• facebook
  • whatsapp
  • telegram

బోధన నైపుణ్యాలు

        బోధనా నైపుణ్యాలు వేరు భాషా నైపుణ్యాలు వేరు. వివిధ అంశాలను బోధించేటప్పుడు అనేక బోధనా నైపుణ్యాలు అవసరమవుతాయి. ఏ స్థాయిలో ఏ నైపుణ్యాన్ని వినియోగించుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. బోధనలో  సంక్లిష్టతను తొలగించే సూక్ష్మ బోధన, అభ్యాసనా సామర్థ్యాన్ని గరిష్ఠ స్థాయిలో పెంపొందించే బృంద బోధన, విద్యార్థుల్లో స్వీయ అధ్యయన శక్తికి తోడ్పడే కార్యక్రమయుత బోధనల గురించి తెలుసుకుందాం.
 

బృంద బోధన

ఈ విధానంలో ఒక పాఠాన్ని ఒక ఉపాధ్యాయుడు మాత్రమే కాకుండా ఎక్కువ మంది బోధిస్తారు. దీంతో విద్యార్థి ఆ పాఠాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి అవకాశముంటుంది. విద్యార్థి సహజంగా వైవిధ్య బోధనా విధానాన్ని కోరుకుంటాడు. సహజమైన అభిరుచికి చక్కటి ప్రత్యామ్నాయం ఈ బృంద బోధన. ఒకే పాఠ్యాంశాన్ని ఉపాధ్యాయులంతా చర్చించి బోధించడం విద్యార్థులకు ప్రయోజనకారిగా ఉంటుంది. వారి ప్రత్యేక నైపుణ్యాలను ఈ బృంద బోధనలో ప్రదర్శించడంవల్ల విద్యార్థి సులువుగా ఎక్కువ జ్ఞానాన్ని పొందగలుగుతాడు.
 

సూక్ష్మ బోధన
వివిధ పూర్వసేవ (Pre service), సేవాంతర్గత (in service) స్థాయి ఉపాధ్యాయుల వృత్తి వికాసానికి దోహదపడే శిక్షణ సూక్ష్మ బోధన. ఇది ఉపాధ్యాయుడు సాధారణ తరగతి గదిలో ఎదుర్కొనే సంక్లిష్టతలను తొలగించి ఆత్మవిశ్వాసంతో బోధన చేయడానికి తోడ్పడుతుంది. సూక్ష్మ బోధన ద్వారా ఉపాధ్యాయుడు తక్కువ వ్యవధిలో తన దోషాలను గ్రహించి, సవరించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
* 5 నిమిషాల్లో అయిదారుగురు విద్యార్థులకు చిన్న పాఠాన్ని లేదా ఒక భావనను తీసుకుని, ఒక నైపుణ్యాన్ని సాధించడానికి చేసే కృషే సూక్ష్మ బోధన.
* బోధనా నైపుణ్యాల్లో ముఖ్యమైనవి ప్రతిస్పందన వ్యత్యాసం, పూర్వ బోధన ఉపోద్ఘాతం - సామీప్యం, మౌనం - అశాబ్దిక చర్యలు, పునర్బలన నైపుణ్యం, వేగంగా ప్రశ్నలడగడం, ప్రశ్నలు తయారు చేసే నైపుణ్యం మొదలైన వాటిని సాధించడం ద్వారా బోధనను సమగ్రంగా నిర్వహించవచ్చు.

సూక్ష్మ బోధన - ప్రయోజనాలు:
* సాధారణ తరగతి బోధనలో ఉన్న క్లిష్టతను తగ్గిస్తుంది.
* నైపుణ్య సాధనలో శిక్షణ పొందిన అధ్యాపకుడు - ఆత్మవిశ్వాసంతో బోధిస్తాడు.
* బోధనా నైపుణ్యాలు ఆర్జించడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.
* దీనిలో అనవసర విషయాల బోధన ఉండదు. ఇది వాస్తవిక బోధన.
* బోధనా సామర్థ్యం పెరుగుతుంది.
* పర్యవేక్షణ స్నేహపూరితం. కాబట్టి భయం తొలగిపోతుంది.

 

సూక్ష్మ బోధన - విధానం
                     
 

కార్యక్రమయుత బోధన

* స్కిన్నర్ రూపొందించిన 'Operant Conditioning Theory of Learning' ఆధారంగా రూపొందించిన విధానం.
* విషయాన్ని భావనలు లేదా నిర్వచనాల చట్రాల (ఫ్రేం) ద్వారా గ్రహించే స్వీయ అభ్యసన విధానం.
* పునర్బలనం అవసరాన్ని నొక్కి చెప్పిన బోధనా విధానం.
* గిల్బర్ట్ అధ్యయనాంశాలను చిన్న చిన్న కృత్యాలుగా ఆకృతీకరించి సత్ఫలితాలను సాధించాడు.
* గాగ్ని, గుడ్‌మన్, పార్క్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు దీనిపై విశేష కృషి చేశారు.
* ఈ పద్ధతిలో తిరిగి భర్తీ (Feedback), నియంత్రణ (Control) అనే అంశాలకు విశేష ప్రాధాన్యం ఇచ్చారు.
* ఈ పద్ధతిని అనుసరించిన బోధన నిర్వహణలో చిన్న మెట్లు (Small steps) లేదా చిన్న సోపానాలు, వీటిని క్రమంగా వరుసలో 'కూర్చడం' అనే రెండు అంశాలు ముఖ్యమైనవి.
* ఈ పద్ధతి శాఖీయ కార్యక్రమమనీ, రేఖీయ కార్యక్రమమనీ రెండు విధాలుగా ఉంటుంది.
* భాషా బోధనలో ఈ పద్ధతి ద్వారా వ్యాకరణం, ఉపవాచకం, కథ, గద్య పద్యాంశాలు మొదలైన వివిధ ప్రక్రియలను బోధించడానికి వీలు కలుగుతుంది.
* ఈ బోధనలో ఆధునిక బోధనోపకరణాలు, యంత్ర పరికరాలైన కంప్యూటర్, టేప్ రికార్డర్‌లను కూడా ఉపయోగించుకోవచ్చు.

 

నిర్వచనాలు:

*  ''వైవిధ్యమైన బోధన నైపుణ్యాలతో ఒకరికంటే ఎక్కువమంది ఉపాధ్యాయులు కలిసి ఆలోచించి, బోధన నిర్వహించి సత్ఫలితాలు సాధించగల వ్యూహం".  - కార్లో ఆబ్సన్
*  ''ఇద్దరికంటే ఎక్కువమంది ఉపాధ్యాయులు ఒక ప్రణాళిక ప్రకారంగా, పరస్పర సహకారంతో బోధనను, మూల్యాంకనాన్ని నిర్వహించే విధానమే బృంద బోధన".  - ఎం.బి. నాయక్    
*  ''ఒక పాఠశాలలోని ఉపాధ్యాయులు ఒక బృందంగా ఏర్పడి, తమకున్న ప్రత్యేక నైపుణ్యాలను, వనరులను, విద్యార్థుల అవసరాలను, వారికున్న ప్రత్యేక నైపుణ్యాలను దృష్టిలో పెట్టుకుని పాఠ్య ప్రణాళికను చర్చించి, అందులోని వివిధ భాగాలను వేర్వేరు ఉపాధ్యాయులు బోధించే పద్ధతిని బృంద బోధన అంటారు".   
 - డేవిడ్ వార్‌విక్

Posted Date : 26-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌