• facebook
  • whatsapp
  • telegram

ప్రథమ చికిత్సలు

ప్రమాదాలు చెప్పిరావు. అవి వచ్చినప్పుడు కంగారు పడకుండా వెంటనే చేపట్టే నివారణ/తాత్కాలిక ఉపశమన చర్యే ప్రథమ చికిత్స. ప్రమాదాలు, కాలిన గాయాలు, విరిగిన ఎముకలు, పక్షవాతం, గుండెపోటు, కుక్కకాటు, పాము కాటు, వడదెబ్బ... ఇలా ప్రతీ ఒక్కదానికి ఎలాంటి ప్రథమ చికిత్స చేయాలో తెలుసుకుందాం.

* ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వైద్యుడి వద్దకు వెళ్లెలోపు రోగికి చేసే చికిత్సను ప్రథమ చికిత్స అంటారు.
* ఇస్‌మార్క్ అనే జర్మన్ విదేశీయుడు ప్రథమ చికిత్సకు ఆద్యుడు. 1879లో St.జాన్స్ అంబులెన్స్ సర్వీస్ వల్ల ఇది ప్రజాదరణ పొందింది.
* రోగికి తక్షణ ధైర్యం అందించడం ప్రథమ చికిత్సలో భాగం.

 

ప్రథమ చికిత్స చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు:
1) చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. వీలైతే గ్లోవ్స్ ధరించాలి.
2) డెట్టాల్ లాంటి యాంటీసెప్టిక్ లోషన్‌ను నేరుగా వాడకూడదు. కొన్ని చుక్కలు నీళ్లలో కలిపి, దూదితో గాయాలను శుభ్రం చేయాలి.
3) కమిలిన గాయాలపై పాలిథిన్ కవర్‌లో చుట్టిన ఐస్‌తో కాపడం పెట్టాలి.
* ప్రమాదం జరిగిన మొదటి గంటను 'Golden Hour' అంటారు. బాధితుడికి మొదటి గంటలో సరైన చికిత్స అందించడం ద్వారా అతడిని ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు.

* ప్రథమచికిత్సకు సంబంధించి మూడు ప్రాణ రక్షణ సూచనలు పాటించాలి.

మొదటి ప్రాణ రక్షణ సూత్రం:
* రోగిని వెళ్లకిలా పడుకోబెట్టాలి. దుస్తులను వదులుచేసి, గాలి పీల్చేమార్గంలో అడ్డంకులు ఉంటే తొలగించాలి. పరిస్థితిని బట్టి తలను పక్కకు వంచాలి.

 

రెండో ప్రాణ రక్షణ సూత్రం:
* ఊపిరి ఆడుతోందా లేదా పరిశీలించాలి. విషం, యాసిడ్ వాంతులు సందర్భాల్లో మినహా మిగిలిన సందర్భాల్లో నోటితో కృత్రిమ శ్వాస అందించాలి.

 

మూడో ప్రాణ రక్షణ సూత్రం:
* గుండె కొట్టుకోవడాన్ని పరిశీలించాలి. స్పందన లేకపోతే ఛాతీపై అరచేతులు ఒకదానిపై ఒకటి ఉంచి అణిగేలా నొక్కాలి.

బెణికిన గాయాలు:
     1) బెణికిన గాయంపై ఆయింట్‌మెంట్‌తో గట్టిగా రుద్దకూడదు.
     2) దళసరి వస్త్రం, పాలిథీన్ కవర్‌లో ఐస్ ఉంచి కాపడం పెట్టాలి.
     3) క్రేప్ బ్యాండేజ్‌తో కట్టుకట్టాలి.
     4) గాయం అయిన ప్రాంతాన్ని ఎత్తుగా పెట్టి విశ్రాంతి తీసుకోవాలి.

కాలిన గాయాలు:

     1) కాలిన ప్రాంతాన్ని చల్లని నీటిలో 15-20 నిమిషాలు ఉంచాలి.
     2) అరచేయి మందంలోపు గాయం అయితేనే గాయంపై ఆయింట్‌మెంట్ రాయాలి.
     3) కాలిన బొబ్బలను చిదమకూడదు. బ్యాండేజ్‌తో కట్టు కట్టకూడదు. ఐస్ కూడా పెట్టకూడదు.
     4) మంటలు అంటుకున్నప్పుడు పరిగెత్తకూడదు. SDR నియమం పాటించాలి.
          S - Stop (ఆగడం)
          D - Drop (కింద పడిపోవడం)
          R - Roll (అటూ ఇటూ దొర్లడం)

 

పాయిజన్ (విషం) తీసుకోవడం:
1) పాయిజన్ తీసుకున్న వ్యక్తి సాధ్యమైనంత వరకు విషతీవ్రత తగ్గించడానికి ఎక్కువ నీటిని ఇస్తూ ఆస్పత్రికి తీసుకెళ్లాలి.
2) వాంతి చేయించకూడదు
3) స్పృహ తప్పిపోనివ్వరాదు

 

స్పృహ తప్పడం:
     1) పక్కకు పడుకోబెట్టి గడ్డాన్ని ఎత్తిపెట్టి ఆస్పత్రికి తీసుకెళ్లాలి.
     2) వెళ్లకిలా పడుకోబెట్టరాదు. దానివల్ల నాలుక గొంతుకు అడ్డుపడి శ్వాస ఆగిపోయే అవకాశాలున్నాయి.

ఎముకలు విరగడం:
     1) ఎముక విరిగిన ప్రాంతాన్ని కదలనివ్వకుండా ఆస్పత్రికి తీసుకెళ్లాలి.

 

పక్షవాతం:
1) బీపీ (రక్తపోటు) అధికంగా ఉన్నవారు ఒళ్లు తిరుగుతుందనీ, తిమ్మిరిగా ఉందని చెబితే ఆ వ్యక్తిని నవ్వమని అడగాలి.
2) నవ్వేటప్పుడు మూతి వంకరగా ఉన్నా, సరిగ్గా మాట్లాడలేకపోయినా చేతులు ఎత్తలేకపోయినా పక్షవాత చిహ్నంగా భావించాలి.
3) వెంటనే (గోల్డెన్ అవర్) ఆస్పత్రికి తీసుకెళ్లాలి.

 

కుక్కకాటు:
     1) కుక్క, కోతి, పిల్లి, ఎలుక కరిచిన ప్రాంతాన్ని సబ్బునీటితో కడగాలి.
     2) బ్యాండేజ్ కట్టుకట్టడం, కుట్లు వేయడం చేయరాదు.
     3) వైద్యుడిని సంప్రదించాలి.

 

వడదెబ్బ:
     1) విపరీతమైన జ్వరం, ఒళ్లుతిరగడం, వాంతి అయ్యేసూచన, తలనొప్పి వడదెబ్బ సూచనలు.
     2) ఇలాంటప్పుడు నీరు తాగించే ప్రయత్నం చేయకూడదు.
     3) వ్యక్తి శరీరాన్ని చల్లటి నీటిలో ముంచిన వస్త్రంతో తుడవాలి.
     4) ORS ద్రావణం లేదా ఎలక్ట్రోల్ కలిపిన నీరు ఇవ్వాలి.

కంటిలో రసాయనాలు:
     1) రసాయనాలు పడిన కంటిని ప్రవహించే చల్లని నీటి కింద కనీసం 15-20 నిమిషాలుంచాలి.
     2) తీవ్రమైన మంట వల్ల కళ్లు నులిమే ప్రయత్నం చేయరాదు.

 

కళ్లు తిరిగి పడిపోవడం:
     1) కళ్లుతిరిగి పడిపోయిన వ్యక్తి కాళ్లను ఎత్తుగా పెట్టి తలను పక్కకు పెట్టి ఉంచాలి.
     2) దీనివల్ల మెదడుకు రక్తస్రావం జరిగి తిరిగి కోలుకుంటారు.

 

గొంతులో ఏదైనా అడ్డుపడటం:
     1) నోటిలో చేతులు పెట్టి లాగే ప్రయత్నం చేయకూడదు.
     2) ముందుకు వంగించి, వీపుపై 4, 5 సార్లు చరచాలి, చరిచినప్పుడు దగ్గమని చెప్పాలి.
     3) వెంటనే గోల్డెన్ అవర్ (మొదటి గంట) లోపు ఆస్పత్రికి తీసుకెళ్లాలి.

 

రక్తస్రావం:
     1) రక్తస్రావం అయిన ప్రాంతాన్ని గట్టిగా అదిమిపెట్టి గుండె కంటే ఎత్తయిన భాగంలో ఉంచాలి.
     2) వెంటనే గోల్డెన్ అవర్ (మొదటి గంట) లోపు ఆస్పత్రికి తీసుకెళ్లాలి.

 

ముక్కులోంచి రక్తస్రావం:
1) ముక్కులో నుంచి రక్తస్రావం వస్తే తలను వెనక్కి పెట్టకూడదు ముందుకు వంచి 10 నిమిషాల దాకా మెత్తటి వస్త్రంతో ముక్కు భాగాన్ని వత్తాలి.

2) బీపీ ఉన్నవారికి 5-10 చుక్కలు వచ్చి ఆగిపోతుంది. వారికి సేఫ్టీవాల్వ్‌గా పనిచేస్తుంది. కాబట్టి వారికి ఆపే ప్రయత్నం చేయరాదు.
 

కరెంట్ షాక్:
     1) స్విచ్‌లు ఆపాలి, ప్లగ్‌లు తొలగించాలి
     2) షాక్ తగిలిన వ్యక్తి గడ్డాన్ని పైకెత్తాలి
     3) శ్వాస తీసుకోలేకపోతే కృత్రిమ శ్వాస కల్పించాలి
     4) షాక్ వల్ల కార్డియాక్ అరెస్ట్ జరిగితే గుండె తిరిగి కొట్టుకునేలా ప్రయత్నాలు చేయాలి.

 

పాముకాటు:
1) పాముకాటుకు గురైన వ్యక్తి మరణించడానికి 90% కారణం భయం. కాబట్టి వారికి ధైర్యం చెప్పి ఆస్పత్రికి తీసుకెళ్లాలి.
2) ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం పాము, తేలు కుట్టినప్పుడు తాడు కట్టడం, రక్తం పీల్చడం లాంటివి చేయరాదు.
3) శుభ్రపరచని బ్లేడు, చాకులు లాంటివి ఉపయోగించి గాటు పెట్టడం ద్వారా ధనుర్వాతం రావచ్చు.

 

గుండెపోటు:
1) ఛాతీ ప్రాంతంలో తీవ్రంగా పొడిచినట్లు ఉండి నొప్పి ఉండటంతో పాటు శరీరంలో ఇంకెక్కడైనా నొప్పిగా ఉంటే తప్పనిసరిగా గుండెపోటుగా భావించాలి.
2) ఆగకుండా చెమటలు, కడుపులో వికారంతో కూడిన ఛాతీ నొప్పిని గుండెపోటుగా భావించాలి.

3) అలాంటప్పుడు వ్యక్తిని పడుకోబెట్టకూడదు, నిల్చోబెట్టకూడదు, నడిపించకూడదు.

4) కూర్చోబెట్టి దగ్గమని చెబుతూ ఆస్పత్రికి తరలించాలి.
 

గుండె ఆగడం:
     1) తీవ్రమైన గుండెపోటు, కరెంట్‌షాక్‌ల వల్ల గుండె ఆగిపోయే అవకాశముంటుంది.
     2) అప్పుడు CPR ప్రక్రియ ద్వారా గుండె తిరిగి పనిచేసేలా చేయాలి.
          C - Cardio (గుండె)
          P - Pulmonary(ఊపిరితిత్తులు)
          R - Resuscitation & Restart (తిరిగి స్టార్ట్ చేయడం)
CPR ప్రక్రియ:
1) ఛాతీ మధ్య ఎముక అంతమైన చోట నుంచి 2-3 అంగుళాల పైన అరచేతితో అదిమిపెట్టి, చేయి నిటారుగా ఉంచి మధ్య ఎముకపై 30 సార్లు ఒత్తిడి కలిగించాలి.
2) నోటి నుంచి నోటి ద్వారా రెండు కృత్రిమ శ్వాసలను ఊపిరితిత్తుల్లోకి పంపించాలి.
3) ఇలా నిమిషానికి 30 సార్లు (30 : 2 × 30) చేయాలి.
4) ఇలా 3 సార్లు (3 నిమిషాలు) చేయాలి. ఈ ప్రక్రియ గుండె కొట్టుకోవడం మొదలయ్యే వరకు కొనసాగించాలి.
5) కృత్రిమ శ్వాస కల్పించేటప్పుడు ముక్కు రంధ్రాన్ని మూసి గడ్డాన్ని పైకెత్తడం మరిచిపోవద్దు.


రచయిత: కె. నాగేంద్ర

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌