• facebook
  • whatsapp
  • telegram

పారిశ్రామిక విప్లవం

క్రీ.శ. 1500 నుంచి 1800 మధ్య ప్రపంచ వ్యాప్తంగా ఆఫ్రికా, అమెరికా, ఆసియా, యూరప్‌ ఖండాల్లోని దేశాల మధ్య వర్తక వ్యాపారం బాగా వృద్ధి చెందింది. ముఖ్యంగా ఆ సమయంలో వస్త్ర వ్యాపారం బాగా విస్తరించింది.


సబ్‌ కాంట్రాక్ట్‌ విధానం: ఫ్యాక్టరీల నిర్మాణం లేని సమయంలో వస్త్ర తయారీలో వివిధ దశలను వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించేవారు. దీన్నే సబ్‌ కాంట్రాక్ట్‌ విధానం (Putting out System) అంటారు. ఉదా: మధ్యవర్తి చేనేత వస్త్రాలు తయారు చేసే చేతివృత్తుల వారి ఇళ్లకు వెళ్లి వారికి ముడి పదార్థాలు ఇచ్చి, వస్త్రాలు తయారు చేయించేవారు. తయారైన వస్త్రం వ్యాపారికి చేరేది. 

కర్మాగారం (Factory): వస్త్ర వ్యాపారులు చేతి వృత్తులవారందరినీ ఒకే ప్రదేశానికి తెచ్చి, తమకు కావాల్సిన విధంగా వస్తువులను ఉత్పత్తి చేయించుకొనేవారు. దీన్నే ‘కర్మాగారం’ అంటారు. కర్మాగారంలో పని సమయం రోజూ ఉదయం 6 నుంచి సాయంత్రం 8.30 వరకు.

పూర్వ పారిశ్రామికాభివృద్ధి దశ (Proto Industrialisation): పనివాళ్లు తమ సొంత పనిముట్లతో కర్మాగారానికి వచ్చి, వ్యాపారి ఇచ్చే ముడిపదార్థాలతో వస్తువులను తయారు చేసేవారు. వీటిని వర్తకుడు మార్కెట్‌లోకి తీసుకెళ్లేవాడు.

* చేతివృత్తి పనివారిపై వర్తకుడి ఆధిపత్యం పెరిగిన విధానాన్నే పూర్వ పారిశ్రామికాభివృద్ధి దశ అంటారు.

యాంత్రిక దశ (Machine Age): బ్రిటన్‌లో యంత్రాలు, వాటితో తయారుచేసిన వస్తువులను ఉపయోగించడాన్ని యాంత్రిక దశ ప్రారంభంగా పేర్కొంటారు (లేదా) 1750లో బ్రిటన్‌లో పెరిగిన ప్రజా రవాణా యంత్రాల వాడకం, ఆవిరి శక్తి వినియోగాన్ని యాంత్రిక శక్తి ప్రారంభంగా చరిత్రకారులు అభివర్ణించారు.

పెట్టుబడిదారులు (Investors): వస్తువుల ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాలను, సహజ వనరులను వెలికితీయడానికి కావాల్సిన పెట్టుబడిని పెట్టే వారిని పెట్టుబడిదారులు అంటారు. ఉదా: భూమి, యంత్రాలు, యంత్ర పరికరాలు, మానవ వనరులు మొదలైనవి.

పారిశ్రామిక విప్లవం (Industrial Revolution): వస్తువుల తయారీలో వచ్చిన విప్లవాత్మక మార్పునే పారిశ్రామిక విప్లవం అంటారు. ఇది 18వ శతాబ్దంలో (1750-1850) మొదటిసారి బ్రిటన్‌లో సంభవించింది. 

* పారిశ్రామిక విప్లవం అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించింది: ఫ్రాన్స్‌లో జార్జెస్‌ మిష్లెట్, జర్మనీలో ఫెడరిక్‌ ఎంగెల్స్‌. 

* పారిశ్రామిక విప్లవం అనే పదాన్ని తొలిసారిగా ఇంగ్లిష్‌లో ఉపయోగించింది - ఆర్నాల్డ్‌ టోయిన్‌ బీ.


బ్రిటన్‌లో పరిశ్రమల స్థాపన, వాటి అభివృద్ధికి కారణాలు


రాజకీయ స్థిరత్వం: ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లాండ్‌ దేశాలు బ్రిటన్‌ రాచరికం కింద ఏకీకృతం అయ్యాయి. దీంతో 17వ శతాబ్దం నుంచే బ్రిటన్‌లో రాజకీయ స్థిరత్వం ఏర్పడింది.

వాతావరణ పరిస్థితులు: ఇక్కడి వాతావరణ పరిస్థితులు వస్త్ర పరిశ్రమకు బాగా అనుకూలించాయి. బ్రిటన్‌లో అపారమైన జలవనరులు ఉన్నాయి.

పెట్టుడులు: బ్రిటన్‌లో అపారమైన సంపద ఉంది. దీంతో ఆ దేశం తేలిగ్గా పెట్టుబడులు సమకూర్చుకుంది.

కార్మికులు: పరిశ్రమల్లో పనిచేసేందుకు బ్రిటన్‌లో ఎక్కువ సంఖ్యలో కార్మికులు అందుబాటులో ఉన్నారు.

రవాణా వ్యవస్థ: 18 శతాబ్దం నాటికే సముద్రయానానికి కావాల్సిన అన్ని వసతులను బ్రిటన్‌ సమకూర్చుకుంది. ఇక్కడ అనేక రేవులు ఉన్నాయి.


18వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు


జాక్‌ కే, జేమ్స్‌ హర్‌గ్రేవ్స్‌: చేనేత, వడ్రంగి వనుల్లో నైపుణ్యం కలిగిన వారు.

రిచర్డ్‌ ఆర్క్‌రైట్‌: జుట్టును కత్తిరించడం, విగ్గుల తయారీలో ప్రసిద్ధి పొందారు.

ఎడ్మండ్‌ కార్ట్‌రైట్‌: సాహిత్యం, వైద్యం, వ్యవసాయ శాస్త్రాలు చదివాడు.

థామస్‌ సావేరి: ఇతడు సైనికాధికారి.

థామస్‌ న్యూకొమెన్‌: కమ్మరి పని చేసేవాడు.

జేమ్స్‌ వాట్‌: యంత్ర చలనాలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. ఆవిరి యత్రాన్ని కనుక్కున్నాడు. నీటిని తోడటానికే కాకుండా కర్మాగారాల్లో యంత్రాలను కదిలించడానికి కూడా ఇవి ఉపయోగపడ్డాయి. 1776లో మాథ్యూ రాబిన్సన్‌ బౌల్టన్‌తో కలిసి ‘సోహో ఫౌండ్రీ’ని స్థాపించాడు. అందులో ఆవిరితో నడిచే యంత్రాలు తయారు చేసి, అమ్మాడు. ఈ విధంగా వచ్చిన లాభంలో జేమ్స్‌ వాట్‌ 1/3వ వంతు, బౌల్టన్‌ 2/3వ వంతు పంచుకున్నారు. 1840 నాటికి మొత్తం యూరప్‌లో 70% ఆవిరి యంత్రాలను ఈ ఫ్యాక్టరీ అందించింది. జలరవాణాకు ఆవిరి యత్రాన్ని ఉపయోగించడం వల్ల ప్రయాణ ఖర్చు 1/3వ వంతు తగ్గింది.

జాన్‌ మెట్‌కాఫ్‌: రోడ్ల ఉపరితలాలను సర్వే చేసి వాటి నిర్మాణానికి ప్రణాళికలను తయారుచేశాడు. ఆరేళ్ల వయసులో ఇతడు కంటి చూపు కోల్పోయాడు.

జేమ్స్‌ బ్రిండ్లే: ఇతడు చదువుకోలేదు. అయిన్పటికీ ఊహాశక్తి, తెలివితేటలు, ఏకాగ్రత ఎక్కువగా ఉన్నాయి. ఇతడు వర్స్‌లీ కాలువను నిర్మించాడు. దీన్ని మొదటి ఇంగ్లిష్‌ కాలువగా పిలుస్తారు. మాంచెస్టర్‌ సమీపంలోని వర్స్‌లీ గనుల నుంచి బొగ్గును తరలించడానికి ఇతడు ఈ కాలువ తవ్వించాడు.

జార్జ్‌ స్టీఫెన్‌ సన్‌: ఇతడు 1814లో మొదటి ఆవిరి రైలు ఇంజిన్‌ను రూపొందించారు. 1830లో ఈ ఇంజిన్‌ లివర్‌పూల్‌ నుంచి మాంచెస్టర్‌ మధ్య 64 కి.మీ. దూరాన్ని గంటకు 46 కి.మీ. వేగంతో చేరింది.

జాన్‌ లెడేన్‌ మెక్‌డమ్‌: 1840లో కంకర/ రోడ్డు రోలర్‌ విధానాన్ని ప్రవేశపెట్టాడు.

రైట్‌ బ్రదర్స్‌: 20వ శతాబ్దం తొలినాళ్లలో రైట్‌ బ్రదర్స్‌ విమానాన్ని కనుక్కున్నారు.

పారిశ్రామిక విప్లవానికి ముందు ఆయా శాస్త్త్ర్రవేత్తల ఆవిష్కరణలు
యంత్రం పేరు ఆవిష్కర్త పేరు
స్పిన్నింగ్‌ జెన్నీ జేమ్స్‌ హార్‌ గ్రీన్స్‌
స్టీమ్‌ ఇంజిన్‌ జేమ్స్‌ వాట్‌
ఉక్కు తయారీ హెన్రీ బెస్‌మర్‌
విద్యుత్‌ బల్బు థామస్‌ ఆల్వా ఎడిసన్‌
అచ్చుయంత్రం జాన్‌గుటెన్‌ బర్గ్‌
టెలిగ్రాఫ్‌ శ్యామూల్‌ ఎఫ్‌బీ మోర్స్‌
టెలిఫోన్‌ అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌
కంకర రోడ్డు జాన్‌మెక్‌డమ్‌

డర్బీలు: బ్రిటన్‌లో ప్రావ్‌షైర్‌కు చెందిన కమ్మరి పనిచేసే కుటుంబాలను డర్బీలు అంటారు. వీరిలో మూడు తరాలకు చెందిన వారు అనేక ఆవిష్కరణలు చేశారు. వారు:

అబ్రహం డర్బీ: 50 ఏళ్లు కృషి చేసి మిశ్రమలోహ పరిశ్రమలో విప్లవం తీసుకొచ్చాడు. 

అబ్రహం డర్బీ I (క్రీ.శ. 1677-1717): 1709లో కొలిమి బట్టీని కనుక్కున్నాడు. బొగ్గు నుంచి గంధకం ఇతర మలినాలు తొలగించి కోక్‌ రూపాంతరాన్ని తయారు చేశాడు.

అబ్రహం డర్బీ II (క్రీ.శ. 1711-68): ముడి ఇనుము నుంచి తేలిగ్గా విరగని ఇనుమును తయారు చేశాడు.

అబ్రహం డర్బీ III (క్రీ.శ. 1750-1791): ‘కోల్‌ బ్రూక్‌ డైల్‌’ వద్ద ఇనుప పోల్స్‌తో వంతెనను నిర్మించాడు.

హెన్రీ కోర్ట్‌ (క్రీ.శ. 1740-1828): ముడి ఇనుమును కరిగించి, అందులోని వ్యర్ధాలను తొలగించి, దాన్ని పోల్‌గా తయారు చేశాడు. వాటిపై ఆవిరి యంత్రాలు (రైళ్లు) ప్రయాణించొచ్చని కనుక్కున్నాడు.


ప్రపంచీకరణ


జాయింట్‌ వెంచర్‌: బహుళజాతి సంస్థలు/ కంపెనీలు ఆయా దేశాల స్థానిక కంపెనీలతో కలిసి వస్తువులను ఉత్పత్తి చేయడాన్ని జాయింట్‌ వెంచర్‌ అంటారు.

ఉదా: అమెరికాకు చెందిన ఫోర్డ్‌ మోటార్స్‌ కంపెనీ 1995లో భారత్‌కు చెందిన మహేంద్ర అండ్‌ మహేంద్ర కంపెనీతో కలిసి రూ.1700 కోట్లతో చెన్నై సమీపంలో ఉత్పత్తులను ప్రారంభించింది.

గమనిక: భారత్‌లో బహుళజాతి సంస్థలకు ప్రధాన ఉదాహరణ టాటా మోటార్స్, సుందరం ఫాస్టెనర్స్‌ (నట్లు, బోల్టులు), రాన్‌బాక్సీ (మందులు) మొదలైనవి.


అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF)

స్థాపన: 1945,  ప్రధాన కార్యాలయం: వాషింగ్టన్‌ డి.సి.

సభ్య దేశాలు: 190

మేనేజింగ్‌ డైరెక్టర్‌: క్రిస్టలీనా జార్జియేవా

ఉద్దేశం: ప్రపంచ దేశాలకు స్వల్పకాలిక రుణాలను (వడ్డీతో) ఇస్తుంది. 

ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ రీకన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (IBRD) లేదా ప్రపంచ బ్యాంక్‌:

స్థాపన: 1945, ప్రధాన కార్యాలయం: వాషింగ్టన్‌ డి.సి.

సభ్య దేశాలు: 189,  ప్రస్తుత అధ్యక్షుడు: డేవిడ్‌ మాల్పస్‌

ఉద్దేశం: అల్పాదాయ, మధ్య ఆదాయ దేశాలకు రుణాలు, విరాళాలు ఇచ్చి మూలధనాన్ని ప్రోత్సహించడం. 

* IBRD, IMFలను ‘బ్రెట్టన్‌వుడ్స్‌ కవలలు’ అంటారు.


ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌ (IDA):

స్థాపన: 1960, సెప్టెంబరు 24.

ప్రధాన కార్యాలయం: వాషింగ్టన్‌ డి.సి.

చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ): క్రిస్టలీనా జార్జియేవా

లక్ష్యం: అత్యంత పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేదరికాన్ని తగ్గించేందుకు అభివృద్ధి సహాయం, రాయితీ, రుణాలు, గ్రాంట్లు అందించడం. ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధికి వడ్డీలేని దీర్ఘకాలిక రుణాలు, సాంకేతిక సహకారం, విధాన సలహాలు ఇవ్వడం.

* IDA నుంచి పొందిన రుణాలకు 3040 ఏళ్లపాటు వడ్డీ లేకుండా చెల్లించొచ్చు. గ్రేస్‌ పీరియడ్‌ కాలం మరో పదేళ్లు ఉంటుంది.

ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO):

స్థాపన: 1995, జనవరి 1

ప్రధాన కార్యాలయం: జెనీవా (స్విట్జర్లాండ్‌)

సభ్యదేశాలు: 164 (పాఠ్య పుస్తకం ప్రకారం 150)

డైరెక్టర్‌ జనరల్‌: Ngozi Okonjo-Iweala

విధులు: అంతర్జాతీయంగా వాణిజ్యంలో సరళీకృత విధానాలు రూపొందించేలా, నియమ నిబంధనలు పాటించేలా చేస్తుంది.

* WTOను ‘వాచ్‌ డాగ్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ ట్రేడ్‌’ అంటారు.

Special Economic Zone(-SEZ) Act 2005

అమలు: 2006, ఫిబ్రవరి 10

ప్రాధాన్యం: విదేశీ సంస్థల నుంచి పెట్టుబడులు ఆకర్షించడం.

* SEZ యాక్ట్‌ 2005 ప్రకారం ఒక సెజ్‌లో ఒక విదేశీ కంపెనీకి వంద శాతం ఎఫ్‌డీఐలకు అవకాశం కల్పించారు.

* ఈ యాక్ట్‌ ప్రకారం సెజ్‌లను ఏర్పాటు చేసిన కంపెనీలు మొదటి అయిదేళ్ల వరకు ప్రభుత్వానికి ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు.


అరబ్‌ వసంతం


* పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికాలోని ట్యునీషియా, ఈజిప్ట్, లిబియా, సిరియా మొదలైన అరబ్‌ దేశాల్లో నియంత్రిత పాలన ఉండేది. దానికి వ్యతిరేకంగా 2010, డిసెంబరులో ట్యునీషియాలో మొదటిసారి విప్లవం మొదలైంది. దీనికి జాస్మిన్‌ అని పేరు. ఈ విప్లవానికి ప్రభావితమైన ఇతర అరబ్‌ దేశాలు ఒకదాని తర్వాత  మరొకటి తమ దేశంలోని నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటు కోసం పోరాటాలు చేశాయి. అరబ్‌ ప్రసార మాధ్యమాలు ప్రజల తిరుగుబాటును అరబ్‌ వసంతంగా పేర్కొన్నాయి.

* 2012, నవంబరు 14న బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్‌లు లిబియా నియంత మహమ్మద్‌ గడాఫీని అధికారం నుంచి తొలగించి, ఆ దేశంలో నూతన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేశాయి.


ముఖ్యాంశాలు

* భారత్‌లో సరళీకరణ విధానాలు 1991 నుంచి ప్రారంభమయ్యాయి.

* 19వ శతాబ్దంలో అయిదు కోట్ల మంది ప్రజలు యూరప్‌ నుంచి అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు వలస వెళ్లారు.

* అమెరికా జీడీపీలో వ్యవసాయ రంగం వాటా: 1%

* అమెరికాలో మొత్తం ఉపాధిలో వ్యవసాయ రంగ ఉపాధి శాతం: 0.5%

Posted Date : 14-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌