• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రప్రదేశ్ ఉనికి, శీతోష్ణస్థితి, నదీవ్యవస్థ

   శ్రీ పొట్టిశ్రీరాములు చేసిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా 1953 అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. హైదరాబాద్ సంస్థానంలో తెలుగు ప్రాంతమైన తెలంగాణాను, ఆంధ్రరాష్ట్రంతో కలిపి, 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్.
      ఉనికి: భారతదేశంలో ఆగ్నేయంగా 12º.37' నుంచి 19º.54' ఉత్తర అక్షాంశాల మధ్య 76º.46' నుంచి 84º.46' తూర్పు రేఖాంశాల మధ్య ఆంధ్రప్రదేశ్ విస్తరించి ఉంది.
* దేశంలోని రాష్ట్రాల్లో వైశాల్యంలో 4వ పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ కంటే పెద్ద రాష్ట్రాలు వరుసగా
       1) రాజస్థాన్ 2) మధ్యప్రదేశ్ 3) మహారాష్ట్ర.

ఆంధ్రప్రదేశ్ - భౌతిక నిర్మాణం
 

       1. కోస్తా ఆంధ్ర 2. రాయలసీమ 3. తెలంగాణ.
* ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 23 జిల్లాలు ఉన్నాయి. విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లా - అనంతపురం, అతిచిన్న జిల్లా- హైదరాబాద్.
* ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు దాదాపు 972 మీటర్లు.
కోస్తా ఆంధ్ర: ఈ ప్రాంతాన్ని 'దక్షిణ భారతదేశ ధాన్యాగారం'గా పిలుస్తారు. వ్యవసాయపరంగా అభివృద్ధి సాధించడంతో జనాభా కూడా కేంద్రీకృతమై ఉంటుంది.


* రాయలసీమ: శిలామయమైన నిస్సార మృత్తికలు, నిలకడలేని వర్షపాతం వల్ల తరచూ కరవులు సంభవిస్తుంటాయి. ఇక్కడ జనసాంద్రత చాలా తక్కువ.
* తెలంగాణా ప్రాంతం: అనార్ధ్రతతో కూడిన చవిటి నేలలు ఉంటాయి. చెరువు నీటి ద్వారా మెట్ట పంటలు పండిస్తుంటారు. కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో పోలిస్తే పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధి అంతా హైదరాబాద్ - సికింద్రాబాద్ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది.


నైసర్గిక మండలాల విభజన
     1. తీర మైదానం      2. తూర్పు కనుమలు     3. పడమటి పీఠభూమి.
    
1. తీర మైదానం: ఉత్తరాన మహేంద్రగిరి నుంచి దక్షిణాన పులికాట్ సరస్సు వరకు, దాదాపు 972 కి.మీ. పొడవున వ్యాపించి ఉంది.
* కృష్ణా-గోదావరి డెల్టాల మధ్య ఉన్న పల్లపు ప్రాంతం 'కొల్లేరు' సరస్సుగా ప్రసిద్ధిగాంచింది. కొల్లేరు మంచినీటి సరస్సు. దీని విస్తీర్ణం 250 చ.కి.మీ.

* తీర మైదాన మధ్యభాగంలో కృష్ణా, గోదావరి నదులు ఏర్పరచిన ఒండ్రు నేలలతో కూడిన సారవంతమైన మైదానం (డెల్టా) ఉంది.
* తీర మైదాన దక్షిణభాగంలో నెల్లూరు జిల్లా దక్షిణ సరిహద్దుకి, తమిళనాడు రాష్ట్రానికి మధ్య సముద్రపు నీరు తీరమైదానంలోకి చొచ్చుకుని రావడం వల్ల పులికాట్ సరస్సు ఏర్పడింది. ఇది ఉప్పునీటి సరస్సు. దీని వైశాల్యం
460 చ.కి.మీ.

 

2. తూర్పు కనుమలు: ఇవి చార్నోకైట్, ఖొండాలైట్ శిలలతో ఏర్పడ్డాయి. తూర్పు కనుమల్లో ఎత్తయిన శిఖరం - మహేంద్రగిరి (1501 మీటర్లు). తూర్పు కనుమలను విభిన్న ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు.
        1. ఉభయ గోదావరి జిల్లాలు - పాపికొండలు
        2. చిత్తూరు జిల్లా - హార్సీలీహిల్స్, శేషాచలం కొండలు
        3. కృష్ణా జిల్లా - కొండపల్లి కొండలు
        4. విశాఖపట్నం - డాల్ఫిన్‌నోస్ కొండ
        5. అనంతపురం - మడకశిర, పెనుగొండ
        6. కర్నూలు - నల్లమల కొండలు
        7. నెల్లూరు - ఎర్రమల, వెలికొండలు

 

3. పడమటి పీఠభూమి: పడమటి పీఠభూమి పురాతనమైన ఆర్కియన్ శిలలతో ఏర్పడింది. పడమటి పీఠభూమిలో తెలంగాణా ప్రాంతం, రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలు కూడా కలిసి ఉన్నాయి. ఈ పీఠభూమి ఉత్తరభాగంలోని గోదావరి పరీవాహక ప్రాంతంలో గోండ్వానా శిలలు ఉన్నాయి. గోండ్వానా శిలల్లో దొరికే ప్రధాన ఖనిజం - బొగ్గు. ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ సముద్రమట్టం కంటే 600 మీటర్ల ఎత్తులో పడమటి పీఠభూమిలోనే నెలకొని ఉంది.
 

శీతోష్ణస్థితి

అక్షాంశాల ఉనికి ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ఆయనరేఖా మండలంలో ఉంది. మనరాష్ట్ర శీతోష్ణస్థితి రుతుపవనాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఇక్కడి శీతోష్ణస్థితిని ఆయనరేఖా రుతుపవన శీతోష్ణస్థితి అంటారు. రామగుండంలో అత్యధిక సగటు ఉష్ణోగ్రత 34.5ºC నమోదవుతుంది. మైసూరు పీఠభూమికి ఆనుకుని ఉన్న చిత్తూరు, అనంతపురం జిల్లాలు ఇతర ప్రాంతాల కంటే చల్లగా ఉంటాయి.
          ఆంధ్రప్రదేశ్‌లో సంవత్సరాన్ని నాలుగు రుతువులుగా విభజించవచ్చు.
         1. శీతాకాలం - జనవరి నుంచి ఫిబ్రవరి
         2.  వేసవికాలం - మార్చి నుంచి జూన్ మధ్య వరకు
         3.  వర్షాకాలం- జూన్ రెండోవారంనుంచి సెప్టెంబరు వరకు
         4. ఈశాన్య రుతుపవన కాలం - అక్టోబరు నుంచి డిసెంబరు వరకు
¤ నైరుతి రుతుపవనాలు జూన్ రెండోవారంలో మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి. ఒక్క నెల్లూరు జిల్లా మినహా రాష్ట్రమంతటా వర్షాలు విస్తరిస్తాయి. అక్టోబరు మాసంలో నైరుతి రుతుపవనాలు తిరోగమనమై, ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి. వీటి వల్ల ఉత్తర ప్రాంతాల కంటే దక్షిణ ప్రాంతాల్లోనే ఎక్కువ వర్షపాతం సంభవిస్తుంది. నెల్లూరు జిల్లాలో 70 శాతం వర్షపాతం ఈశాన్య రుతుపవనాల వల్ల కురుస్తుంది. వాయుగుండాల వల్ల దక్షిణ కోస్తా జిల్లాలకు తరచూ తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌