• facebook
  • whatsapp
  • telegram

విజ్ఞానశాస్త్ర బోధనా ప్రణాళిక

        విజ్ఞానశాస్త్రంలో ఒక తరగతికి నిర్ణయించిన విషయ ప్రణాళికను ఆ తరగతి ఉపాధ్యాయుడు ఆ విద్యాసంవత్సరంలో పూర్తిచేసి విద్యార్థుల్లో ఆశించిన సామర్థ్యాలను, ప్రక్రియ నైపుణ్యాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఉపాధ్యాయుడు తయారు చేసుకోవాల్సినవి
1. వార్షిక పథకం 2. యూనిట్ పథకం 3. పాఠ్య పథకం (దీన్నే పరిసరాల విజ్ఞానం విషయంలో 'పీరియడ్ పథకం' అని పిలుస్తారు). 


వార్షిక పథకం
           తరగతివారీగా పరిసరాల విజ్ఞానం (విజ్ఞాన శాస్త్రం)లోని పాఠ్యాంశాలను ఒక విద్యా సంవత్సరంలో ఏ నెలలో ఎంత పూర్తిచేయాలనే దాని ప్రకారం తయారుచేసుకునేదే వార్షిక పథకం.
            వార్షిక పథకాన్ని విద్యాసంవత్సరం ఆరంభంలోనే విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుడు తాను బోధించే తరగతులన్నింటికీ విడివిడిగా తయారు చేసుకోవాలి.

 

వార్షిక పథకం తయారు చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు:
1. ఒక విద్యా సంవత్సరంలో విజ్ఞానశాస్త్రాన్ని బోధించడానికి తరగతి వారీగా కేటాయించిన పీరియడ్ల సంఖ్య.
2. తరగతి పాఠ్యపుస్తకంలోని యూనిట్ల సంఖ్య.
3. విద్యార్థుల్లో పెంపొందించాల్సిన సామర్థ్యాల స్థాయి.
4. విద్యాసంవత్సరంలో పాఠశాల పనిచేసే రోజుల సంఖ్య.
5. ఉపాధ్యాయుడు వాడుకునే సెలవు రోజులు.
6. ప్రత్యేక ప్రాంతీయ సెలవు రోజులు.
7. వివిధ పరీక్షలు నిర్వహించడానికి ఉపయోగించే రోజులు.

 

వార్షిక పథకం - ప్రయోజనాలు: వార్షిక పథకం తయారుచేసుకోవడం వల్ల ఉపాధ్యాయుడు...
1. ఏ నెల పాఠ్యాంశాలను ఆ నెలలో పూర్తి చేయగలుగుతాడు.
2. తన కాలాన్ని సద్వినియోగం చేసుకోగలడు.
3. అనివార్య కారణాల వల్ల ఏ పాఠం అయినా మిగిలిపోతే, అవకాశాన్ని బట్టి దాన్ని పూర్తి చేయగలుగుతాడు.

4. అవసరమయ్యే బోధనాభ్యసన సామగ్రి ఏదో తెలుస్తుంది. వాటిని సమకూర్చుకోవడానికి ప్రణాళిక రూపొందించుకోవచ్చు.
5. బోధనాభ్యసన సామగ్రి లభ్యమయ్యే కాలాన్ని బట్టి తగిన యూనిట్‌ను ఎన్నుకోవచ్చు.
6. ఒక విద్యాసంవత్సరంలో ఏ నెలలో క్షేత్ర పర్యటనలు, ప్రాజెక్టు పనులు ఉంటాయో ముందే తెలుస్తుంది. కాబట్టి, తగిన ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు.
1. వార్షిక పథకం - నమూనా:
1. పాఠశాల పేరు:                        విద్యా సంవత్సరం:
2. సబ్జెక్టు:
3. తరగతి:
4. విద్యా సంవత్సరంలో కేటాయించిన పీరియడ్ల సంఖ్య:


 

యూనిట్ పథకం

* వార్షిక పథకంలోని ప్రతి యూనిట్‌ను బోధించడానికి ఒక ప్రత్యేక పథకాన్ని తయారు చేసుకోవాలి. దాన్నే 'యూనిట్ పథకం' అంటారు.
* 'పరస్పర సంబంధం ఉన్న ఒక సుదీర్ఘమైన విషయాన్నే' యూనిట్ అంటారు- ప్రెస్టన్
* ఒక యూనిట్ వరుసగా 5 నుంచి 10 పీరియడ్లలో బోధించేదిగా ఉంటుంది.

 

యూనిట్ పథకం - నమూనా

తరగతి:                    యూనిట్ పేరు:            సబ్జెక్టు:                పీరియడ్ల సంఖ్య:

యూనిట్ పథకం - ప్రయోజనాలు:
1. ఉపాధ్యాయుడు అన్ని పాఠ్యాంశాల విషయాలను వరుస క్రమంలో బోధించగలుగుతాడు.
2. అవసరమైన చోట పాఠ్యపుస్తకంలోని విషయాలనే కాకుండా ఇతర విషయాలను కూడా విద్యార్థులకు అందించవచ్చు.
3. అవసరమయిన బోధనాభ్యసన సామగ్రిని ముందుగానే సమకూర్చుకోవచ్చు.
4. ఒక యూనిట్ పూర్తిచేసిన తరువాత యూనిట్ పరీక్ష ద్వారా విద్యార్థులు పొందిన సామర్థ్యాలను మదింపు చేయగలుగుతాడు.

పాఠ్య పథకం లేదా పీరియడ్ పథకం  

                ఒక పీరియడ్‌లో పాఠానికి సంబంధించిన సామర్థ్యాలను సాధించడానికి ఉపాధ్యాయుడు, విద్యార్థి నిర్వహించే కృత్యాలు, కావలసిన బోధనాభ్యసన సామగ్రి, విద్యార్థులు ఎంతవరకు ఆశించిన సామర్థ్యాలు సాధించారో మదింపు చేయడానికి చేసే మూల్యాంకనం ఉన్న పథకాన్నే పాఠ్యపథకం లేదా పీరియడ్ పథకం అంటారు.
           'పాఠ్య పథకం అనేది కచ్చితంగా ఒక కార్యాచరణ పథకం'   - లేస్టర్ బి.సీండ్స్

పీరియడ్ పథకం - సోపానాలు:
శిశు కేంద్రీయ, కృత్యాధార పద్ధతిలో పరిసరాల విజ్ఞానాన్ని బోధించడానికి మన రాష్ట్రమంతటా ఒకే రకమైన పీరియడ్ పథకం ఆచరణలో ఉంది.
పీరియడ్ పథకంలో ముఖ్యంగా 5 సోపానాలు ఉన్నాయి. అవి.. 1. సామర్థ్యాలు 2. బోధనాభ్యసన సామగ్రి
3. బోధనాభ్యసన కృత్యాలు 4. అభ్యసన మూల్యాంకనం 5.ఉపాధ్యాయుడి అభిప్రాయాలు.
* మన రాజ్యాంగంలో 45వ ఆర్టికల్ ప్రకారం 14 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలి.
బహుళ తరగతి బోధన: ఒక ఉపాధ్యాయుడు ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ తరగతుల విద్యార్థులకు బోధించడాన్నే 'బహుళ తరగతి బోధన' అంటారు.
బహుళ తరగతి బోధన ప్రక్రియలు:
1. ప్రత్యక్ష బోధన
2. జట్టు కృత్యాల నిర్వహణ
3. తరగతి లీడర్ సహాయం
4. సమవయస్కుల బోధన

5. స్వయం అభ్యసన
6. అనుబంధ పఠనం
7. తరగతి వెలుపల నిర్వహించే కృత్యాలు
8. మొత్తం తరగతి పని


బోధనాభ్యసన ప్రక్రియలను పరిశీలించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన సూత్రాలు:
1. ఉపాధ్యాయ జనిత అభ్యసన ప్రక్రియలను కల్పించడం.
2. అభ్యసనాన్ని కృత్యాల ద్వారా, ప్రయోగాల ద్వారా, అన్వేషణల ద్వారా ప్రోత్సహించడం.
3. వైయక్తిక, సామూహిక, పూర్తి తరగతి పనులను అభివృద్ధి చేయడం.
4. వైయక్తిక భేదాలను గుర్తించి, తగిన సహాయం అందించడం.
5. స్థానిక పరిసరాలను వినియోగించడం.
6. విద్యార్థుల పనిని ప్రదర్శించి ఆసక్తికరమైన తరగతి గదిని రూపొందించడం.
పాఠ్యపథకం - నమూనాలు
1. హెర్బార్ట్ విధానం
2. బ్లూమ్స్ మూల్యాంకన విధానం
3. RCEM (Regional College of Education, Mysore) విధానం.

హెర్బర్ట్ పాఠ్యపథక నమూనా: హెర్బర్ట్ జర్మన్ తత్వవేత్త, విద్యావేత్త. హెర్బర్ట్ పాఠ్య పథక నమూనా సిద్ధాంతపరంగా Appreceptive Mass Theory of Learning పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, 'విషయాన్ని హాజరు పరచడం' అనే అంశానికి ప్రాధాన్యం ఇచ్చారు.
         హెర్బర్ట్ నమూనాపై Classical Human Organisation Theory ప్రభావం కూడా ఉండటం వల్ల విద్యార్థి పూర్వజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠ్యపథక రచన కొనసాగుతుంది. అందువల్ల సామర్థ్యాలు, అభిరుచులు, వైఖరులకు అంతగా ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపించదు.
హెర్బర్ట్ పాఠ్యపథక నమూనాలో సోపానాలు - 6.
1. సన్నాహం 2. హాజరు పరచడం 3. పోలిక లేదా సంసర్గం 4. సాధారణీకరణం 5. అన్వయం 6. పునారావృతం 
           పైన పేర్కొన్న ఆరు సోపానాలను ప్రస్తుతం ఉపాద్యాయ విద్యలో టీచింగ్ ప్రాక్టీస్‌లో పాఠ్యపథక రూపకల్పనలో 3 దశల్లో ఉపయోగిస్తున్నారు. అవి..

    హెర్బర్ట్ విధానంలో విషయ వ్యవస్థీకరణ చాలావరకు జ్ఞాపకశక్తి స్థాయిలోనే జరుగుతుంది.

హెర్బర్ట్ విధానం - ప్రయోజనాలు:
1. తార్కికమైంది, మనోవిజ్ఞానశాస్త్ర సూత్రాలకు అనుగుణమైంది.
2. అన్ని సబ్జెక్టుల బోధనకు అనుకూలంగా ఉంటుంది.
3. ఆగమన, నిగమన పద్ధతులు రెండింటినీ ఉపయోగిస్తారు.
4. జ్ఞానరంగ లక్ష్యాల సాధనకు ప్రయోజనకరంగా ఉంటుంది.
5. ఈ విధానం సరళంగా, సులభంగా ఉంటుంది.
6. విద్యార్థుల అభ్యసన పూర్వజ్ఞానం నుంచి కొత్తజ్ఞానం వైపు సాగుతుంది. అంటే తెలిసిన విషయం నుంచి తెలియని విషయం వైపు అనే అభ్యసన సూత్రానికి అనుగుణంగా ఉంటుంది.

 

హెర్బర్ట్ విధానం - పరిమితులు:
1. ఉపాధ్యాయుడి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
2. విద్యార్థుల సృజనకు, సహజసామర్థ్యాల వినియోగానికి అవకాశం లేనట్లుగా దీని నిర్మాణం ఉంటుంది.
3. మిగిలిన వాటికంటే జ్ఞానరంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
4. విషయాన్ని హాజరుపరచడం అనే అంశానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. జ్ఞాపకశక్తి స్థాయికే ఎక్కువ అంటిపెట్టుకుని ఉన్నట్లు ఉంటుంది.
5. బోధనాకృత్యాల నిర్మాణం ఉపయోగంగా, అర్థవంతంగా ఉండదు.

ఫలవంతమైన బోధనకు సహకరించే కొన్ని అంశాలు:
1. ఉన్శుఖీకరణ
2. వ్యవస్థీకరణ
3. జ్ఞానేంద్రియాలను ఉపయోగించడం
4. ప్రశ్నించడం


అభ్యసనానుభవాలను అభివృద్ధి చేసే విధానాలు
1. వైషమ్య పద్ధతి
2. గుర్తింపు పద్ధతి
1. వైషమ్య పద్ధతి: ప్రతి విద్యార్థి పూర్వజ్ఞానం ఆధారంగా వ్యక్తిగత సామర్థ్యాలననుసరించి, అభ్యసన సన్నివేశాలను రూపొందిస్తాడు.
2. గుర్తింపు పద్ధతి: ఉపాధ్యాయుడు అభ్యసన సన్నివేశాల రూపకల్పనలో తనను తాను విద్యార్థి స్థానంలో గుర్తిస్తాడు. అంటే తరగతి మొత్తానికి సగటు స్థాయిలో అభ్యసన సన్నివేశాలను కల్పిస్తాడు.

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌