• facebook
  • whatsapp
  • telegram

కృత్రిమ దారాలు, ప్లాస్టిక్‌ దారాలు

* పత్తి, ఉన్ని, పట్టు, జనుము లాంటి దారాలు మొక్కలు, జంతువుల నుంచి లభిస్తాయి. వీటిని సహజదారాలు అంటారు.
* రసాయన పదార్థాలతో చేసిన దారాలను కృత్రిమ దారాలు అంటారు.
ఆదిమానవులు చెట్ల ఆకులు, జంతువుల చర్మాలు, బెరళ్లను దుస్తులుగా ధరించేవారు.
* పూర్వకాలంలో యుద్ధంలో సైనికులు లోహదుస్తులు ధరించేవారు.
బట్ట నేతలో ఉపయోగించే దారాలు రెండు వరుసల్లో ఉంటాయి. నిలువు వరుసను పడుగు అని, అడ్డువరుసని పేక అని పిలుస్తారు.
* దారం చివర నలిపితే మరిన్ని సన్నని పీచులు కనిపిస్తాయి. వీటిని పీచుదారాలు లేదా దారపు పోగులు అంటారు.
* నూలు దారాలు పత్తిపీచు దారాలతో తయారవుతాయి.
* నీటిని పీల్చుకునే స్వభావం సహజ దారాలకు ఎక్కువగా, కృత్రిమ దారాలకు తక్కువగా ఉంటుంది.
* సాగేగుణం సహజదారాలకు తక్కువ, కృత్రిమ దారాలకు ఎక్కువ.
* పట్టువస్త్రాలు సహజ వస్రాలు. వీటికి నునుపుగా జారే స్వభావం ఉంటుంది.
* నూలు వస్త్రాలు నునుపుగా ఉన్నప్పటికీ ముతకగా, మందంగా ఉంటాయి.
* కృత్రిమ వస్త్రాలను కాలిస్తే ఘాటైన వాసన వస్తుంది.

 

సహజ దారాలు: పత్తి, జనుము, ఉన్ని, పట్టుదారాలను సహజ దారాలు అంటారు.
 

పత్తి: ఇది పత్తికాయల నుంచి లభిస్తుంది.
 

* పత్తిలోని సన్నని వెంట్రుకల లాంటి నిర్మాణాలను పత్తి పీచుదారాలు అంటారు.
* పత్తి దూది నుంచి గింజలను వేరుచేయడాన్ని జిన్నింగ్ అంటారు.
* పత్తిదారాన్ని వడకడానికి తకిలి, చరఖా, రాట్నం ఉపయోగిస్తారు.
* దూది పీచు ఉపయోగించి నూలు దారాలు తయారుచేయడాన్ని స్పిన్నింగ్ అంటారు.

 

జనపనార:
 

* జనుము దారాలను జనపమొక్కల కాండం నుంచి తయారుచేస్తారు.
* మొక్కను నానబెట్టడం ద్వారా కాండం మీద ఉండే బెరడు చీకిపోతుంది. దీన్ని వేరు చేస్తారు. దీన్నే జనపనార అంటారు.
* జనపనారను బంగారు దారం అని కూడా పిలుస్తారు.
* ఇది గట్టిగా, గరుకుగా ఉంటుంది. గోనె సంచులు నేయడానికి దీన్ని ఉపయోగిస్తారు.
* గోంగూర, వెదురు మొక్కల నుంచి కూడా దారాలను నేస్తారు.
* విద్యుత్ సహాయంతో నడిచే నేత యంత్రాలను మరమగ్గాలు అని, చేతితో నేయడానికి ఉపయోగపడే వాటిని చేనేత మగ్గాలు అని అంటారు.
* తెలుగు రాష్ట్రాల్లో చేనేత పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది, చేనేత పరిశ్రమకు గద్వాల్, సిరిసిల్ల, వెంకటగిరి, ధర్మవరం, పోచంపల్లి, మంగళగిరి ప్రసిద్ధి చెందాయి.
* విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో జనపనార పరిశ్రమలు ఉన్నాయి.
* వరంగల్ తివాచీలు నాణ్యతకు, మన్నికకు ప్రసిద్ధి చెందాయి.

* కర్రగుజ్జుకు రసాయనాలను కలిపి రేయాన్ దారాలు తయారుచేస్తారు.
పాలిస్టర్ దారాలను పెట్రోలియం నుంచి తయారుచేస్తారు.
* ఒక పత్తికాయ నుంచి 500 మీటర్ల పొడవైన దారాన్ని తీయవచ్చు.
* మైక్రోఫైబర్ (సూక్ష్మదారం)ను మొదట 1970లో మియోషి వొకమోటో తయారుచేశారు.
* ఫ్లెక్సీల తయారీలో ఉపయోగించే 'పాలివినైల్ క్లోరైడ్‌ను' 'వాల్డ్.ఎల్.సీమన్' తయారుచేశారు.
* వర్షానికి తడవని దుస్తులను తయారుచేసినవారు ఛార్లెస్ మెకింతోష్ (1823).
* ప్రపంచంలో ఎక్కువగా వినియోగించే ఉన్ని వస్త్రాల తయారీకి గొర్రెల ఉన్ని ఉపయోగిస్తారు.
* వస్త్ర పరిశ్రమలో 'కర్బన దారాలు' సరికొత్త ఆవిష్కరణ.

 

కృత్రిమ దారాలు:
 

* ఇవి మానవ నిర్మిత దారాలు
ఉదా: పాలిస్టర్, నైలాన్, ఆక్రలిత్.
* వీటిని పెట్రోలియం ముడిపదార్థాల నుంచి తయారుచేస్తారు.
* కృత్రిమ దారాలను దుస్తుల తయారీకి, గృహోపకరణాల తయారీకి ఉపయోగిస్తారు.
* కృత్రిమ దారాల్లో చిన్న యూనిట్‌ను మోనోమర్‌లు అని, పెద్ద యూనిట్‌ను పాలిమర్ అని పిలుస్తారు.
* గ్రీకుభాషలో పాలిమర్ అంటే పాలి - ఎక్కువ, మర్ - భాగం అని అర్థం

 

నైలాన్:
 

* మొదటగా తయారుచేసిన కృత్రిమ దారం నైలాన్. ఇది రెండో ప్రపంచ యుద్ధసమయంలో ఎక్కువ ప్రాచుర్యం పొందింది.
* నేలబొగ్గు, నీరు, గాలిని ఉపయోగించి దీన్ని తయారుచేస్తారు.
* ఈ మధ్యకాలంలో అల్లికలకు ఉపయోగించే పట్టుకు బదులు నైలాన్ వాడుతున్నారు.
* నైలాన్ పాలిఎమైడ్‌లు అనే యూనిట్లతో తయారవుతుంది.
* పాలిఎమైడ్ అనేవి హెక్సామిథిలిన్ మోనోమర్‌లు, డయామిన్, అడిపిక్ ఆసిడ్‌లతో తయారవుతాయి.
* నైలాన్ దారం బలంగా, సాగే గుణంతో ఉండే తేలికైన పదార్థం.
* నైలాన్‌తో తయారైన దుస్తులు మంచి మెరుపును కలిగి ఉంటాయి.
* ఇది నీటిని పీల్చుకోదు. నైలాన్ వస్త్రంపై స్థావర విద్యుత్‌ను సులభంగా సృష్టించవచ్చు.
* దీనికి మండే స్వభావం ఎక్కువ.
* పళ్లు తోముకునే టూత్‌బ్రష్ కుంచె, తాళ్లు (Ropes), చేపల వేటకు వాడే వలలు, గుడారాలు, చీరలు, స్త్రీల మేజోళ్లు, కాళ్లకు వేసుకునే చిన్న మేజోళ్లు (సాక్స్), సీట్ బెల్టులు, నిద్రకు ఉపకరించే సంచులు, తెరలు... అన్నింటిని నైలాన్‌తోనే తయారుచేస్తారు.
* తివాచీల, పారాచూట్‌ల తయారీకి, పర్వతారోహణకు ఉపయోగించే తాళ్ల తయారీకి, ఈత దుస్తులు, లోదుస్తులు, తెరచాపలు, గొడుగుకు వాడే వస్త్రం కారు చక్రాల... ఇలా మొదలైన వాటి తయారీలో నైలాన్‌లు ఉపయోగిస్తారు.
* నైలాన్ దారాన్ని అంతే మందంగల స్టీలు తీగతో పోలిస్తే నైలాన్ కూడా అంతే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

 

రేయాన్:
 

* కాగితపు గుజ్జు, రేయాన్ మొక్కల సెల్యులోజ్ నుంచి పొందదగిన ఒక కృత్రిమ దారం. దీన్ని సెల్యులోజ్ దారం అని అంటారు.
* కృత్తిమ పట్టునే రేయాన్ అంటారు. 1911లో అమెరికాలో కృత్రిమ పట్టు ఉత్పత్తి మొదలైంది.
* దీనికి రేయాన్ అని 1924లో పేరుపెట్టారు.
* మన దేశంలో మొదటి రేయాన్ పరిశ్రమ 1946లో కేరళలో స్థాపించారు.
* రేయాన్ పట్టు కంటే చౌక.
* రేయాన్ తయారీలో కర్రగుజ్జు నుంచి సెల్యులోజ్‌ను మొదట సేకరించి, దానికి NaOH, కార్బన్ డై సల్ఫైడ్ (CS2) కలుపుతారు. ఇది పానకంలా తయారవుతుంది. దీన్ని స్నిగ్ధస్థితి ద్రవం (Viscose) అంటారు.
* దీన్ని చిన్న రంధ్రాల జల్లెడ నుంచి H2SO4 ద్రావణంలోకి పంపి, వచ్చిన దారాలను సబ్బుతో కడుగుతారు.
* రేయాన్‌ను నూలుతో కలిపి దుప్పట్ల తయారీలో, ఉన్నితో కలిపి తివాచీల తయారీలో ఉపయోగిస్తారు.
* పిల్లల డైపర్, బ్యాండేజీ, గాయానికి కట్టుకట్టే నారపీచుల్లో (Lint) వాడతారు.
ఏదైనా కృత్రిమ దారాన్ని రెండు లేదా ఎక్కువ ఇతర దారాలతో కలిపే ప్రక్రియను మిశ్రణం (Blending) అంటారు.

 

ఆక్రలిత్:
 

* దీన్ని కృత్రిమ ఉన్ని లేదా నకిలి ఉన్ని అని పిలుస్తారు.
* ఇది వ్యాపారపరంగా 1941 నుంచి అందుబాటులోకి వచ్చింది.
* నేలబొగ్గు, గాలి, నీరు, నూనె, సున్నపురాళ్లను కలపడం ద్వారా దీన్ని తయారుచేస్తారు.
* దీన్ని తడి లేదా పొడి స్పిన్నింగ్ పద్ధతిలో పురిపెడతారు.
ఆక్రలిత్‌ను ఉన్నితో చేసే వస్తువులు, కాళ్లకు వేసుకునే మేజోళ్లు (Socks), క్రీడాదుస్తులు, స్వెటర్లు, దారంతో అల్లే దుస్తులు (Knitted Apparels), తివాచీలు, ప్రయాణ సామగ్రి, అల్లికలకు వాడే దారాలు, వాహనాల కవర్లలో ఉపయోగిస్తారు.
* కృత్రిమ దారాలకు తక్కువ నీటిని శోషించడం, వేగంగా పొడిబారే లక్షణాలు ఉంటాయి.

 

పాలిస్టర్‌లు (Polyesters):
 

* పాలిస్టర్ అనేది సాధారణంగా వాడే కృత్రిమ దారం.
* టెర్లిన్ అనేది ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్న పాలిస్టర్. ఇది సహజ దారాలతో బాగా మిశ్రణం చెందుతుంది.
* టెర్లిన్‌ను నూలుతో మిశ్రణం చెందించి టెరికాట్, ఉన్నితో మిశ్రణం చెందించి టెరిఊల్‌ను తరచుగా తయారుచేస్తారు.
* టెర్లిన్ నైలాన్‌లా సులభంగా మంటకు అంటుకుంటుంది.
* 'డై మిథైల్ ఈథర్', 'టెరిఫ్తాలిక్' ఆమ్లం చర్య జరపగా ఏర్పడిన ఉత్పన్నాన్ని డై హైడ్రిక్ ఆల్కహాల్‌తో చర్యనొందించి పాలిస్టర్‌ను తయారుచేస్తారు.
* పాలిస్టర్‌లను వస్త్రాల తయారీకే కాకుండా సోడాసీసాల నుంచి పడవల వరకు అనేక ఇతర వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు.
PET అనేది అందరికి తెలిసిన ఒక పాలిస్టర్. దీన్ని ఉపయోగించి సీసాలు, వంట పరికరాలు, ఫిల్మ్‌లు, తీగలు లాంటి ఎన్నో ఉపయోగకరమైన వస్తువులను తయారుచేస్తారు.

 

 PET: పాలి ఇథిలిన్ టెరిఫ్తాలేట్
 

 HDPE: అధిక సాంద్రత గల పాలి ఇథిలిన్
 

 PVC: పాలివినైల్ క్లోరైడ్ (వినైల్)
 

 LDPE: అల్పసాంద్రత గల పాలి ఇథిలిన్
 

 PP: పాలిప్రొపిలిన్
 

 PS: పాలిస్టెరిన్
   PET సీసాల్లో శీతల పానీయాలను ఉంచుతారు. కారణం శీతల పానీయాలు కార్బనామ్లీకృతం కాకుండా ఉండటం కోసం.

 

ప్లాస్టిక్:
 

* కృత్రిమ దారాల్లా ప్లాస్టిక్ కూడా ఒక పాలిమర్.
* ప్లాస్టిక్‌లలో మోనోమర్‌లు
i) రేఖీయంగా పొడవాటి గొలుసులుగా (linear chains)
ii) అడ్డంగా అనుసంధానించిన అమరిక (cross linked)గాను ఉంటాయి.
* అలెగ్జాండర్ పార్క్స్ పార్కెసిన్ అనే మొదటి ప్లాస్టిక్‌ను సృష్టించాడు. (1862 లండన్‌లో)
* పార్కెసిన్ తయారీకి - సల్ఫ్యూరికామ్లంలో నానబెట్టిన దూదిని HNO3తో వేడిచేశారు. దీనికి నూనె + కర్పూరాన్ని ఉపయోగించాడు.
* వేడిచేసినప్పుడు ముడుచుకుపోయే, వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్‌ను థర్మోప్లాస్టిక్ అంటారు.
ఉదా: పాలిథిన్ (పళ్లు తోముకునే బ్రష్, బకెట్‌ల తయారీకి), PVC (పాలి వినైల్ క్లోరైడ్) (బొమ్మలు, దువ్వెనల తయారీలో వాడతారు)

ఒకసారి మలచిన తర్వాత వేడిచేయడం ద్వారా మృదువుగా మార్చలేనటువంటి ప్లాస్టిక్‌లను థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అని అంటారు.
ఉదా: బెకలైట్, మెలమైన్.
* విద్యుత్ స్విచ్, వంటపాత్ర పిడి, ప్లాస్టిక్ పళ్లెం, కాఫీకప్పు - థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్‌లు.
* థర్మోప్లాస్టిక్‌లు వేడిచేసినప్పుడు మృదువుగా, చల్లబరచినప్పుడు కఠినంగా తయారవుతాయి.
* వేడిచేసినప్పుడు ద్రవస్థితిలోకి, తగినంతగా చల్లబరిస్తే గాజుస్థితిలోకి మారుతుంది.
* థర్మో ప్లాస్టిక్‌ను 1920లో హెర్బన్ స్టాడింగర్ కనుక్కున్నాడు.
* పాలిమర్లు పొడవాటి గొలుసులున్న అణువులుగా ఉంటాయని తెలిపిన స్టాండింగర్‌కు 1953లో నోబెల్ బహుమతి వచ్చింది.
* థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్‌ను వేడిచేసినప్పుడు నల్లబొగ్గుగా మారుతుంది లేదా మండుతుంది.
* బెకలైట్‌ను తక్కువ ఉష్ణ, విద్యుత్ వాహకత్వం ఉన్న వంటపాత్రల పిడులు, స్విచ్‌బోర్డుల తయారీలో, ముత్యాల లాంటి రాళ్లకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు.
* బేకలైట్‌ను 'లియోహెండ్రిక్ బేక్‌లాండ్' కనుక్కున్నారు. కాబట్టి ఇతడిని ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు అని పిలుస్తారు.

* బెకలైట్ అనేది కార్బొనిక్ ఆమ్లం, ఫార్మాల్టిహైడ్‌ల సమ్మేళన పదార్థం.
* ఇచ్చిన ప్లాస్టిక్ పదార్థం బెకలైట్ అయితే గుండు సూదితో గుచ్చితే గుచ్చుకోదు. ఆమ్లపు వాసన వస్తుంది. పర్పుల్ రంగులతో ఉంటుంది.
* మెలమిన్‌ను వంటపాత్రలు, గృహోపకరణాల తయారీకి వాడతారు.
* ఇది మంటను నిరోధించే శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి Floor Meterial తయారీకి; కీబోర్డు, కంప్యూటర్, TVల పైభాగం (Cabinet) తయారీకి ఉపయోగిస్తారు.
* ప్లాస్టిక్‌లు చర్యాశీలత లేనివి, ఇవి తుప్పు పట్టవు.
* వీటిని మండిస్తే చాలా ఎక్కువ వాయుకాలుష్యాన్ని కలగజేస్తాయి.
* ప్లాస్టిక్ వినియోగంలో 4R సూత్రం పాటించాలి.
    Reduce తగ్గించడం
    Recycle రీసైకిల్
    Reuse తిరిగి వాడటం
    Recover తిరిగి పొందడం
* ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 60,000 రకాల ప్లాస్టిక్‌లు ఉన్నాయి.
* PET (Code-1) HDPE (Code-2) లను రీసైకిల్ చేస్తారు.
* క్యారిబ్యాగ్‌ల తయారీకి వాడే LDPE (Code-4)ను రీసైకిల్ చేయరు.
* PVCని రీసైక్లింగ్ చేసే ప్రక్రియ ప్రస్తుతానికి అందుబాటులో లేదు.
* 2003లో సుప్రీంకోర్టు 4R సూత్రాన్ని పాటించాలని చెప్పింది.
    (ఘనవ్యర్థాల నిర్వహణ)

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌