• facebook
  • whatsapp
  • telegram

కళలు - కళాకారులు

తెలంగాణ టెట్‌ తెలుగులో కళలు - కళాకారులకు సంబంధించిన అంశం కీలకమైంది. ఇందులో గంగిరెద్దులాట, జోగాట, గరగ నృత్యం, ఒగ్గు కథ, చిందు భాగవతం లాంటి కళలతోపాటు, శారదకాండ్రు, ఆసాదులు, వీరముష్టి వారు, బుడబుక్కల వారు మొదలైన కళాకారుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఒగ్గు కథ

* ఒగ్గు అనేది అచ్చమైన తెలంగాణ దేశీ పదం.

* శివుడి చేతిలోని ఢమరుకానికి ఒగ్గు అని పేరు.

* ఒగ్గు అంటే త్రినేత్రుడైన శివుడ్ని ప్రార్థించడం లేదా వేడుకోవడం అని అర్థం.

* ఒగ్గు కథల్ని తెలంగాణ ప్రాంతంలో గొల్ల, కురుమలు తమ కుల పురాణంగా భావిస్తారు.

* కురుమ కులానికి చెందిన వారు ఈ ఒగ్గు కథను ప్రదర్శిస్తారు.

* తెలంగాణలో అత్యంత ప్రచారంలో ఉన్న ఒగ్గు కథలు గొల్ల సుద్దులు.

* ఒగ్గు కథను ప్రదర్శించడంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కళాకారులు మిద్దె రాములు (కరీంనగర్‌), చుక్క సత్తయ్య (జనగాం).


చిందు భాగోతం


* మాదిగ కులంపై ఆధారపడిన డొక్కలివారు ప్రదర్శిస్తారు.

* చిందు భాగవతులు ‘ఎల్లమ్మ’ను ఆరాధ్య దైవంగా కొలుస్తారు.

* 18 మంది కళాకారులుండే ఈ ప్రదర్శన ఎల్లమ్మ దర్శనంతో ప్రారంభమవుతుంది.

* చిందు భాగవతం పాత్రలను హాస్యంగా పరిచయం చేసే బుడ్డర్‌ఖాన్‌ పాత్ర ముఖ్యమైంది. 

* పొణికి కర్రతో చేసిన నగల్ని ధరించి ఎవరి పాత్రకు వారే వేషధారణ చేసుకుంటారు.

* నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో చిందు భాగవతాన్ని ప్రదర్శించే కళాబృందాలు ఉన్నాయి.

కళాకారులు: నల్గొండ జిల్లా తుక్కాపురానికి చెందిన గడ్డం రాజలింగం.

* ఆలేరు మండలం, సాయిగూడేనికి చెందిన పిల్లుట్ల సంజీవ.

* కాట్‌పల్లికి చెందిన జి.స్వామి; సోమారామానికి చెందిన బాల నర్సయ్య.

* సుద్దాలకు చెందిన గడ్డం యాదగిరి; వెంకటాపురానికి చెందిన గడ్డం స్వామి.

గంగిరెద్దులాట

* గంగిరెద్దులను ఆడించేవారు పూజగొల్ల కులానికి చెందినవారు.

* ఒక గంగిరెద్దుతో ముగ్గురు వ్యక్తులుంటారు.

* ఒకరు గంగిరెద్దును ఆడిస్తే, మరొకరు డోలు వాయిస్తారు. మూడో వ్యక్తి సన్నాయి వాయిస్తాడు.

* సాధారణంగా వీరు డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎక్కువగా ప్రదర్శనలు చేస్తారు.

జోగాట

* హరిజనుల్లో ఒక తెగకు సంబంధించిన వారే ఈ జోగువారు.

* వీరు సంతోష సమయాల్లో, వేడుకలు-ఉత్సవాలప్పుడే కాకుండా తమ జాతివారెవరైనా మరణించినప్పుడు కూడా డప్పులు వాయిస్తూ నృత్యం చేస్తూ పిండోత్పత్తి క్రమాన్ని వర్ణిస్తారు.

తెలంగాణ లత్కోర్‌సాబ్‌

* తెలంగాణలో పిట్టల దొర వేషాన్ని లత్కోర్‌సాబ్, బుడ్డర్‌ఖాన్, తుపాకీ రాముడు అని పిలుస్తారు.

* ఇది పగటి వేషాల్లో ఒక రకం. పిట్టల దొర వేషగాళ్లు సమాజంలో ఉన్న చెడు విషయాల గురించి హాస్యంతో వ్యంగ్య రూపంలో ప్రదర్శిస్తారు.

కప్పతల్లి

* ఇది అత్యంత ప్రాచీనమైన జానపద కళ.

* నృత్యం, పాట, తప్పెట, లయతో ఈ జానపద  కళ ఎంతో రమ్యంగా ఉంటుంది.

* కోస్తా - రాయలసీమల్లో ఈ కళను ‘తప్పెటగుళ్లు’గా పిలుస్తారు.

గరగ నృత్యం

* ఇది చాలా ప్రాచీన జానపద నృత్య నాటికల్లో ఒకటి.

* తలపై కుండను పెట్టుకుని నృత్యం చేస్తారు. దీన్ని ఘట నృత్యం అని కూడా పిలుస్తారు.

కోలాటం

* ఇది మనదేశంలోని అన్ని ప్రాంతాల్లో ఏదో ఒక రూపంలో ప్రదర్శితమవుతుంది.

* స్త్రీపురుషులిద్దరూ ప్రదర్శించడానికి అనువైన కళారూపం.

డప్పు నాట్యం

* తెలంగాణకే పరిమితమైన రసవత్తర నాట్యం.

* 1520 మంది ఉన్న నాట్య బృందం కాళ్లకు గజ్జెలు కట్టి డప్పులను వాయిస్తూ నాట్యం చేస్తారు.

పేరిణి తాండవ నృత్యం

* ఇది వీరనాట్య శైలికి చెందింది.

* ఈ నృత్యం చేసే కళాకారులు వీరావేశంతో నాట్యం చేస్తారు.

* ఈ నృత్యం కాకతీయుల కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది.

* కాకతీయులు పాలించే సమయంలో వీరశైవ సైనికులకు ప్రేరణ కలిగించడానికి ఈ నృత్యాన్ని కనిపెట్టారు.

* పేరిణి నాట్యంపై పరిశోధన చేసి పునరుద్ధరించింది నటరాజ రామకృష్ణ.

మయూరి నృత్యం

* ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే తెగలు తలకు కొమ్ములు ధరించి చేసే నృత్యమే ‘మయూరి నృత్యం’.

రేల నృత్యం

* దీన్నే రేలాట అంటారు.

* రేల నృత్యం భద్రాచలం మన్యం ప్రాంతంలో బాగా  ప్రచారంలో ఉంది.

* అడవి జాతుల్లో కోయతెగకు చెందిన మహిళలు ఈ నృత్యం చేస్తారు.

* ఈ నృత్యాన్ని రేలచెట్టు కింద నలుగురు కంటే ఎక్కువ మంది కోయ స్త్రీలు చేస్తారు. అందుకే దీనికి రేల నృత్యం అనే పేరు వచ్చింది.

గుస్సాడి నృత్యం

* ఇది గోండు జాతివారు చేసే నృత్యం.

* ఈ నృత్య కార్యక్రమం పౌర్ణమి రోజు ప్రారంభమై సుమారు 14 రోజులు జరుగుతుంది.

* గుస్సాడి నృత్యాన్ని ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాలో నివసించే గోండులు ప్రదర్శిస్తారు.

చుట్టకాముడు

* చుట్టకాముడు తెలంగాణ ప్రజాపోరాట కాలంలో పోరాట జీవిత గాథలను ప్రతిబింబించే జానపద నృత్యం.

* నల్గొండ జిల్లాలో చుట్టకాముడు చాలా ప్రసిద్ధిపొందింది.

ధులానృత్యం

* ధులా అనే కళారూపం తెలంగాణ ప్రాంతంలో అధిక ప్రచారంలో ఉంది.

* ఇది ముఖ్యంగా శ్రమజీవుల కళారూపం.

* ‘‘ధులానృత్యం ముస్లింలు జరుపుకునే పీర్ల పండగకు సంబంధించింది’’ అని జయధీర్‌ తిరుమలరావు పేర్కొన్నారు.

* ధులానృత్యం స్త్రీలు పాల్గొనే చుట్టకాముడు ఆటకి దగ్గరగా ఉంటుంది. దీన్ని పురుషులు రాత్రిపూట మాత్రమే ప్రదర్శిస్తారు.

లంబాడి నృత్యం

* వరి నాట్లు, కోతలు ఇంకా ఇతర వ్యవసాయ పనుల్లో బంజారాలు పరవశించి చేసేదే లంబాడీ నృత్యం.

* తెలంగాణ ప్రాంతంలో పెళ్లిళ్లు, హోళీ, ఏరువాక సందర్భాల్లోనూ దీన్ని బంజారాలు ప్రదర్శిస్తారు.

గొరవయ్య నృత్యం

* ఈ నృత్యాన్ని కురుబ వంశస్థులు చేస్తారు.

* ఇది వీర శైవ మతానికి చెందింది. ఈ నృత్యాన్ని చేసే కళాకారుల్లో ప్రతి కుటుంబంలోని ఒకరు గొరవయ్యలాగా అలంకరించుకుని ఇళ్లకు వెళ్లి అడుక్కోవడం వీరి ఆచారం.

యానాది భాగవతం

* వీరు చెంచులక్ష్మి కథను ఎంతో రమ్యంగా చెబుతారు.

* దీన్నే ‘గరుడాచల భాగవతం’గా పిలుస్తారు.

బిట్రో నిట్రో

* ముకెబర్ల జంగాలు హైరో సైరో - బిట్రో నిట్రో, జగితగ - బిట్రో నిట్రో మకుటంతో ఉండే బిట్రో - నిట్రో పదాలను పాడతారు.

* వీరు నేటికీ బిట్రేశ్వరుడు, నిట్టేశ్వరీదేవి అనే దేవుళ్లను పూజిస్తున్నారు.

* ముకెబర్ల జంగాలు అనే తెగవారు కాకతీయుల కాలంలో శైవులు.

కళాకారులు

శారదకాండ్రు

* తెలంగాణలో శారద కథగా పేరొందిన ఈ కళారూపం బుర్రకథను పోలి ఉంటుంది.

* ఈ కళను ప్రదర్శించేవారు ఎక్కువగా వరంగల్‌ జిల్లాలో ఉన్నారు.

* శారదకాండ్రు ఉపయోగించే ‘తంబురాను’ శారద అంటారు. అందుకే వారికి శారదకాండ్రు అనే పేరు వచ్చింది.

కొలనుపాక భాగవతులు లేదా గంటె భాగవతులు

* గరిటె చమురు దీపం వెలిగించి ఆ వెలుతురులో కథ చెబుతారు.

* తెలంగాణలో గంటె భాగవతం చెప్పేవారు కరీంనగర్‌లోని కొలనుపాకలో ఉన్నారు. అందుకే వీరికి కొలనుపాక భాగవతులు అని పేరు వచ్చింది.

* గంటె భాగవతం కేవలం రాత్రిపూట మాత్రమే ప్రదర్శించే కళారూపం.

ఆసాదులు

*  శూద్ర కులానికి చెందిన అర్చకులను ఆసాదులు అంటారు.

* వీరు అమ్మవార్లను తాంత్రిక పద్ధతిలో పూజిస్తారు.

* మాల కులంలో మాలదాసర్లు ఉన్నట్లు, మాదిగ కులంలో ఆసాదులు ఒక తెగ.

* మాదిగ ఆసాదులు ముఖ్యంగా ఎల్లమ్మ కథను గానం చేస్తూ చిందులు వేస్తారు.

* ఆసాదులంటే మాల-మాదిగ కులాల్లో పూజారి వర్గానికి చెందిన వారని ఆరుద్ర పేర్కొన్నారు.

బిక్షుక కుంట్లు

* తెలంగాణలో వీరు కూడా సంచార జాతికి చెందిన కళాకారులే.

* భిక్షుక కుంట్ల కళాకారులు సత్యహరిశ్చంద్ర, మార్కండేయ, ప్రహ్లాద, గంగా - గౌరి లాంటి కథలు చెబుతారు.

* ఈ ప్రదర్శనలో నలుగురు కళాకారులు పాల్గొంటారు.

* ప్రధాన కథకుడు చేతిలో ‘పన్ను కర్ర’ పట్టుకుని కథను చెప్తే మిగతా కళాకాకారులు మద్దెల, హార్మోనియం, తాళాలు వాయిస్తారు.

జముకుల వారు

* వీరినే బవనీలు అని పిలుస్తారు.

* వీరు పోచమ్మ, ఎల్లమ్మ, అక్కమ్మ, సారంగధర మొదలైన గ్రామ దేవతల కథలను చెప్తారు.

* జముకుల వారు ఉపయోగించే వాయిద్యాల్లో ‘జమిడిక’ లేక ‘బవనిక’ అనే వాయిద్యం ముఖ్యమైంది.

బుడగ జంగాలు

* వీరు శివ భక్తులు. ఒక చేతిలో గంట వాయిస్తూ శివుడి గురించి యక్షగానం చేస్తూ భిక్షాటన చేస్తారు.

* బుడగ జంగాలను ‘జంగమ దేవర’ అంటారు.

* వీరు వాయించే గంటపైన చిన్న నంది విగ్రహం ఉంటుంది.

వీరముష్టి వారు

* వీరు వైశ్యకుల ఆశ్రితులు.

* వైశ్య కుల ఆరాధ్య దైవమైన శ్రీ కన్యకాపరమేశ్వరి దేవి గురించి అనేక పాటలు పాడతారు.

* వీరు జంగాల దగ్గరకు కూడా వెళ్లి యాచిస్తారు.

బుడబుక్కల వాళ్లు

* వీరు తెలంగాణలో సంచార జాతికి చెందినవారు.

* తెల్లవారుజామున విచిత్రమైన వేషధారణతో ఢమరుకం వాయిస్తారు.

* వీరు ఎక్కువగా జ్యోతిషం చెబుతూ, తాయెత్తులు కడుతూ యాచక వృత్తి చేస్తారు.

ఢోడీల ప్రదర్శన

* సంచార జాతులైన బంజారాలను లంబాడీలు, సుగాలీలు అని పిలుస్తారు.

* వీరిని భట్టు, భట్‌ అని కూడా అంటారు.

విప్ర వినోదులు

* వీరిని తెలంగాణ ప్రాంతంలో మాయాజాల కళాకారులని పిలుస్తారు.

* వీరిని కోస్తా ప్రాంతంలో విప్ర వినోదులని, రాయలసీమలో గారడీ కళాకారులని అంటారు.

Posted Date : 05-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌