• facebook
  • whatsapp
  • telegram

జ్ఞానేంద్రియాలు

* పరిసరాల నుంచి మనకు జ్ఞానాన్ని అందించే శరీరంలోని అవయవాలను జ్ఞానేంద్రియాలు అంటారు.
* మన ఇంద్రియ జ్ఞానాలైన అయిదింటి గురించి మొదట తెలిపినవారు, జ్ఞానేంద్రియాలన్నింటి కంటే స్పర్శ జ్ఞానం చాలా ముఖ్యమైందని చెప్పినవారు ప్లేటో, అరిస్టాటిల్.
* స్పర్శ జ్ఞానంతో నాడుల పాత్రను మొదటిసారిగా తెలిపినవారు అల్బర్టస్ మేగ్నస్.
* జ్ఞానేంద్రియాలు చేసే పనులన్నింటికీ కేంద్రం మెదడు.
* జ్ఞానేంద్రియాలు శరీరానికి కిటికీల లాంటివని కూడా అంటారు.

ముఖ్యమైన జ్ఞానేంద్రియాలు
1) కళ్లు
2) చెవులు
3) ముక్కు
4) నాలుక
5) చర్మం

కళ్లు

ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు మనకు కనిపించే కనురెప్పలు, కనుబొమ్మలు, కంటిగుడ్డు మొదలైనవన్నీ కంటి గుంతలో అమరి ఉంటాయి. నిజానికి మనకు కంటికి బయట ఉన్న 1/6వ వంతు భాగం మాత్రమే కనిపిస్తుంది. కంటిని మూడు పొరలు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాయి. అవి: దృఢస్తరం, రక్తపటలం, నేత్ర పటలం. 

* కంటి గురించి అధ్యయనం చేసే శాస్త్రం ‘ఆప్తమాలజీ’.

దృఢస్తరం: ఇది తంతుయుతంగా, దళసరిగా, గట్టి స్థితిస్థాపకత లేకుండా, తెలుపు రంగులో బాహ్యంగా ఉండే పొర. దృఢస్తరం ఉబ్బి శుక్లపటలాన్ని ఏర్పరుస్తుంది. దృఢస్తరం చివరి భాగంలో దృక్‌నాడి ఉంటుంది.

రక్తపటలం: కేవలం తారక (చూసే) భాగానికే కాకుండా కంటిలోని అన్ని భాగాలనూ ఆవరించి రక్తపటలం ఉంటుంది. ఇందులో అనేక రక్తనాళాలు ఉంటాయి. తారక భాగం చుట్టూ రక్తపటలం నుంచి కంటిపాప ఏర్పడుతుంది. దీనిలో కిరణాకార, వర్తులాకార కండరాలు ఉంటాయి. తారకకు వెనుక ద్వికుంభాకారంలో కటకం ఉంటుంది. ఇది శైలికాకార అనే ఆరు కండరాలతో, అవలంబిత స్నాయువులకు కలిపి ఉంటుంది. కటకం నలుపు రంగులో ఉంటుంది.

నేత్రపటలం: కటకం కంటి (కంటి గుడ్డు) లోపలి భాగాన్ని నేత్రోదయ కక్ష్య, కాచావత్‌ కక్ష్యలుగా విభజిస్తుంది. నేత్రోదయ కక్ష్య ద్రవంతో; కాచావత్‌ కక్ష్య జెల్లీ లాంటి ద్రవంతో నిండి ఉంటాయి. నేత్ర పటలంలో దండాలు, కోన్‌లు/ శంకువులు అనే కణాలుంటాయి.  ఇందులో దృష్టి జ్ఞానం లేని అంధ చుక్క, మంచి దృష్టి జ్ఞానం కలిగిన పచ్చ చుక్క ఉంటాయి. పచ్చ చుక్కను మెక్యులా సోవియా అని అంటారు. దండాలు, కోన్‌లు 15 : 1 నిష్పత్తిలో ఉంటాయి. హ్రస్వ దృష్టి లోపం ఉన్నవారికి నేత్రపటలానికి ముందు, దూర దృష్టి లోపం ఉన్నవారిలో నేత్ర పటలానికి వెనుక ప్రతిబింబాలు ఏర్పడతాయి. హ్రస్వ దృష్టి లోపం వారు పుటాకార కటకాన్ని, దీర్ఘ దృష్టి లోపం ఉన్నవారు కుంభాకార కటాకాన్ని వాడాలి. కంటికి వచ్చే వ్యాధులు: రేచీకటి, కళ్లు పొడిబారడం, దీర్ఘ దృష్టి లోపం, హ్రస్వ దృష్టి లోపం, కంటిలో శుక్లాలు రావడం, గ్లూకోమా, వర్ణ అంధత్వం.


ముక్కు

* ముక్కు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘రైనాలజీ’ అంటారు.

* ముక్కు/ నాసికా కుహరం లోపలి వైపును ఆవరించి ‘శ్లేష్మస్తరం’ ఉంటుంది. ఇది శ్లేష్మద్రవాన్ని స్రవిస్తుంది. ఈ ద్రవంలో దాదాపు 1500 రకాల వాసనలను గుర్తించే గ్రాహకాలు ఉన్నట్లు శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. 

* శ్లేష్మస్తరంలో ఘ్రాణ గ్రాహకాలు ఉంటాయి. ఇతర జంతువులతో పోలిస్తే మన ఘ్రాణ గ్రాహకాల సామర్థ్యం చాలా తక్కువ.

* ఘ్రాణ గ్రాహకాలు వాసన ఇచ్చే అణువులను కలిగి, వాసనను గుర్తిస్తాయి. ఇవి దేన్నైనా గ్రహించినప్పుడు ప్రేరణ పొంది, నాడీ సంకేతాలుగా మార్చి మెదడులో కింది భాగాన ఉండే ఘ్రాణ కేంద్రాలకు చేరుస్తాయి. అక్కడ ఘ్రాణజ్ఞానం ప్రక్రియ జరిగాక ఆ సంకేతాలు మెదడులోని ఇతర భాగాలకు చేరతాయి. వాసనను, రుచిని గ్రహించే గ్రాహకాలను రసాయనిక గ్రాహకాలు అంటారు. 

ఉమామి: జున్ను, మాంసం, సముద్ర జీవుల నుంచి వచ్చే ఒక రకమైన వాసనను ఉమామి అంటారు.

నాలుక

నాలుకపై పదివేల రుచులను గుర్తించే రుచికళికలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి చిన్న చిన్న నిర్మాణాలుగా ఉండే సూక్ష్మాంకురాలను/ పాపిల్లేలను కలిగి ఉంటాయి.

ఇవి 4 రకాలు. అవి: 

ఫిలిఫామ్‌ పాపిల్లే: నాలుక ముందు భాగంలో పొలుసుల్లా ఉంటాయి. రుచి కళికలు ఉండవు. తీపిని గ్రహిస్తుంది.

ఫంగిఫాం పాపిల్లే: నాలుక మధ్య భాగంలో చిన్న, గుండ్రటి నిర్మాణాలను కలిగి ఉంటుంది. రుచికళికలు ఉంటాయి. ఉప్పును గ్రహిస్తుంది.

సర్కంవల్లేట్‌ పాపిల్లే: నాలుక వెనుక భాగంలో పెద్ద అండాకారంలో ఉంటుంది. రుచి కళికలు ఉంటాయి. చేదును గ్రహిస్తుంది.

ఫోలియేట్‌ పాపిల్లే: నాలుక అంచుల్లో ఉబ్బెత్తు నిర్మాణాలుగా ఉంటుంది. పులుపును గ్రహిస్తుంది.

* రుచికళికల్లో రుచి గ్రాహకాలు ఉంటాయి. అన్ని గ్రాహకాలు కలసి జిహ్వనాడిగా మారి, మెదడుకి సమాచారాన్ని తీసుకెళ్తాయి.

* నాలుక గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘లారింగాలజీ’ అంటారు.

చెవి

* కపాలంలోని ఎముకల ద్వారా శబ్దాలు మన లోపలి చెవికి చేరతాయి. దీన్నే బోనికండక్షన్‌ అంటారు. చెవులు కేవలం వినడానికే కాకుండా మన శరీర సమతాస్థితిని సక్రమంగా ఉంచడానికి కూడా ఉపయోగపడతాయి. చెవి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘ఓటాలజీ’ అంటారు. చెవిలో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి. అవి: వెలుపలి చెవి, మధ్య చెవి, అంతర చెవి.

బాహ్య/ వెలుపలి చెవి: చెవిలో బయటకు కనిపించే భాగాన్ని పిన్నా లేదా చెవిదొప్ప అంటారు. బాహ్య చెవిలో కుహరం లాంటి ప్రదేశం ఉంటుంది. దీన్ని శ్రవణ కుహరం లేదా ఆడిటరీ మీటస్‌ అంటారు. ఇది సెరుమినస్‌ గ్రంథులను కలిగి ఉంటుంది. ఈ గ్రంథులు ‘సెరుమిన్‌’ అనే మైనం లాంటి ద్రవాన్ని స్రవిస్తాయి. ఇది దుమ్ము, ధూళిని అడ్డుకుంటుంది. బాహ్య చెవిలో చివరి భాగం ‘కర్ణభేరి’. ఇది శబ్ద తరంగాలను లోపలి చెవివైపు పంపిస్తుంది.

మధ్య చెవి: మధ్య చెవిలో మూడు ఎముకలు ఉంటాయి. అవి: కూటకం, దాగలి, కర్ణాంతరాస్థి. ఈ మూడూ ఒక గొలుసులా అమరి ఉంటాయి. ఆకారం ఆధారంగా కూటకాన్ని సుత్తి అని, దాగలిని పట్టెడ అని, కర్ణాంతరాస్థిని అంకవనె అని పిలుస్తారు. మధ్య చెవి చివరి భాగాన్ని కప్పుతూ అండాకార కిటికీ అనే పొర ఉంటుంది. మధ్య చెవి వర్తులాకార కిటికీ ద్వారా లోపలి చెవిలోకి తెరుచుకుంటుంది.

అంతర/ లోపలి చెవి: లోపలి చెవిలో త్వచాగహనాన్ని ఆవరించి అస్థిగహనం ఉంటుంది. అస్థిగహనంలో 3 భాగాలుంటాయి. అవి: 1. పేటిక  2. అర్ధవర్తుల కుల్యలు 3. కర్ణావర్తం

పేటిక: పేటిక ముందు భాగాన్ని సెక్యులస్‌ అని, వెనుక భాగాన్ని యుట్రిక్యులస్‌ అని అంటారు. సెక్యులస్, యుట్రిక్యులస్‌ నుంచి వచ్చే నాడీతంతువులు పేటిక నాడిని ఏర్పరుస్తాయి. పేటిక భాగం శరీర సమతాస్థితిని నిర్వహిస్తుంది.

అర్ధవర్తులాకార కుల్యలు: ఇవి పేటికకు కలిపి ఉంటాయి. వీటిలో అంతరలసికాద్రవం ఉంటుంది.  

కర్ణావర్తం: ఇది ఒక సర్పిలాకార నిర్మాణం. ఇది స్కాలావెస్టిబ్యులై, స్కాలామీడియా, స్కాలాటింపాని అనే 3 సమాంతర నాళాలను కలిగి ఉంటుంది. స్కాలావెస్టిబ్యులై, స్కాలాటింపాని పరలసిక ద్రవంతో; స్కాలామీడియా అంతరలసిక ద్రవంతో నిండి ఉంటాయి. కర్ణావర్త నాడీతంతువులు కర్ణావర్త నాడిని ఏర్పరుస్తాయి. పేటికా నాడి, కర్ణావర్తనాడి కలసి శ్రవణ నాడిగా ఏర్పడతాయి. యుస్టాచియన్‌ (eustachian)నాళం మధ్య చెవి నుంచి నోటి కుహరాన్ని కలుపుతుంది.

చెవికి వచ్చే వ్యాధులు: బ్యాక్టీరియా, ఫంగస్‌ వల్ల చీము కారడం, కర్ణభేరికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.

చర్మం

* మానవ శరీరంలో అత్యంత పెద్ద అవయవం చర్మం. దీని బరువు నాలుగు కేజీలు ఉంటుంది.

* యుక్త వయసు వారి చర్మం 11/2 చ.మీ. వైశాల్యం కలిగి ఉంటుంది. అరికాళ్లలో చర్మం అత్యధికంగా 1/2 సెం.మీ. మందంతో ఉంటే, కనురెప్పల వద్ద అత్యల్పంగా 1/2 మి.మీ. మందంతో ఉంటుంది.

* చర్మాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘డెర్మటాలజీ’ అంటారు.
 

ముఖ్యమైన జ్ఞానేంద్రియాలు
1) కళ్లు
2) చెవులు
3) ముక్కు
4) నాలుక
5) చర్మం

కన్ను
* కంటి గురించి అధ్యయనం చేయడాన్ని ఆప్తామాలజీ అంటారు.
* కనుగుడ్డులో మనకు కనిపించే భాగం 1/6వ వంతు.
* మనం చదివేటప్పుడు కంటికి, పుస్తకానికి మధ్య ఉండాల్సిన దూరం 30 సెం.మీ.
* టీవీకి, కంటికి మధ్య ఉండాల్సిన దూరం 2 1/2 మీటర్లు.
* కంటి ముందు భాగంలో ఉండే ఉపకళ కణజాలంతో తయారైన పలుచని పొర కంటి పొర.
* కన్నును కనురెప్పలు, రెప్ప వెంట్రుకలు, కనుబొమ్మలు, అశ్రు గ్రంథులు నిరంతరం రక్షిస్తూ ఉంటాయి. కంటి గుడ్డును కదపడానికి 6 కండరాలు ఉంటాయి.
* కంటిలో 3 ముఖ్యమైన పొరలు ఉన్నాయి. అవి ధృడస్తరం, రక్తపటలం, నేత్రపటలం.


       

1) ధృడస్తరం: దళసరి, గట్టిగా, తంతుయుతంగా, స్థితిస్థాపకత లేకుండా తెలుపు రంగులో బాహ్యంగా ఉండే పొర.
* ధృడస్తరం ఉబ్బి శుక్లపటలాన్ని ఏర్పరుస్తుంది. దీని చివరలో ధృక్‌నాడీ ఉంటుంది. శుక్లపటలం కాంతి కిరణాలను కంటిలోకి వెళ్లనిస్తుంది. దీన్నే కార్నియా అంటారు. దీన్ని నేత్రదానంలో సేకరిస్తారు.
2) రక్తపటలం: ఇది రెండో పొర. ఈ పొర నలుపు రంగులో ఉండి, అనేక రక్తనాళాలను కలిగి ఉంటుంది.
* తారక భాగాన్ని తప్ప కంటి అన్ని భాగాలను ఆవరించి ఉంటుంది. కంటి మధ్య భాగంలో ఉన్న చిన్న గుండ్రటి ప్రదేశం తారక.
* తారక చుట్టూ రక్తపటలం నుంచి ఏర్పడే భాగమే కంటిపాప. దీనిలో కిరణాకార, వర్తులాకార కండరాలు ఉంటాయి.
* తారకకు వెనుక ద్వికుంభాకారంలో ఉండే కటకం ఉంటుంది.


కనుపాప (ఐరిస్):
* ఇది శుక్ల పటలం కింద ఉంటుంది. కనుపాప గుండ్రంగా ఉండే పొర లాంటి నిర్మాణం. కనుపాప మధ్యలో గుండ్రంగా ఉండే రంధ్రాన్ని తారక అంటారు. ఇది కంటి లోపలి కుహరంలోకి కాంతిని పోనిస్తుంది. చీకటిలో కనుపాప వ్యాకోచిస్తుంది. అప్పుడు తారక పెద్దదవుతుంది. దీనివల్ల ఎక్కువ కాంతి తారక ద్వారా కంటిలోకి ప్రవేశిస్తుంది. కాంతి తీక్షణంగా ఉన్నప్పుడు కంటిపాప సంకోచించడం వల్ల తారక చిన్నదవుతుంది. అందువల్ల తక్కువ కాంతి లోనికి వెళ్తుంది.
* కంటి రంగు కనుపాపను బట్టి ఉంటుంది. కనుపాపలో ఉండే వర్ణక పదార్థం కంటికి నలుపు, బూడిద రంగు, పసుపు, నీలం రంగులను కలగజేస్తుంది.

స్ఫటిక కటకం: ఇది కనుపాప వెనుకగా ఉండి, కాంతి కిరణాలను నేత్ర పటలం మీదకు కేంద్రీకరిస్తుంది. ఇది కుంభాకారంలో ఉంటుంది.

* కంటి గుడ్డు లోపలి భాగాన్ని నేత్రోదక కక్ష, కచావత్ కక్ష అనే రెండు భాగాలుగా విడగొడుతుంది.
నేత్రోదక కక్ష: ఇది నీరు లాంటి ద్రవంతో నిండి ఉంటుంది.
కచావత్‌కక్ష: ఇది జెల్లీ లాంటి ద్రవంతో నిండి ఉంటుంది.
* కటకాన్ని, కంటి ఇతర భాగాలను యాంత్రిక అఘాతాల నుంచి రక్షించేవి నేత్రోదక కక్ష, కచావత్ కక్షలో ఉండే ద్రవాలు.
నేత్ర పటలం: ఇది కంటి లోపలి పొర, కంటిలోని జ్ఞాన భాగం. దీనిలో 2 రకాల కణాలు ఉంటాయి.

నేత్రపటలంలోని కణాలు రెండు రకాలు. అవి:
1) దండాలు (RODS)
2) శంకువులు (CONES)

 

దండాలు
* ఇవి సుమారుగా 125 మిలియన్లు ఉంటాయి.

* ఇవి అతితక్కువ కాంతిలో అంటే చీకటిలో వస్తువులను చూడగలవు. వివిధ రంగులను గుర్తించలేవు.
* రొడాప్సిన్ అనే వర్ణద్రవ్యం వీటిలో ఉంటుంది.

శంకువులు

* ఇవి సుమారు 7 మిలియన్లు ఉంటాయి.
* ఇవి కాంతివంతమైన వెలుతురులో పనిచేస్తాయి.
* ఇవి వివిధ రంగులను గుర్తిస్తాయి.
* 'ఫోవియా' అనే భాగంలో ఉండి, దృష్టి స్పష్టంగా ఉండేలా చేస్తాయి.
* అయోడాప్సిన్ అనే వర్ణద్రవ్యం వీటిలో ఉంటుంది.
* కంటిలో దండాలు, కోనుల నిష్పత్తి 15 : 1.
* కంటి లోపల ప్రతిబింబం ఏర్పడే భాగం నేత్ర పటలం. నేత్ర పటలంలో శంకువులు అధికంగా ఉండే భాగాన్ని ఎల్లో స్పాట్/ ఫోవియా అంటారు.

 

అంధచుక్క
*నేత్ర పటలంలో కాంతి గ్రాహకాలు లేని, అంధకారంగా ఉండే ప్రాంతాన్ని అంధచుక్క అంటారు. ఇక్కడ దండాలు, శంకువుల కణాలు ఉండవు.
* దృక్‌నాడీ కంటి నుంచి బయటకు వెళ్లే ప్రాంతం వద్ద ఉంటుంది.

క‌న్ను - సంరక్షణ

* కంటి ముందు భాగాన్ని పారదర్శకమైన ఉపకళా కణజాలంతో చేసిన కంటిపొర రక్షిస్తుంది.
* ఏదైనా అవసరం లేని పదార్థం కంటిలో పడితే బయటకు పంపేది అశ్రుగ్రంథులు.
* కటకాన్ని, కన్ను ఇతర భాగాలను అఘాతాల నుంచి రక్షించేవి నేత్రోదక కక్ష, కచావత్ కక్ష.
* ఒక పరిశుభ్రమైన కిటికీలా పని చేసేవి కనుపాపకు ముందుండే శుక్లపటలం, ధృడస్తరం.
* తారక నిర్మాణాన్ని సరిచేసే కండర నిర్మాణం కంటిపాప.
* కటకం నాభ్యంతరాన్ని సరిచేయడానికి ఉపయోగపడేవి శైలికామయ కండరాలు, అవలంబిత స్నాయువులు.
* ఒక ప్రతిబింబం ముద్ర నేత్రపటలం మీద సుమారు 1/6 సెకన్లు మాత్రమే ఉంటుంది.

 

కన్ను పనిచేసే విధానం
దృష్టిజ్ఞానం:
* కన్ను కాంతిని సేకరించి కుంభాకార కటకం ద్వారా కేంద్రీకరించి, కంటిలో వెనుక భాగాన ఉండే నేత్రపటలంపై ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది.
* కటకం వల్ల ఏర్పడే ప్రతిబింబంలో ఎడమ కుడిగా, తలకిందులుగా ఉంటుంది.
* మెదడులోని జ్ఞాన కేంద్రాల్లో పటాలన్నీ సాధారణంగా తిరగబడి తలకిందులుగా మారతాయి.
* నాడీ కణాలన్నీ కట్టలా కలిసి, కంటి నుంచి దృష్టి సమాచారాన్ని మెదడుకు పంపించే 'దృక్‌నాడీ'ని ఏర్పరుస్తాయి.
* రెండు కళ్లు సేకరించిన రెండు దృశ్యాలను కలిపి ఒక త్రిమితీయ పటంగా మెదడు తయారు చేస్తుంది.

కంటికి వచ్చే వ్యాధులు, లోపాలు
కంటి శుక్లం (కేటరాక్ట్): కంటి ముందర భాగంలో ఉండే పొర ఉబ్బి మెత్తగా మారి పగులుతుంది. కళ్లు సరిగా కనిపించవు.
ఎస్టిగ్మాటిజమ్: నేత్రపటలంలోని వంపు అసంపూర్తిగా ఉండటం.
హ్రస్వ దృష్టి/ మయోపియా: దీనిలో నేత్ర పటలానికి ముందుగా ప్రతిబింబం ఏర్పడుతుంది. దూరంగా ఉండే వస్తువులు వీరికి సరిగ్గా కనిపించవు.
దూరదృష్టి/ దీర్ఘదృష్టి: నేత్ర పటలానికి వెనుక ప్రతిబింబాలు ఏర్పడతాయి. వీరికి దగ్గరి వస్తువులు సరిగా కనిపించవు.
వర్ణాంధత: సాధారణ పరిస్థితుల్లో రంగులను గుర్తించలేకపోవడం, చూడలేకపోవడం. ఇది జన్యు సంబంధిత వ్యాధి.
కండ్ల కలక: ఇది ఒక వైరస్ వల్ల వస్తుంది. కంటి ముందు పొర ఉబ్బుతుంది. కన్ను ఎరుపెక్కుతుంది, మండుతుంది; నీరు కారుతుంది.
జిరాఫ్తాల్మియా: కంటిలోని అశ్రుగ్రంథులు అశ్రువులను ఉత్పత్తి చేయవు. కంటిపొర పొడిగా అవుతుంది.
గ్లూకోమా: కంటిలోని దృక్‌నాడీ పాడైపోతుంది. దీనివల్ల కంటిలో ఎక్కువ పీడనం ఏర్పడుతుంది.
రేచీకటి: తక్కువ వెలుతురులో లేదా రాత్రి వేళలో వస్తువులను చూడలేకపోవడం.
ట్రకోమా: కంటికి సోకే అంటువ్యాధి. ఇది రెండు కళ్లకూ వస్తుంది. ఇది క్లామీడియా ట్రాకోమేటిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది.
* 'ఆధార్' లాంటి గుర్తింపు కార్డులను ఇచ్చేటప్పుడు కంటిపాప (ఐరిస్)ను ఫోటోగా తీసుకుంటారు. ఇవి ఒక్కొక్కరికి ప్రత్యేకంగా ఉంటాయి. వేలి ముద్రల మాదిరి వీటిని కూడా గుర్తింపు కోసం ఉపయోగిస్తారు.
* రెండు కళ్లతో ఒక వస్తువును చూడటాన్ని బైనాక్యులర్ విజన్ అంటారు.

చెవి (ఓటాలజీ)

* వినడంతోపాటు మన శరీర సమతాస్థితిని సక్రమంగా ఉంచడానికి ఇవి ఉపయోగపడతాయి.
* చెవిలో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. అవి: వెలుపలి చెవి, మధ్య చెవి, అంతర్/లోపలి చెవి.

 

వెలుపల చెవి/ చెవి దొప్ప
* దీన్నే 'పిన్నా' అని కూడా అంటారు. ఇది మృదులాస్థితో తయారవుతుంది. శ్రవణకుహరం అనే గది/ తగ్గు లాంటి నిర్మాణం దీనిలో ఉంటుంది.
* పిన్నా మైనాన్ని స్రవించే సెరుమినస్ గ్రంథులు, తైలాన్ని స్రవించే తైలగ్రంథులను కలిగి ఉండి దుమ్ము, ధూళి శ్రవణ కుహరంలోకి చేరకుండా ఆపుతుంది. ఈ శ్రవణ కుహరాన్నే 'ఆడిటరీ మీటస్' అంటారు.
* శ్రవణ కుహరం చివరలో కర్ణభేరి అనే పలుచని పొర ఉంటుంది. ఇది వెలుపలి చెవికి, మధ్య చెవికి మధ్యలో ఉంటుంది.

 

మధ్యచెవి:
* ఇది ఒక గదిలా ఉంటుంది. దీనిలో మూడు ఎముకలు ఒక దాంతో ఒకటి కలిసి గొలుసులా అమరి ఉంటాయి. వాటిని వరుసగా కూటకం, దాగలి కర్ణాంతరాస్థి/ స్టేపీస్ అంటారు. ఆకారాన్ని బట్టి వాటిని వరుసగా సుత్తి, పట్టెడ, అంకవన్నె అని కూడా పిలుస్తారు. కర్ణభేరితో కూటకం కలిసి ఉంటుంది.
* ఈ ఎముకల గొలుసు శబ్ద తరంగాలను లోపలి చెవి నిర్మాణానికి అందజేస్తుంది.
* మధ్యచెవి చివరి భాగాన్ని కప్పుతూ అండాకార కిటికీ అనే ఒక పొర ఉంటుంది.
* మధ్యచెవి లోపలి చెవిలోకి వర్తులాకార కిటికీ ద్వారా తెరుచుకుంటుంది.
* మధ్యచెవి కుహరం యూష్టాషియన్ నాళం ద్వారా నోటి కుహరంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. కర్ణభేరికి రెండు వైపులా సమాన పీడనం ఉండటానికి ఇది సహాయపడుతుంది.

అంతరచెవి/ లోపలి చెవి:

* వినడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీనిలో రెండు కుహరాలు ఉంటాయి. వెలుపల ఉండేదాన్ని అస్థిగహనం, లోపలి దాన్ని త్వచాగహనం అంటారు. అస్థిగహనం కపాలంలోని ఎముకల్లో ఉంటుంది.
* త్వచాగహనంలో పేటిక, అర్దవర్తుల కుల్యలు, కర్ణావర్తం అనే భాగాలు ఉంటాయి.

 

పేటిక:
* దీని ముందు భాగాన్ని సేక్యులస్, వెనుక భాగాన్ని యుట్రిక్యులస్ అంటారు. వాటి నుంచి వచ్చే తంతువులు పేటిక నాడీని ఏర్పరుస్తాయి.

 

అర్ధవర్తుల కుల్యలు:
* పేటికకు కలిపి ఉంటాయి. అంతర లసిక ద్రవంతో ఉంటాయి.
* పేటిక అర్ధవర్తుల కుల్యలు కలిసి పేటికా ఉపకరణాన్ని ఏర్పరుస్తాయి. ఇవి శరీర స్థితి, సమతౌల్యం సక్రమంగా ఉండేలా చూసి శరీర సమతాస్థితిని నిర్వహిస్తాయి.

 

కర్ణవర్తం:
* ఇది ఒక సర్పిలాకార నిర్మాణం.
* ఇది స్కాలా వెస్టిబ్యులై, స్కాలా మీడియం, స్కాలా టింపాని అనే మూడు సమాంతర నాళాలను కలిగి ఉంటుంది.
* ఇది కార్టై అండం, ప్రాథమిక జ్ఞాన కణాలతో ఉంటుంది.
* పేటికా నాడీ, కర్ణావర్త నాడీ కలిసి 'శ్రవణనాడీ'గా ఏర్పడతాయి.
* ప్రకృతి ప్రశాంతతను దుర్వినియోగం చేసే ధ్వనులను ధ్వని కాలుష్యం అంటారు. ధ్వని కాలుష్యం వల్ల మన వినికిడి శక్తి తగ్గిపోతుంది.

సైన్ లాంగ్వేజ్:
* చెవుడు, మూగ ఉన్నవారికి విషయాలను తెలియజేయడానికి కొన్ని గుర్తులు, సైగలతో కోడ్‌లను సూచిస్తారు. ఇలా ప్రత్యేకంగా మాట్లాడుకోవడాన్ని సైన్ లాంగ్వేజ్ అంటారు.
* ఒక వ్యక్తికి జన్మించినప్పటి నుంచి వినికిడి జ్ఞానం లేకుంటే అతడికి మాటలు కూడా రావు.
* మానవుడు వినగలిగే స్థాయి 20 హెర్ట్జ్ - 20,000 హెర్ట్జ్.

 

శ్రవణ జ్ఞానం:
* వెలుపలి చెవి శబ్ద తరంగాలను సేకరిస్తుంది. అవి శ్రవణకుల్య ద్వారా కర్ణభేరిని చేరతాయి. అక్కడి నుంచి ప్రకంపనలు కూటకం, దాగలి, కర్ణాంతరాస్థులను చేరగానే అవి శబ్ద ప్రకంపనాల తీవ్రతను పెంచుతాయి. తర్వాత అక్కడి నుంచి అవి కర్ణావర్తం చేరతాయి. అప్పుడు త్వచాగహనం కదిలి ప్రకంపనాలు కార్టై అంగాన్ని చేరి, శ్రవణ నాడీ ద్వారా మెదడును చేరతాయి.
* చెవిలోని గులిమి వల్ల ఏదైనా ఆటంకం వస్తే హైడ్రోజన్ పెరాక్సైడ్ చుక్కలు వాడాలి.

చెవిలోని భాగాలు


 

ముక్కు
* మానవ శరీరంలో అతి ముఖ్యమైన జీవక్రియ శ్వాసక్రియ. దీనికి ఉపయోగపడే జ్ఞానేంద్రియం ముక్కు.
* ముక్కు అధ్యయనాన్ని రైనాలజీ అంటారు.
* ముక్కు ఒక జత నాసికా రంధ్రాలతో ఉంటుంది. ఇవి నాసికా కుహరాల్లోకి తెరుచుకుంటాయి. నాసికా కుహరాలు నాసికా విభాజకం ద్వారా వేరై, శ్లేష్మస్తరం ద్వారా లోపలి వైపుకు కప్పి ఉంటాయి.
* శ్లేష్మస్తరంలో రసాయన గ్రాహకాలు ఉంటాయి. వాటిని ఘ్రాణ గ్రాహకాలు అంటారు.
* ఘ్రాణ గ్రాహకాల నుంచి ఘ్రాణనాడీ మెదడుకు వార్తలను తీసుకెళుతుంది.
* శాస్త్రవేత్తలు 1500 రకాల వాసనలను ఉత్పత్తిచేసే రసాయనాలను వర్గీకరించారు.

నాలుక

* నాలుక మాట్లాడానికి, ఆహారం మింగడానికి, రుచులు తెలుసుకోవడానికి సహాయపడుతుంది.
* చేపల్లో తప్ప మిగిలిన అన్ని సకశేరుకాల్లో జిహ్వ గ్రాహకాలు నాలుక మీద ఉంటాయి.
* చేపలు, అకశేరుకాల్లో నాలుక లేకపోవడం వల్ల జిహ్వ గ్రాహకాలు శరీరం మీద అనేక ప్రాంతాల్లో ఉంటాయి.
* వివిధ రుచులను గ్రహించడానికి నాలుకపై రుచిమొగ్గలు/ రుచి కటికాలు ఉంటాయి.
   వాటి సంఖ్య సుమారుగా 10 వేలు.
* నాలుకపై రుచిని గ్రహించేవి రుచి గ్రాహక కణాలు/జిహ్వ గ్రాహకాలు. రుచి ఒక రసాయనిక జ్ఞానం.
* నాలుకలోని కండరాలు నియంత్రిత కండరాలు.

 

నాలుకపై రుచి మొగ్గలు
* రుచిని, వాసనను గ్రహించే ఇంద్రియ జ్ఞానాలు ఒక దాంతో ఒకటి దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంటాయి.
* జలుబుగా ఉన్నప్పుడు నోటికి ఆహారం రుచిగా ఉండకపోవడానికి కారణం ముక్కు పూడుకున్నట్లుగా అవడం.
* కృత్రిమంగా తయారైన ఆహార పదార్థాలకు ఉండే రుచిని మెటాలిక్ టేస్ట్ అంటారు.
    

* మిరపకాయలు తిన్నప్పుడు నోరు మండటం అనేది యదార్థంగా రుచి కాదు. నాలుక భౌతికంగా ఆ ఘాటు భరించలేకపోవడమే.
* ఉష్ణాన్ని గ్రహించడానికి కూడా నాలుక మీద గ్రాహకాలు ఉంటాయి.

 

నాలుక పై భాగాలు/ సూక్ష్మాంకురాలు (Papille)
ఫిల్లిపార్మ్ పాపిల్లే
* ఇవి పొలుసుల లాంటి నిర్మాణాలు. రుచి కలికలు ఉండవు. కాబట్టి రుచిని గుర్తించలేవు.
ఫంగిపార్మ్ పాపిల్లే
* ఇవి గుండ్రంగా కనిపించే నిర్మాణాలు
* రుచి కలికలు ఉంటాయి.
సర్కంవేలేట్ పాపిల్లే
* నాలుక వెనుక వైపు గుండ్రంగా ఉంటాయి.
* రుచి కలికలు ఉంటాయి.
పోలియేట్ పాపిల్లే
* ఇవి నాలుకకూ ఇరువైపులా ఉబ్బెత్తుగా ఉండే నిర్మాణాలు.
* రుచి కలికలు ఉంటాయి.

ఉమామి

* ఇది చాలా తక్కువ మందికి తెలిసిన మరొక రుచి.
* మాంసకృతులు పుష్కలంగా ఉండే ఆహారం (మాంసం, సముద్రం నుంచి లభించే ఆహారం, జున్ను) నుంచి వచ్చే ఒక రకమైన వాసననే ఉమామి అంటారు.
* ఇది 'మోనోసోడియం గ్లూటమేట్‌'తో కలిస్తే దీన్ని హాచింగ్ అని పిలుస్తారు. ఆసియా ప్రాంతపు వంటల్లో ఉపయోగిస్తారు.
* నాలుకపై ప్రతి రుచికణికలోనూ ఒక కుహరం రంధ్రాన్ని కలిగి ఉంటుంది. ఈ రంధ్రాన్ని రుచి రంధ్రం అంటారు. రుచికణిక దగ్గర ఉండే ఉపకళకణాలు రుచికణాలు/గ్రాహకాలను ఏర్పరుస్తాయి.

చర్మం
* మన శరీరంలోని అన్ని అవయవాలకు చర్మం ఒక రక్షణ కవచం లాంటిది. ఇది ఒక స్పర్శ జ్ఞానేంద్రియం. అంతేకాకుండా చర్మం వల్ల శరీరానికి ఒక నిర్దిష్ట ఆకారం ఏర్పడుతుంది.
* యుక్త వయసులో చర్మ ఉపరితల వైశాల్యం 1 1/2 చ.మీ. అందువల్ల ఇది శరీరంలో అతిపెద్ద అవయవం.
* కంటిరెప్పలో ఇది 1/2 మి.మీ. మందం, అరికాళ్లలో సుమారు 1/2 సెం.మీ. మందంతో ఉంటుంది.
* దీనికి సాగే, నీటిని అడ్డుకునే లక్షణాలు ఉన్నాయి.
* కొన్ని వ్యర్థ పదార్థాలను చెమట రూపంలో విసర్జించడం, శరీర ఉష్ణోగ్రతను క్రమపరచడంలో చర్మం సహాయపడుతుంది.
* చర్మం సుమారు నాలుగు కిలోల బరువును కలిగి ఉంటుంది. దీని అధ్యయనాన్ని డెర్మటాలజీ అంటారు.
* చర్మంలో రెండు పొరలు ఉన్నాయి. అవి: 1) బాహ్యశ్చర్మం 2) అంతశ్చర్మం.

బాహ్యశ్చర్మం

* దీనిలోని కణాలు మూడు వరుసల్లో అమరి ఉంటాయి. మొదటి వరుసలో కార్నియస్ పొర ఉంటుంది. ఇది నిర్జీవ కణాలతో ఉంటుంది. ఇందులో ఉండే నిర్జీవమైన ప్రొటీన్ కెరోటిన్.
* ఇది గోళ్లు, రోమాల్లో అధికంగా ఉంటుంది. ఈ పొరలోని కణాలు అరుగుదల వల్ల లేదా వాతావరణంలోని మార్పుల వల్ల రాలిపోతాయి.
* ఇందులో రెండో పొర గ్రాన్యులార్. ఇది జీవకణాలను కలిగి ఉండే మధ్య పొర.
* మూడోది మాల్ఫీజియన్ పొర. తరచూ విభజన చెందుతూ రాలిపోయిన కార్నియస్ పొరలోని కణాల స్థానాన్ని భర్తీ చేస్తుంది.

 

అంతశ్చర్మం
* ఇది బాహ్యచర్మం కంటే మందంగా ఉంటుంది. ఇది చర్మానికి బలాన్ని, సాగే లక్షణాన్ని ఇస్తుంది.
* అంతశ్చర్మంలో రక్తనాళాలు, నాడీ అంత్యాలు, రోమాలను ఉత్పత్తి చేసే రోమ పుటికలు, తైలాన్ని స్రవించే తైలగ్రంథులు, చెమటను స్రవించే స్వేద గ్రంథులు, కొవ్వులు ఉంటాయి.
* అంతశ్చర్మంలో ఎత్తు పల్లాలు ఉంటాయి. వీటి వల్ల వేలిముద్రలు ఏర్పడతాయి. ఇవి కవలల్లో కూడా వేరుగా ఉంటాయి.
* అంతశ్చర్మంలో మెలనిన్ అనే వర్ణకం చర్మానికి, రోమాలకు రంగును ఇస్తుంది.
* మెలనిన్ చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడుతుంది. ఈ సమయంలో ఎక్కువగా విడుదలయ్యే ప్రక్రియను టానింగ్ అంటారు.

అంతశ్చర్మం ప్రధానంగా 2 రకాల గ్రంథులను కలిగి ఉంటుంది.

ఎ) స్వేద గ్రంథి: ఇది రక్తంలో అధికంగా ఉండే నీటిని, లవణాలను చెమట రూపంలో బయటకు పంపుతుంది. స్వేద రంధ్రాలు ఎక్కుగా ఉండే ప్రాంతాలు నుదుటి భాగం, చేతుల కింది భాగం.
బి) తైల గ్రంథి: ఒక సంచి లాంటి భాగం. ఇది స్రవించే తైలం లాంటి పదార్థం సెబం. ఇది చర్మం తడిగా ఉండేందుకు, రోమాల పెరుగుదలకు సహాయపడుతుంది. దీన్నే సెబాషియన్ గ్రంథి అని కూడా అంటారు.
స్పర్శ గ్రాహకాలు:
* వేలి చివరన, పెదవులపై అధిక సంఖ్యలో ఉంటాయి. అందువల్లే లూయీ బ్రెయిలీ బ్రెయిలీ లిపిని కనుక్కున్నారు.
చర్మంలో 3 రకాల చర్మ గ్రాహకాలు ఉంటాయి.
స్పర్శ గ్రాహకాలు
* ఇవి స్పర్శను గ్రహిస్తాయి.
పాసినియన్ గ్రాహకాలు
* ఇవి పీడనాన్ని గ్రహిస్తాయి.
నాసి సెప్టారులు
* ఇవి ఉష్ణోగ్రతలో మార్పును, బాధను తెలియజేస్తాయి.
* శరీరంలోని ఒక గ్రాహకం 10ºC - 35ºC వరకు శీతల గ్రాహకంగా పనిచేస్తుంది. 36ºC నుంచి ఉష్ణగ్రాహకంగా పనిచేస్తుంది. ఇలాంటి గ్రాహకాలు నాలుకపై ఎక్కువ సంఖ్యలో ఉంటాయి.

చర్మ వ్యాధులు

* కలుషితమైన నీటిలో స్నానం చేయడం వల్ల లేదా ఈగలు /నల్లుల వల్ల వచ్చే చర్మ వ్యాధి ప్రూరైటిస్/దురదలు.
* పోషకాహారంలో లోపం అంటే B3/నియాసిస్ విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి పెల్లాగ్రా.
* బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు కుష్టు, ఏగ్జిమా, ఏక్‌ని (మొటిమలు).
* శిలీంధ్రం వల్ల వచ్చే వ్యాధి తామర (మైక్రోస్పోరియం వల్ల).
* వైరస్ వల్ల వచ్చే వ్యాధులు ఆటలమ్మ, తట్టు/పొంగు.
* ఆర్ద్రోపొడా వర్గానికి చెందిన సార్కోప్టిస్ స్కేబిస్ అనే కీటకం వల్ల వచ్చే వ్యాధి గజ్జి.
* మెలనిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి బొల్లి.

 
రచయిత: కనుముక్కల నాగేంద్ర

Posted Date : 05-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌