• facebook
  • whatsapp
  • telegram

మూల్యాంకనం  

విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుతమైన, మానవతా విలువలతో కూడిన పౌరులుగా తీర్చిదిద్దడమే విద్య ముఖ్య లక్ష్యం. పాఠశాలలో కల్పించే అభ్యసన అనుభవాలు అనేవి విద్యార్థులు అర్థం చేసుకోవడానికి తోడ్పడాలి. దాంతోపాటు పాఠశాలను ఒక సాంఘిక వికాస కేంద్రంగా తీర్చిదిద్దడం ద్వారా విద్యాలక్ష్యాలు సాధించడానికి సహకరించేవిగా ఉండాలి.
 ఒక నిర్ణయాన్ని ప్రకటించే పద్ధతే మూల్యాంకనం. అంటే విద్యార్థి సామర్థ్యాన్ని సాధించాడని గానీ, సాధించలేదని గానీ చెప్పడం. పాఠశాలలో జరిగే అభ్యసన ప్రక్రియలకు, లక్ష్యాలకు బోధనతో ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే ప్రక్రియను మూల్యాంకనం అంటారు.
* విద్యార్థుల అభ్యసన ప్రగతిని ఒక శాస్త్రీయమైన విధానంలో తెలియజేయడానికి, ఉపాధ్యాయుడి బోధన ఎంత మేరకు సఫలమైందో తెలుసుకోవడానికి ఉపయోగపడేదే మూల్యాంకనం.
* మూల్యాంకనం అనేది జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక రంగాలు మూడింటికి సంబంధించింది. మూల్యాంకనం ఒక నిరంతర ప్రక్రియ. దీన్ని సమగ్రంగా నిర్వహించాలని జాతీయ విద్యావిధానం (1986) పేర్కొంటోంది.
* విద్యార్థుల ప్రగతిని నిరంతరం సమగ్రంగా మూల్యాంకనం చేయాలని విద్యాహక్కు చట్టం - 2009 నిర్దేశించింది.

 

నిరంతర సమగ్ర మూల్యాంకనం (Continuous Comprehensive Evaluation - CCE)

విద్యాప్రణాళిక బోధనాభ్యసన ప్రక్రియలకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో, పిల్లల ప్రగతిని కూడా అంతే ప్రాధాన్యతతో పరిశీలిస్తుంది. పాఠశాలలో నిర్వహించే మూల్యాంకనం విద్యార్థుల జ్ఞాననిర్మాణ సామర్థ్యంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని కూడా పరిశీలించేదిగా ఉండాలి.
* మూల్యాంకనం - 1) పాఠ్యాంశాలు 2) సహ పాఠ్యాంశాలు రెండింటి మధ్య ఎలాంటి విభేదాన్ని చూపకుండా, వాటిని సమష్టిగా పరిశీలించేదిగా ఉంటే దాన్ని నిరంతర, సమగ్ర మూల్యాంకనంగా చెప్పవచ్చు.
* 'నిరంతరం' అంటే బోధన అభ్యసన ప్రక్రియలో ఏదో ఒక సంఘటనకో, సందర్భానికో పరిమితం కాకుండా అభ్యసనాంశాలు అన్నింటినీ ఎల్లప్పుడు పరిశీలించడం.
* పాఠశాల లోపల, వెలుపల, పిల్లల శారీరక, మానసిక వికాసాలను తరచుగా క్రమపద్ధతిలో పరిశీలిస్తున్నామని తెలియకుండానే ఉపాధ్యాయుడు గమనించడం.
* 'సమగ్రం' అంటే విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి సంబంధించింది. దీని అర్థం - శారీరక, మానసిక, నైతిక, జ్ఞానాత్మక రంగాల్లో విద్యార్థుల అభివృద్ధి.
* పాఠ్య, పాఠ్యేతర అంశాలను విడివిడిగా చూడకుండా రెండు విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని విద్యాప్రణాళిక పేర్కొంది. అంటే భాష, గణితం, పరిసరాల విజ్ఞానం లాంటి విషయాలతోపాటు కళలు, పని, ఆరోగ్యం, జీవన నైపుణ్యాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం.

* విద్యార్థుల సమగ్ర అభివృద్ధి: కేవలం పాఠ్యపుస్తకాల్లోని సమాచారం నేర్చుకోవడం మాత్రమే కాదు. పిల్లల్లో శారీరక, మానసిక ఉద్వేగ, సాంఘిక, సాంస్కృతిక వికాసాలు కలిగించడాన్నే సమగ్ర వికాసం అంటారు. పాఠశాలలో కల్పించే అభ్యసన అనుభవాలన్నీ పిల్లల సమగ్ర వికాసానికి తోడ్పడేవిగా ఉండాలి. కాబట్టి మూల్యాంకనం కూడా సమగ్రతను కలిగి ఉండాలి.


 నిరంతర సమగ్ర మూల్యాంకనం - లక్ష్యాలు
"విద్యార్థుల భావిజీవితానికి అవసరమైన విశ్లేషణాత్మక, సృజనాత్మక, తార్కిక ఆలోచనశక్తి, స్వీయ క్రమశిక్షణ, సామాజికంగా సర్దుబాటు చేసుకోవడం, సమస్యల పట్ల సున్నితంగా ప్రతిస్పందించడం, పరిష్కరించుకోవడం మొదలైన జీవన నైపుణ్యాలు, సామర్థ్యాలు పెంపొందించడం పాఠశాల బాధ్యత" అని జాతీయ ప్రణాళిక చట్రం - 2005 పేర్కొంటోంది.
* అందుకే నిరంతర సమగ్ర మూల్యాంకనంలో విద్యార్థుల శారీరక, మానసిక ఉద్వేగ, సాంఘిక వికాసాలన్నింటిని సమాన ప్రాధాన్యతతో మదింపు చేయాలని నిర్దేశించారు.
లక్ష్యాలు:
              1. బోధన అభ్యసన ప్రక్రియలో మూల్యాంకనం ఒక అంతర్భాగం.
              2. విద్యార్థుల్లో జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక నైపుణ్యాలు పెంపొందించడం.
              3. బోధనాభ్యసన ప్రక్రియ విద్యార్థి కేంద్రీకృతంగా సాగేటట్లు చూడటం.
              4. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరచడం.
              5. బట్టీ పద్ధతి కాకుండా, విశ్లేషణాత్మక ఆలోచనలతో సరైన భావాలను వ్యక్తపరచేలా చేయడం.
             6. అభ్యసన ప్రక్రియలో విద్యార్థులు ఎక్కడ వెనుకబడుతున్నారో తెలుసుకుని సవరణాత్మకంగా బోధించడం.

* నిరంతర సమగ్ర మూల్యాంకనం వల్ల ఉపాధ్యాయుడు మరింత సమర్థంగా బోధనా ప్రణాళికలను రూపొందించుకోవడానికి అవకాశం కలుగుతుంది.
* వ్యక్తిగతంగా విద్యార్థుల బలాలు, బలహీనతలు, వారి అవసరాలు, ఆసక్తులను ఉపాధ్యాయుడు తెలుసుకుని, వారిలో సరైన అభిరుచులు, వైఖరులను గుర్తించడానికి నిరంతర సమగ్ర మూల్యాంకనం చాలా తోడ్పడుతుంది.
* విద్యార్థుల ప్రగతిని అంచనా వేయడంలో ప్రాథమిక పాఠశాల స్థాయిలో మదింపు చేయాల్సిన అంశాలు 12 ఉన్నాయి. అవి... 1. భాష 2. గణితం 3. పరిసరాల విజ్ఞానం 4. విజ్ఞానశాస్త్రం 5. సాంఘికశాస్త్రం 6. కళా విద్య 7. ఆరోగ్య విద్య 8. వ్యాయామ విద్య 9. సంగీతం - నృత్యం 10. పని విద్య 11. సాంకేతిక విద్య 12. నైతిక విద్య.

 

మదింపు విధానాలు
1. నిర్మాణాత్మక మదింపు (Formative)
2. సంగ్రహణాత్మక మదింపు (Summative)
* నిర్మాణాత్మక మదింపు: బోధన అభ్యసన జరుగుతున్న సమయంలో ఉపాధ్యాయుడు తరగతి గదిలోనే విద్యార్థులు తమను తాము సరిచేసుకునే వీలు కల్పిస్తూ, వారికి పరిపుష్టి కలిగించడానికి తోడ్పడుతుంది.
* సంగ్రహణాత్మక మదింపు: బోధన అభ్యసన కార్యక్రమం పూర్తయిన తర్వాత విద్యార్థుల సాధనను, సామర్థ్యాలను పరీక్షించే పద్ధతి ఇది.

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌