• facebook
  • whatsapp
  • telegram

విజ్ఞానశాస్త్ర స్వభావం  

      విజ్ఞానశాస్త్రం సంచిత, అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహం. ఈ పరిశీలనల నుంచి భావనలు, సిద్ధాంతాలు రూపొందుతాయి. ఇలా ఏర్పడిన భావనలు, సిద్ధాంతాలు తర్వాత జరిగే అనుభవాత్మక పరిశీలనల వల్ల మార్పు చెందడానికి అవకాశం ఉంది. విజ్ఞానశాస్త్రం జ్ఞాన విభాగాన్ని, జ్ఞానాన్ని సంపాదించి పరిష్కృతం చేసే ప్రక్రియ అనే రెండింటిని కలిగి ఉంటుంది . - ఫ్రెడరిక్ ఫిట్జ్ పాట్రిక్
 

విజ్ఞానశాస్త్ర స్వభావం
సైన్స్ అనే ఇంగ్లిష్ పదానికి మూలం 'సైన్షియా' (Scientia) లేదా సిరే (Scire).
* 'SCIENTIA' అంటే జ్ఞానం (Knowledge) అని అర్థం.
* SCIENTIA అనేది లాటిన్ పదం.

 

విజ్ఞానశాస్త్రం - కొన్ని నిర్వచనాలు
* వ్యవస్థీకరించిన జ్ఞానాంశమే విజ్ఞానశాస్త్రం
* ప్రకృతి సంభవాలకు వ్యాఖ్యానం లేదా అర్థం చెప్పడమే - విజ్ఞానశాస్త్రం
* సత్యాల కుప్పే - విజ్ఞానశాస్త్రం
* ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై, సంచిత, క్రమీకరించిన అభ్యసనమే విజ్ఞానశాస్త్రం.   - కొలంబియా ఎన్‌సైక్లోపిడియా

* భౌతిక ప్రపంచాన్ని, ప్రకృతి నియమాలను, సమాజాన్ని పరిశీలించడం ద్వారా సత్యాలను పరీక్షించడం ద్వారా వచ్చిన వ్యవస్థీకరించిన జ్ఞానమే విజ్ఞానశాస్త్రం - ఆక్స్‌ఫర్డ్ అడ్వాన్స్‌డ్ లెర్నర్స్ డిక్షనరీ
* విజ్ఞానశాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వం ముడిపదార్థమే. కేవలం విశ్వం ప్రస్తుత స్వరూపమే కాదు. దాని పూర్వ చరిత్ర, అందులోని జీవ ప్రపంచం కూడా. - కార్ల్ పియర్సన్.
* వ్యవస్థీకృతమైన సాధారణ జ్ఞానమే విజ్ఞానం. దీనిలో కొన్ని సాధారణ సూత్రాల నుంచి ప్రత్యేక ప్రతిజ్ఞా వాక్యాలను నిర్మిస్తారు - కొహెన్, నాగెల్
* విజ్ఞానశాస్త్రమంటే ఒక మాపనం. మాపనం వల్ల మనకు నిర్దిష్టమైన గణనలు, ఫలితాలు లభిస్తాయి. మాపనం వల్ల ఒక విషయాన్ని స్పష్టంగా, నిర్దిష్టంగా వివరించడానికి వీలవుతుంది - అర్హీనియస్
* ప్రయోగాల పరిశీలనల నుంచి అభివృద్ధి చెంది, తదుపరి ప్రయోగాత్మక పరీక్షలు, పరిశీలనలకు ఫలితాలనిస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు కలిగిన భావనల, భావనా పథకాల శ్రేణులే విజ్ఞానశాస్త్రం  - జేమ్స్ బి.కొనాంట్
             విజ్ఞానశాస్త్రం  =  జ్ఞానం + పద్ధతులు
                          =  ప్రక్రియ + ఉత్పన్నం
                          =  శాస్త్రజ్ఞానం + శాస్త్రీయ పద్ధతి + శాస్త్రీయ వైఖరి

 

విజ్ఞానశాస్త్ర మూల భావాలు
* విజ్ఞానశాస్త్ర విషయం ప్రపంచంలో పరిశీలించదగిన దృగ్విషయాల మీద ఆధారపడి ఉంది.
* విషయాత్మక విశ్వంలో సామ్యం ఉందని విజ్ఞానశాస్త్రం భావిస్తుంది.
* తప్పక జరుగుతుందనే దృక్పథం కాకుండా జరగడానికి అవకాశముందనే దృక్పథం మాత్రమే విజ్ఞానశాస్త్రానికి ఉంది.
* విజ్ఞానశాస్త్రం సంభావ్యతను మాత్రమే తెలుపుతుంది. కానీ తథ్యాల గురించి తెలపదు.
* నేటి సత్యం గురించి చెబుతుంది తప్ప ఎల్లవేళలా ఉండే సత్యం గురించి మాట్లాడదు.


                                 

 

ద్రవ్యాత్మక నిర్మాణంలోని అంశాలు
* యథార్థం: ఒక భౌతిక వస్తువు లేదా యథార్థ సంఘటనను వివరించే ప్రవచనమే యథార్థం.
ఉదా: 1. పదార్థం స్థలాన్ని ఆక్రమిస్తుంది.
2. పాదరసం ద్రవరూపంలో ఉన్న లోహం.
3. చిక్కుడు విత్తనంలో రెండు బీజదళాలుంటాయి.
* భావన: ఏదైనా ఒక అంశానికి సంబంధించిన సాధారణ భావం లేదా అర్థాన్ని వస్తువు, సంకేతం లేదా పరిస్థితి సహాయంతో ఒక వ్యక్తిలో ఏర్పరచేదే భావన.
* జె.డి. నొవాక్ ప్రకారం ఏదైనా భౌతిక లేదా జీవశాస్త్ర ప్రపంచానికి సంబంధించిన సామాన్యీకరణాలే విజ్ఞానశాస్త్రంలో భావనలు.
ఉదా: పని, ఉష్ణోగ్రత, విద్యుత్, అయస్కాంతత్వం.
* సాధారణీకరణం: పరస్పర సంబంధం కలిగిన సత్యాల సంబంధాన్ని నియమబద్ధం చేసి వివరించేదే సాధారణీకరణం.
ఉదా: ఉష్ణం వల్ల పదార్థాలు వ్యాకోచం చెందుతాయి.
* సిద్ధాంతం: నిరూపితం కాకపోయినా బలమైన సాక్ష్యాల ఆధారంగా పరిస్థితులను వివరించడానికి ఒక ప్రతిపాదన.
ఉదా: కణసిద్ధాంతం, పరమాణు సిద్ధాంతం.
* నియమం: విస్తారంగా పరీక్షించి నిరూపితమై, నిశ్చయమైన సిద్ధాంతాలను నియమం అంటారు.
ఉదా: న్యూటన్ గమన నియమాలు.

* సూత్రం: ఒక కృత్యం లేదా తార్కికత్వానికి ఆధారమైన ఒక ప్రాథమిక సత్యాన్ని 'సూత్రం' అంటారు.
ఉదా: ఆర్కిమెడిస్ సూత్రం.

 

సంశ్లేషణాత్మక నిర్మాణంలో అంశాలు
* పరిశీలన: శాస్త్ర ప్రయోగానికి సంబంధించిన ప్రాథమిక నైపుణ్యం.
* వర్గీకరణ: భావన ఏర్పడటంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. పరిశీలన, వర్ణన, ఆలోచన మొదలైనవాటి ఆధారంగా వర్గీకరణ జరుగుతుంది.
* ప్రాగుక్తీకరించడం: సేకరించిన సమాచారం ఆధారంగా తర్వాతి పరిణామాన్ని లేదా సంఘటనను ఊహించడమే ప్రాగుక్తీకరించడం.
ఉదా: వాతావరణ పరిస్థితుల అనుకూలతను బట్టి పంటల దిగుబడి చెప్పగలగడం.
* ప్రాక్కల్పన: యథార్థాలను ఆధారం చేసుకుని సమస్య పరిష్కారానికి ఇచ్చే తాత్కాలిక ప్రతిపాదిత ఊహా సమాధానమే ప్రాక్కల్పన.
* ప్రయోగ నిర్వహణ: ప్రయోగశాలలో ప్రయోగాలు నిర్వహించడమే ప్రయోగ నిర్వహణ.
* వ్యాఖ్యానించడం: లభించిన సమాచారం నుంచి అవసరమైన విషయాలను జాగ్రత్తగా నమోదు చేసి, విభిన్న కోణాలతో వ్యాఖ్యానించడం.
* కొలవడం: సత్యాన్వేషణలో పరిశీలనకు విలువ కట్టడానికి ఇది ఒక మార్గం. ఈ మాపనం అనేది వస్తువులు లేదా ప్రక్రియల కచ్చితత్వాన్ని తెలియజేస్తుంది.

 

ప్రాక్కల్పనలో రకాలు
1. నల్ ప్రాక్కల్పన
2. ప్రకటనాత్మక ప్రాక్కల్పన
3. ప్రాగుక్తి ప్రాక్కల్పన
4. ప్రశ్న ప్రాక్కల్పన


ఉత్తమ ప్రాక్కల్పన లక్షణాలు
* పరిశీలించిన విషయాల ఆధారంగా, ఆమోదయోగ్యంగా ఉండాలి.
* నిర్ధారిత సిద్ధాంతాలకు, నియమాలకు వ్యతిరేకంగా ఉండకూడదు.
* తార్కికంగా, వాస్తవంగా ఉండాలి.
* స్పష్టత కలిగి, పునఃపరిశీలనకు వీలుగా ఉండాలి.
* ప్రాక్కల్పన వర్ణన స్పష్టంగా, సులభంగా తక్కువ పదాలతో ఉండాలి.
* దత్తాంశ సేకరణకు అనుకూలంగా ఉండాలి.

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌