• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సిలబస్‌ గుట్టు తెలిస్తే.. సగం గెలిచినట్టే!

సర్కారీ కొలువు సాధ్యం ఇలా

 

 

లక్షలమంది పోటీపడినా.. తగిన కృషిచేసి ప్రభుత్వ ఉద్యోగం కొట్టగలిగేది కొద్దిమంది మాత్రమే. ఆ కొద్దిమందిలో మీరూ ఉండాలనుకుంటున్నారా? అయితే లక్ష్యం, తపనలతో పాటు పకడ్బందీ ప్రణాళికతో సన్నద్ధం కావాల్సి ఉంటుంది. అందుకు మొదటి మెట్టు (ఏ ఉద్యోగానికి ఏ అభ్యర్థి సరిపోతాడనే నిర్ణయం) గురించి గత సంచికలో తెలుసుకున్నాం. ఇక రెండో సోపానం-  పరీక్షల సిలబస్‌. ఇది చాలా ముఖ్యమైనది. దీని గురించి ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం! 

 

పోటీ పరీక్షలకు సంబంధించిన వివిధ పరిస్థితులు, అవరోధాలు, మెలకువలు మొదలైన స్థూల అంశాలను అర్థం చేసుకున్నాక ఒకటి, రెండు పరీక్షల్ని ఎంపిక చేసుకోవాలి. ఆ తరువాత ఒక్కొక్క మెలకువను క్రమబద్ధంగా అమలు చేస్తూ అవరోధాలు తొలగించుకుంటూ ముందుకెళ్లాలి. అలా వెళ్ళే క్రమంలో పరిగణించాల్సిన ఒక ప్రధాన అంశం- సిలబస్‌ను అర్థం చేసుకోవడం.

 

‘సిలబస్‌పై సంపూర్ణ అవగాహన వస్తే విజయానికి కావాల్సిన సగం బలం చేకూరినట్లే’ అనేది వాస్తవం. సిలబస్‌ని అర్థం చేసుకోవటం ద్వారా అభ్యర్థి చదవాల్సిన పరిధినీ, లోతునూ నిర్ణయించుకునే సదవకాశం ఏర్పడుతుంది. పోటీ పరీక్షల్లో నిజానికి పేపర్‌ తయారీదారులు సిలబస్‌ బద్ధులై ప్రశ్నలు తయారు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అనేక సందర్భాల్లో సిలబస్‌ పరిధిని దాటి ప్రశ్నలు అడిగారు కూడా. అదేవిధంగా సిలబస్‌లో ఉన్న వివిధ అంశాలకు సమాన వెయిటేజిని ఇవ్వనక్కర్లేదు కూడా.

 

ఏ స్థాయి పుస్తకాలు?

సిలబస్‌పై అవగాహన పెంచుకోవడం ద్వారా అభ్యర్థులు కలిగే మరొక లాభం- ఏ స్థాయి పుస్తకాలను ఎంచుకోవాలో నిర్ణయించుకోవడం సులభమవటం. సిలబస్‌ లోని ఉపఅంశాలను గమనించినప్పుడు ఆ అంశాలన్నీ బేసిక్‌ స్థాయిలో చదవాలా, మధ్య స్థాయిలో చదవాలా, గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో చదవాలా అనేది అభ్యర్థికి తెలుస్తుంది. 

 

జనరల్‌ స్టడీస్‌లో ప్రస్తుత కాలంలో విపత్తు నిర్వహణ, పర్యావరణ విద్య మొదలైనవి బేసిక్‌ స్థాయిలో చదివితే చాలు. అంటే పాఠశాల స్థాయి అవగాహన. అందువల్ల పాఠశాల స్థాయి పుస్తకాలు సంబంధిత అంశాల కోసం చదివితే సరిపోతుంది. 

 

ఒక దశాబ్ద కాలపు అనుభవాలను పరిశీలిస్తే- భారత ఆర్థిక అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ క్రమంలో సిలబస్‌లోని అంశాలు క్షుణ్ణంగా పరిశీలించి నట్లయితే అర్థశాస్త్ర అంశాలను గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో చదవాలనే అవగాహన ఏర్పడుతుంది. 

 

చరిత్ర సంబంధిత సిలబస్‌ను పరిశీలిస్తే- గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఉండే పుస్తకాల వల్లే మంచి మార్కులు వస్తాయని అర్థమవుతుంది.

 

థియరీ ఎంత? అన్వయం ఎంత?

సిలబస్‌ను సంపూర్ణంగా పరిశీలించడం వల్ల కలిగే మరొక ప్రయోజనం.. సైద్ధాంతిక (థియరీ) అంశాలకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, అన్వయ అంశాలకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి అనే స్పష్టత ఏర్పడటం. సిలబస్‌లో కొన్ని టాపిక్స్‌ను పరిశీలించినప్పుడు అవి కేవలం సైద్ధాంతిక అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్టుగా గమనించవచ్చు. ఫలితంగా ఆ అంశాల్ని సైద్ధాంతిక కోణంలో చదివేసి పరీక్షకు సిద్ధం అవ్వవచ్చు. శాస్త్ర సాంకేతికత, ఆర్థిక వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ మొదలైన అంశాల్లో ఎంత స్థాయిలో అన్వయాన్ని మేళవించాలి అనే విషయంలో స్పష్టత ఏర్పడుతుంది.

 

సమయ నిర్వహణ సులువు

సిలబస్‌ను సమగ్రంగా అర్థం చేసుకున్నప్పుడు పరీక్ష సన్నద్ధతకు సమయ నిర్వహణ కూడా సులభం అవుతుంది. టాపిక్స్‌ వారీగా ‘ఏ టాపిక్‌ కి ఎంత సమయాన్ని కేటాయించాలి?’ అనే ప్రాథమిక అవగాహన అభ్యర్థుల్లో ఏర్పడుతుంది.

 

క్రమబద్ధమైన అధ్యయనం

సిలబస్‌ అధ్యయనం ద్వారా అందులోని వివిధ టాపిక్స్‌ను ఏది ముందుగా చదవాలి, ఏది తర్వాత చదవాలి, ఏది చివరకు చదవాలి అనే క్రమబద్ధమైన అధ్యయనానికి మార్గం ఏర్పడుతుంది. దానితో అభ్యర్థుల్లో అధ్యయన క్లిష్టత తొలగి ప్రేరణ పెరుగుతుంది. చక్కని విజయాన్ని సాధించే అవకాశం ఏర్పడుతుంది.

 

సమాచారం అనుసంధానం

పరీక్షకు సంబంధించిన సిలబస్‌పై అవగాహన ఉన్నట్లయితే వివిధ పేపర్ల మధ్య ఉండే విషయాంతర దృక్పథం (ఇంటర్‌ డిసిప్లినరీ అప్రోచ్‌) ఏర్పడుతుంది. ఫలితంగా ఒకే పరీక్షలోని వివిధ పేపర్లలో ఉన్న వివిధ సమాచారాన్ని అనుసంధానం చేసుకుని సందర్భోచితంగా వాడుకొనే నైపుణ్యం అభ్యర్థుల్లో ఏర్పడుతుంది.

 

జనరల్‌ స్టడీస్‌ చాలా ముఖ్యం 

మొదటిసారి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ప్రత్యేక శ్రద్ధతో ఎక్కువ సమయాన్ని కేటాయించడం ద్వారానే రాణించగలుగుతారు. అభ్యర్థులకు ఉద్యోగానికి సంబంధించిన ప్రత్యేక సబ్జెక్టులపై తప్పనిసరిగా పట్టు ఉండాలి. అదే సందర్భంలో జనరల్‌ స్టడీస్‌పై కూడా గట్టి పట్టు ఉంటేనే అంతిమ విజయం సాధ్యమవుతుంది. సాధారణంగా వృత్తి సంబంధిత సబ్జెక్టులో టాప్‌ ర్యాంకర్స్‌ అందరూ ఒకే రకమైన మార్కులు సాధిస్తారు. అయితే అంతిమ ఫలితం మాత్రం జనరల్‌ స్టడీస్‌లో వచ్చే మార్కుల పైనే ఆధారపడి ఉంటుంది. 

 

పోస్టులు తక్కువ.. పోటీ ఎక్కువ

అందులోనూ ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్లలో ఉద్యోగాల సంఖ్య చాలా స్వల్పంగా ఉండటం వల్ల పోటీ తీవ్రంగా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని లభ్యమయ్యే సమయాన్ని 60 శాతం వృత్తి సంబంధిత సబ్జెక్టుకు కేటాయించి, 40 శాతం సమయాన్ని జనరల్‌ స్టడీస్‌కు కేటాయించాలి. అలాగే ఈ స్వల్పకాలంలో జనరల్‌ స్టడీస్‌ లోని అన్ని అంశాలపైనా లోతైన అధ్యయనం చేయకుండా కరెంట్‌ అఫైర్స్, అరిథ్‌మెటిక్, రీజనింగ్, చరిత్ర, రాజ్యాంగ అంశాలు, జనరల్‌ సైన్స్, విపత్తు నిర్వహణ లాంటి కొన్ని అంశాలపై ప్రధాన దృష్టి నిలపాలి. ఇలా చేయడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనాన్ని పొందవచ్చు! 

 

కొత్త అంశాలకు ప్రాధాన్యం

సాధారణంగా జనరల్‌ స్టడీస్‌లో 11 విభాగాలుంటాయి. వీటిలో సంప్రదాయబద్ధంగా అనేక దశాబ్దాలుగా ప్రాధాన్యం ఉన్నవి కొన్ని. చరిత్ర, భౌగోళిక అంశాలు, రాజ్యాంగ అంశాలు, జనరల్‌ సైన్స్, అంకగణితం, మానసిక సామర్థ్యాలు, వర్తమాన అంశాలు.. ఈ కోవకు చెందుతాయి. కొన్ని సిలబస్‌ అంశాలు కాలమాన పరిస్థితులను బట్టి ప్రాధాన్యం పొందుతాయి. ఇటీవలి కాలంలో విపత్తు నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎథిక్స్‌ అండ్‌ గవర్నెన్స్‌ మొదలైన కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. అందువల్ల ఎగ్జామినర్‌ తరచుగా వీటిపై ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ సూక్ష్మం అర్థం చేసుకుని సిలబస్‌లోని ఏ అంశాలకు ప్రాధాన్యమివ్వాలో గ్రహించాలంటే.. సిలబస్‌ అధ్యయనం చాలా కీలకమవుతుంది.

 

 

ఇటీవలి కాలంలో విపత్తు నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎథిక్స్‌ అండ్‌ గవర్నెన్స్‌ మొదలైన కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎగ్జామినర్‌ తరచుగా వీటిపై ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ సూక్ష్మం అర్థం చేసుకుని ఏ అంశాలకు ప్రాధాన్యమివ్వాలో గ్రహించాలంటే.. సిలబస్‌ అధ్యయనం చాలా కీలకమవుతుంది.

 

ఏ అంశాలు వదిలెయ్యాలి?

లభించే సమయాన్ని బట్టీ, పరీక్ష స్థాయిని బట్టీ సిలబస్‌లోని ఏ అంశాలను వదిలివేయవచ్చు అనే అవగాహన అభ్యర్థుల్లో ఏర్పడుతుంది. అందువల్ల వారికి అనవసరమైన భారం తగ్గుతుంది. ముఖ్యంగా యూపీఎస్సీ, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-1 లాంటి పరీక్షల్లో ఏయే అంశాలు వదిలివేయాలో తెలియటం విజయానికి అతి పెద్ద సాధనం అని చెప్పవచ్చు. అందువల్ల సిలబస్‌ను అర్థం చేసుకోవటం అంటే అనవసరమైన భారం తగ్గించుకోవడమే!

 

ఏపీపీఎస్‌సీ నుంచి కొత్త ఉద్యోగాలు 

తాజాగా ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) ఆరు రకాల నోటిఫికేషన్లను వెలువరించింది. వీటి ప్రకారం భర్తీ అవనున్న పోస్టులు: ఆయుష్‌ విభాగంలోని హోమియో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 29, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆయుర్వేద పోస్టులు 3, ఆంధ్రప్రదేశ్‌ శాసన విభాగం పరిధిలో తెలుగు రిపోర్టర్‌ పోస్ట్లులు 5, హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టులు 39, సమాచార శాఖకు చెందిన జిల్లా పౌర సమాచార అధికారుల పోస్టులు 4, సర్వే- ల్యాండ్‌ రికార్డు శాఖకు చెందిన అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులు 6.   

 

ఈ పోస్టులన్నీ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా భర్తీ అవుతాయి. ఈ పరీక్షలన్నీ కూడా ఆబ్జెక్టివ్‌ తరహావి. అన్నిటిలోనూ ఒక్క పేపర్‌ జనరల్‌ స్టడీస్‌ ఉండగా, వారి ఉద్యోగ స్వభావానికి సంబంధించిన సమాచారంపై మిగతా పేపర్లు ఉంటాయి. జనరల్‌ స్టడీస్‌ 150 మార్కులకు 150 ప్రశ్నలు రూపంలో ఆబ్జెక్టివ్‌ తరహాలో ఇస్తారు. గ్రూప్‌ 1, 2 మొదలైన పరీక్షలకు సిద్ధమైన అభ్యర్థులకు ఈ జనరల్‌ స్టడీస్‌ పేపర్లో మంచి స్కోర్‌ వస్తుంది.

 


 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ తరగని అవకాశాల.. సివిల్‌

‣ ఆర్థిక ప్రగతి సూచి: మెటలర్జీ అండ్‌ మెటీరియల్‌ సైన్స్‌

Posted Date : 04-10-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌