• facebook
  • whatsapp
  • telegram

ధ్రువ ప్రాంతాలు

ధ్రువాలకు దగ్గరగా ఉండే ప్రాంతాన్ని ధ్రువ ప్రాంతం అంటారు. ఉత్తరాన ధ్రువ ప్రాంత సరిహద్దు ఆర్కిటిక్‌ వృత్తం, దక్షిణ సరిహద్దు అంటార్కిటికన్‌ వృత్తం. ధ్రువ ప్రాంతం కలిగివున్న ఖండాలు ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియా, అంటార్కిటికా.


* ధ్రువ ప్రాంతంలో ఉన్న ఖండాల ఉత్తర భాగాలను ‘టండ్రా ప్రాంతం’ అంటారు.

* టండ్రా అంటే ‘చాలా చలిగా ఉండే ప్రాంతం’, ‘మంచు ఎడారి’ అని అర్థం.

* టండ్రా ప్రాంతంలో పెరిగే వృక్షజాలాన్ని ‘టండ్రా వృక్షజాలం’ అంటారు.

* తక్కువ సూర్య కాంతి వల్ల ఇక్కడ ప్రత్యేకమైన మొక్కల రకాలు పెరుగుతాయి.


కాలాలు


చలికాలం: 

* టండ్రా ప్రాంతంలో నవంబరు, డిసెంబరు, జనవరి నెలల్లో సూర్యుడు కనిపించడు, దీంతో చాలా చీకటిగా ఉంటుంది. 

* తీవ్రమైన చలి వల్ల నీరు గడ్డకడుతుంది. అందువల్ల చలి కాలంలో ఈ ప్రాంతంలో మొక్కలు చనిపోతాయి; పక్షులు, జంతువులు వలస పోతాయి.

* చలి కాలంలో ఈ ప్రాంతమంతా చీకటిగా, నిర్జనంగా, నిర్మానుష్యంగా ఉంటుంది.

వేసవికాలం: 

* టండ్రా ప్రాంతంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో సూర్యుడు ప్రకాశించడం మొదలుపెడతాడు.

* మే నుంచి జులై వరకు మూడు నెలల పాటు సూర్యుడు అస్తమించడు.

* భూమి, ఆకాశం కలిసినట్టు అనిపించే ప్రదేశాన్ని ‘క్షితిజం’ లేదా ‘దిగ్మండలం’ అంటారు.

* ఈ ప్రాంతంలో సూర్యుడు వేసవిలో కూడా ‘క్షితిజం’ దాటి పైకి రాడు.

* ఈ కాలంలో మంచు కరగడం వల్ల చెరువులు నిండుతాయి.

* పెద్ద పెద్ద మంచుగడ్డలు విరిగి నీటిలో తేలుతూ సముద్రంలోకి ప్రవేశిస్తాయి. వీటిని ‘ఐస్‌బర్గ్స్‌’ అంటారు.

వృక్ష సంపద - పక్షులు

* ధ్రువ ప్రాంతంలో మొక్కలు పెరగడానికి ప్రధాన అవరోధం ‘ఫర్మా ఫ్రాస్ట్‌’. ఫర్మా ఫ్రాస్ట్‌ అంటే శాశ్వతంగా గడ్డకట్టిన నేల అని అర్థం. ఆల్డర్, బిర్చ్, విలో మొదలైనవి టండ్రా సరిహద్దుల్లో పెరిగే వివిధ రకాల పొదలు. నాచు, లైచెన్లు, సెడ్జ్‌లు - గడ్డి భూముల్లో పెరిగే పూల మొక్కలు. పాలీలు, వయోలెట్స్, అల్లీ, బటర్‌కప్‌ - టండ్రా ఎడారి పూల మొక్కలు.   

* టార్మిగాన్, ధ్రువపు గుడ్లగూబ ఈ ప్రాంతంలోని ప్రధాన పక్షులు. పక్షి గుంపులను ‘రూకరీలు’ అంటారు.

ప్రజలు 

* టండ్రా ప్రాంతంలో నివసించే వారిని ‘ఎస్కిమోలు’ అంటారు. ఎస్కిమో అంటే ‘మంచుబూట్ల వ్యక్తి’ అని అర్థం.

* సైబీరియా నుంచి బేరింగ్‌ జలసంధిని దాటి 5000 సంవత్సరాల క్రితం ఎస్కిమోలు మొదటిసారి ఉత్తర అమెరికాలో ప్రవేశించారు.

* ఎస్కిమోలు చాలా వరకు చెట్లు లేని టండ్రా ప్రాంతంలో, ఆర్కిటిక్‌ మైదానాల్లో నివసిస్తున్నారు.

* ఎస్కిమో బృందాలు రెండు రకాలు అవి: 

1. ఇన్యుయిట్‌  2. యూపిక్‌

* ఇన్యుయిట్‌ అంటే ‘స్థానిక ప్రజలు’ లేదా ‘మూల పురుషులు’ అని అర్థం.

ఎస్కిమోల విస్తరణ: సైబీరియాలో 2000, కెనడాలో 22,500, అలస్కాలో 30,000, గ్రీన్‌లాండ్‌లో 43,000 మంది ఎస్కిమోలు ఉన్నారు.

* యురేషియాలోని టండ్రా మండలంలో నివసించే వారిని ‘లాప్‌’లు అంటారు.

* లాప్‌ల ప్రధాన వృత్తి రెయిన్‌ డీర్‌ల పెంపకం.

భాష: ఎస్కిమోలు ప్రధానంగా మూడు రకాల భాషలు మాట్లాడతారు. అవి:

1) ఇన్యుపిక్‌: ఎక్కువ మంది మాట్లాడే భాష.

2) యూపిక్‌: నైరుతి అలస్కా, సైబీరియాలో మాట్లాడతారు.

3) అల్యుయిట్‌.

* వీరి భాషకు లిపి లేదు.


సామూహిక జీవనం

ఎస్కిమోలు చాలా చిన్న బృందాలుగా నివసిస్తారు. 500 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలు ఉత్తర అలస్కా తీరంలో ఉన్నాయి.

* తూర్పు ప్రాంతంలోని గ్రీన్‌లాండ్, బాఫిన్‌దీవి, లాబ్రాడార్‌లలో 25-45 మంది ఒక బృందంగా జీవిస్తారు. తూర్పు ప్రాంతంలో నివసించే ఎస్కిమోలు ‘సంచార జీవనం’ చేస్తారు. వీరు సుమారు 1100 కి.మీ. తిరుగుతారు.

* శీతాకాలంలో తీరం దగ్గరగా ఉండి సముద్రపు సీల్‌ జంతువులు, చేపలను వేటాడతారు. వేసవిలో సముద్రం నుంచి లోపలి ప్రాంతాల్లో కారిబో జంతువులను వేటాడుతూ, పండ్ల సేకరణ చేస్తూ జీవిస్తారు.

వాహనాలు

ఉమియాక్స్‌: ఇది సంచార జీవనంలో భాగంగా నీటిలో ప్రయాణానికి ఉపయోగించే పడవ. 

కయాక్‌:  దీన్ని చెక్క చట్రంపై జంతు చర్మంతో నిర్మిస్తారు. నీటిలోని జంతువులను వేటాడటానికి ఉపయోగిస్తారు.

స్లెడ్జ్‌ బండి: దీన్ని మంచు బండి అని కూడా అంటారు. దీన్ని లాగడానికి పెద్ద కుక్కలను వాడతారు. 10 నుంచి 14 స్లెడ్జ్‌ కుక్కలు గంటకు 3 - 7 కి.మీ. వేగంతో ఒక టన్ను బరువును లాగగలవు.


వేట బృందాలు 

వాతావరణం అనుకూలంగా లేనప్పుడు మనుగడ కోసం బృందంగా కలసి పనిచేయాల్సి వస్తుంది. శీతాకాలంలో గడ్డకట్టిన సముద్రాల్లో సీల్‌ జంతువుల వేటకు 10 నుంచి 12 మంది అవసరం. కారిబో, తిమింగలం వేటకు 100 మంది సభ్యులు ఉన్న బృందం కావాలి. వలతో చేపలు పట్టడం, పండ్ల సేకరణ, ఎలుగుబంటి జాడను గుర్తించే పనులను కుటుంబ సభ్యులే చూసుకుంటారు.

కారిబోల వేట:

* కారిబో అనేది దుప్పిని పోలిన జంతువు.

* అన్ని ఎస్కిమో బృందాలు కారిబో జంతువులను వేటాడతాయి.

* వీటిని వేసవి కాలంలో, వసంతకాల ఆరంభంలో వేటాడతారు.

* కారిబోల వేటకు బల్లేలు, బాణాలు, హార్పూన్లను ఆయుధాలుగా వాడతారు.

* ఎస్కిమోలు వరుసగా నిలబడి, రాళ్ల కుప్పలను వరుసగా పేర్చి కారిబోలను వేటాడతారు.

చేపలు పట్టడం:

* లోతుగా ఉండే బురద నీళ్లలో లేదా మంచులో ఉండే రంధ్రాల నుంచి వీరు చేపలు పడతారు.

* కొక్కెం అనే పరికరానికి దారం చుట్టి శీతాకాలంలో మంచు రంధ్రాల దగ్గర, వసంత కాలంలో వాగు ఒడ్డున చేపలు పడతారు.

* నీటికి అడ్డంగా రాళ్లతో చిన్న ఆనకట్టలు కట్టి, వాటి వెనుక నిలిచే నీటిలోని చేపలను బరిసెతో వేటాడతారు.

* కొక్కెం అంటే ముళ్లు లేని ఎముక, బరిసె అంటే మూడు పళ్లు ఉన్న ఆయుధం.

ఆహారం:

* ఎస్కిమోల ఆహారంలో ప్రధానంగా మాంసం, చేపలు, కొవ్వు పదార్థాలు ఉంటాయి.

* ఈ ప్రాంతంలో కట్టె పుల్లలు లభించవు. అందుకే వీరు పచ్చి మాంసం తింటారు.

* పచ్చి మాంసం, చేపలను చిన్న ముక్కలుగా చేసి ‘సీల్‌’ జంతువు నూనెలో ఉంచుతారు.

* నూనె దీపాలతో ఆహారాన్ని ఉడికిస్తారు.

* సముద్రపు పెద్ద క్షీరదాల మాంసం కొద్దిగా కుళ్లిన తర్వాత తింటారు.

ఆవాసం: 

* ‘ఇగ్లూ’ అనే ఎస్కిమో పదానికి ‘ఆశ్రయం’ అని అర్థం. వేసవిలో చాలా మంది ఎస్కిమోలు జంతు చర్మాలతో చేసిన గుడారాల్లో నివసిస్తారు.

* శీతాకాలానికి పశ్చిమ అలస్కా ప్రాంతంలో చెక్క చట్రాలపై వాల్‌రస్‌ చర్మాన్ని కప్పడం ద్వారా పెద్ద పెద్ద గుడారాలను తయారు చేస్తారు.

* ఉత్తర అలస్కా ప్రాంతంలో దుంగలు, తిమింగలం పక్కటెముకలతో గుండ్రటి ఇల్లు కడతారు. గ్రీన్‌ లాండ్‌ ప్రాంతంలో రాతి పలకలతో ఇళ్లు నిర్మిస్తారు.

* తూర్పు, మధ్య అలస్కా ప్రాంతంలో మాత్రమే మంచు ఇళ్లను ఉపయోగిస్తారు.

* సీల్‌ జంతు చర్మాలను కలిపి కుట్టడం ద్వారా రెండు మంచు గదులను కలిపి ఒక పెద్ద ఇంటిని నిర్మించుకుంటారు.

* ఇంటికి వెనుక భాగంలో తలుపుకి రెండువైపులా ఒక మీటరు ఎత్తులో మంచు బల్లలను నిర్మిస్తారు. ఇవి జంతు చర్మంతో కప్పి ఉండి పడుకోవడానికి అనుకూలంగా ఉంటాయి.

* ఈ మంచు బల్లల్లోని అరలు ఆహార నిల్వకు, బట్టలు ఆరబెట్టడానికి; కాంతిని, వేడినిచ్చే దీపాలను ఉంచడానికి అనువుగా ఉంటాయి.

దుస్తులు: 

* ఎస్కిమోలు ‘ముక్‌లుక్‌’లు అనే బూట్లు, ప్యాంట్లు, తలకు టోపీ ఉండే కోట్లు వేసుకుంటారు. ఈ కోటును ‘పర్కా’ అంటారు. వీటిని జంతు చర్మాలతో చేస్తారు.

* రకరకాల రంగులు కలిగిన జంతు చర్మాలను కలిపి కుట్టడం ద్వారా పర్కాలపై డిజైన్లు వేస్తారు.

* ఆడ, మగవారి వేషధారణల్లో తేడాలుండేవి.

* వీరు ధరించే వస్త్రాలు చక్కటి ఎంబ్రాయిడరీ చేసి, అంచులు అందంగా కుట్టి ఉంటాయి.

* చలి కాలంలో రెండు పొరలు ఉన్న దుస్తులు ధరిస్తారు. ఈ కాలంలో మెత్తగా, వెచ్చగా ఉండే కారిబో పిల్ల చర్మంతో చేసిన వస్త్రాలను వేసుకునేందుకు ఇష్టపడతారు.

* తీర ప్రాంత బృందాలు వేసవి, వసంత కాలం చివర్లో సీల్‌ చర్మంతో చేసిన దుస్తులను వేసుకుంటారు. అవి నీటిలో తడవవు, కానీ గట్టిగా ఉంటాయి.

కళలు: 

ఎముక, దంతం, కొయ్య, సోప్‌స్టోన్‌ అనే మెత్తటి రాయితో జంతువులు, మనుషుల బొమ్మలు, ఆయుధాలు, వివిధ రకాల పరికరాలు తయారు చేస్తారు. పసిఫిక్, సుదూర పశ్చిమ ప్రాంతాల్లో చెక్కతో ముఖాల తొడుగులను చెక్కి, వాటిని రంగురంగుల పక్షి ఈకలు, జంతు చర్మాలతో అలంకరిస్తారు.

బయటి ప్రపంచంతో సంబంధాలు

ఎస్కిమోలు మొట్టమొదట చూసిన బయటివారు ‘వైకింగ్‌’లు. వీరు ఐస్‌లాండ్‌ నుంచి వచ్చి గ్రీన్‌లాండ్‌లో నివాసం ఏర్పరచుకున్నారు. ఐస్‌లాండ్‌ వారితో ఎస్కిమోల సంబంధాలు క్రీ.శ.1200లో ప్రారంభమై క్రీ.శ.1400 వరకు కొనసాగాయి. 1576-78 కాలంలో బాఫిన్‌ దీవులను బ్రిటిష్‌ సముద్ర యాత్రికుడు మార్టిన్‌ ప్రాస్‌ బిషర్‌ సందర్శించాడు. ఆ తర్వాత ఐరోపా వాసులు ధ్రువ ప్రాంతంలో అనేక అన్వేషణలు చేపట్టారు.

* ఇంగ్లండ్‌కు చెందిన డేవిష్, నార్వేజియన్‌ అనే అన్వేషకులు సముద్రం మీదుగా ఉత్తర ప్రాంతాల చివరకు వెళ్లి చైనాకు వాయవ్య మార్గాన్ని కనుక్కున్నారు.

* 1728 నాటికి రష్యన్లు సైబీరియా, ఉత్తర అలస్కాలకు చేరుకున్నారు.

* 1800 చివరి వరకు ఉత్తర ఆర్కిటిక్‌ దీవుల్లో ఉంటున్న ఎస్కిమో బృందాలకు బయటివాళ్లతో ఎలాంటి సంబంధాలు లేవు.

* 1850 తర్వాత అమెరికా, యూరప్‌ దేశాల నుంచి తిమింగలాల వేటగాళ్లు, జంతుచర్మ వ్యాపారుల రాకతో ఎస్కిమోల్లో చాలా మార్పులు వచ్చాయి.

* బయటివాళ్ల రాకతో వీరి బృందాల్లో అనేక మందికి మశూచి, క్షయ, జలుబు, కోరింత దగ్గు, అమ్మవారు లాంటి వ్యాధులు సంక్రమించాయి. పేదరికం పెరిగింది. ఎస్కిమో బృందాలు చెల్లాచెదురయ్యాయి. విపత్తులు సంభవించసాగాయి.


వృద్ధి - పతనం (Boom and Burst)

ఎస్కిమోలు, బయటివారి మధ్య సంబంధాన్ని ‘వృద్ధి - పతనం’ అంటారు. ఈ వృద్ధి అయిదు దశల్లో జరిగింది. అవి:

1. తిమింగలాల వేట (1859 - 1910)   

2. జంతు చర్మాల వ్యాపారం (1925 - 50) 

3. సైనిక శిబిరాల నిర్మాణం (1950 మధ్య కాలం) 

4. పట్టణాల నిర్మాణం (1960) 

5. చమురు అన్వేషణ, అభివృద్ధి (1970)

మతపరమైన అంశాలు

ప్రతి బృందానికి ప్రత్యేకమైన నమ్మకాలు, సంప్రదాయాలు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి, బృందానికి ఒక నిషిద్ధం ఉంటుంది. దీన్ని ‘టాబూ’ అంటారు. దీని ప్రకారం వారు ఫలానా ఆహారం తినకూడదు, పని చేయకూడదు మొదలైన ఆచారాలు ఉంటాయి. జనన - మరణ సమయంలో, వేట దొరికిన - దొరకని సందర్భాల్లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారు. వీరు ‘శిల’ అనే దేవతను అతీతశక్తిగా పూజిస్తారు. ఆరోగ్యం, జీవనం, ఆత్మ, ఆహార దేవతగా ‘సెడ్నా’ను కొలుస్తారు.  

షమన్లు: మతపరమైన ఆచారాలను నిర్వహించేవారిని ‘షమన్లు’ అంటారు. ఆత్మలను ప్రపంచంతో అనుసంధానించడానికి ఈ షమన్లు సాయం చేస్తారని వీరి నమ్మకం.  


వినోదం: 

జనాదరణ పొందిన పోటీలు, కుస్తీ, పరుగు పందెం, హార్పూన్లు విసరడం వీరి వినోదాలు. కథలు చెప్పడం, పాడటం, డప్పులు వాయిస్తూ ఆడటం వీరి మతపర ఆచారాల్లో భాగం. ఎస్కిమో బృందాలు కలినప్పుడు సంబరాలు జరుపుకుంటారు. మాంసం, కొవ్వు పదార్థాలతో విందు చేసుకుంటారు.

Posted Date : 12-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌