• facebook
  • whatsapp
  • telegram

సాంఘికశాస్త్ర విద్యాప్రమాణాలు

విద్యాప్రమాణాలు


విద్యార్థి అభ్యసిస్తున్నప్పుడు ఏదైనా ఒక స్థాయిలో ఆ విద్యార్థి ఏమి తెలుసుకుంటే, ఏమి నేర్చుకుంటే, ఏ కృత్యాలు చేస్తే ఆ స్థాయి అభ్యసనం జరిగినట్లు భావిస్తామో ఆ విషయాలనే/ కృత్యాలనే విద్యా ప్రమాణాలు అంటారు.

* ఈ విద్యాప్రమాణాలు చాలా స్పష్టంగా, ఆచరణాత్మకంగా, సాధింపదగినవిగా ఉండటం కోసం వీటిని అభ్యసన సూచికలుగా విభజిస్తారు.

* తరగతిలో అభ్యసనం జరిగిందనడానికి అభ్యసన సూచికలే సాక్ష్యాలు.

* సాంఘికశాస్త్ర బోధనలో 6 విద్యాప్రమాణాలు ఉన్నాయి. 

అవి: 1) విషయావగాహన

2) ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి, అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం

3) సమాచార నైపుణ్యాలు

4) సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం - ప్రశ్నించడం

5) పటనైపుణ్యాలు      6) ప్రశంస-సున్నితత్వం

విషయావగాహన (Conceptual understanding)

విద్యార్థి విషయాన్ని అర్థం చేసుకుని (బట్టీ పట్టకుండా) సొంత మాటల్లో చెప్పడమే విషయావగాహన.

అభ్యసన సూచికలు:

* ఉదాహరణలు ఇవ్వడం    * వివరించడం

* వర్గీకరించడం                * పోలికలు తెలపడం

*  భేదాలు తెలపడం         *  ఊహించడం

*  ఫలితాలు తెలపడం      * విశ్లేషించడం

*  సంశ్లేషణ చేయడం       *  కారణాలు తెలపడం

*  దృష్టాంతాలను పేర్కొనడం

*  సంబంధాలను గుర్తించడం


ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి, అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం

విద్యార్థులకు కొంత పాఠ్యాంశ భాగాన్ని ఇచ్చి, చదవమనాలి. వారు అర్థం చేసుకుని రాయగలిగేలా కొన్ని ప్రశ్నలు ఇస్తే వాటికి సమాధానాలు రాయాలి.

ఉదా: ప్రజాపంపిణీ వ్యవస్థకు సంబంధించి 9వ తరగతిలోని 100వ పేజీలో ఒక పేరాను ఇచ్చి సంబంధిత ప్రశ్నలు అడగడం.

అభ్యసన సూచికలు:

* ఇచ్చిన అంశాన్ని చదివి, అర్థం చేసుకోవడం.

* సొంత అభిప్రాయాలతో వ్యాఖ్యానించడం.

* అంశంతో ఏకీభవించడం లేదా విభేదించడం.

* సమస్యకు పరిష్కారాలు సూచించడం.

* సమస్యపై తన అభిప్రాయాన్ని చెప్పడం.

* సమస్య ద్వారా తర్వాత ఏం జరుగుతుందో చెప్పడం.

సమాచార నైపుణ్యాలు

ఇందులో ఆరు సోపానాలు ఉంటాయి. అవి:

* విషయ సేకరణ      * నమోదు

* విశ్లేషణ                * నిర్ణయానికి రావడం

* నివేదిక తయారీ    * నివేదిక ప్రదర్శన

అభ్యసన సూచికలు:

* సమాచారాన్ని సేకరించడం.      * సమాచారాన్ని 

a) Text to table                  b) Table to text
c) Table to question          d) Table to graph

e) Graph to question        f) Graph to table
g) Graph to text               h) Text to graph


 తర్వాతి రూపాల్లోకి మార్చడం

* పట్టికలు, గ్రాఫ్‌లను విశ్లేషించడం.

* పట్టికలు, గ్రాఫ్‌లు, చిత్రంపై ప్రశ్నలు తయారు చేయడం.

సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం - ప్రశ్నించడం

పాఠం నేర్చుకుంటున్నప్పుడే విద్యార్థి ఆ కాలానికి సంబంధించిన సంఘటనలపై తరగతిలో చర్చించగలగాలి. 

ఉదా: 1) 9వ తరగతిలో ‘‘పారిశ్రామికీకరణ - సామాజిక మార్పు’’ పాఠ్యాంశం నేర్చుకుంటున్నప్పుడు బాల కార్మికుల పరిస్థితి గురించి చర్చించడం.

2) ‘‘రోడ్డు భద్రతా విద్య’’ పాఠం నేర్చుకునేటప్పుడే ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి చర్చించడం.

అభ్యసన సూచికలు:

* పాఠ్యాంశాన్ని నిజజీవిత అంశాలతో జోడించాలి.

* స్థానిక అనుభవాలు, అంశాలను జోడించి ప్రతిస్పందించాలి.

* గతంలో ఏకకాలంలో జరిగిన, పోలిన అంశాల గురించి చర్చించాలి.

* సమస్య గురించి సమగ్రంగా తెలుసుకునే కోణంలో ప్రశ్నించాలి.

పట నైపుణ్యాలు

పట నైపుణ్యాల్లో ప్రధానంగా 3 అంశాలు ఉంటాయి. అవి:

* పటాన్ని గీయడం    * పటాలను చదవడం

* పటాల్లోని ప్రదేశాలను గుర్తించడం

అభ్యసన సూచికలు:

* గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశ పటాలను గీయడం.

* పటాల్లో ప్రదేశాలు, మార్గాలు, సరిహద్దులు గుర్తించడం.

* ఇచ్చిన సూచికల ఆధారంగా పటాన్ని అర్థం చేసుకోవడం.

* పాఠ్య విషయానికి పటాన్ని జోడిస్తూ, అన్వయించి అర్థం చేసుకోవడం.

* పటాలను చదవడం, చర్చించడం, ప్రశ్నించడం వాటి గురించి మాట్లాడటం మొదలైనవి చేయడం.

ప్రశంస - సున్నితత్వం

విద్యార్థి మంచి వైఖరులను అలవర్చుకోవడం, విలువలను పెంపొందించుకోవడం ఈ విద్యాప్రమాణ పరిధిలోకి వస్తాయి.

అభ్యసన సూచికలు:

* వివిధ సమస్యలపై తమ స్పందనను తెలిపే నినాదాలు, పోస్టర్లు, కరపత్రాలను తయారు చేయడం.

* సమస్యలపై విశ్లేషణ చేస్తూ పత్రికలకు, అధికారులకు లేఖలు రాయడం.

* స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం లాంటి రాజ్యాంగ విలువలను పెంపొందించుకోవడం.

* సభలు, సమావేశాలలో పాల్గొనడం.

* సమాజంలో ఇతరులు చేసిన మంచి పనులను ప్రశంసించడం.

* దయ, ప్రేమ లాంటి మానవతా విలువలు పెంపొందించుకోవడం.

* పెద్దలను, స్త్రీలను, జాతీయగీతాన్ని, చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించడం లాంటి మంచి వైఖరులును అలవరుచుకోవడం.

* జీవన నైపుణ్యాలను అలవరుచుకోవడం.

* ఇతరుల పట్ల సానుభూతితో వ్యవహరించడం.

మాదిరి ప్రశ్నలు


1. సుధ అనే విద్యార్థిని తన కుటుంబ ఖర్చుల వివరాలతో ఒక పై చిత్రం గీసింది. ఆమెలో నెరవేరిన విద్యా ప్రమాణం?

1) పట నైపుణ్యాలు     2) సమాచార నైపుణ్యాలు   

3) ప్రశంస-సున్నితత్వం  4) విషయావగాహన


2. చార్మిల అనే 9వ తరగతి విద్యార్థిని ఇటలీ పటాన్ని పరిశీలించి అందులో ఉన్న దీవుల పేర్లు చెప్పింది. ఆమెలో నెరవేరిన విద్యా ప్రమాణం?

1) సమాచార నైపుణ్యాలు                 2) పట నైపుణ్యాలు
3) ఇచ్చిన సమాచారం చదివి, అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం

4) విషయావగాహన


3. స్వర్ణలత అనే విద్యార్థిని ‘గ్లోబల్‌ వార్మింగ్‌’ను అరికట్టడానికి సంబంధించి 3 నినాదాలు తయారు చేసింది. తనలో నెరవేరిన విద్యాప్రమాణం?

1) విషయావగాహన      2) పట నైపుణ్యాలు 

3) సమాచార నైపుణ్యాలు   4) ప్రశంస-సున్నితత్వం


4. సంధ్యారాణి అనే ఉపాధ్యాయురాలు వివిధ దశాబ్దాల ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించిన సమాచారాన్ని ఒక బార్‌ గ్రాఫ్‌లో పేర్కొని, దానిపై ప్రశ్నలు ఇచ్చారు. ఆమె విద్యార్థుల్లో ఏ విద్యా ప్రమాణాన్ని పరీక్షిస్తున్నారు?

1) విషయావగాహన     2) సమాచార నైపుణ్యాలు 

3) ప్రశంస-సున్నితత్వం   4) పట నైపుణ్యాలు


5. కిందివాటిలో అభ్యసన సూచికలకు సంబంధించి సరికానిది?

1) ఇవి విద్యాప్రమాణాల సాధనకు సోపానాలు.

2) ఇవి అభ్యసనం జరిగిందనడానికి సాక్ష్యాలు.

3) ఇవి అభ్యాసకుల్లో సాధించాల్సిన అభ్యసన ఫలితాలను తెలియజేస్తాయి.

4) ఇవి పాఠశాలస్థాయి అంతిమ లక్ష్యాలు.


6. నిహ్రాల్‌ అనే విద్యార్థి సతత హరితారణ్యాలు, ఆకురాల్చే అడవుల మధ్య భేదాలను తెలిపాడు. అతడిలో నెరవేరిన విద్యాప్రమాణం ఏది?

1) విషయావగాహన   2) ప్రశంస-సున్నితత్వం   

3) పట నైపుణ్యాలు    4) సమాచార నైపుణ్యాలు


7. జాహ్నవి అనే విద్యార్థిని శిలావరణం, జలావరణం, వాతావరణం లేకుండా జీవావరణం ఎందుకు మనుగడ సాగించలేదో తెలిపింది. ఆమెలో నెరవేరిన విద్యాప్రమాణం?

1) విషయావగాహన   2) ప్రశంస-సున్నితత్వం

3) పట నైపుణ్యాలు    4) సమాచార నైపుణ్యాలు


8. ఒక విద్యార్థికి భారతదేశ పటాన్ని ఇచ్చి, అల్లావుద్దీన్‌ ఖిల్జీ దక్షిణ భారతదేశ దండయాత్రలను గుర్తించండి అని అడిగారు. ఈ ప్రశ్నలో ఉన్న విద్యాప్రమాణం ఏది?

1) పట నైపుణ్యాలు     2) ప్రశంస-సున్నితత్వం

3) విషయావగాహన    4) సమాచార నైపుణ్యం


9. విజయనగర రాజుల శిల్పకళా వైభవాన్ని అభినందించిన రాజు అనే విద్యార్థిలో నెరవేరిన విద్యాప్రమాణం?

1) విషయావగాహన   2) ప్రశంస-సున్నితత్వం

3) పట నైపుణ్యాలు    4) సమాచార నైపుణ్యాలు


10. పర్యావరణ పరిరక్షణ కోసం మీ పాఠశాలలో జరిగే కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక కరపత్రాన్ని తయారుచేయండి అనే ప్రశ్నలో ఉన్న విద్యాప్రమాణం ఏది?

1) విషయావగాహన     2) ప్రశంస-సున్నితత్వం

3) సమాచార నైపుణ్యాలు  4) పట నైపుణ్యాలు


11. రాణి అనే ఉపాధ్యాయురాలు 9వ తరగతిలోని చౌకధరల దుకాణాలకు సంబంధించి ఒక పేరా ఇచ్చి విద్యార్థులను చదవమని, తర్వాత పేదల కోసం సబ్సిడీలు ఇవ్వడం సమంజసమేనా? అని ప్రశ్నించారు. ఆమె కింది ఏ విద్యాప్రమాణాన్ని పరీక్షిస్తున్నారు?

1) విషయావగాహన            2) సమాచార నైపుణ్యాలు

3) ఇచ్చిన పాఠం చదివి, అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం

4) ప్రతిస్పందించడం


12. కిందివాటిలో ‘ప్రశంస-సున్నితత్వం’ అనే విద్యాప్రమాణానికి సంబంధించి సరికాని అభ్యసన సూచిక ఏది?

1) సహజ వనరుల పరిరక్షణ గురించి నినాదాలు రాయడం

2) నీటి సంరక్షణపై పోస్టర్‌ తయారు చేయడం

3) వివిధ గిరిజనుల జీవన విధానాలను గౌరవించడం

4) చిప్కో ఉద్యమం గురించి అర్థం చేసుకోవడం


13. అనిల్‌ అనే విద్యార్థికి భారతదేశ పటాన్ని ఇచ్చి, అందులో విజయనగర సామ్రాజ్యాన్ని గుర్తించమని అడిగితే అది కింది ఏ విద్యాప్రమాణాన్ని పరీక్షిస్తుంది?

1) సమాచార నైపుణ్యాలు            2) పట నైపుణ్యాలు

3) విషయావగాహన                   4) ప్రశంస-సున్నితత్వం


14. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అటవీ విధానాలు, వాటి లక్ష్యాలకు సంబంధించి ఒక పట్టిక ఇచ్చి దాని ఆధారంగా సమాధానాలను కనుక్కోమని కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. అతడు పరీక్షించాలనుకున్న విద్యాప్రమాణం ఏది?

1) ఇచ్చిన పాఠం చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం

2) సమాచార నైపుణ్యాలు

3) సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం - ప్రశ్నించడం

4) విషయావగాహన


సమాధానాలు

1-2; 2-2; 3-4; 4-4; 5-4; 6-1; 7-1; 8-1; 9-2; 10-2; 11-3; 12-4; 13-2; 14-2

Posted Date : 20-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌