస్యులకు ఉపయోగించదగిన శాబ్దిక, అశాబ్దిక పరీక్ష. ఈ పరీక్షలో అక్షరాస్యుల కోసం ప్రయోక్త కొన్ని అంకెలను చెబుతారు. నిరక్షరాస్యులకు మాత్రం పదాలను ఉపయోగిస్తారు. అది విన్న ప్రయోజ్యుడు వాటిని వరుస (విన్న క్రమంలో) క్రమంలో ఒకసారి, తిరగేసి మరోసారి చెప్పాల్సి ఉంటుంది.
5) చిత్ర నిర్మాణ పరీక్ష: ఇందులో చార్టులు, చెక్కలు, థర్మకోల్, ప్లాస్టిక్‌పై కొన్ని చిత్రాలు వేసి ఉంటాయి. మొత్తం 5 చిత్రాలు వరుసగా రెండు భాగాలు, నాలుగు భాగాలు, ఆరు భాగాలు, ఎనిమిది భాగాలు, పన్నెండు భాగాలుగా విభజితమై ఉంటాయి. ఈ భాగాలను ప్రయోజ్యుడు అర్థవంతమైన చిత్రాలుగా పేర్చాల్సి ఉంటుంది. మొదటి మూడు చిత్రాలకు ఒక్కోదానికి 3 నిమిషాలు, చివరి 2 చిత్రాలకు ఒక్కోదానికి 4 నిమిషాల కాలపరిమితి చొప్పున మొత్తం 17 నిమిషాలు ఉంటుంది.

WISC పరీక్ష (వెష్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్)
       అమెరికాకు చెందిన డేవిడ్ వెష్లర్ 5 నుంచి 15 సంవత్సరాల పిల్లలకు స్పియర్‌మెన్ ద్వికారక సిద్ధాంతంలోని సామాన్య కారకాన్ని మాపనం చేసేవిధంగా WISC పరీక్షను రూపొందించారు. ఈ పరీక్షలో శాబ్దిక, నిష్పాదనా పరీక్షలు ఉంటాయి.
I. శాబ్దిక ఉప పరీక్షలు: ఇవి 5 రకాలు:
1) సమాచారం: ఏదైనా ఒక అంశంపై సమాచారం సేకరిస్తారు.
ఉదా: మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు?
2) అవభోదనం: పిల్లల పదజాల పరిజ్ఞానంపై ప్రశ్నిస్తారు.
ఉదా: రాయడానికే పెన్నునే ఎందుకు ఉపయోగిస్తారు?
3) సాదృశ్యాలు: (Similarities):
రెండు వస్తువుల మధ్య సారూప్యతను ప్రశ్నిస్తారు.
ఉదా: గాడిద - గుర్రం, పాలు - నీళ్లు
4) అంకగణితం (Arithmetic):
రోజువారీ ఎదురయ్యే గణిత సమస్యలను అడుగుతారు.
ఉదా: ఒక పెన్సిల్ ధర రూ.5. నీవు 20 రూపాయల నోటు ఇస్తే దుకాణదారుడు ఎంత డబ్బు తిరిగి ఇవ్వాలి?

5) పదజాలం ((Vocabulary)
ఇష్టం వచ్చిన కొన్ని పదాలనిచ్చి ఒక వాక్యం తయారుచేయమంటారు.
ఉదా: చెట్టు, కొమ్మ, చిలుక, వేటగాడు, చీమ.
II. నిష్పాదనా ఉపపరీక్షలు (Pre-performance Tests):
ఇవి 5 రకాలు
1) చిత్రపూరణ పరీక్ష (Picture Completion Test):
అసంపూర్ణంగా ఉన్న చిత్రంలో లోపించిన భాగాన్ని గుర్తించి పూరించాలి.
ఉదా: 3 కాళ్ల గుర్రాన్ని చూపి లోపాన్ని గుర్తించమనడం.
2) చిత్ర అమరిక పరీక్ష (Picture Arrangement Test):
వివిధ విడిభాగాలను క్రమంలో అమర్చి ఆకారాన్ని తయారుచేయాలి.
ఉదా: మనిషి అవయవాలిచ్చి అమర్చమనడం.
3) బ్లాక్ డిజైన్ పరీక్ష (Block Design Test):
    ఇందులో సమఘనాలు ఉంటాయి. వీటికి వివిధ రంగులు ఉంటాయి. మొత్తం 9 ఘనాలను ఉపయోగించి డిజైన్‌ను రూపొందిస్తారు. కార్డుపై ఉన్న డిజైన్ చూసి, ఘనాలను ఉపయోగించి అలాగే రూపొందించాలి.
4) వస్తు సమాఖ్య (Object Assembly):
   చిన్నచిన్న ముక్కలుగా 4 ఫార్మ్ బోర్డులు ఉంటాయి. వీటిని ఒక క్రమంలో పేర్చితే నాలుగు ఆకారాలు వస్తాయి.
5) చిహ్న పరీక్ష (A Digit Symbol Test):
దీర్ఘచతురస్ర ఆకారంలో వివిధ చిహ్నాలు ఉంటాయి. వీటిలోని చిహ్నాల ఆధారంగా గుర్తించాలి.

సహజ సామర్థ్యాలు (Aptitudes)

    సాధారణంగా వివిధ రంగాల్లో అనేకమంది వ్యక్తుల్లో కొంతమంది మాత్రమే అత్యున్నతమైన ప్రతిభను, నైపుణ్యాన్ని కనబరుస్తూ ఉంటారు. అంటే వ్యక్తులు ఏదైనా ఒక వృత్తిలో లేదా రంగంలో ఉన్నతంగా రాణించగలిగే సామర్థ్యాన్ని సహజ సామర్థ్యం అంటారు. సహజ సామర్థ్య అధ్యయన మూలపురుషుడిగా సి.ఎల్.హుల్‌ను పేర్కొంటారు.
నిర్వచనాలు:

SGT SYLLABUS 

1) ఫ్రీమన్: ''సహజ సామర్థ్యం అనేది ఒక భాషను మాట్లాడటం, ఒక సంగీత విద్వాంసుడవడం, మెకానిక్ సామర్థ్యానికి సంబంధించిన విశిష్ట జ్ఞానం-నైపుణ్యాన్ని వ్యవస్థీకరించిన లక్షణాల కలయిక".
2) బింగ్‌హాం: ''సహజ సామర్థ్యం అనేది ఏదైనా నిశ్చిత, నిర్దిష్ట రకాల సమస్యలను ఎదుర్కోవడానికి నేర్చుకోవడంలో అవసరమైన వ్యక్తి ప్రవర్తనా విధానాన్ని చూపే లక్షణాలు".
3) హాన్, మాలిక్: ''సామర్థ్యాలను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి, సాధనను ప్రదర్శించడానికి అవసరమైన అంతర్గత శక్తులను తెలిపే సామర్థ్యాలు".

School Asst. Syllabus ప్రకారం 

1) బింగ్‌హాం: శిక్షణ ద్వారా ప్రత్యేక జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పొందగలిగే లక్షణం, లక్షణాల సమూహం లేదా స్థితే సహజ సామర్థ్యం.

2) జోన్స్: శిక్షణ ద్వారా ప్రత్యేక వృత్తిలో లేదా రంగంలో సాఫల్యతను పొందే సంభావ్యతను మాపనం చేసేది సహజ సామర్థ్యం.
3) ట్రాక్సిలర్: భవిష్యత్‌ను సూచించే వ్యక్తి ప్రస్తుత స్థితే మూర్తిమత్వం.
సహజ సామర్థ్యాలు - లక్షణాలు:
* ఇది వ్యక్తిలో పుట్టుక నుంచి సహజ సిద్ధంగా ఉంటుంది.
* వ్యక్తి ప్రజ్ఞపై ఆధారపడి భవిష్యత్‌లో రాణించడానికి ప్రస్తుతం కలిగి ఉన్న శక్మతలను సూచిస్తుంది.
* వ్యక్తి భవిష్యత్ సాధనను చూపుతుంది.
* వ్యక్తి పుట్టుకతో వచ్చే సహజ సామర్థ్యాలను శిక్షణ ద్వారా మెరుగుపరచవచ్చు.
* ఇవి వ్యక్తి అనువంశికతతో ప్రభావితమై, ఆ వ్యక్తి అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి.
సహజ సామర్థ్యాలు 3 రకాలు:
1) విద్యా సంబంధమైనవి (Educational Aptitudes or Scholastic Tests). విద్యారంగంలో సహజ సామర్థ్యాలను గణించే నిమిత్తం కింది పరీక్షలను ఉపయోగిస్తారు.
* మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్
* డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్

2) వృత్తి సంబంధమైనవి (Vocational Aptitude Tests)
వివిధ వృత్తులకు సంబంధించిన నైపుణ్యాలు, శిక్షణ ఫలితంగా రాణించగల సామర్థ్యాలను మాపనం చేయడానికి వివిధ రకాల సహజ సామర్థ్య పరీక్షలు ఉన్నాయి. అవి:
* యాంత్రిక సహజ సామర్థ్య పరీక్షలు (Mechanical Aptitude Tests)
* ఈ పరీక్షలో వ్యక్తుల చేతివేళ్ల నైపుణ్యం, రెండు చేతుల సమన్వయం, యాంత్రిక వివేచనాలను పరీక్షిస్తారు.
* అంగుళీ నైపుణ్య పరీక్ష (Finger Dexterity Test)
* శ్రవణ నైపుణ్య పరీక్ష (Tweezer Dexterity Test)
* మినిసోటా మానిప్యులేషన్ టెస్ట్
* సైన్‌క్విస్ట్ యాంత్రిక సహజ సామర్థ్య పరీక్ష
2) గుమాస్తాగిరి సహజ సామర్థ్య పరీక్షలు (Clerical Aptitude Tests)
గుమాస్తా ఉద్యోగానికి కావాల్సిన చేతిరాత, సామాన్య గణితం, అక్షరాల పూరణ, సరిదిద్దడం, స్పెల్లింగ్, భాషా ఉపయోగం, వ్యాకరణం, పోల్చడం లాంటి అంశాలుంటాయి.
ఉదా: * డెట్రాయిట్ క్లరికల్ టెస్ట్
       * స్టాఫ్ సెలక్షన్ కమిషన్
       * బ్యాంక్, ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్

* టీచింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (డైట్‌సెట్, ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష)
* ఫ్లయింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (వైమానిక దళంలో ప్రవేశాలకు)
3) సౌందర్య కళాసంబంధ పరీక్షలు: ఇందులో రెండు ఉప పరీక్షలు ఉంటాయి.
(A) సంగీత సామర్థ్య పరీక్షలు: సంగీతంలో ప్రావీణ్యాన్ని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు.
ఉదా: సీషోర్ మెజర్స్ ఆఫ్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్
(B) చిత్రలేఖన సామర్థ్య పరీక్షలు:
     బొమ్మలు గీయడం, రంగులు వేయడం, నమూనాలు రూపొందించడం మొదలైన చిత్రలేఖన కళల్లో సహజ సామర్థ్యాలను మాపసం చేసే పరీక్షలు చిత్రలేఖన సామర్థ్యాన్ని అంచనా వేస్తాయి.
ఉదా: మెయిర్ - సీషోర్ ఆర్ట్ జడ్జిమెంట్ టెస్ట్
సహజ సామర్థ్య పరీక్షల మాలలు:
     వ్యక్తిలో ఒక ప్రత్యేక నిర్దిష్ట సహజ సామర్థ్యాన్ని కాకుండా బహుళ పరీక్షలను ఉపయోగించి వివిధ రంగాలకు అవసరమయ్యే వ్యక్తుల యోగ్యతలను పరీక్షించే మాపనులను సహజ సామర్థ్య పరీక్షల మాలలు అని అంటారు. ఈ పరీక్షలు వ్యక్తుల వ్యక్తంతర సామర్థ్యాలను పరీక్షిస్తాయి.
(భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష (Differential Aptitude Test):
      ఈ పరీక్షను సీషోర్, వెన్‌మాన్; జార్జ్ కె.బెన్నట్‌లు రూపొందించారు. విద్యార్థుల్లో వృత్తి, విద్యానైపుణ్యాలను మాపనం చేసే 8 అంశాలుంటాయి. ఇవి ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉపయోగకరం. దీన్ని భారతీయ పరీక్షలకు అనుగుణంగా ఎ.ఎం.అహుజా రూపొందించారు.

సహజ సామర్థ్య పరీక్షలు - ఉపయోగాలు:
* విద్యా సంబంధమైన, వృత్తి సంబంధమైన కోర్సులకు శాస్త్రీయపద్ధతిలో అభ్యర్థుల ఎంపికకు ఈ పరీక్షలను ఉపయోగిస్తారు.
* ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల్లో అభ్యర్థుల ఎంపిక కోసం.
* విద్యార్థులకు మార్గదర్శకత్వం ఇవ్వడానికి ఈ సహజ సామర్థ్య పరీక్షలు ఉపయోగపడతాయి.

వైఖరులు (Attitudes)
     ఒక విషయం/అంశం/వ్యక్తి పట్ల ధనాత్మకం/రుణాత్మకం ఏదో ఒకరకంగా ప్రతిస్పందించడాన్నే వైఖరి అంటారు. ఇది భావావేశ రంగానికి చెందింది.
ముఖ్యాంశాలు:

* వైఖరులు పుట్టుకతోరావు. ఇవి అనుభవం, శిక్షణ ద్వారా ఏర్పడతాయి.
* వ్యక్తికీ వ్యక్తికి మధ్య తేడాలను చూపుతాయి.
* ఇవి స్థిరంగా ఉండక పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాయి.
* ఇవి సంస్కృతీ సంబంధ అంశాలకు ప్రభావమవుతాయి.
వైఖరుల లక్షణాలు:
దిశ:
వైఖరి యొక్క దిశ అంటే విముఖత, సుముఖతను సూచించేది.
ఉదా: * విద్యపట్ల ధనాత్మక లేదా రుణాత్మక వైఖరి ఉండటం.
* ఒక రాజకీయ నాయకుడంటే అనుకూలత లేదా ప్రతికూలతను చూపడం.
తీవ్రత: వైఖరి ఎంత పటిష్టంగా ఉంది అనుకున్న విషయం పట్ల ఎంత దృఢంగా ఉండటాన్ని సూచిస్తుంది.
ఉదా: ఒక వ్యక్తికి విద్య పట్ల ధనాత్మక స్వభావం ఉంటే అది ఎంత దూరం ఉందో తెలుపుతుంది.
వ్యాప్తి: ఒక అంశం పట్ల సుముఖత, విముఖత ఉండటంలో వ్యక్తుల అభిప్రాయాల మధ్య వ్యత్యాస వైఖరులు విస్తరించే వ్యాప్తిని తెలుపుతుంది.

 వ్యక్తుల్లో సాధారణంగా అనుకూల, ప్రతికూల వైఖరులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ వైఖరులను మాపనం చేయడానికి కొన్ని వైఖరి మాపనులు ఉంటాయి.
వివిధ మాపనులు:
(1) థర్‌స్టన్ వైఖరి మాపని (Thurstone Attitude Scale)

   పాఠశాలల్లో ఈ మాపనిని ఈక్వల్లీ అప్లయింగ్ ఇంటర్వెల్ స్కేల్ అంటారు. ఈ విధానంలో వైఖరిని మాపనం చేయడానికి అంశాలను తయారుచేస్తారు. వీటిలో ధనాత్మక, రుణాత్మక వైఖరీ అంశాలుంటాయి. ఈ ప్రవచనాలను అనుభవజ్ఞులైన న్యాయనిర్ణేతలకు ఇచ్చి వాటిలో ప్రతికూల వైఖరి నుంచి అనుకూల వైఖరిని తెలిపే ప్రవచనాల వరకు వరుస క్రమంలో విభజించమని కోరతారు. ఈ విభజనలో న్యాయనిర్ణేతల మధ్య ఎక్కువ భేదం ఉన్న అస్పష్ట, సందిగ్ధ ప్రవచనాలను తొలగించి మిగిలిన వాటి సరాసరి విలువలు నిర్ణయిస్తారు.
(2) లైకర్ట్ వైఖరి మాపని (Likert's Attitude Scale): ఈ వైఖరి మాపనిని లైకర్ట్ సమ్మేటెడ్ రేటింగ్ స్కేల్ అంటారు. ఈ పద్ధతి ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఈ విధానంలో వైఖరిని మాపనం చేయదలచిన అంశానికి సంబంధించిన ప్రవచనాలను ఎంచుకుంటారు. ప్రతి ప్రవచనానికి ప్రతిస్పందించడానికి రుణాత్మకం నుంచి ధనాత్మకంవైపు కొనసాగే వివిధ స్థాయి ప్రతిస్పందనలుంటాయి. మొత్తం 5 ఐచ్ఛికాలు ఉంటాయి. అన్ని ఐచ్ఛికాలకు వచ్చిన విలువల మొత్తం ఆ అంశం పట్ల వ్యక్తి వైఖరిని నిర్ధారించడానికి దోహదపడుతుంది.

ఉదా: 


  
సోషల్ డిస్టెన్స్ స్కేలు: బొగార్డస్ ప్రతిపాదించిన ఈ మాపనిలో ఒక వ్యక్తి లేదా ఒక సమూహం నుంచి ఒక విషయం ఏ స్థాయి వరకు అంగీకరించడమైందో లేదా అంగీకరించలేదో మాపనం చేయడమే కాకుండా వ్యక్తుల్లోని సాంఘిక అంతరాలను ఇది చక్కగా వివరిస్తుంది.
క్యుములేటివ్ రేటింగ్ స్కేలు: 'గట్‌మన్' అనే శాస్త్రవేత్త దీన్ని రూపొందించాడు.

అభిరుచులు (Interests) 

     ఒక విద్యార్థి గణిత సమస్యలను విసుగు లేకుండా నిరంతరం చేస్తూ ఉంటాడు. మరొక విద్యార్థికి తెలుగుభాషలోని పద్యాలు అంటే అధికమైన ఆసక్తి. ఇంకొందరు ఆటలంటే అమిత ఆసక్తి చూపడం గమనించవచ్చు. దీన్ని ఆసక్తి అని, శ్రద్ధ చూపడం అని అనవచ్చు. దీనికి మూలాధారం వారి అభిరుచులు. వ్యక్తులు తాము అభిరుచి కలిగిన అంశంలో విసుగు విరామం లేకుండా కృషి చేయడానికి ఇష్టపడతారు. ఆ పని పట్ల అవధానం నిలపగలరు.

 ''వ్యక్తులు తమ వ్యక్తిగత స్వస్థతను వేటితో తదాత్మీకరణం చేసుకుంటారో అవే వారి అభిరుచులు" అని షేన్ అనే శాస్త్రవేత్త అభిప్రాయపడ్డాడు.
     జె.పి.చాప్లిన్ 'Dictionary of Psychology' అనే గ్రంథంలో అభిరుచులను మూడు రకాలుగా నిర్వచించాడు.
(1) ఒక విషయం వైపు లేదా ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు వైపు వ్యక్తి అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపే ఒక వైఖరి.
(2) ఒక విషయం లేదా ఒక కృత్యం ఒక వ్యక్తికి అతి ముఖ్యం అనిపించే ఒక అనుభూతి.
(3) వ్యక్తి ప్రవర్తనను ఒకవైపు లేదా ఒక గమ్యానికి నడిపించే 'ప్రేరణస్థితి'
అభిరుచి మాపన: అభిరుచి మాపనానికి 'స్టాన్లీహాల్' మొదటిసారిగా పిల్లల రిక్రియేషన్‌కు సంబంధించిన అభిరుచుల ప్రశ్నావళిని తయారుచేశాడు. తర్వాత అనేక అభిరుచి శోధికలు వచ్చాయి.
ఇందులో (1) స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపని
              (2) థర్‌స్టన్ అభిరుచి మాపని
              (3) 'క్యూడర్' ప్రిఫరెన్స్ రికార్డు
ఒక వ్యక్తిలోని అభిరుచిని తెలుసుకోవడానికి 3 పద్ధతులను ఉపయోగిస్తారు.
అవి:
(1) ప్రకటిత అభిరుచి (Stated Interest):
     ఒక వ్యక్తి తనకు ఉన్న వివిధ అభిరుచులను తనకు తానుగా వ్యక్తం చేయడం, ప్రశ్నావళి, పరిపృచ్ఛ లాంటివి ప్రకటిత అభిరుచిని మాపనం చేయడానికి దోహదపడతాయి.

(2) వ్యక్త అభిరుచి (Manifest Interest):
     వ్యక్తి అభిరుచిని నేరుగా ప్రకటించకుండా ఏ విషయం పట్ల ఎక్కువ అవధానం, ఏకాగ్రతను ప్రదర్శిస్తున్నాడు అనేది వ్యక్త అభిరుచి అవుతుంది.
(3) అభిరుచి నికషలు (Interest tests): వివిధ అంశాలకు సంబంధించిన అభిరుచి నికషలను నిర్వహించి వాటి ఫలితాల ఆధారంగా వ్యక్తి అభిరుచిని మాపనం చేయవచ్చు.
అభిరుచి శోధికలు (Interest Inventories)
     అభిరుచి శోధికలను ఉపయోగించి వ్యక్తి అభిరుచిని మాపనం చేయవచ్చు.
ఉదా: (1) స్ట్రాంగ్ ఔద్యోగిక అభిరుచి మాపని
         (2) క్యూడరన్ ప్రిఫరెన్స్ రికార్డు
         (3) మిన్నెసోటా అభిరుచి మాపని

రచయిత: కోటపాటి హరిబాబు

Posted Date : 26-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌