• facebook
  • whatsapp
  • telegram

అభ్యసన సిద్ధాంతాలు

జీవుల్లో అభ్యసనం ఎలా జరుగుతుంది అనే విషయాన్ని వివరించడానికి అనేక సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చాయి. వీటిని అనుప్రయుక్తంలో పరీక్షల దృష్ట్యా పరిశీలిద్దాం.


శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతం (Classical Conditioning)

ఇవాన్‌ పావ్‌లోవ్‌ రష్యాకు చెందిన ప్రసిద్ధ శరీరధర్మ శాస్త్రవేత్త. ఈయన వైద్యశాస్త్రపరంగా జంతువుల జీర్ణక్రియపై అనేక పరిశోధనలు చేశారు. వీటిని క్రమంగా మనోవిజ్ఞాన శాస్త్రానికి పరిచయం చేసి  “The work of the Digestive Glands” అనే గ్రంథాన్ని రూపొందించారు. ఈయన ‘శాస్త్రీయ నిబంధనా ప్రక్రియ’ను కనుక్కున్నారు.

ప్రయోగం: పావ్‌లోవ్‌ కుక్కను కదలకుండా తోలు పటకాలతో బంధించి దాని లాలాజల గ్రంథుల నుంచి రబ్బరు గొట్టాన్ని అమర్చి, ఆ గొట్టం చివర కొలపాత్రను ఏర్పాటు చేశాడు.

ఆకలిగా ఉన్న కుక్కకు ఆహారాన్ని చూపించి, అది ఎంత లాలాజలాన్ని స్రవించిందో గమనించి, కొంత సమయం అనంతరం ఒక గంటను మోగించి వెంటనే ఆహారాన్ని ఇవ్వడం వెంట వెంటనే చేశాడు.

గంటను మోగించడం అర సెకను తేడాతో కుక్కకు ఆహారాన్ని ఇవ్వడం అనే ప్రక్రియను మళ్లీ మళ్లీ చేయడం ద్వారా కుక్క లాలాజలాన్ని స్రవించసాగింది. పావ్‌లోవ్‌ ఈ ప్రక్రియను అనేక పర్యాయాలు కొనసాగించాడు.

కొంత కాలం తర్వాత గంటను మాత్రమే మోగించి ఆహారాన్ని ఇవ్వకపోయినా, అలవాటుగా కుక్క గంట శబ్దానికే లాలాజలాన్ని స్రవించింది.

తొలుత ఆహారానికి లాలాజలం స్రవించిన కుక్క క్రమంగా గంట శబ్దానికి కూడా ముందుచూపిన  ప్రతిస్పందననే కనబరచడంతో దీన్ని ‘నిబంధిత అభ్యసనం’ అంటారు. ఈ ప్రయోగాన్ని మూడు దశలుగా  పరిశీలించవచ్చు. 

ఎ) ఆహారం: సాధారణంగా ఆకలిగా ఉన్న ఏ కుక్క అయినా సహజంగా ఆహారాన్ని చూసి ప్రేరేపితమై లాలాజలాన్ని స్రవిస్తుంది. కాబట్టి ఇది సహజ ఉద్దీపన లేదా నిర్నిబంధిత ఉద్దీపన అవుతుంది (UCS).

బి) గంట శబ్దం: గంట శబ్దం వింటే ఏ కుక్క కూడా సాధారణ పరిస్థితుల్లో లాలాజలాన్ని స్రవించదు. ప్రత్యేకించి శిక్షణ లేదా నిబంధనం పొందిన కుక్క మాత్రమే లాలాజలాన్ని స్రవిస్తుంది. కాబట్టి ఇది అసహజ లేదా నిబంధిత ఉద్దీపన (CS) అవుతుంది.

సి) లాలాజలాన్ని స్రవించడం: 

i) ఆహారాన్ని చూసిన కుక్కలు సాధారణంగా లాలాజలాన్ని స్రవిస్తాయి. కాబట్టి ఈ సందర్భంలో ఇది సహజ/ నిర్నిబంధిత ప్రతిస్పందన అవుతుంది.

ii) గంట శబ్దం విని కేవలం ప్రయోగంలోని కుక్క మాత్రమే లాలాజలాన్ని స్రవిస్తుంది. ఈ సందర్భంలో అసహజ/ నిబంధిత ప్రతిస్పందన (CR) అవుతుంది. 

నిబంధనం (Condition)

‘డ్రెవర్‌’ అనే శాస్త్రవేత్త ఒక ఉద్దీపన లేదా పరిస్థితికి అంతకుముందు లేనిది, స్వభావసిద్ధం కాని ప్రతిస్పందనను వెలికి తీయడాన్ని ‘నిబంధనం’గా పేర్కొన్నారు.

* నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన రావడమే నిబంధనం. 

* సహజసిద్ధం కాని, అంతకుముందు లేని ఒక ప్రవర్తనకు జీవి ప్రస్తుతం ప్రతిస్పందించడమే నిబంధనం.

ఈ ప్రయోగం ఆధారంగా గుర్తుంచుకోవలసిన అంశాలు

1) సంసర్గం (Association):  గంట శబ్దానికి, ఆహారానికి మధ్య ఏర్పడే సంబంధం (CS-UCS)

2) నిబంధనం (Condition): గంట శబ్దానికి కుక్క లాలాజలం స్రవించడం (CS కు CR రావడం)

సిద్ధాంత అనుప్రయుక్తాలు

* ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి రాగానే పిల్లలంతా లేచి నిలబడటం, నమస్కరించడం

* నిబంధనాన్ని అనుసరించి సర్కస్‌లోని జంతువులు వాటి మాస్టర్స్‌ ఇచ్చే సూచనలకు  అనుకూలంగా ప్రవర్తించడం /అభినయించడం

* వ్యక్తులకు, వస్తువులకు పేర్లు పెట్టడం కూడా శాస్త్రీయ నిబంధనంలో భాగమే.

* రోడ్డుపై ప్రయాణించేవారు ట్రాఫిక్‌ నియమాలకు అనుగుణంగా సూచనలు పాటించడం.

* పాఠశాలలో డ్రిల్‌మాస్టర్‌ను అనుసరించి పిల్లలు ఆయన ఇచ్చే సూచనలకు అనుగుణంగా చేతులు, కాళ్లను (ఎక్సర్‌సైజ్‌) క్రమపద్ధతిలో ఆడించడం.

* వేడుకల్లో సంగీతానికి అనుకూలంగా పిల్లలు డాన్స్‌ చేయడం కూడా శాస్త్రీయ నిబంధనమే.

శాస్త్రీయ నిబంధనం - నియమాలు

1) పునర్బలన నియమం (Law of Reinforcement): సహజ ఉద్దీపనకు (ఆహారం) అసహజ ఉద్దీపనను (గంట) జోడించడం అనే ప్రక్రియను అనేకసార్లు చేయడం ద్వారా ప్రతిస్పందనను బలపడేలా చూడటం.

ఉదా: ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో గమనించిన మంచి ప్రవర్తనను స్థిరపరచడానికి పొగడ్త అనే బహుమతిని అందిస్తూనే ఉండటం.

2) విరమణ/ విలుప్తీకరణం (Law of Extinction): పునర్బలనం బాగా ఏర్పడిన తర్వాత సహజ ఉద్దీపనకు అసహజ ఉద్దీపనను క్రమంగా తొలగించడం వల్ల నిబంధనా చర్య (లాలాజలం) క్రమంగా ఆగిపోవడమే విరమణ.

ఉదా: చిన్నపిల్లల్లో కనిపించే ఇబ్బందికర ప్రవర్తన అయిన వేళ్లు చీకడం (Thumb sucking), పక్క తడపడం (Bed Wetting) లాంటి చర్యలను తగ్గించడానికి ఈ నియమాన్ని ఉపయోగిస్తారు.

3)  అయత్నసిద్ధ స్వాస్థ్యం (Spontaneous Recovery): ప్రయోగాన్ని పూర్తిగా విరమించిన తర్వాత కొంత కాలానికి ఎప్పుడైనా అసహజ ఉద్దీపన ఎదురైనప్పుడు (గంట శబ్దం) కుక్కలోని నిబంధిత ప్రతిస్పందన (లాలాజలం) అయత్నంగా లేదా అప్రయత్నంగా రావడమే అయత్నసిద్ధ స్వాస్థ్యం. 

ఉదా: చిన్ననాటి ఉపాధ్యాయులు కొన్ని సంవత్సరాల  తర్వాత యాదృచ్ఛికంగా ఎదురైనప్పుడు అప్రయత్నంగా మనం చేతిని పైకెత్తి నమస్కరించడం.

4) సామాన్యీకరణం (Generalisation): నిబంధిత ఉద్దీపనను పోలిన ఇతర ఉద్దీపనలకు కూడా అదే విధమైన/ ముందు చూపించిన నిబంధిత ప్రతిస్పందనను చూపడం.

ఉదా: ప్రయోగంలో కుక్క గంట శబ్దానికి చూపే ప్రతిస్పందననే గంటను పోలిన ఇతర శబ్దాలకు (బజర్‌ శబ్దం, కాలింగ్‌ బెల్‌ శబ్దం) కూడా చూపడం.

5) విచక్షణ (Discrimination):

ఒక ప్రత్యేకమైన ఉద్దీపనకు మాత్రమే నిబంధనం ఏర్పడిన తర్వాత ఇతర ఉద్దీపనల మధ్య తేడాను గుర్తించి వాటికి ప్రతిస్పందించకపోవడం.

ఉదా: ప్రయోగంలో కుక్క గంట శబ్దానికి చూపించే ప్రతిస్పందనను ఇతర ఏ శబ్దాలకూ చూపించకపోవడం.

6) ఉన్నత క్రమ నిబంధనం (Higher order condition): మొదట నిబంధనం చేయడంలో ఉపయోగించిన అసహజ ఉద్దీపన (గంట)ను రెండో నిబంధన ప్రయోగంలో సహజ ఉద్దీపనగా ఉపయోగించి రెండో నిబంధనాన్ని చేయడమే ‘ఉన్నత క్రమ నిబంధనం’ అవుతుంది. 

ఉదా: ఆంగ్ల ఉపాధ్యాయుడి పట్ల ప్రేమ, అభిమానాన్ని ప్రదర్శించే విద్యార్థి తన అభిమానాన్ని ఆ ఉపాధ్యాయుడి పేరుకి, ఆయన బోధించే సబ్జెక్టు పట్ల కూడా చూపడం.

పావ్‌లోవ్‌ ప్రయోగ దశలు

మొదటి దశ

ఆహారాన్ని ఇవ్వడం                                         లాలాజలం స్రవించడం

(Unconditional Stimlus - UCS)                               (Unconditional Response -UCR)

సహజ లేదా నిర్నిబంధిత ఉద్దీపన                                    సహజ/నిర్నిబంధిత ప్రతిస్పందన


రెండో దశ

గంట శబ్దం + ఆహారం నిబంధిత/            లాలాజలాన్ని స్రవించడం సహజ/ 

అసహజ ఉద్దీపన (CS) + సహజ                              నిర్నిబంధిత    ప్రతిస్పందన (UCR)

ఉద్దీపన (UCS)

మూడో దశ

గంట శబ్దం నిబంధిత/ అసహజ         లాలాజలాన్ని స్రవించడం

 ఉద్దీపన (CS)                                         నిబంధిత/ అసహజ ప్రతిస్పందన (CR)

మాదిరి ప్రశ్నలు

1. ఒక ఉపాధ్యాయుడు పాఠ్యబోధనలో క్లిష్టమైన భావనలను కొన్ని సంతోషకరమైన ఉద్దీపనలతో జతచేసి బోధించేవాడు. కొన్ని భావనలను బోధించాక పిల్లలందరూ సబ్జెక్టును ఇష్టపడ్డారు. ఇందులో ఇమిడిఉన్న అభ్యసన సిద్ధాంతం ఏది?

జ‌:  శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతం


2. ‘The work of the Digestive glands’ గ్రంథకర్త ఎవరు?

జ‌:  పావ్‌లోవ్‌     


3. సంప్రదాయ నిబంధనానికి సంబంధించని సూత్రం?

జ‌:  ఆకృతీకరించడం

Posted Date : 06-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌