• facebook
  • whatsapp
  • telegram

విద్యాప్రణాళిక  

విద్యాప్రణాళిక నిర్మాణ సూత్రాలు:
సాంఘిక అధ్యయన విద్యా ప్రణాళికను కింది సూత్రాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించాలి.
1. ప్రయోజన సూత్రం: సమాజానికి, విద్యార్థి వర్తమానానికి, భవిష్యత్తుకు విషయం ఉపయోగపడాలని చెప్పేది.
2. సరళతా సూత్రం: మారుతున్న సమాజానికి అను గుణంగా కరికులం సరళంగా, గతిశీలమై ఉండాలి.
3. సంతులన సూత్రం: విషయాలు- కార్యకలాపాలు- అనుభవాల మధ్య ప్రత్యక్ష- పరోక్ష అనుభవాల మధ్య వైయక్తిక- సామాజిక లక్ష్యాల మధ్య; ఐచ్ఛిక- అనివార్య విషయాల మధ్య సముచిత సంతులనాన్ని నెలకొల్పాలి.
4. సమగ్రతా సూత్రం: విద్యార్థుల వైయక్తిక భేదాలను దృష్టిలో పెట్టుకోవాలి (శక్తి సామర్థ్యాలు).
5. సృజనాత్మక సూత్రం: విద్యార్థుల్లోని అంతర్గత, సృజ నాత్మక, నిర్మాణాత్మక సామర్థ్యాలను వినియోగించే అవకాశాన్ని కల్పించాలి.
రేమంట్ అనే విద్యావేత్త ప్రకారం కరిక్యులం ''నేటి, రేపటి అవసరాలకు తగిన విద్యా ప్రణాళిక, సృజనాత్మక విషయాల పట్ల నిశ్చితమైన మొగ్గు చూపాలి''.
6. సఫల జీవిత సూత్రం: ఆధునిక సమాజంలో కలసి మెలసి విజయవంతంగా జీవించడానికి కావలసిన సామర్థ్యాలను అందించాలి.
7. సమగ్ర అనుభవాల సూత్రం: విద్యార్థిని నిజ జీవితానికి సంసిద్ధం చేసేందుకు అనువైన అభ్యసనాన్ని అందించాలి.
8. అనుభవాల సూత్రం: జీవిత ఉపయోగ అనుభవాలను అందించడం.
9. పరిపూర్ణ ప్రవర్తనా రీతుల ఆర్జన సూత్రం: బాల్యం నుంచే మంచి అలవాట్లను, ప్రవర్తనా రీతులను అందించడంలో సహాయకారిగా ఉండాలి.
10. యావజ్జీవిత వ్యాసాంగాల అంతర్లీనతా సూత్రం: ప్రజాస్వామ్యం పట్ల విద్యార్థిలో అనుకూల వైఖరులను, విలువలను  పెంపొందించగలగాలి.
11. పరిణామ నిత్యతా సూత్రం: సమాజం నిరంతర పరిణామశీలి. కాబట్టి, కరిక్యులం ఎప్పటికప్పుడు పునర్నిర్మితమవుతూ ఉండాలి.  క్రో అండ్ క్రో ప్రకారం ''ప్రజాస్వామిక సమాజంలో కరికులం నిశ్చలంగా ఉండలేదు''. జాన్‌డీవీ ప్రకారం ''పాఠ్య ప్రణాళిక తన ప్రయోజనాన్ని సాధిస్తుంది లేదా నిష్కర్ష చేసేందుకు అది నిరంతర పరిశీలనకు, విమర్శకు, సంస్కరణకు గురికావాలి''.
12. క్రీడా కృత్యాల అంతస్సంబంధ సూత్రం: 'అభ్యసనం అంతా క్రీడా పద్ధతి కాదు' అని తెలిపేది.


సెకండరీ విద్యా కమిషన్ సూచించిన సూత్రాలు:
* అనుభవ సాకల్య సూత్రం: పాఠశాలలో తరగతిలో, ఆటస్థలంలో గ్రంథాలయంలో విద్యార్థి పొందే సమస్త అనుభవాలూ పాఠ్య ప్రణాళికలో భాగమవుతాయి.
* వైవిధ్యత సామ్యతా సూత్రం: విద్యార్థుల్లో వైయక్తిక భేదాలను దృష్టిలో పెట్టుకునేది.
* సామాజిక జీవితంతో సంబంధ సూత్రం: స్థానిక అవసరాలు తీరేలా పాఠ్య ప్రణాళిక రూపొందాలి.

* విరామకాల వినియోగ శిక్షణ సూత్రం: పని, విరామం రెండింటిలో విద్యార్థిని అయత్తం చేసే విధంగా పాఠ్య ప్రణాళికను రూపొందించాలి.
* విషయాల అంతస్సంబంధ సూత్రం: పాఠ్య ప్రణాళికలోని ప్రతి విషయాన్ని నిజ జీవితంతో సమ్మిళితం చేయాలి.
కరిక్యులం అనేది ''విద్యార్థి సంపూర్ణ వికాసానికి, భావి జీవితానికి సక్రమంగా ఆయత్తం కావడానికి తోడ్పడాలి. బడి జీవితం యావత్తూ విద్యాప్రణాళిక కావాలి'' అని తెలిపింది సెకండరీ విద్యా కమిషన్.


కరిక్యులం ఉపగమాలు (curriculum approaches):
సహసంబంధ ఉపగమనం (correlation): సహ సంబంధం అంటే వివిధ పాఠ్య విషయాల అంతస్సంబంధం. కరిక్యులంలోని వివిధ భాగాల మధ్య అను సంధానం చేయడానికి పాఠ్య విషయాల్లోని సంబంధిత అంశాలను కనుక్కుని వినియోగించడమే సహసబంధం. పాఠ్య విషయ విలువలను పెంచేలా చూసేదే ఈ సహసబంధం.


సహసంబంధం రకాలు:
1. అంతర్గత సహసంబంధం: విద్యార్థి చదువుకున్న అంశాల్ని లేదా సంఘటనలను ఉపాధ్యాయుడు తాను తెలుసుకున్న అదనపు(సంబంధిత) సమాచారంతో, జ్ఞానంతో జోడించేందుకు ప్రయత్నిస్తాడు (Previous Knowledge + Present Knowledge) ఇది అభ్య సనలో ప్రేరణ కలిగించి ఆసక్తిని పెంచుతుంది.

2. పాఠ్య విషయ సహసబంధం: సాంఘిక అధ్యయనాలకు చెందిన ఒక పాఠ్య విషయానికి మరో పాఠ్య విషయంతో సంబంధం ఏర్పరచి బోధించే పయత్నం.
ఉదా: భారతీయ సాహిత్యాన్ని చదివేటప్పుడు భారతదేశ చరిత్రను అధ్యయనం చేయడం.

* దేశాల మధ్య ఎగుమతి దిగుమతులు అంత ర్జాతీయ అవగాహన (భూగోళం + పౌరనీతి)
* బ్రిటిష్ వారి కాలంలో భారతదేశ వ్యవసాయరంగం (చరిత్ర + భూగోళం)

3. ఏకైక సహసంబంధ పాఠ్యక్రమం: ఇందులో భూగోళ శాస్త్రంలోని మొదటి యూనిట్‌ను బోధించిన తరువాత దానికి సంబంధించిన చరిత్ర యూనిట్, పౌరనీతికి సంబంధించిన యూనిట్, చివరిగా అర్థశాస్త్ర సంబంధిత యూనిట్‌లను సమ్మిళితం చేసి బోధించవచ్చు.
 

సహసంబంధం మరో వర్గీకరణ:
1. అంతర్గత సహసంబంధం: సాంఘిక అధ్యయనాలకు చెందిన వివిధ అంశాల మధ్య సహసంబంధం కలగ జేయడం. వివిధ విషయాలను, సంఘటనలను ఒక వరుస క్రమంలో రూపొందించాలి.
ఉదా: మౌర్య సామ్రాజ్యం గురించి చెప్పేటప్పుడు చంద్రగుప్తుడి నుంచి మౌర్య సామ్రాజ్య పతనం వరకు బోధించాలి. భారత స్వాతంత్య్ర ఉద్యమం గురించి బోధించడానికి మనదేశంలో బ్రిటిషర్ల స్థాపన నుంచి స్వాతంత్య్రం సాధించడం వరకూ చెప్పడం.

2. బాహ్య సహసంబంధం: సాంఘిక అధ్యయనాల విద్యా ప్రణాళికలోని ఇతర పాఠ్యాంశాలతో సహసంబంధం కలిగించడం.
 

ప్రయోజనం:
1. పాఠ్య విషయంలో ఆసక్తి.
2. విషయంపై చక్కటి అవగాహన.
3. విద్యార్థులు ఇంట్లో, సమాజంలో, పాఠశాలలో పొందే అనుభవాల మధ్య ఐక్యత నెలకొల్పుతుంది.

 

పరిమితులు:
1. పాఠ్య విషయాల మధ్య నిర్బంధ, అసహజ సహసంబంధానికి దారి తీయవచ్చు.
2. బలవంతంగా ఏర్పరచిన సహసంబంధం వల్ల ఆ సంబంధిత అంశానికి చెందిన విద్యా లక్ష్యాలు దెబ్బతినవచ్చు.
సమైక్య ఉపగమం - Integration: క్రో అండ్ క్రో ''పరస్పర సంబంధిత విషయ క్షేత్రాలను ఏకీకరణ చేసే ప్రయత్నమే సమైక్య ఉపగమం'' అని నిర్వ చించారు.
* సమైక్య పరచడంలో పాఠ్య విషయ స్వరూపాలు అలాగే ఉంటాయి. కానీ, పాఠ్య విషయాల హద్దులను ఇంచుమించు విస్మరించడం జరుగుతుంది.
* సమైక్యం అంటే ఒక విషయానికి సంబంధించిన ఎంపిక చేసిన అనేక అంశాల పరంపర.
ఉదా: 'భారతదేశంలో రైలు మార్గాలు' ఈ పాఠ్యాంశానికి సంబంధించిన పలు పాఠ్య విషయాల్లోని సంబంధిత సమాచారాన్నంతా ఒక చోటికి చేర్చి బోధించడం.
* మనదేశంలో రైలు మార్గాలు ఎలా విస్తరించి ఉన్నాయి? (భూగోళం), మొదటి రైలు మార్గం - వాటి అభివృద్ధి (చరిత్ర), ఒక దేశానికి జీవనాడులు (పౌరనీతి), సేవా రంగంలో వీటి పాత్ర (అర్థశాస్త్రం).

 

ప్రయోజనాలు:
1. విషయాన్ని సామాన్యీకరిస్తారు.
2. విద్యార్థికి లాభదాయకం.
3. విజయవంతమైతే విద్యార్థిని ఆకట్టుకుంటుంది.

4. విషయ సామగ్రి ఉపయుక్తకు ప్రాధాన్యం.

 

నష్టాలు:
1. ఉపాధ్యాయుడికి ఎంతో ప్రావీణ్యత ఉంటే గానీ ఇది చేయలేడు.
2. అన్ని పాఠ్యాంశాలూ ఈ పద్ధతికి అనువుగా ఉండవు.
యూనిట్ ఉపగమం లేదా విభాగ ఉపగమం (unit approach): గెస్టాల్ట్ మనో విజ్ఞాన శాస్త్రవేత్తల ఆలోచనల ప్రకారం ఈ ఉపగమాన్ని రూపొందించారు. ఇందులో పాఠ్యాంశాలను కొన్ని విశాలమైన భాగాల కింద వర్గీకరిస్తారు. విద్యార్థుల స్థాయిని బట్టి సంపూర్ణత్వం పొందిన కొన్ని పాఠ్యంశాలను కలిపి ఒక 'పాఠ్యవిభాగం'గా రూపొందిస్తారు.

 

నిర్వచనాలు:
ట్రస్టస్: ''అభ్యాసకుడు సమీక్ష పూర్వక పరిచయం కింద ఊహించే విషయ సమాచార సమూహం - యూనిట్''
హెచ్.సి మోరిసన్: ''అంశం అనేది సామాన్యశాస్త్రం లేదా ఇతర శాస్త్రాల సమగ్రమైన అంశ క్షేత్రం.''
వెస్లీ: ''విద్యార్థిలో నిబిడీకృతమై ఉన్న అభిలషనీయ ఫలితాలను వెలికి తీయడానికి క్రమపద్ధతిలో పొందుపరచిన విషయ, అనుభవాల నిర్మాణమే అంశం.''
హాగ్‌మస్, పోటర్: ''అభ్యాసకుడు సమర్థవంతంగా జీవన పరిస్థితులకు అనుగుణంగా నడపడానికి, మార్పు చేయడానికి ఉద్దేశించిన అర్థవంతమైన అభ్యసనానుభవాన్ని సమకూర్చడానికి దోహదం చేసేదే యూనిట్.'' చికాగో వర్సిటీకి చెందిన హెచ్.సి.మోరిసన్ అభివృద్ధి చేసిన యూనిట్ పథకం ప్రసిద్ధి గాంచింది.

 

ఉత్తమ యూనిట్ లక్షణాలు/ ప్రమాణాలు:
1. విద్యార్థుల పూర్వ అనుభవాలపై ఆధారపడాలి.
2. విద్యార్థి అవసరాలు అభిరుచులు, సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకోవాలి.
3. యూనిట్‌లో అనేక కార్యకలాపాలు ఉండాలి.
4. వరుస క్రమంలో ఉండాలి.
5. సరళంగా, మార్పునకు వీలై ఉండాలి.
6. విద్యార్థి జీవిత సన్నివేశంతో సంబంధం ఉండి, కొత్త అనుభవాలను అందించాలి.

 

యూనిట్ రకాలు:
1. వనరుల యూనిట్:
విద్యార్థి, పాఠశాల, సమాజ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయుడు ఒక తరగతికి యూనిట్ కూర్చడానికి వనరుల యూనిట్ ఉపయోగ పడుతుంది. తరగతి బోధనకు అవసరమైన ఆలోచనలను అందిస్తుంది. యూనిట్ ప్లాన్ టీచర్‌కు ఉపయోగం.
2. బోధనా యూనిట్ (Lesson Plan): ఇది తరగతిలో చేపట్టిన పని విభాగం అభివృద్ధిని తెలుపుతుంది. ఒక ప్రత్యేక తరగతికి ఒక నిర్దేశిత పీరియడ్‌లో చేపట్టిన యధార్థ బోధన (కార్యనిర్వహణ కేంద్రంగా) అమలును ఇది వివరిస్తుంది. వనరుల యూనిట్ కంటే శ్రేష్టమైంది.
3. విషయజ్ఞాన యూనిట్: విద్యార్థి కంటే విద్యార్థి తెలుసుకోవలసిన విషయానికి, సమగ్ర సమాచారానికి, జ్ఞానానికి ప్రాముఖ్యతనిస్తూ దీన్ని రూపొందించారు. ఇవి నాలుగు విధాలు

                 1. ప్రకరణ అంశం 
                 2. సాధారణీకరణ అంశం 
                 3. పరిసరాల అంశం 
                 4. అనుభవ ప్రాముఖ్య అంశం.
4. అనుభవపూర్వక యూనిట్: ఇది విద్యార్థి నిజ జీవిత సన్నివేశాలు లేదా సమస్యలకు సంబంధించి ఉంటుంది. ఇది విద్యార్థి జీవితంలో ఎదురయ్యే సమస్యలను అర్థం చేసుకోవడానికి, అవగాహనకు తోడ్పడుతుంది. ఇందులో 3 అంశాలు ఉంటాయి. 
                 1. విద్యార్థి అభిరుచి అంశం 
                 2. విద్యార్థి ఆవశ్యక అంశం 
                 3. విద్యార్థి అవసర అంశం.
5. నిర్మాణాత్మక యూనిట్: పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన జోన్స్ అనే విద్యావేత్త దీన్ని రూపొందించారు. విద్యార్థి వాస్తవ జీవిత సమస్యలను ఎదుర్కోవడానికి తగిన సామర్థ్యాన్ని పెంపొందించి, జీవితాన్ని సరిదిద్దుకోగల సామర్థ్యాన్ని ఇవ్వడమే ఈ యూనిట్ ముఖ్య ఉద్దేశ్యం. ఇది అన్ని యూనిట్ల కంటే ఉత్తమమైంది.
యూనిట్ పద్ధతిలోని సోపానాలు: హెచ్.సి. మోరిసన్ బోధనా ప్రణాళికలో సోపానాలు
                 1. అన్వేషణ 
                 2. ప్రదర్శన 

                 3. సాంశీకరణ 
                 4. వ్యవస్థీకరణ 
                 5. పునఃపఠన
మోరిసన్ యూనిట్‌ను హెర్బర్ట్ బోధనా సోపానాలతో పోల్చవచ్చు.
పరిమితులు: యూనిట్ విధానం అమలు పరచడానికి విశేషమైన విషయ జ్ఞానం, అనుభవజ్ఞులైన, ఉత్తమ ఉపాధ్యాయులు అవసరం.

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌