• facebook
  • whatsapp
  • telegram

ద్రవ్యం

భారతదేశంలో ద్రవ్య సప్లయ్‌


* 1967-68 వరకు మనదేశంలో ఒకే ద్రవ్య సప్లయ్‌ కొలమానాన్ని ప్రకటించారు.

M1 = C + DD
 

* 1968 నుంచి ఆర్‌బీఐ సమష్టి ద్రవ్య వనరులు అనే కొలమానాన్ని ప్రకటిస్తోంది. దీనిలో టైమ్‌ డిపాజిట్లు చేర్చారు. 

M = C + DD + TD
  
* 1997 నుంచి ఆర్‌బీఐ నాలుగు రకాల ద్రవ్య సప్లయ్‌ కొలమానాలను ప్రచురిస్తోంది. అవి M1, M2, M3, M4. వీటిని సులభంగా అర్థం చేసుకునేందుకు డిపాజిట్లను రెండు రకాలుగా విభజించారు. అవి:


1) బ్యాంకుల్లోని డిపాజిట్లు: బ్యాంకుల్లోని డిపాజిట్లను

A) డిమాండ్‌ డిపాజిట్లు

B) టైమ్‌ డిపాజిట్లు అని విడదీస్తారు.

* వీటిలో డిమాండ్‌ డిపాజిట్ల సహాయంతో M1 ద్రవ్యాన్ని, టైమ్‌ డిపాజిట్ల సహాయంతో M3 ద్రవ్యాన్ని నిర్వచిస్తారు.


2) పోస్టాఫీసుల్లోని డిపాజిట్లు: పోస్టాఫీసుల్లోని డిపాజిట్లను 

A) పొదుపు డిపాజిట్లు

B) మొత్తం డిపాజిట్లు అని రెండు రకాలుగా విడదీస్తారు.

* వీటిలో పొదుపు డిపాజిట్ల సహాయంతో M2 ద్రవ్యాన్ని, మొత్తం డిపాజిట్ల సహాయంతో M4 ద్రవ్యాన్ని నిర్వచిస్తారు.


M1 ద్రవ్యం:

M= ప్రజల వద్ద ఉన్న కరెన్సీ + బ్యాంకుల వద్ద గల డిమాండ్‌ డిపాజిట్లు + రిజర్వ్‌ బ్యాంకు వద్ద ఉన్న ఇతర డిపాజిట్లు

⏩  M1 = C + DD + OD

⏩  M1 ను సంకుచిత ద్రవ్యం అంటారు.

⏩  M1 ను సామాన్య ప్రజల దృష్టిలో ద్రవ్యం అంటారు.

⏩  M1  అత్యధిక ద్రవ్యత్వం కలిగిన ద్రవ్యం.

⏩  సంప్రదాయ ద్రవ్య నిర్వచనం, M1 ద్రవ్యకొలమానం ఒక్కటే.


M3 ద్రవ్యం: 

⏩  M3 = M1 + బ్యాంకుల వద్ద ఉన్న కాలపరిమితి డిపాజిట్లు (TD)

⏩  M3 = M1 + TD

⏩  M3 ను విశాల ద్రవ్య కొలమానం అంటారు. దీన్నే సమష్టి ద్రవ్య వనరులుగా పేర్కొంటారు.

⏩  M3 = C + DD + OD + TD

= M1 + TD    

 చికాగో ఆర్థికవేత్తల ద్రవ్య నిర్వచనం, M3 ద్రవ్యకొలమానం ఒక్కటే.


M2, M3: పోస్టాఫీస్‌ వద్ద ఉన్న డిపాజిట్లను లెక్కలోకి తీసుకుని ద్రవ్యాన్ని నిర్వచిస్తే M2, M3 ద్రవ్యాలు వస్తాయి.

M2 ద్రవ్యం: M2 = M1 + పోస్టాఫీసుల వద్ద ఉన్న పొదుపు డిపాజిట్లు.

M4 ద్రవ్యం: M4 = M3 + పోస్టాఫీసుల్లోని మొత్తం డిపాజిట్లు.


పరిమాణంలో M4 అధికంగా, M1 అల్పంగా ఉంటాయి. M1 కు అత్యధిక ద్రవ్యత్వం  ఉండగా,  M4 కు అల్ప ద్రవ్యత్వం ఉంది.


నూతన ద్రవ్యం, ద్రవ్యత్వ వనరులు


* 1997లో డాక్టర్‌ వై.వి.రెడ్డి అధ్యక్షతన నియామకమైన వర్కింగ్‌ గ్రూప్‌ ద్రవ్య సప్లయ్‌పై అధ్యయనం చేసి 1998లో నివేదికను సమర్పించింది. ఇది మూడో నూతన ద్రవ్య కొలమానాలను సూచించింది. అవి:

M0, M1, M2, M3

M0ను Basic money, High power money, Primary money, Reserve money అని కూడా వ్యవహరిస్తారు.

* నూతన పద్ధతిలో అధిక liquidity ఉన్న అంశం = M1

* నూతన పద్ధతిలో Narrow money = M1

M0  = C + OD + CR
M0 = Money in circulation
C = Cash with public
OD = Other Deposits; వాణిజ్య బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద చేసిన డిపాజిట్‌లు

CR = Cash Reserves
M1 = C + DD + OD


* M2 = M1 + ఒక సంవత్సరంలోపు కాలపరిమితి ఉన్న టర్మ్‌ డిపాజిట్‌ + బ్యాంకు జారీ చేసిన డిపాజిట్‌ సర్టిఫికేట్‌లు 

* M3 = M2 + ఒక సంవత్సరానికి మించి కాలపరిమితి కలిగిన టర్మ్‌ డిపాజిట్‌లు + బ్యాంకులు జారీచేసిన రుణాలు


ద్రవ్యత్వ వనరులు


RBI వర్కింగ్‌ గ్రూప్‌ నూతనంగా మూడు రకాల ద్రవ్యత్వ వనరులను ప్రవేశపెట్టింది. అవి:

* L1 = నూతన M+ పోస్టాఫీస్‌ వద్ద ఉన్న అన్ని రకాల డిపాజిట్లు. ఇందులో జాతీయ పొదుపు పత్రాలను మినహాయించాలి (NSC)

* L2 = L1 + విత్త సంస్థల కాలపరిమితి డిపాజిట్లు + విత్త సంస్థలు జారీచేసిన డిపాజిట్‌ సర్టిఫికెట్‌లు + Term borrowing by FIs. 

* L3 = L2 + బ్యాంకేతర విత్త సంస్థల వద్ద ఉన్న ప్రజల డిపాజిట్లు.


ద్రవ్య సప్లయ్‌ కొలమానాలు


ద్రవ్య సప్లయ్‌ నిర్వచనంపై భిన్నాభిప్రాయాలున్నాయి.

i) సంప్రదాయ నిర్వచనం: ప్రజల వద్ద ఉన్న కరెన్సీ (C), బ్యాంకుల వద్ద గల డిమాండ్‌ డిపాజిట్లను (DD) కలిపి ద్రవ్య సప్లయ్‌గా నిర్వచిస్తారు.

M = C + DD

ii) చికాగో అర్థశాస్త్రవేత్తల నిర్వచనం: కరెన్సీ (C), డిమాండ్‌ డిపాజిట్ల (DD) తో పాటు టైమ్‌ డిపాజిట్లు(TD)ను ద్రవ్య సప్లయ్‌లో చేర్చాలి.

M = C + DD + TD

* సంప్రదాయ ఆర్థికవేత్తలు ద్రవ్యానికి సంకుచిత (Narrow) నిర్వచనం ఇస్తే, చికాగో ఆర్థ్ధికవేత్తలు విస్తృత అర్థాన్ని ఇచ్చారు.


ద్రవ్య ప్రసార వేగం

* నిర్ణీత కాలంలో ఒక యూనిట్‌ ద్రవ్యం ఎన్నిసార్లు వస్తు సేవలు కొనడానికి చేతులు మారుతుందో తెలిపే దాన్ని ద్రవ్య ప్రసార వేగం అంటారు.

* ద్రవ్య ప్రసార వేగం కింది అంశాలపై ఆధారపడుతుంది.


1) పరపతి సంస్థలు: పరపతి సంస్థల సంఖ్య పెరిగేకొద్దీ ద్రవ్య ప్రసార వేగం పెరుగుతుంది.

2) నగదు వ్యవహారాలు: నగదు వ్యవహారాలు ఎక్కువగా పెరిగేకొద్దీ ద్రవ్య ప్రసార వేగం పెరుగుతుంది.

3) వినియోగం ప్రవృత్తి: వినియోగ స్థాయి పెరిగేకొద్దీ ద్రవ్యప్రసార వేగం పెరుగుతుంది.

4) ఆదాయ పంపిణీ: ఆదాయ అసమానతలు ఎక్కువ ఉంటే ద్రవ్య ప్రసార వేగం తక్కువగా ఉంటుంది.

5) ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు: ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్య ప్రసార వేగం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక మాంద్య కాలంలో ద్రవ్య ప్రసార వేగం తక్కువగా ఉంటుంది.

6) వేతన విధానం: ఎక్కువ కాలాంతరాల్లో వేతన చెల్లింపు జరిగితే ప్రసార వేగం తగ్గుతుంది.

7) రెగ్యులర్‌ ఆదాయం: రెగ్యులర్‌ ఆదాయం ఉంటే ప్రసార వేగం పెరుగుతుంది.

8) పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రసార వేగం ఎక్కువగా ఉంటుంది.

9) రవాణా, ప్రసార సాధనాలు పెరిగితే ప్రసార వేగం పెరుగుతుంది.


Call Money: ద్రవ్య నిల్వలు అధికంగా ఉన్న బ్యాంకులు, ద్రవ్య నిల్వలు తక్కువగా ఉన్న బ్యాంకులకు స్వల్ప కాలవ్యవధితో తిరిగి తీర్చే విధంగా రుణాలను ఇస్తాయి. 

* ఈ మార్కెట్‌లో విధించే వడ్డీరేటును కాల్‌ మనీ రేటు అంటారు.

* ఒకరోజు కాలవ్యవధికైతే కాల్‌మనీ అని, రెండు నుంచి 14 రోజులకైతే నోటీస్‌ మనీ అని, 14 రోజులుపైన అయితే Term Money అని అంటారు.

Hot Money: ఒక దేశంలో వడ్డీరేటు తగ్గడం వల్ల, అధిక వడ్డీరేటు ఉన్న దేశంలోకి పెట్టుబడులు తరలిపోతాయి. ఈ రకమైన ద్రవ్యాన్ని Hot Money అంటారు.

Cheap Money:తక్కువ వడ్డీరేటు వద్ద లభ్యమయ్యే ద్రవ్యం.

Tight Money: అధిక వడ్డీరేటు వద్ద లభించే ద్రవ్యం.


మాదిరి ప్రశ్నలు


1. అధిక వడ్డీరేటు వద్ద లభ్యమయ్యే ద్రవ్యాన్ని ఏమంటారు?

   a) Cheap Money     b) Hot Money    c) Tight Money      d) Call Money


2. దేశంలోని మొత్తం ద్రవ్య సరఫరా దేనికి సమానం?

a) M1       b) M2       c) M3        d) M0


3. కింది వాటిలో అధిక Liquidity దేనికి ఉంది?

a) బంగారం    b) భూమి      c)  షేర్స్‌    d) గృహం


4. సాధారణంగా దేశంలో ద్రవ్యాన్ని అధికంగా ద్రవ్యనిల్వ చేసే వర్గం...

a) సాధారణ ప్రజలు     b) ప్రభుత్వాలు      c) వాణిజ్య బ్యాంకులు    d) ఆర్‌బీఐ


5. సమీప ద్రవ్యం కానిది ఏది?                   

a) బాండ్లు        b) డిబెంచర్‌      c) ట్రెజరీ బిల్లులు    d) చెక్కులు


6. ద్రవ్య నిల్వల నిష్పత్తిని నిర్ణయించేది?

a) కేంద్ర బ్యాంకు      b) వాణిజ్య బ్యాంకులు       c) మార్కెట్‌ శక్తులు  d) ప్రభుత్వం


7. Cheap Money అంటే ఏమిటి?

a) డబ్బు విలువను పొగొట్టుకోవడం       b) సంపాదించకుండా వచ్చిన డబ్బు

c) ద్రవ్యోల్బణం కారణంగా డబ్బు విలువ  తగ్గడం       d) బ్యాంకుల ద్వారా పరపతి చాలా తేలిగ్గా దొరకడం


8. మంచి ద్రవ్యానికి ఉండాల్సిన లక్షణాలు ఏవి?

a) మన్నిక     b) తేలిగ్గా గుర్తించడం     c) అల్ప బరువు     d) పైవన్నీ


సమాధానాలు

1 - c; 2 - d; 3 - a; 4 - c; 5 - d; 6 - a; 7 - d; 8 - d

వస్తు మార్పిడి పద్ధతిలో లోపాలు


* ఇద్దరు వ్యక్తుల మధ్య కోరికల సమన్వయం లేకపోవడం

* విలువలను కొలిచే కొలమానం లేకపోవడం

* సంపదను నిల్వచేసే వీలులేకపోవడం

* కాల సమన్వయం లేకపోవడం

* వస్తువును విభజించడానికి వీలులేకపోవడం

* వాయిదా చెల్లింపులకు అవకాశం లేకపోవడం

ద్రవ్య నిర్వచనం 


Money అనే పదం లాటిన్‌ పదమైన ‘మానెటా’ నుంచి పుట్టింది (రోమన్‌ దేవత మానెటా ఆలయంలో నాణేలను ముద్రించేవారు).అతి ముఖ్యమైన మానవ కల్పనల్లో ద్రవ్యం ఒకటి.

‘‘ప్రతి శాస్త్రంలో ముఖ్యమైన కల్పన ఒకటి ఉంటుంది. అది యాంత్రిక శాస్త్రంలో చక్రం, విజ్ఞాన శాస్త్రంలో నిప్పు, రాజనీతి శాస్త్రంలో ఓటు, అర్థశాస్త్రంలో ద్రవ్యం’’  - క్రౌథర్‌ 

* ఏదైతే ద్రవ్యంగా పనిచేస్తుందో అదే ద్రవ్యం (Money is what money does) - వాకర్‌

* సర్వాంగీకారం పొందిన వస్తువు ద్రవ్యం - సెలిగ్‌మన్‌

* వినిమయ సాధనంగా సర్వాంగీకారం పొంది, విలువల కొలమానంగా ఉపయోగపడేదే ద్రవ్యం - క్రౌథర్‌

* ద్రవ్యం తాత్కాలిక కొనుగోలు శక్తి నిలయం (Temporary abode of purchasing power) - మిల్టన్‌ ప్రీడమన్‌


ద్రవ్యం - విధులు

ద్రవ్యం విధులను రెండు రకాలుగా విభజించవచ్చు.

A. ప్రాథమిక విధులు (Primary/ Main/ Basic Functions)

B. గౌణ విధులు (Subsidiary/ Derivative Functions)

A. ప్రాథమిక విధులు:

i. వినిమయ మాధ్యమం (Medium of Exchange): ద్రవ్యం వస్తువుకి, సేవకి మధ్యవర్తిగా అమ్మకాలు, కొనుగోళ్లు చేయడంలో ఉపయోగపడుతుంది.

ii. విలువల కొలమానం (Measure of value): అన్ని రకాల వస్తు సేవలను ద్రవ్యంలో కొలుస్తారు. వస్తు సేవలను ద్రవ్య రూపంలో వ్యక్తపరిస్తే ‘ధర’ లభిస్తుంది.

B. గౌణ విధులు (ద్వితీయ శ్రేణి విధులు):

i. విలువల నిధి (Store value): 

* సంపదను ప్రస్తుత అవసరాలకే కాకుండా భవిష్యత్తుకు ఉపయోగపడేలా నిల్వ చేసుకునేందుకు ఈ ద్రవ్యం ఉపయోగపడుతుంది. దీనికి అధిక ప్రాధాన్యం ఇస్తారు.

* ద్రవ్యాన్ని సులభంగా తీసుకుపోవచ్చు, దాచుకోవచ్చు, నిల్వ చేసేందుకు ఎక్కువ ప్రదేశం అవసరం లేదు.

* అన్ని కాలాల్లో దీన్ని ఉపయోగించవచ్చు.

* వస్తువుల కంటే ద్రవ్యాన్ని ఎక్కువ భద్రతతో పొదుపు చేయవచ్చు.

ii. వాయిదా చెల్లింపుల ప్రమాణం (Standard of Deferred payments) 

* వ్యాపార వ్యవహారాలను అరువు పద్ధతిలోనూ నిర్వర్తించడానికి ద్రవ్యం ఉపయోగపడుతుంది.

* ఈ విధి వల్ల రుణాలు తీసుకోవడం, అప్పు ఇవ్వడం లాంటి వ్యవహారాలు సులభతరమయ్యాయి.

iii. ద్రవ్యం విలువలను బదిలీ చేసేందుకు కూడా ఉపయోగపడుతుంది.

మంచి ద్రవ్యానికి ఉండాల్సిన లక్షణాలు

1) సులభంగా తీసుకు వెళ్లగల అవకాశం (Portability)

2) ఆమోదయోగ్యత (Acceptability)

3) మన్నిక (Durability)

4) విభాజ్యత (Divisibility)

5) సజాతీయత (Homogeneity)

6) వ్యాకోచత్వం (Elasticity)

7)  అల్ప బరువు (Low weight)

8)  స్థిరత్వం (Stability)

9) తేలికగా గుర్తించే వీలు (Cognisability)

ద్రవ్యక్రమ పరిణామం


1) వస్తు ద్రవ్యం: ప్రారంభంలో వస్తువులనే ద్రవ్యంగా ఉపయోగించేవారు. 

ఉదా: ఉత్తర అమెరికాలో పొగాకు, ఆఫ్రికాలో దంతం.

2) లోహ ద్రవ్యం: నాగరికత అభివృద్ధి చెందే కొద్దీ లోహ ద్రవ్యం వాడుకలోకి వచ్చింది. 

ఉదా: బంగారం, వెండి, రాగి.

* రోమన్ల బంగారు నాణెం - బిసెంట్‌

* మౌర్యుల వెండి నాణెం - పానా

* క్రీ.పూ.700 లో లిడియా (Lydia) ప్రాంతంలో మొదటగా నాణేలను జారీ చేశారు. 

3) కాగితపు ద్రవ్యం: బంగారు, వెండి, లోహాలను ఆధారం చేసుకుని కేంద్ర బ్యాంకు (RBI) నోట్లను జారీచేసింది.

ఉదా: రూ.10, రూ.20

4) పరపతి ద్రవ్యం: బంగారాన్ని నిల్వగా ఉంచుకుని కరెన్సీని జారీచేసిన విధంగానే, కరెన్సీని నిల్వగా దాచి పరపతి ద్రవ్యాన్ని లేదా బ్యాంకు ద్రవ్యాన్ని సృష్టించడం జరుగుతుంది.

5) సమీప ద్రవ్యం: హుండీలు, ట్రెజరీ బిల్లులు, బాండ్‌లు మొదలైన వాటికి కూడా ద్రవ్యత్వం ఉండటంతో ద్రవ్యంగా ఉపయోగిస్తుంటారు. వీటికి ద్రవ్యానికి ఉండే లక్షణాలు ఉండటంతో సమీప ద్రవ్యం అంటారు.

* ప్రాచీన కాలంలో ధాన్యం, పశువులు, బంగారం, వెండి, రాగి లాంటి లోహాలను డబ్బుగా ఉపయోగించారు.

* డబ్బుతో సంబంధం లేకుండా ఒక వస్తువు ఇచ్చి మరొక వస్తువు తీసుకోవడాన్ని వస్తు మార్పిడి అంటారు. మానవుడి కోరికలు పరిమితంగా ఉండటంతో ఈ పద్ధతి సాధ్యమైంది. వస్తు మార్పిడిలో ఒక వస్తువు విలువను మరొక వస్తువు విలువతో నిర్ణయించాలి. ఈ విలువల నిర్ణయంలో ప్రామాణికత ఉండదు. ఈ ఆర్థిక వ్యవస్థను C - C (Commodity to Commodity) Economy అనేవారు.

* మానవుడి కోరికలు పెరగడంతో, ఆర్థిక వ్యవస్థ విస్తరించి దీనిలోని లోపాలు బయటపడ్డాయి. ఫలితంగా ద్రవ్యాన్ని కనుక్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక వ్యవస్థను C-M-C (Commodity - Money - Commodity) Economy గా పిలుస్తారు.

ద్రవ్యం - రకాలు

I. ద్రవ్య ముద్రణలో వినియోగించే వస్తువును బట్టి ద్రవ్యాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.

A) లోహ ద్రవ్యం B) కాగితపు ద్రవ్యం

లోహ ద్రవ్యం 

లోహన్ని ద్రవ్యంగా ఉపయోగిస్తే దాన్ని లోహ ద్రవ్యం అంటారు. ఇది మూడు రకాలు. 

i) పూర్తి ప్రమాణ ద్రవ్యం 

ii) తక్కువ ప్రమాణ ద్రవ్యం 

iii) ప్రాతినిధ్యపు ద్రవ్యం

పూర్తి ప్రమాణ ద్రవ్యం (Standard Money): ద్రవ్యం తయారీకి ఉపయోగించే లోహం అంతర్గత విలువ, బహిర్గత విలువ సమానంగా ఉంటే అలాంటి ద్రవ్యాన్ని పూర్తి ప్రమాణ ద్రవ్యం అంటారు.
తక్కువ ప్రమాణ ద్రవ్యం: నాణేల ముఖ విలువ,బహిర్గత విలువ నాణెం అంతర్గత విలువ కంటే ఎక్కువగా ఉంటే ‘టోకెన్‌ మనీ’ అంటారు.

ప్రాతినిధ్యపు ద్రవ్యం (Representative Money): తక్కువ విలువ ఉన్న లోహాన్ని లేదా కాగితాన్ని ద్రవ్యంగా ముద్రించి వాడితే అలాంటి ద్రవ్యాన్ని ప్రాతినిధ్యపు ద్రవ్యం అంటారు. ద్రవ్యాన్ని జారీచేసే అధికారుల దగ్గర చలామణిలో ఉన్న ద్రవ్యానికి సమానంగా బంగారం, వెండి నిల్వలు ఉంటాయి.

కాగితపు ద్రవ్యం 

ద్రవ్యాన్ని తయారు చేయడానికి కాగితాన్ని ఉపయోగిస్తే దాన్ని ‘కాగితపు ద్రవ్యం’ అంటారు. మొదటిసారిగా కాగితపు ద్రవ్యాన్ని చైనాలో ప్రవేశపెట్టారు. దీన్ని కింది విధంగా విభజించవచ్చు.

i. ప్రాతినిధ్య కాగితపు ద్రవ్యం (Representative Paper Money):

నూటికి నూరు శాతం లోహాన్ని నిల్వగా ఉంచి ద్రవ్యాన్ని జారీచేస్తే అలాంటి ద్రవ్యాన్ని ప్రాతినిధ్య కాగితపు ద్రవ్యం అంటారు. ఉదా: మనదేశంలో జారీచేసిన బంగారం, బులియన్‌ సర్టిఫికెట్‌లు

ii. పరివర్తనీయ కాగితపు ద్రవ్యం (Convertible Paper Money):

జారీచేసిన కాగితపు ద్రవ్యాన్ని బంగారం లేదా వెండిరూపంలోకి మార్చుకోవడానికి వీలుంటే ఆ ద్రవ్యాన్ని పరివర్తనీయ కాగితపు ద్రవ్యం అంటారు.

iii. అపరివర్తనీయ కాగితపు ద్రవ్యం (Inconvertible Paper Money):

జారీచేసిన కాగితపు నోట్లను బంగారం లేదా వెండి రూపంలోకి మార్చుకునే వీలులేకపోతే అలాంటి ద్రవ్యాన్ని అపరివర్తనీయ కాగితపు ద్రవ్యం అంటారు.

II. ఆమోదయోగ్యతను బట్టి ద్రవ్యం రెండు రకాలు

A) చట్టబద్ధ ద్రవ్యం B) చట్టబద్ధం కాని ద్రవ్యం

A. చట్టబద్ధ ద్రవ్యం(Legal Tender Money): రిజర్వ్‌ బ్యాంక్‌ అధికారులు జారీచేసిన ద్రవ్యాన్ని చట్టబద్ధమైన ద్రవ్యం అంటారు. దీనికి చట్టం సమ్మతి ఉంటుంది. ఈ ద్రవ్యం రెండు రకాలు.

i. అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం: వ్యాపార వ్యవహారాల నిర్వహణకు, రుణాల పరిష్కారానికి ఎంత పరిమాణంలోనైనా తప్పనిసరిగా ఆమోదించాల్సిన ద్రవ్యాన్ని అపరిమిత చట్టబద్ధ ద్రవ్యం అంటారు. 

ఉదా: రూపాయి నుంచి 2000 వరకు ఉన్న నోట్లు

ii. పరిమిత చట్టబద్ధ ద్రవ్యం: ద్రవ్యాన్ని కొంత పరిమితికి లోబడి మాత్రమే ఆమోదించే ద్రవ్యాన్ని పరిమిత చట్టబద్ధ ద్రవ్యం అంటారు.

ఉదా: 5, 10, 20, 25 పైసల నాణేలు, వీటిని 25 రూపాయల వరకు మాత్రమే ఆమోదిస్తారు.

నోట్‌: 2011 జూన్‌ 30 నుంచి 25 పైసలను ఆర్‌బీఐ రద్దు చేసింది. 

B. చట్టబద్ధం కాని ద్రవ్యం (Optional Money):

చట్టం ప్రమేయం లేకుండా ఇష్టాన్ని బట్టి కొన్నింటిని ద్రవ్యంగా అంగీకరించవచ్చు. దీన్నే చట్టబద్ధం కాని ద్రవ్యం అంటారు.

ఉదా: బ్యాంకులు ఇచ్చే చెక్కులు, డ్రాఫ్ట్‌లు

III. ద్రవ్యత్వం ఆధారంగా ద్రవ్యం: ఇది రెండు రకాలు. 

A) సామాన్య ద్రవ్యం (Ordinary Money)

B) సమీప ద్రవ్యం (Near Money)

A. సామాన్య ద్రవ్యం: ప్రజల వద్ద ఉన్న నాణేలు, కరెన్సీ నోట్లు, బ్యాంకుల వద్ద ఉన్న డిమాండ్‌ డిపాజిట్లను సామాన్య ద్రవ్యం అంటారు. దీనికి 100% ద్రవ్యత్వం ఉంటుంది.

B. సమీప ద్రవ్యం: సామాన్య ద్రవ్యంతో పోల్చినప్పుడు ఇది తక్కువ ద్రవ్యత్వం కలిగి ఉంటుంది. అవసరమైనప్పుడు వీటిని తక్కువ ఖర్చుతో ద్రవ్యంగా మార్చుకోవచ్చు. అందుకే దీన్ని సమీప ద్రవ్యం అంటారు.

ఉదా: జాతీయ పొదుపు డిపాజిట్లు, బాండ్లు, డిబెంచర్లు, ట్రెజరీ బిల్లులు, ప్రామిసరీ నోట్లు.

IV. ఇతర రకాల ద్రవ్యం:

i. ఆవర్జా ద్రవ్యం (Account Money): జమ, ఖర్చుల లెక్కలను ఏ ద్రవ్య యూనిట్‌ రూపంలో రాస్తారో దాన్ని ఆవర్జా ద్రవ్యం అంటారు.

ఉదా: భారత్‌లో రూపాయి, బ్రిటన్‌లో పౌండ్‌

ii. వ్యవహారిక ద్రవ్యం (Actual Money): ఆర్థిక వ్యవస్థలో వాస్తవంగా చలామణిలో ఉన్న ద్రవ్యమే వ్యవహారిక ద్రవ్యం. వ్యవహారాలన్నీ దీంతోనే జరుగుతాయి.

iii. విశ్వాసాస్త్రిత ద్రవ్యం (Fiduciary Money): వ్యవస్థపై, ప్రభుత్వంపై, కేంద్ర బ్యాంకుపై ఉన్న విశ్వాసాన్ని ఆధారంగా చేసుకుని ద్రవ్యాన్ని ముద్రిస్తే దాన్ని ‘విశ్వాసాస్త్రిత ద్రవ్యం’ అంటారు. మనదేశంలో ద్రవ్యాన్ని కనీస నిల్వలను ఆధారంగా చేసుకుని విశ్వాసాస్త్రిత పద్ధతిలో ముద్రిస్తున్నారు.

iv. పరపతి ద్రవ్యం: దీన్నే బ్యాంకు ద్రవ్యం అంటారు.  ఉదా: బ్యాంకులు జారీచేసే చెక్కులు, డ్రాప్ట్‌లు, వినిమయ బిల్లులు.

v. Fiat Money: ప్రభుత్వ అధికారం వల్ల కాగితపు ద్రవ్యం చలామణిలో ఉంటే దాన్ని Fiat Money అంటారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం దీన్ని జారీ చేస్తుంది. ఈ ద్రవ్యానికి వెనుక రిజర్వులు ఉండవు.

Posted Date : 18-08-2022

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు