• facebook
  • whatsapp
  • telegram

జంతువుల్లో ప్రత్యుత్పత్తి

 సజీవుల ముఖ్య లక్షణాల్లో ప్రత్యుత్పత్తి ఒకటి. దీనివల్ల అవి తల్లిదండ్రులను పోలి ఉండే, సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి.

* ప్రత్యుత్పత్తి : 

1) తరతరాలకు జాతిని కొనసాగించడానికి,
2) జనాభా సంఖ్యను వృద్ధి చేయడానికి సహాయపడుతుంది.
ప్రత్యుత్పత్తిలోని రకాలు, వివిధ రకాల జంతువులు, పక్షుల్లో అది జరిగే విధానాల గురించి తెలుసుకుందాం.

    గుడ్లు పెట్టే జంతువులను అండోత్పాదకాలు అంటారు.ఉదా: పక్షులు, పాములు, చేపలు, కప్పలు, కీటకాలు మొదలైనవి.
*  ప్రత్యక్షంగా పిల్లలను కని, పాలిచ్చి పెంచే జంతువులను శిశూత్పాదకాలు అంటారు. ఉదా: క్షీరదాలు.
*  బొద్దింక - 'గుడ్ల తిత్తి' అనే పెట్టెలో గుడ్లను పెడుతుంది.
*  గొల్లభామ - గుడ్లను 'కాయ' లాగ మారుస్తుంది.
*  దోమ - 300 గుడ్లను పడవ ఆకారంలో 'బల్లకట్టు' గా పెడుతుంది.
*  గొంగళిపురుగు ప్రౌఢ సీతాకోకచిలుకగా  'రూప విక్రియ' చెందుతుంది.
* రూపవిక్రియ అంటే 'తల్లిదండ్రులకు భిన్నంగా ఉండే లార్వా.. తల్లిదండ్రులను పోలి ఉండే రూపాన్ని' పొందడం.
* దోమ లార్వాను 'రిగ్లర్', ఈగ లార్వాను 'మెగ్గాట్ అంటారు.
*  చేపలు సామాన్యంగా 'అండోత్పాదకాలు', కానీ షార్క్ చేపలు - శిశోత్పాదకాలు (ప్రత్యక్షంగా పిల్లల్ని కంటాయి).
*  కప్పలు అండోత్పాదకాలు. వాటి గుడ్లు లార్వాలుగా మారతాయి.
*  కప్ప లార్వాను 'టాడ్‌పోల్' అంటారు. ఇది చిన్న చేపలా కనిపిస్తుంది.

*  రూపవిక్రియ ప్రక్రియ ద్వారా కప్ప లార్వా - చిరుకప్పగా మారుతుంది (థైరాక్సిన్).
*  సరీసృపాలైన పాములు, మొసళ్లు, తొండలు, బల్లులు - అండోత్పాదకాలు.
*  పాములన్నీ అండోత్పాదకాలు, కానీ రక్తపింజర పాములు - శిశూత్పాదకాలు.
*  పక్షులు అండోత్పాదకాలు. అవి తగినంత వేడిమి ఇవ్వడానికి గుడ్లపై కూర్చోవడాన్నే 'పొదగడం' అంటారు.
*  కోడి 21 రోజుల్లో గుడ్లను పొదుగుతుంది.
*  అతిపెద్ద గుడ్డు పెట్టేది - ఆస్ట్రిచ్
*  అతి చిన్న గుడ్డు పెట్టేది- హమ్మింగ్ బర్డ్.

 

క్షీరదాలు: పిల్లలను కని, పాలిచ్చి పెంచే జంతువులను క్షీరదాలు అంటారు.
ఉదా: ఆవు, పిల్లి, కుక్క, గేదె, గుర్రం, పులి, సింహం, ఏనుగు, కోతి, మానవుడు.
* తల్లి గర్భంలో పిల్లజీవి అభివృద్ధి చెందే కాలాన్ని 'గర్భావధి కాలం అంటారు.

జంతువు

గర్భావధి కాలం

అపోసమ్

14 రోజులు

ఎలుక

15 నుంచి 20 రోజులు

పిల్లి, కుక్క

60 రోజులు

మేక

149 రోజులు

ఆవు

280 రోజులు

గుర్రం

336 రోజులు

మానవుడు

270 నుంచి 280 రోజులు

ఏనుగు

600 రోజులు (లేదా) 20 నెలలు

*  ఎకిడ్నాను స్పైనీ యాంట్ ఈటర్ అంటారు.
*  ఇవి క్షీరదాలు అయినప్పటికీ ఒకటి లేదా రెండు గుడ్లను స్త్రీ జీవి పొట్ట ముందున్న సంచిలో పెట్టి, వాటిని పొదుగుతాయి.
* డక్‌బిల్ ప్లాటిపస్‌లు నదుల ఒడ్డున ఉన్న బొరియల్లో 2 గుడ్లు పెడతాయి.
*  ఎకిడ్నా, డక్‌బిల్ ప్లాటిసస్, కంగారులు - ఆస్ట్రేలియా, టాస్మేనియాల్లో నివసిస్తాయి.
*  కంగారు పూర్తిగా ఎదగని పిల్లలని కని, వాటిని స్త్రీ పొట్టమీద ఉండే సంచిలో పెంచుతుంది.

అలైంగిక ప్రత్యుత్పత్తి

బీజకణాల కలయిక లేకుండానే కొత్త జీవి ఏర్పడే ప్రత్యుత్పత్తిని 'అలైంగిక ప్రత్యుత్పత్తి' అంటారు. అలైంగిక ప్రత్యుత్పత్తి కింది రకాలుగా జరుగుతుంది.

ద్విధావిచ్ఛిత్తి: ఒక జీవి రెండు పిల్లజీవులుగా విభజన చెందడాన్ని 'ద్విధావిచ్ఛిత్తి' అంటారు.
* పేరమీషియంలో విభజన కణానికి మధ్యగా, అడ్డంగా జరుగుతుంది.
*  పేరమీషియంలోని జీవపదార్థం, స్థూల కేంద్రం, సూక్ష్మ కేంద్రకాలు అనే రెండు భాగాలుగా విభజన చెందుతుంది.
*  పేరమీషియంలో ద్విధావిచ్ఛిత్తి సుమారు రెండు గంటల్లో పూర్తవుతుంది (1 రోజులో 1-4 సార్లు).కోరకాల ద్వారా ప్రత్యుత్పత్తి
కోరకాల ద్వారా ప్రత్యుత్పత్తి
*  హైడ్రా మంచినీటిలో జీవించే బహుకణజీవి. ఇది కోరకాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది.
*  హైడ్రా శరీర కుడ్యం నుంచి బయటకు ఏర్పరిచే చిన్న చిన్న బొడిపెల లాంటి నిర్మాణాలను 'కోరకాలు' అంటారు.
*  హైడ్రా ఒకవైపు ఆధారం ద్వారా మొక్కలను అంటి పెట్టుకుని, రెండో చివర దారాల్లా ఉండే స్పర్శకాలను ఏర్పరచుకుంటుంది.
*  బొడిపె-స్పర్శకాలను ఏర్పరచుకుని, పరిమాణంలో పెద్దదై, తల్లి నుంచి వేరై, స్వతంత్ర జీవనం గడుపుతుంది.

పునరుత్పత్తి
*
  కోల్పోయిన లేదా తెగిన శరీర భాగాలను తిరిగి ఏర్పరచుకోవడాన్ని 'పునరుత్పత్తి' అంటారు.
*  వానపాములో పునరుత్పత్తి తల ఉండే భాగానికే పరిమితం, అంటే తోక భాగం పునరుత్పత్తిని చూపలేదు.
*  పునరుత్పత్తి శక్తి ఎక్కువగా కలిగి ఉండే జంతువులకు ఉదాహరణ - స్పంజికలు, హైడ్రా, సముద్ర నక్షత్రం.
*  జీవులు తమ శరీరం నుంచి ప్రత్యక్షంగా పిల్ల జీవులను ఉత్పత్తి చేయడాన్ని 'అలైంగిక ప్రత్యుత్పత్తి' అంటారు.

లైంగిక ప్రత్యుత్పత్తి

    పురుష, స్త్రీ బీజ కణాల (లేదా) సంయోగ బీజాల కలయిక ద్వారా కొత్త జీవులు ఏర్పడే ప్రత్యుత్పత్తిని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు.
పురుష ప్రత్యుత్పత్తి అవయవాలను 'ముష్కాలు' అని, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలను 'స్త్రీ బీజకోశాలు' అని అంటారు.
* పురుష బీజకణాలను శుక్రకణాలు అని, స్త్రీ బీజకణాలను అండాలు అని అంటారు.
శుక్రకణానికి తల, తోక ఉంటుంది. ఈ రెండింటిని కలుపుతూ నడిమి తునక ఉంటుంది.

శుక్రకణాలు

 అండాలు

ఇవి ముష్కాలలో ఉత్పత్తి అవుతాయి.

ఇవి స్త్రీ బీజ కోశాల్లో ఉత్పత్తి అవుతాయి.

ఇవి అతి సూక్ష్మంగా ఉంటాయి.

ఇవి శుక్ర కణాల కంటే పెద్దవిగా ఉంటాయి.

ఇవి చలిస్తాయి.

ఇవి కదలకుండా స్థిరంగా ఉంటాయి.

ఇవి ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి.

అండాలు తక్కువ సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి.

* ఫలదీకరణం: స్త్రీ, పురుష సంయోగ బీజ కణాల కలయికను ఫలదీకరణం అంటారు.

*  అంతర ఫలదీకరణం: స్త్రీ జీవి శరీరం లోపల జరిగే ఫలదీకరణం.
ఉదా: సరీసృపాలు, పక్షులు, కీటకాలు, క్షీరదాలు.
 బాహ్య ఫలదీకరణం: స్త్రీ జీవి శరీరం బయట జరిగే ఫలదీకరణం.
ఉదా: చేపలు, ఉభయచర జీవులు, వానపాము.
 ఫలదీకరణం చెందిన అండం ఒక కొత్త జీవిగా అభివృద్ధి చెందుతుంది.

 

కీటకాల్లో లైంగిక ప్రత్యుత్పత్తి (బొద్దింక):

 బొద్దింకలో లింగభేదం ఉంటుంది. 1) మగ బొద్దింక ఉదరం ఇరుకుగా ఉంటుంది. 2) స్త్రీ బొద్దింక ఉదరం వెడల్పుగా ఉంటుంది.

*  బొద్దింకల్లో ఫలదీకరణం - జనన కోశంలో జరుగుతుంది (అంతర ఫలదీకరణం).

* బొద్దింక గుడ్లు గుడ్లకోశంలో ఉంటాయి. (వరుసకు 8 చొప్పున రెండు వరుసల్లో 16 ఉంటాయి.)

*  గుడ్లకోశం నుంచి బయటకు వచ్చే రంగు, రెక్కలులేని పిల్ల బొద్దింకలను 'సరూప శాబకాలు' అంటారు.

పక్షుల్లో ప్రత్యుత్పత్తి:

 పక్షులు ఏకలింగ జీవులు, అండోత్పాదకాలు.
 మగపక్షిలో ఒక జత ముష్కాలు, ఒక జత శుక్రవాహికలు, అవస్కరం, అవస్కర రంధ్రం ఉంటాయి.
ఆడపక్షిలో ఒకే స్త్రీ బీజకోశం, ఒకే స్త్రీ బీజవాహిక శరీర కుహరంలో ఎడమవైపు ఉంటాయి.
 పక్షుల్లో అంతర ఫలదీకరణం స్త్రీ బీజవాహికలో జరుగుతుంది.

 

క్షీరదాల్లో ప్రత్యుత్పత్తి (మానవుడు):
క్షీరదాల్లో లింగభేదం ఉండి, అంతర ఫలదీకరణం జరుగుతుంది.

 

పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ:
 పురుష జీవిలో 2 ముష్కాలుంటాయి. ఇవి ముష్కగోణుల్లో అమరి ఉంటాయి.
 ముష్కాలు శుక్రకణాలను, టెస్టోస్టిరాన్ అనే పురుష లైంగిక హార్మోన్‌ను విడుదల చేస్తాయి.
*  ముష్కంలో ముడతలుపడి ఉన్న శుక్రనాళికను 'ఎపిడిడిమస్' అంటారు.
*   ఏకస్థితిక పురుషబీజ కణాలైన శుక్రకణాలు, ఎపిడిడిమస్‌లో తాత్కాలికంగా నిల్వ ఉంటాయి.

 శుక్రకణాలు ఎపిడిడిమస్ నుంచి శుక్రవాహిక, శుక్రాశయాల మీదుగా ప్రయాణించి ప్రసేకం ద్వారా శరీరం నుంచి బయటకు విడుదలవుతాయి.

*  శుక్రకణం తల భాగంలో ఏకస్థితిక క్రోమోజోమ్‌లు ఉన్న పెద్ద కేంద్రకం ఉంటుంది. తలపైన ఉన్న కోశం లాంటి నిర్మాణమైన 'ఏక్రోసోమ్' ఫలదీకరణలో తోడ్పడుతుంది.

 శుక్రకణాలు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో 24 నుంచి 72 గంటల వరకు సజీవంగా ఉంటాయి.
పురుషుల్లో యుక్తవయసు రాగానే (జన్మించిన తర్వాత 14 నుంచి 15 ఏళ్ల వయసులో) శుక్రకణాల ఉత్పత్తి ప్రారంభమవుతుంది.

 

స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ:
*  స్త్రీ జీవిలో రెండు స్త్రీ బీజకోశాలు, స్త్రీ బీజవాహికా సురంగం, ఫాలోపియన్ నాళాలు, గర్భాశయం, యోని అనే భాగాలు ఉంటాయి.
* క్షీరదాల్లో స్త్రీ జీవిలో ఫాలోపియన్ నాళాల్లో ఫలదీకరణం జరుగుతుంది.
స్త్రీ బీజకోశాల్లోని గ్రాఫియన్ పుటికల నుంచి అండాలు శరీర కుహరంలోకి విడుదలవుతాయి. ఈ ప్రక్రియను అండోత్సర్గం అంటారు.
*   పగిలిన గ్రాఫియన్ పుటికను కార్పస్‌లూటియం అంటారు. ఇది ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ లను ఉత్పత్తి చేస్తుంది.
*   స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కలిగే మార్పుల చక్రాన్ని 'రుతుచక్రం' అంటారు. రుతుచక్రం 28 నుంచి 30 రోజులకు ఒకసారి జరుగుతుంది.

 అండం విడుదలైన 24 గంటలు సజీవంగా ఉంటుంది.

*   స్త్రీలలో రుతుచక్రం 13 లేదా 14 ఏళ్ల నుంచి ప్రారంభమై 50 లేదా 55 ఏళ్ల వరకు కొనసాగుతుంది.

 పిండం గర్భాశయ కుడ్యానికి అంటిపెట్టుకునే ప్రక్రియను 'పిండ ప్రతిస్థాపన' అంటారు.
 గర్భధారణ జరిగిన మూడో నెల నుంచి పిండాన్ని 'భ్రూణం' అంటారు.
*   పిండానికి, తల్లి గర్భాశయానికి మధ్య ప్రసరణ సంబంధమైన లింకు ఏర్పడుతుంది. దీన్నే 'జరాయువు' అంటారు (12వ వారంలో ఏర్పడుతుంది).
 జరాయువు ద్వారా పిండానికి తల్లి నుంచి ఆహారం లభిస్తుంది.
1978 బాల్యవివాహాల అదుపు చట్టం ప్రకారం వివాహ వయసు స్త్రీలకు 18 ఏళ్లుగా, పురుషులకు 21 ఏళ్లుగా నిర్థారించారు.
*   రక్త సంబంధీకుల మధ్య జరిగే వివాహాలను 'మేనరికం' అంటారు. ఈ వివాహాల వల్ల 'మార్పు చెందిన జన్యువు' (డిఫెక్టివ్ జీన్) భార్యాభర్తలిద్దరిలోనూ ఉన్నట్లయితే వాటి కలయిక వల్ల వారికి పుట్టే బిడ్డల్లో శారీరక అంగవైకల్యం కలుగుతుంది.

రచయిత : పి.బాబా ఫక్రుద్దీన్

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌