• facebook
  • whatsapp
  • telegram

విజ్ఞానశాస్త్ర, బోధనాభ్యసన వ్యూహాలు  

విద్యార్థుల్లో ఆమోదయోగ్యమైన ప్రవర్తనా మార్పులు తేవడమే బోధన ముఖ్యోద్దేశం. విద్యా లక్ష్యాలను సాధించడానికి బోధనా పద్ధతులు తోడ్పడతాయి. ఒక విషయంలో ఉపగమాన్ని బోధనా పద్ధతుల్లో వాడితే మరో సబ్జెక్టులో అదే ఉపగమాన్ని ప్రత్యేక పద్ధతిగా వాడుతున్నారు. జీవశాస్త్రంలో వాడుతున్న ఆగమన, నిగమన ఉపగమాలనే గణితశాస్త్ర బోధనలో ప్రత్యేకమైన పద్ధతులుగా వాడుతున్నారు.
ఆగమన పద్ధతి (Inductive Method): ఒక సందర్భంలో వాస్తవమైన విషయం లేదా సూత్రం ఇతర సందర్భాల్లో కూడా నిజమవుతుందని తెలిపే సార్వత్రిక సత్యాన్ని రుజువు చేసే విధానం.
'నిర్దిష్ట అంశాల నుంచి సాధారణీకరణాలను రూపొందించడమే ఆగమనం'- ఫౌలర్
'ప్రత్యేక సత్యాల నుంచి సాధారణ సత్యాలను రూపొందించడమే ఆగమనం- జీవన్
ఉదా: మల్లెలకు సువాసన ఉంటుంది
సన్నజాజులకు సువాసన ఉంటుంది
విరజాజులకు సువాసన ఉంటుంది

ఇవి రాత్రిపూట వికసిస్తాయి కాబట్టి సాధారణీకరణం ఏమిటంటే 'రాత్రి వికసించే పూలన్నింటికీ సువాసన ఉంటుంది'.
 

ప్రయోజనాలు: శాస్త్రీయ పద్ధతి. దీనివల్ల శాస్త్రీయ వైఖరి అలవడుతుంది. వివేచనాశక్తి, పరిశీలనా నైపుణ్యం అభివృద్ధి చెందుతాయి. ఇది తార్కిక, మనో వైజ్ఞానిక పద్ధతి. స్వయంగా పనులు చేయడానికి అవకాశం కల్పిస్తుంది.
 

పరిమితులు: ఎక్కువ సమయం తీసుకుంటుంది. విజ్ఞానశాస్త్ర పాఠాలన్నింటినీ బోధించడానికి వీలుకాదు. అన్ని సందర్భాలకు వర్తించదు. ప్రతి సాధారణీకరణకు కొన్ని మినహాయింపులు ఉంటాయి.
 

నిగమన ఉపగమం (Deductive Approach): సిద్ధాంతీకరించిన సూత్రాలు, సిద్ధాంతాలు, ధర్మాలు, నిర్ణయాలను నూతన లేదా ప్రత్యేకమైన సందర్భాల్లో అన్వయించి వాటి యదార్థాలను తెలుసుకునే పద్ధతి.
'అమూర్త సామాన్యీకరణాల నుంచి మూర్త సత్యాలను గుర్తించే విధానమే నిగమన పద్ధతి'
ఉదా: 'ఆమ్లాలు నీలి లిట్మస్‌ను ఎర్రగా మారుస్తాయి' అనే సిద్ధాంతాన్ని హైడ్రో క్లోరిక్ ఆమ్లానికి అన్వయించడం. దీని ద్వారా హైడ్రోక్లోరిక్ ఆమ్లం నీలి లిట్మస్‌ను ఎర్రగా మారుస్తుందని పేర్కొనడం.

ఆగమన, నిగమన పద్ధతుల మధ్య భేదాలు

ప్రయోజనాలు: తక్కువ సమయంలో ఎక్కువ విషయాలను చెప్పవచ్చు. కింది తరగతులకు అనువైంది. ఉపాధ్యాయుడికి పనిభారం తగ్గుతుంది.
పరిమితులు: విద్యార్థులకు శాస్త్రీయ విధానంలో శిక్షణ నివ్వదు. కాబట్టి శాస్త్రీయవైఖరి అలవడదు. జ్ఞాపకశక్తికి సంబంధించిన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. విద్యార్థులు తెలిసిన సూత్రాలను అన్వయించడం తప్ప ఎలాంటి కొత్త విషయాలను కనుక్కోలేరు. మనోవైజ్ఞానిక పద్ధతి కాదు. 
       విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని ఆశించే ఉపాధ్యాయులు చేసే ప్రయత్నాలు రెండు రకాలు. వీటినే 'ఉపగమాలు' అంటారు.
1. ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమం 2. విద్యార్థి కేంద్రీకృత ఉపగమం
ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమం: దీన్ని నాలుగు పద్ధతుల్లో నిర్వహించవచ్చు.
* ఉపన్యాస పద్ధతి
* ఉపన్యాస ప్రదర్శనా పద్ధతి 
* చారిత్రాత్మక పద్ధతి
* నిర్మాణ పద్ధతి.
ఉపన్యాస పద్ధతి: దీన్నే రాసి -మాట్లాడే పద్ధతి అని కూడా అంటారు. ఇది Lectare అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. 'బిగ్గరగా చదవడం' అని దీని అర్థం. మొదట చదవడం, నెమ్మదిగా చెప్పడం తర్వాత వివరించడంగా మారింది. భావాలను ఉద్దేశపూర్వకంగాగానీ, ఉద్దేశరహితంగాగానీ ఉపాధ్యాయుడి నుంచి విద్యార్థులకు విలువలుగా, వైఖరులుగా అందిస్తారు.

ఉపన్యాసపద్ధతి జ్ఞానాత్మకరంగం, సాంఘిక కృత్యాలకు సంబంధించింది. భావావేశ, మానసిక చలనాత్మక రంగాలకు చెందదు. విద్యార్థి కంటే విషయానికే ప్రాధాన్యం ఉంటుంది.
 

ప్రయోజనాలు:
* ఆర్థికంగా సులభమైంది.
* వైజ్ఞానికుల జీవిత విశేషాలు, వారి పరిశోధనలు, వాటి ఫలితాలు మొదలైనవాటిని విద్యార్థులకు ఆసక్తికరంగా, సులభంగా బోధించవచ్చు.
* పాఠ్య ప్రణాళికను సకాలంలో పూర్తిచేసి, పునఃశ్చరణ చేయవచ్చు.
* ఎక్కువ విద్యార్థులుండే తరగతుల్లో బోధించవచ్చు. పనిభారం తగ్గుతుంది.

 

లోపాలు:
* విద్యార్థులకు కొత్త విషయాలను బోధించడానికి ఉపయోగపడదు.
* కృత్యభ్యసన సూత్రానికి విరుద్ధమైంది. శాస్త్రీయ వైఖరులు పెంపొందించదు.
* వైయుక్తిక భేదాలను పరిగణలోకి తీసుకోదు. అవగాహనను అంచనా వేయడం కష్టం.

 

ఉపన్యాస పద్ధతిని ఉపయోగించే సందర్భాలు:
* క్లిష్టమైన కొత్త పాఠ్యాంశాన్ని ప్రారంభించడానికి
* ప్రదర్శించి, బోధించడానికి వీలుకాని క్లిష్టమైన సైద్ధాంతిక అంశాలను వివరించడానికి.
* సాధారణీకరణకు

* పునఃశ్చరణకు
* ప్రదర్శనను నిర్వహించి దాన్ని క్రమబద్ధంగా వివరించడానికి ఉపయోగిస్తారు.
ఉపన్యాస - ప్రదర్శనా పద్ధతి: విద్యార్థుల్లో పరిశీలనాశక్తి, హేతువాదం అలవడతాయి.
ఉపన్యాస - ప్రదర్శనా పద్ధతి నిర్వహించే విధానం:
* లక్ష్యాత్మక పాఠ్యపథకాన్ని తయారు చేయాలి.
* పరికరాలను సిద్ధం చేసుకోవాలి
* ప్రయోగాలు చేసి సరిచూడాలి.

 

ప్రయోజనాలు:
* సిద్ధాంతానికి, ఆచరణకు మధ్య సంబంధం ఏర్పరుస్తుంది.
* ప్రదర్శనలు విద్యార్థుల్లో ఆలోచనలు రేకెత్తిస్తాయి.
* వ్యయాన్ని, కాలాన్ని ఆదా చేయవచ్చు.

 

పరిమితులు:
* చేయడం ద్వారా నేర్చుకోవడం అనే అంశానికి అవకాశం లేదు.
* శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ, శాస్త్రీయ వైఖరులు అలవడవు.

 

చారిత్రక పద్ధతి: విజ్ఞాన శాస్త్రాన్ని చారిత్రక అభివృద్ధి మార్గంలో విద్యార్థులకు అందించే పద్ధతినే 'చారిత్రక పద్ధతి' అంటారు.
 

చారిత్రక పద్ధతిని ఉపయోగించే సందర్భాలు:
ఉపాభ్యాసక పద్ధతి:
శాస్త్రవేత్తల జీవిత అనుభవాల ద్వారా తాము కనుక్కున్న విషయాల గురించి చెప్పడం.
ఉదా: తొట్టిలో స్నానం చేస్తూ ఆర్కిమెడిస్ సూత్రాన్ని కనుక్కోవడం.

 

జీవిత చరిత్ర పద్ధతి: జీవిత చరిత్రలను బోధించడం
 

పరిణామ పద్ధతి: వివిధ సిద్ధాంతాలు, అవి పరిణామం చెందిన విధానంలో అమర్చి బోధించడం.
ఉదా: న్యూటన్ కాంతికణ సిద్ధాంతం, హైగన్స్ తరంగ సిద్ధాంతం మొదలైనవి

 

సాంఘిక పద్ధతి: శాస్త్రానికి, సమాజానికి మధ్య సంబంధాన్ని బోధించడం. 
ఉదా: లేజర్, కంప్యూటర్, ఇంటర్నెట్.
ఈ విధానాన్ని మొత్తం ఒక బోధనా పద్ధతిగా కాకుండా పాఠ్యాంశంలోని సందర్భాన్నిబట్టి వీలైనచోట ఒక ఉపగమంగా వాడుకోవాలి.

 

నిర్మాణ పద్ధతి: విజ్ఞానశాస్త్ర నిర్మాణం ప్రకారం బోధన జరిపే పద్ధతి.
ఈ పద్ధతిలో పాఠ్య విషయాన్ని విజ్ఞానశాస్త్ర నిర్మాణాన్ని అనుసరించి బోధిస్తారు.
విజ్ఞానశాస్త్ర విషయాలను ద్రవ్యాత్మక, సంశ్లేషణాత్మక నిర్మాణాలుగా బోధిస్తే, శాస్త్రీయవైఖరులు, ఆలోచనలు, పరిశీలనాశక్తి అలవడతాయి.


విద్యార్థి కేంద్రీకృత ఉపగమం
శాస్త్రీయ పద్ధతి:

* సత్యాన్వేషణలో శాస్త్రవేత్తలు అనుసరించే విధానం.
* సమస్యలను ఒక ప్రత్యేక రీతిలో క్రమబద్ధంగా పరిష్కరించడం.
* శాస్త్రీయపద్ధతిలో శిక్షణ పొందిన విద్యార్థులు తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలను సమర్థంగా తమకు తాము పరిష్కరించుకోగలరు.

 

శాస్త్రీయ పద్ధతి సోపానాలు:
* శాస్త్రీయ పద్ధతికి నిర్దిష్టమైన సోపానాలు లేవు
* కార్ల్ పియర్‌సన్ 1937లో కొన్ని సోపానాలను ప్రతిపాదించాడు. అలాగే కీస్లర్ కూడా కొన్ని సోపానాలను రూపొందించాడు. అయితే అందరికి ఆమోద యోగ్యమైన సోపానాలు...
* సమస్యను గుర్తించడం, నిర్వచించడం. 
* సమస్య విశ్లేషణ లేదా లక్ష్య నిర్ధారణ. ఈ సోపానం దత్తసేకరణకు, ప్రాక్కల్పనలను రూపొందించడానికి తోడ్పడుతుంది.
దత్తాంశ సేకరణ: కావాల్సిన సమాచారాన్ని పుస్తకాలు, నమూనాలు, బొమ్మలు, క్షేత్రపర్యటనలు, ప్రయోగాలు మొదలైన వాటి ద్వారా సేకరిస్తారు.

 

దత్తాంశాలను ప్రతిక్షేపించడం: శాస్త్రీయ పద్ధతిలో ముఖ్యమైన సోపానం.
* ప్రాక్కల్పనను ప్రతిపాదించడం
* ప్రాక్కల్పనలను పరీక్షించడం
* సాధారణీకరించడం
* కొత్త అంశాలకు అన్వయించడం.

 

అన్వేషణ పద్ధతి (Heuristic Method):
* Heuristic అనే పదం heuristo అనే మాట లేదా heurisco అనే గ్రీకు పదం నుంచి ఉద్భవించింది. Heurisco అంటే అన్వేషణ లేదా కనుక్కోవడం.
* విద్యార్థి తనకు తానే పరిశీలించడం, తర్కించడం, తానే పనిచేయడం, ఆలోచించడం లాంటి స్వయం కృషికి సంబంధించిన అంశాలు కలిగిన పద్ధతి అన్వేషణ పద్ధతి.
* ఈ పద్ధతికి మూలపురుషుడు హెచ్.ఇ. ఆర్మ్‌స్ట్రాంగ్
* ఈ విధానంలో జ్ఞానాన్ని పొందడం కంటే శాస్త్రీయ విధానంలో శిక్షణ పొందడానికే ఎక్కువ ప్రాముఖ్యమిస్తారు.
* ఈ పద్ధతి ద్వారా విద్యార్థులు ముందు సమస్యలను నిర్వచించి, ప్రయోగాల ద్వారా విషయాలను రాబట్టి చివరకు ముగింపు కనుక్కుంటారు.

 

సోపానాలు:
* బోధించాల్సిన అంశాలను సమస్యల రూపంలోకి మార్చాలి.
* సూచన పత్రాలను తయారుచేయాలి.

* సూచనల ఆధారంగా ప్రయోగాలు చేయాలి.
* ప్రయోగ ఫలితాలను రికార్డుచేసి ఉపాధ్యాయులతో సంప్రదించి తిరిగి ప్రయోగాలు చేయాలి.
* నేర్చుకున్న సూత్రాలను, సాధారణీకరణాలను నూతన సందర్భాల్లో వినియోగించగలగాలి.

 

ప్రయోజనాలు:
* విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వడానికి తోడ్పడుతుంది.
* శాస్త్రీయ వైఖరి, ఆలోచనాశక్తి, సృజనాత్మకత, నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి.
* ఆచరణ ద్వారా అభ్యసనం పెంపొందుతుంది.
* నిజజీవితంలోని సమస్యలను సమర్థంగా ఎదుర్కొంటారు.

 

లోపాలు:
* విద్యార్థులే పరిశోధకులుగా ఊహించుకుని వారే నేర్చుకుంటారు అనే భావన అత్యాశ లాంటిది.
* అధిక వ్యయం, కాలం అవసరం.
* ప్రాథమిక తరగతుల్లో అమలుకు వీలులేని విధానం
* కోర్సులు సకాలంలో పూర్తికావు.
* సమగ్ర ప్రయోగశాలలు అన్ని పాఠశాలల్లో లేవు.
* సైన్స్ అనేది ప్రయోగశాలకు మాత్రమే పరిమితమైందనే తప్పుడు భావనలు ఏర్పడవచ్చు.
* ఎక్కువగా భౌతిక, రసాయశాస్త్ర బోధనకు, తక్కువగా జీవశాస్త్ర బోధనకు ఉపయోగపడుతుంది.

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌