• facebook
  • whatsapp
  • telegram

యత్నదోష అభ్యసన సిద్ధాంతం

అభ్యసన సిద్ధాంతాల్లో థార్న్‌డైక్‌ రూపొందించిన యత్నదోష అభ్యసన సిద్ధాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈయన సిద్ధాంతాన్ని విద్యాచరణలోనూ, శిక్షణా బదలాయింపులోనూ అధికంగా అన్వయిస్తారు. 

* 1890లో విలియం జేమ్స్‌ రూపొందించిన Prinicipals of Psychology అనే గ్రంథం చదివి ప్రభావితుడైన థార్న్‌డైక్‌ 1911లో Animal Intelligence అనే గ్రంథాన్ని ప్రచురించారు.

* థార్న్‌డైక్‌ రూపొందించిన యత్నదోష అభ్యసన సిద్ధాంతంలో ఉద్దీపన, ప్రతిస్పందన మధ్య నాడీ సంధానం జరుగుతుంది. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని సంసర్గ సిద్ధాంతం, బంధనాల సిద్ధాంతం, S-R-Type సిద్ధాంతం, విజయ పథ వరణరీతి సిద్ధాంతంగా పేర్కొంటారు.

*  ప్రయోగంలో పిల్లి అనేక ప్రయత్నాల ద్వారా విజయాన్ని పొందుతుంది. ఈ సిద్ధాంతాన్ని విజయపథ వరణరీతి సిద్ధాంతం అని కూడా పిలుస్తారు.

* అమెరికాకు చెందిన ఈ.ఎల్‌. థార్న్‌డైక్‌ అనే శాస్త్రవేత్త ప్రకారం అభ్యసనం అనేది ప్రయత్నాలు చేయడం, దోషాలను అధిగమించడం ద్వారా జరుగుతుంది.

ఈయన ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలంటే అనేక ప్రయత్నాలు చేయాలని, తద్వారా యత్నాల సంఖ్య పెరిగేకొద్దీ దోషాల సంఖ్య తగ్గి అభ్యసనంలో పట్టు సాధించడం జరుగుతుందని ప్రయోగపూర్వకంగా నిరూపించారు. 

* అనేక తప్పులు చేయడం,  వాటిని సరిదిద్దుకోవడం ద్వారా అభ్యసనం జరగడాన్నే యత్నదోష అభ్యసనం అంటారు.

ప్రయోగం:

థార్న్‌డైక్‌ ఆకలిగా ఉన్న పిల్లిని పజిల్‌బాక్స్‌ (Puzzle Box) లో ఉంచి, దానికి కనిపించేలా ఆహారాన్ని ఉంచారు. బాక్స్‌కు అమర్చిన మీట నొక్కితే ఆహారం పిల్లికి అందేలా ఏర్పాటు చేశారు.

* పిల్లికి ఆకలి అనే అవసరం ద్వారా ప్రేరణకలగగా, అది తన ముందున్న ఆహారాన్ని పొందడానికి, బాక్స్‌లో నుంచి బయటికి రావడానికి అటూ ఇటూ తిరుగుతూ, తన పంజాతో కొట్టడం, పళ్లతో కొరకడం లాంటి అనేక వ్యర్థ ప్రయత్నాలను చేసింది. చివరకు అనుకోకుండా, యాదృచ్ఛికంగా మీటను తన పంజాతో నొక్కగానే తలుపు తెరుచుకోవడంతో పిల్లికి ఆహారం లభించింది.

* అంటే పిల్లి ఆహారాన్ని పొందే ప్రయత్నంలో చాలా తప్పులు చేసి, కొంతసమయాన్ని వృథా చేసి చివరకు ఆహారాన్ని పొందింది.

* పిల్లి మళ్లీ ఆహారాన్ని పొందే క్రమంలో ప్రయత్నాల సంఖ్య, ఆహారం పొందడానికి పట్టే సమయం కూడా తగ్గిపోయాయి. 

* ఈ విధంగా ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దోషాల సంఖ్య తగ్గి, తక్కువ కాలంలోనే విజయవంతంగా మీటను నొక్కి ఆహారాన్ని పొందడం అనేది అభ్యసనం ద్వారా జరుగుతుందని ఈ ప్రయోగం ద్వారా తెలుస్తోంది.

* ఈ ప్రయోగం ద్వారా అభ్యసించడానికి చలన కౌశలాలైన డ్రైవింగ్‌ (సైకిల్, స్కూటర్, కార్‌) ప్రక్రియ, ఈత నేర్చుకోవడం, క్రీడల్లో నైపుణ్యం పొందడం, చిన్నతనంలో పిల్లలు పలకపై అక్షరాలు దిద్ది నేర్చుకోవడం లాంటివి అనుకూలమైనవి.


మాదిరి ప్రశ్నలు


1. పునీత్‌ తనకు ఉపాధ్యాయుడు ఇచ్చిన అయిదు లెక్కలను సులభంగా పూర్తి చేసిన తర్వాత కష్టమనిపించే ఆరో లెక్కను కూడా సాధించడానికి ప్రయత్నించాడు. ఇది థార్న్‌డైక్‌ ఏ నియమాన్ని సూచిస్తుంది?

1) అభ్యాస నియమం           2) సంసిద్ధతా నియమం

3) ఫలిత నియమం             4) పౌనఃపున్య నియమం

జ: 3


2. ఏ అభ్యసన సిద్ధాంతం బోధనాభ్యాసన ప్రక్రియలో అభ్యాసం, డ్రిల్లు, పునరావృతాలకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది?

1) పరిశీలనా అభ్యసనం     2) కార్యసాధక నిబంధనం

3) యత్నదోష అభ్యసనం   4) అంతర్‌దృష్టి అభ్యసనం

జ: 3


3. శిశుకేంద్ర విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న మంజునాథ్‌ అనే ఉపాధ్యాయుడు థార్న్‌డైక్‌ ఏ నియమానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు భావించవచ్చు?

1) సంసిద్ధతా నియమం      2) ఫలిత నియమం

3) అభ్యాస నియమం        4) సంసర్గ నియమం

జ: 1


4. ప్రాథమిక పాఠశాల విద్యార్థులైన జాహ్నవి, శక్తి స్వరూప్‌లు పాఠశాలకు వెళ్లే మార్గంలో ఉన్న గుడిని చూడగానే ప్రసాదం లేదా దేవుడిని గుర్తుకు తెచ్చుకోవడంలో ఇమిడి ఉన్న థార్న్‌డైక్‌ నియమం ఏది?

1) పాక్షిక చర్యా నియమం       2) ప్రేరణకారక నియమం

3) కాలక్రమణ నియమం        4) సామీప్యతా నియమం

జ: 4


5. ‘S-R’ నిబంధనానికి సంబంధించి సరికాని వాక్యమేది?

1) నిర్ణయాలు ఉంటాయి     2) ఉద్దీపనకు ప్రాధాన్యం ఉంటుంది

3) ప్రతిస్పందన వెలువడిన తర్వాత పునర్బలనం లభిస్తుంది

4) సామీప్యతా నియమాన్ని కలిగింది

జ: 3


6. అభ్యసనంలో ప్రాధాన్యం కలిగిన ‘అభ్యాస నియమం’ను ఏ సంప్రదాయం ఏర్పరచింది?

1) నిర్మాణాత్మక వాదం     2) ప్రవర్తనా వాదం

3) మనోవిశ్లేషణా వాదం    4) గెస్టాల్ట్‌ వాదం

జ: 2


థార్న్‌డైక్‌ ప్రయోగ అభ్యసన  ప్రధాన నియమాలు


ఈ ప్రయోగం ద్వారా థార్న్‌డైక్‌ మూడు ప్రధాన నియమాలను పేర్కొన్నారు.

1. సంసిద్ధతా నియమం (Law of Readiness)

2. అభ్యాస నియమం (Law of Exercise)

3. ఫలిత నియమం (Law of Effect)


సంసిద్ధతా నియమం 

*  ఈ నియమం ప్రకారం ఎవరిలోనైనా అభ్యసన ప్రక్రియ జరగాలంటే మొదట ‘సంసిద్ధత’ అవసరం. 

* అదేవిధంగా పని (Work) పరంగా గమనించినా ఏదైనా శారీరక, మానసిక చర్యలు జరపడానికి శారీరక పెరుగుదలతోపాటు మానసిక పెరుగుదల, పరిపక్వత అవసరం. ఈ ప్రక్రియ ప్రేరణపై కూడా ఆధారపడుతుంది.

* అభ్యాసకుడు సంసిద్ధంగా లేకపోతే ఎన్నిరకాల అభ్యాసనా అనుభూతులను కల్పించినా కూడా ఫలితం ఉండదు. కొన్ని సందర్భాల్లో అభ్యసనం కూడా ప్రారంభం కాదు.

* దీని కోసం ఉపాధ్యాయులు తరగతి గదిలో పాఠ్యబోధనకు ముందు రకరకాల ప్రేరణ కృత్యాలను నిర్వహించి విద్యార్థులను సంసిద్ధులను చేయాల్సి ఉంటుంది. 

* దాహం లేని గుర్రాన్ని నీటి వద్దకు తీసుకెళ్లగలం కానీ దాంతో నీరు తాగించలేం కదా!

అభ్యాస నియమం 

ఒక కృత్యాన్ని మళ్లీ మళ్లీ చేయడమే అభ్యాసం. 

‘తినగ తినగ వేము తియ్యనుండు.. 

సాధనమున పనులు సమకూరు ధరలోన’, ‘అభ్యాసము కూసు విద్య’ అనే సామెతలు ఈ నియమానికి సంబంధించినవే. ఇందులో 2 ఉపనియమాలు ఉన్నాయి. 

A. ఉపయోగ/ తరచుదన /పౌనఃపున్య నియమం (Law of use): ఒక పనిని మళ్లీ మళ్లీ చేయడం ద్వారా దోషాలను నివారించి, అభ్యసనం సమర్థవంతంగా చేయవచ్చు. దీన్ని అనుసరించి ఎక్కాలు, పద్యాలు, శ్లోకాలు నేర్పించవచ్చు. క్రీడల్లో నైపుణ్యానికి కూడా ఈ ఉపనియమం అత్యంత ఉపయోగకరం.

B. నిరుపయోగ/ అనుపయోగ నియమం (Law of disuse): నేర్చుకున్న అంశాన్ని మళ్లీ మళ్లీ సాధన చేయకపోవడం వల్ల విషయం మధ్య సంధానం బలహీనపడి, అభ్యసనం కుంటుపడుతుంది. 

ఉదా: చిన్నతనంలో నేర్చుకున్న / అభ్యసించిన విషయాలు మళ్లీ మళ్లీ చదవకపోవడంతో వాటిని ప్రస్తుతం గుర్తుంచుకోలేకపోవడం.

గమనిక: చలన కౌశలాలకు ఈ నియమం వర్తించదు. 

ఉదా: ఈత, టైప్‌రైటింగ్, డ్రైవింగ్‌ లాంటి కౌశలాలను వెంటవెంటనే తిరిగి చేయకపోయినా, వాటిని పూర్తిగా మర్చిపోవడం జరగదు కానీ కొంత నిష్పాదన తగ్గవచ్చు.

ఫలిత నియమం

థార్న్‌డైక్‌ ఈ నియమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. దీన్ని రెండు ఉపనియమాలుగా పరిశీలిస్తే...

A. సంతృప్తి నియమం (Law of satisfaction): ఒక కృత్యసాధనలో మంచి ఫలితం లేదా సంతృప్తి ఏర్పడితే దాని మధ్య సంసర్గం బలపడుతుంది.

B. అసంతృప్తి నియమం (Law of Dissatisfaction): ఏదైనా ఒక కృత్యసాధనలో వైఫల్యం లేదా అసంతృప్తి కలిగితే వాటి మధ్య ఉన్న బంధనాలు బలహీనపడి అభ్యసనం సన్నగిల్లుతుంది లేదా క్షీణిస్తుంది.

Posted Date : 14-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌