• facebook
  • whatsapp
  • telegram

నక్షత్రాలు - సౌర కుటుంబం 

* అనేక వేల కోట్ల నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ అంటారు. సూర్యుడు అనే నక్షత్రం పాలపుంత లేదా ఆకాశగంగ అనే గెలాక్సీకి చెందింది.
* వేలకోట్ల గెలాక్సీలను కలిపి విశ్వం అంటారు.
* విశ్వం గురించి అధ్యయనం చేసే శాస్త్ర విభాగాన్ని కాస్మాలజీ అంటారు.
* భూమిపై నిట్టనిలువుగా ఉన్న వస్తువుకు ఏర్పడే నీడల్లో అతి తక్కువ పొడవు ఉన్న నీడ ఉత్తర, దక్షిణ దిశల్లో ఏర్పడుతుంది.
* ప్రాంతీయ మధ్యాహ్న వేళలోనే వస్తువుకు అతి తక్కువ పొడవు ఉన్న నీడ ఏర్పడుతుంది.
* ప్రాంతీయ మధ్యాహ్న వేళనే లోకల్ నూన్ టైం అంటారు.
* సూర్యోదయం రోజురోజుకు దక్షిణ దిక్కుగా కదులుతున్నట్లు అనిపిస్తే దాన్ని దక్షిణాయనం అంటారు. రోజు రోజుకు ఉత్తర దిక్కుకు కదులుతున్నట్లు అనిపిస్తే దాన్ని ఉత్తరాయణం అటారు.
* ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరంలోని సత్యనారాయణస్వామి ఆలయ ప్రాంగణంలో నీటి గడియారం ఉంది.
* చంద్రుడి ఆకారం ప్రతిరోజు మారుతూ ఉంటుంది. ఈ మార్పులను చంద్ర కళలు అంటారు.

* ఒక ప్రదేశంలో కనిపించిన చంద్రుడు మళ్లీ అదే ప్రదేశంలో కనిపించడానికి ఒకరోజు కంటే దాదాపు 50 నిమిషాల ఎక్కువ సమయం పడుతుంది. ఇదే చంద్రకళలు ఏర్పడటానికి కారణం.
* అమావాస్య రోజున సూర్యుడు, చంద్రుడు భూమికి ఒకేవైపు ఉంటారు.
* పౌర్ణమి రోజున సూర్యుడు, చంద్రుడు భూమికి చెరోవైపు ఉంటారు.
* 1969లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై కాలుపెట్టాడు.
* చంద్రుడి ఉపరితలం దుమ్మూ-ధూళితో ఎలాంటి జీవం లేకుండా ఉంది. అక్కడ అనేక లోయలు, పర్వతాలు ఉన్నాయి.
* 2008, అక్టోబరు 22న భారతదేశం చంద్రుడి గురించి పరిశోధనలకు చంద్రయాన్-I ను ప్రయోగించింది.

 

చంద్రయాన్ ముఖ్య విధులు:
     i) చంద్రుడిపై నీటి జాడ వెదకడం
     ii) చంద్రుడిపై పదార్థ మూలకాలను తెలుసుకోవడం
     iii) హీలియం-3ని వెదకడం
     iv) చంద్రుడి త్రిమితీయ (3D) అట్లాస్‌ను తయారు చేయడం
     v) సౌర వ్యవస్థ ఆవిర్భావానికి ఆధారాలు వెదకడం.

 

సూర్యగ్రహణం
* చంద్రుడి నీడ భూమిపై పడటం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది.
* ఇది అమావాస్య రోజున ఏర్పడుతుంది.
* సూర్యగ్రహణం నాలుగు రకాలు
   1. సంపూర్ణ సూర్యగ్రహణం
   2. పాక్షిక సూర్యగ్రహణం
   3. వలయాకార సూర్యగ్రహణం
   4. మిశ్రమ సూర్య గ్రహణం: వలయాకార గ్రహణం సంపూర్ణ గ్రహణంగా మారడం. ఇది అరుదుగా సంభవిస్తుంది.

 

చంద్రగ్రహణం:
* భూమి నీడ చంద్రుడిపై పడినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
* ఇది పౌర్ణమి రోజున సంభవిస్తుంది.
ఇది మూడు రకాలు:
    1. సంపూర్ణ చంద్రగ్రహణం
    2. పాక్షిక చంద్రగ్రహణం
    3. ప్రచ్ఛాయ/ ఉపచ్ఛాయ చంద్రగ్రహణం

* భూమి నీడ అంచుల్లో ఉండే పలుచని నీడ ప్రాంతం చంద్రుడిపై పడటం వల్ల ప్రచ్ఛాయ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
* సంపూర్ణ సూర్యగ్రహణం 1980, ఫిబ్రవరి 16న ఏర్పడింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో కొన్ని ప్రదేశాల్లో కనిపించింది.
* భూమి స్థానంతో పోలిస్తే స్థానభ్రంశం చెందకుండా స్థిరంగా ఉండే నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రం అంటారు.
* ధ్రువ నక్షత్రాన్ని ఆంగ్లంలో పోలారిస్ అంటారు. ఇది భూమి ఉత్తర ధ్రువానికి ఎదురుగా ఉంది.
* ధ్రువ నక్షత్రాన్ని సప్తర్షి మండలం సహాయంతో తెలుసుకోవచ్చు. ఈ సప్తర్షి మండలం (Great Bear) నాగలి లేదా గాలిపటం ఆకారంలో ఉంటుంది.
* సప్తర్షి మండలం చలికాలంలో సూర్యోదయానికి కొద్ది గంటల ముందు ఆకాశంలో ఉదయిస్తుంది. (ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాల నుంచి చూడొచ్చు)
* శర్మిష్ట రాశిలో ఆరు నక్షత్రాలు ఉంటాయి. ఇది 'm' ఆకారంలో ఉంటుంది.
* ధ్రువ నక్షత్రం చుట్టూ మిగిలిన నక్షత్రాలన్నీ ఒక చుట్టు తిరిగిరావడానికి 24 గంటల సమయం పడుతుంది.
* ధ్రువ నక్షత్రం భూభ్రమణాక్షంపై ఉంది కాబట్టి స్థిరంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

 

సౌర కుటుంబం:
       సూర్యుడు, దాని చుట్టూ తిరిగే అంతరిక్ష వస్తువులను అన్నింటినీ కలిపి సౌర కుటుంబం అని అంటారు.
దీనిలో గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు, ఆస్టరాయిడ్‌లు లాంటివి ఉంటాయి.

 

సూర్యుడు:
* మనకు దగ్గరలో ఉండే నక్షత్రం సూర్యుడు. ఇది అత్యంత ఉష్ణం, కాంతిని నిరంతరం వెదజల్లుతుంది.
* భూమిపై ఉన్న వివిధ గ్రహాలపై ఉన్న శక్తిరూపాలకు సూర్యుడు ప్రధాన వనరు.

 

గ్రహాలు:
* ఇవి నక్షత్రాల్లా కనిపిస్తాయి. కానీ వీటికి స్వయం ప్రకాశక శక్తి ఉండదు.
* ఇవి తమపై పడిన కాంతిని పరావర్తనం చేస్తాయి.
* ప్రతి గ్రహం సూర్యుడి చుట్టూ ప్రత్యేక మార్గంలో పరిభ్రమిస్తుంది. దీన్ని కక్ష్య అంటారు.
* ఒక గ్రహం సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టేకాలం పరిభ్రమణ కాలం అంటారు.
* సూర్యుడు నుంచి గ్రహాలకు ఉండే దూరం పెరుగుతున్న కొద్ది వాటి పరిభ్రమణ కాలం పెరుగుతుంది.
* గ్రహాలు తమ చుట్టూ తాము తిరగడాన్ని 'భ్రమణ కాలం' అంటారు.
* ఏ అంతరిక్ష వస్తువైనా మరొకదాని చుట్టూ తిరుగుతూ ఉంటే దాన్ని ఉపగ్రహం అంటారు.
* చంద్రుడు భూమికి ఉపగ్రహం. మానవ నిర్మిత ఉపగ్రహాలను 'కృత్రిమ ఉపగ్రహాలు' అంటారు.

 

బుధుడు:
* సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం, 'అతిచిన్న గ్రహం'.
* దీనికి ఉపగ్రహాలు లేవు.
* దీని పరిభ్రమణ కాలం 88 రోజులు.

 

శుక్రుడు:
* భూమికి దగ్గరగా ఉన్న గ్రహం, ఆకాశంలో కనిపించే గ్రహాల్లో ప్రకాశమంతమైంది.
* దీన్ని వేగుచుక్క, సాయంకాల చుక్క అని పిలుస్తారు.
* ఇది అపసవ్యదిశ (తూర్పు నుంచి పడమరకు)లో తిరుగుతుంది.
* దీనికి ఉపగ్రహాలు లేవు.
* దీని పరిభ్రమణ కాలం 225 రోజులు.

 

భూమి:
* సౌరకుటుంబంలోని గ్రహాలన్నింటిలోకి జీవరాశిని కలిగి ఉన్న గ్రహం.
* అంతరిక్షం నుంచి చూసినప్పుడు నీలి - ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. దీనికి కారణం నేల, చెట్లు, నీటి వల్ల కాంతి వక్రీభవనం.
* దీనికి ఉన్న ఏకైక ఉపగ్రహం - చంద్రుడు.
* దీని పరిభ్రమణ కాలం 365 రోజులు.

 

కుజుడు/ అంగారకుడు:
* భూకక్ష్యకు బయటి వైపు ఉన్న మొదటి గ్రహం.
* కొద్దిగా ఎరుపు రంగులో ఉండటం వల్ల దీనిని అరుణ గ్రహం అని పిలుస్తారు.
* దీనికి ఉండే ఉపగ్రహాల సంఖ్య: 2
* దీని పరిభ్రమణ కాలం: 687 రోజులు

 

గురుడు/ బృహస్పతి:
* సౌర కుటుంబంలోకెల్లా అతిపెద్ద గ్రహం.
* భూమి కంటే 1300 రెట్లు పెద్దది. దీని ద్రవ్యరాశి భూ ద్రవ్యరాశికి 318 రెట్లు ఎక్కువ.
* ఇది తనచుట్టూ తాను అతివేగంగా తిరుగుతుంది.
* దీనికి ఉన్న ఉపగ్రహాలు సంఖ్య: 50
* దీని పరిభ్రమణ కాలం: 12 సంవత్సరాలు; అతిపెద్ద ఉపగ్రహం: గనిమెడ

 

శని:
* ఇది పసుపు వర్ణంలో కనిపిస్తుంది.
* దీని చుట్టూ వలయాలు ఉంటాయి.
* దీనికి ఉన్న ఉపగ్రహాల సంఖ్య: 53
* దీని పరిభ్రమణ కాలం: 29.5 సంవత్సరాలు; దీని ఉపగ్రహం టైటాన్ భూమిని పోలి ఉంటుంది.

 

యురేనస్:
* దీన్ని టెలిస్కోప్ సాయంతో మాత్రమే చూడగలం.
* ఇది శుక్రగ్రహం మాదిరి తూర్పు నుంచి పడమరకు పరిభ్రమిస్తుంది.
* దీని అక్షం అత్యధికంగా వంగి ఉంటుంది.
* దీని ఉపగ్రహాల సంఖ్య: 27; పరిభ్రమణ కాలం 84 ఏళ్లు.

 

నెప్ట్యూన్:
* ఇది సూర్యుడికి అత్యంత దూరంలో ఉంటుంది.
* దీని ఉపగ్రహాల సంఖ్య: 13
* దీని పరిభ్రమణకాలం: 165 సంవత్సరాలు

 

గ్రహాలు రెండు రకాలు
     1. అంతర గ్రహాలు (బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు)
     2. బాహ్య గ్రహాలు (బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్)
* సూర్యుడి వ్యాసం: 13,92,000 కి.మీ., భూమి వ్యాసం 12,742 కి.మీ.; చంద్రుడి వ్యాసం 3,474 కి.మీ.
* భూమికి, చంద్రుడికి మధ్యదూరం: 3,84,399 కి.మీ.
* భూమికి, సూర్యుడికి మధ్యదూరం 15 కోట్ల కి.మీ.

* 2006 ఆగస్టు 25న ఫ్లూటోను గ్రహం కాదు అని నిర్ణయించారు. కారణం (Clear the Neighbourhood) అనే నియమాన్ని ఉల్లంఘించడం.
* క్లియర్ ద నైబర్‌హుడ్ అంటే తోటి గ్రహాల కక్ష్యలకు ఆటంకం కలిగించరాదు.

 

ఆస్టరాయిడ్స్:
* చిన్న చిన్న గ్రహ శకలాలను ఆస్టరాయిడ్స్ అంటారు.
* ఇవి కుజుడు, బృహస్పతి గ్రహాల మధ్య ఉంటాయి.
* వీటిని టెలీస్కోప్ సహాయంతో మాత్రమే చూడగలం.

 

తోకచుక్కలు:
* ఇవి సూర్యుడి చుట్టూ అతి దీర్ఘవృత్తకార కక్ష్యల్లో పరిభ్రమిస్తుంటాయి.
* వీటి పరిభ్రమణ కాలం చాలా ఎక్కువ.
* తోకచుక్క సూర్యుడిని సమీపిస్తున్న కొద్ది దాని తోక పొడవు పెరుగుతుంది. దీని తోక ఎల్లపుడూ సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉంటుంది.
* హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. 1986లో కనిపించింది. తర్వాత 2062లో కనిపిస్తుంది.
* షుమేకర్ - లేవి IX అనే తోకచుక్క 1994లో బృహస్పతిని ఢీకొంది.

 

ఉల్కలు - ఉల్కాపాతాలు:
* అంతరిక్షం నుంచి జారిపడే ఖనిజాలను ఉల్కలు అంటారు.
* ఇవి భూవాతావరణంలోకి ఎక్కువ వేగంతో ప్రవేశిస్తాయి.
* ఇవి గాలిలో ఉండే ఘర్షణ వల్ల బాగా వేడెక్కి మండుతాయి.
* ఇవి భూమిని చేరి పెద్ద గొయ్యిని ఏర్పరుస్తాయి. దీన్ని 'ఉల్కాపాతం' అంటారు.
* సౌరకుటుంబం ఏయే పదార్థాలతో ఏర్పడిందో తెలుసుకోవడానికి ఉల్కాపాతం ఉపయోగపడుతుంది.

 

కృత్రిమ ఉపగ్రహాలు:
* మానవ నిర్మిత ఉపగ్రహాలను కృత్రిమ ఉపగ్రహాలు అంటారు.
* భారత్ మొదటగా ప్రయోగించిన ఉపగ్రహం 'ఆర్యభట్ట'.
* ఇన్‌శాట్, ఐఆర్ఎస్, కల్పన - I, ఎడ్యుశాట్ లాంటివి భారత్ ప్రయోగించిన ఉపగ్రహాలు.
* వాతావరణ అధ్యయనానికి, రేడియో, టెలివిజన్ ప్రసారాలకు; టెలీకమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్ (నిర్ణీత దూరంలో ఉండి సమాచారం సేకరించడం), వైమానిక, సైనిక కార్యకలాపాలకు ఉపగ్రహాలను ఉపయోగిస్తారు.

 

నక్షత్ర రాశులు - రాశి చక్రం:
* నక్షత్ర వీధుల్లోని నక్షత్రాలను చిన్న చిన్న గుంపులుగా విభజించవచ్చు. ఈ చిన్న గుంపులను నక్షత్ర రాశులు అంటారు. వీటినే తారాగణం అని కూడా అంటారు.

* నక్షత్ర రాశులను వాటి ఆకారాలను బట్టి పన్నెండు పేర్లతో అనాదిగా పిలుస్తున్నారు. ఈ పన్నెండు రాశులను కలిపి 'రాశి చక్రం' అంటారు.
 

రాశులు - కనిపించే తేదీలు
    1. మేషం - మేక - మార్చి 21 - ఏప్రిల్ 19
    2. వృషభం - ఎద్దు - ఏప్రిల్ 20 - మే 20
    3. మిథునం - కవలలు - మే 21 - జూన్ 21
    4. కర్కాటకం - ఎండ్రకాయ - జూన్ 22 - జులై 22
    5. సింహం - సింహం - జులై 23 - ఆగస్టు 22
    6. కన్య - కన్య - ఆగస్టు 23 - సెప్టెంబరు 22
    7. తుల - త్రాసు - సెప్టెంబరు 23 - అక్టోబరు 23
    8. వృశ్చికం - తేలు - అక్టోబరు 24 - నవంబరు 21
    9. ధనస్సు - విల్లు - నవంబరు 22 - డిసెంబరు 21
    10. మకరం - మొసలి - డిసెంబరు 22 - జనవరి 21
    11. కుంభం - కుండ - జనవరి 22 - ఫిబ్రవరి 18
    12. మీనం - చేప - ఫిబ్రవరి 19 - మార్చి 20

అంతరిక్ష యానం
* రాకెట్‌లకు పలాయన వేగం, ఉపగ్రహానికి సమకూర్చడానికి 'బహుళ ప్రయోగ వ్యవస్థ' (Multistage Launching System) అనే ప్రక్రియను ఉపయోగిస్తారు.
* ఈ అంచెల పద్ధతిని 1903లో 'ద్సియోల్కల్ స్కి' అనే రష్యన్ ఉపాధ్యాయుడు సూచించాడు.
* మొదటిసారిగా రష్యన్ శాస్త్రవేత్తలు 1957, అక్టోబరు 4న స్పుత్నిక్ - I అనే మానవరహిత అంతరిక్ష నౌకను అంతరిక్షంలో ప్రవేశపెట్టారు.
* ఈ అంతరిక్ష నౌకను ఉపయోగించి విశ్వంలోని నక్షత్రాలు, సూర్యుడు, ఇతర విశ్వాంతరాలు, భూ వాతావరణం గురించి అధ్యయనం చేయడానికి ప్రయత్నించారు.
* 1957 నవంబరులో స్పుత్నిక్ - II అనే అంతరిక్ష నౌకలో ఒక కుక్క (లైకా)ను పంపారు.
* ఈ అంతరిక్ష నౌకలో కుక్కను పంపడం వల్ల అంతరిక్షంలో జంతువుల హృదయ స్పందన, ఉష్ణోగ్రత లాంటివి అధ్యయనం చేశారు.
* 1958, జనవరి 31లో అమెరికా ఎక్స్‌ప్లోరర్ - I ను అంతరిక్షంలోకి పంపి అంతరిక్షం వయసు, భూమి అయస్కాంత క్షేత్రాన్ని కనుక్కుంది.
* 1961, ఏప్రిల్ 12న రష్యా దేశస్థుడు కల్నల్ యూరీగగారిన్ 'వస్తోక్' అనే అంతరిక్ష నౌక ద్వారా భూమి చుట్టూ ఒకసారి 89.34 నిమిషాల్లో పరిభ్రమించాడు.

* యూరీగగారిన్ మొదటి అంతరిక్ష వ్యోమగామి. రష్యాలో ఆస్ట్రోనాట్‌ను కాస్మోనాట్ అని అంటారు.
* 1961, మే 5న 'మెర్క్యూరీ - 3' అనే అంతరిక్ష నౌకలో 'అలెన్ షెపార్డ్' అనే వ్యోమగామి కూడా అంతరిక్షయానం చేసి భూమి చుట్టూ 89.34 నిమిషాలు పరిభ్రమించాడు.
* 1962లో టెలిస్టార్ (Telstar) అనే సమాచార కృత్రిమ ఉపగ్రహం పంపారు.
* 1963, జూన్ 16న 'వస్తోల్ - 6' అనే అంతరిక్ష నౌకలో లెఫ్టినెంట్ కల్నల్ 'వాలెంటినా తెరిష్కోవా' అనే మహిళ ఇతర వ్యోమగాములతో కలిసి అంతరిక్షంలో 2 రోజుల, 22 గంటల 42 నిమిషాల్లో భూమి చుట్టూ 48 సార్లు ప్రదక్షిణ చేసింది.
* 1982, ఆగస్టు 19 రష్యన్ మహిళ ''స్వెత్లానా సవిత్‌స్కయా" సోయూజ్ టి.7లో; 1983, జూన్ 18న అమెరికన్ మహిళ 'స్యాలిరైడ్‌'లు అంతరిక్షయానం చేశారు.
* 1965 మార్చిలో 'అలెక్సి లియోహున్' 'వస్తోల్ - II' అనే రోదసీ నౌకలో పయనించి అంతరిక్షంలో కొద్దిసేపు నడిచాడు.
* 1965, జూన్ 3 'Gemini - 7' అంతరిక్ష నౌక ద్వారా అమెరికన్ వ్యోమగామి ఎడ్వర్డ్ హెచ్.వైట్ అంతరిక్ష నౌక నుంచి బయటకు వచ్చి అంతరిక్షంలో స్వేచ్ఛగా 21 నిమిషాలు తేలియాడాడు.
* 1969, జులై 21న అమెరికన్ 'నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్', 'ఎడ్విన్ అల్డ్రిన్' అనే ఇద్దరు వ్యోమగాములు అపోలో - II అనే అంతరిక్ష వాహక నౌక ద్వారా మొదటిసారి చంద్రుడిపై కాలు మోపారు.
* 1971లో రష్యన్‌లు 'శాల్యూట్' (Salyut) అనే అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

* 1972లో అమెరికన్‌లు 'స్కైలాబ్' (Skylab) అనే అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇది విఫలమై 1979లో భూమిపై పడిపోయింది.
* 1975లో అమెరికాకు చెందిన 'లైకింగ్ - I', 'లైకింగ్ - II' అనే అంతరిక్ష నౌకల ద్వారా అంగారక గ్రహంపై జీవరాశి లేదని నిరూపించారు.
* 1984 ఏప్రిల్ 3న రష్యా సహకారంతో భారత పౌరుడు 'రాకేష్ శర్మ' సోయజ్ - T - 11 అనే రోదసీ నౌక ద్వారా అంతరిక్షయానం చేశాడు.
* రష్యన్‌లు 1986, ఫిబ్రవరి 20న ఒక కొత్త అంతరిక్ష ప్రయోగశాల 'మిర్' (Mir) ను 'బైకనూర్ కాస్మోడ్రాం' నుంచి ప్రయోగించి 1982లో ఏర్పరిచిన 'శాల్యూట్‌'తో కలిపారు. మిర్ అనేది 'మల్టీ మాడ్యులర్ స్టేషన్'. ఈ స్టేషన్ ఆరు స్పేస్ క్రాఫ్ట్‌లను ఒకేసారి తన వద్ద ఉంచుకోగలుగుతుంది.
* 1986, మార్చి 13న సోయాజ్ T - 15 పై ఇద్దరు రష్యన్ వ్యోమగాములు 'మిర్‌'తో అనుసంధానమయ్యారు. ఈ అనుసంధానాన్ని ప్రపంచమంతటా దూరదర్శన్‌లో అప్పుడు ప్రసారం చేశారు. ఇది ప్రపంచ చరిత్రలో అద్భుతమైన విషయం.
* 1986, మే 30న పదకొండు దేశాల బృందం 'యూరోపియన్ అంతరిక్ష సంస్థ' దూర సమాచార ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టింది.
* 1989 మార్చిలో అట్లాంటిస్‌ను 'శుక్ర గ్రహం' పైకి పంపారు.

* 1990 అక్టోబరులో 'హబుల్ అంతరిక్ష దూరదర్శిని' సహాయంతో శని, ఫ్లూటోకు సంబంధించిన ఎంతో విలువైన ఛాయా చిత్రాలను భూమిపైకి పంపారు.
* భారతదేశంలో 1970 - 80 దశాబ్దంలో అంతరిక్ష యుగం ప్రారంభమైంది.
* 1975, ఏప్రిల్ 19న 'ఆర్యభట్ట' అనే ఉపగ్రహాన్ని రష్యా సహకారంతో పంపారు.
* రష్యా సహకారంతో తుంబా (కేరళ), శ్రీహరికోట (ఆంధ్రప్రదేశ్)ల వద్ద రాకెట్ లాంచింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేశారు.
* ఆర్యభట్ట తర్వాత భాస్కర I, II రోహిణి, ఐఆర్ఎస్, ఆపెల్, ఇన్‌శాట్ 1A 1B 1C మొదలైనవాటిని పంపారు.
* పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఉపగ్రహ వాహక నౌక PSLV (Polar Satellite Launching Vehicle) ను 1994, అక్టోబరు 15న శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించారు.

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌