• facebook
  • twitter
  • whatsapp
  • telegram

తక్కువ సమయంలో ఉద్యోగం సాధించాలంటే? 

డిగ్రీ, పీజీ, వృత్తివిద్యా కోర్సులు పూర్తిచేసిన ఎంతోమంది ఆ తర్వాత ఉద్యోగాన్వేషణ మొదలుపెడతారు. ఎన్నో ఇంటర్వ్యూలకూ హాజరవుతుంటారు. వీరిలో కొంతమంది మాత్రమే వెంటనే ఉద్యోగాన్ని సంపాదించగలగుతారు. మరికొందరు మాత్రం మూసధోరణిలో తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు. అలాకాకుండా అతి తక్కువ కాలంలోనే ఉద్యోగాలు పొందాలంటే కాస్త సృజనాత్మకంగా ఆలోచించడం మొదలుపెట్టాలి. విభిన్నమైన మార్గాలను అనుసరించడం ద్వారా కలల కొలువును సొంతం చేసుకోవచ్చు. 

కొత్త తరహాలో... 

రెజ్యూమె తయారుచేయడం, దానికో కవర్‌ లెటర్‌ రాయడం పాత పద్ధతే. అంతకంటే భిన్నంగా ఏం చేయగలరో ఒక్కసారి ఆలోచించాలి. ఫొటోగ్రఫీ, డిజైన్‌ లాంటి రంగాలకు చెందినవారైతే డిజిటల్‌ పోర్ట్‌ఫోలియోను రూపొందించవచ్చు. అలాగే స్వీయ లక్ష్యాలను తెలియజేస్తూ సిద్ధంచేసిన రెజ్యూమెను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచొచ్చు. వ్యక్తిగత వెబ్‌సైట్‌ను ఏర్పాటుచేసుకుని వివరాలను తెలియజేయవచ్చు. ఇప్పటివరకు విజయవంతంగా పూర్తిచేసిన కొన్ని పనులను సోషల్‌ మీడియా సైట్ల ద్వారానూ తెలియజేయవచ్చు. 

వర్క్‌షాపులు  

ఎంచుకున్న రంగానికి సంబంధించిన తాజా విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఆ రంగంలో నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. ఆ రంగానికి చెందిన ప్రముఖుల ప్రసంగాలను వినడం, వర్క్‌షాప్‌లకు హాజరుకావడం లాంటివి చేయాలి. వివిధ రంగాలకు చెందిన అనుభవజ్ఞులు చెప్పే విషయాలను ఆసక్తిగా విన్నా తెలియని విషయాలెన్నో తెలుస్తుంటాయి. తాజా సమాచారంతో పరిజ్ఞానానికి మెరుగులు దిద్దుకునే అవకాశం వస్తుంది. వ్యక్తిగతంగా లేదా ఆన్‌లైన్‌ సమావేశాలకు హాజరైనా అవి పరిధిని విస్తరించడానికి ఉపయోగపడతాయి. 

వేతనం లేకపోయినా..  

వేతనం చెల్లించే ఉద్యోగం అభ్యర్థులకెంతో అవసరం కావచ్చు. కానీ కొన్నిసార్లు వేతనం అందే అవకాశం లేకపోయినా పని చేయాల్సి రావచ్చు. దానివల్ల డబ్బుకాకుండా విలువైన అనుభవాన్ని సంపాదించే అవకాశం లభిస్తుంది. ఇలాంటి అవకాశాన్ని అసలు వదులుకోకూడదు. అలా సంపాదించిన అనుభవంతో మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ రావచ్చు. అదే సంస్థలో భవిష్యత్తులో ఖాళీలు ఏర్పడినా అభ్యర్థికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం లేకపోలేదు. అలాగే మీరో సంస్థలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నపుడు.. ఆ సంస్థ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవచ్చు. ఈలోగా అదే సంస్థలో వేరే విభాగంలో పనిచేసే అవకాశం వచ్చినా దాన్ని వదులుకోకూడదు. 

స్వీయ ప్రచారం 

ఇది కొంతవరకు మంచిదేగానీ శ్రుతి మించితే అనర్థమే. కొంతమంది తమ పనితనం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. మరికొందరు మొహమాటంతో చేసిన పనుల గురించి చెప్పుకోవడానికి వెనకాడుతుంటారు. నిజానికి రెండు పద్ధతులూ సరికాదు. ఎవరి గురించి వారు అవసరమైనంత వరకూ చెప్పుకోవాల్సిందే. అయితే గొప్పదనం గురించి సొంత డబ్బా కొట్టుకుంటున్నట్లుగా ఉండకూడదు. చేసిన ఉద్యోగం, నిర్వర్తించిన పనులు, సంపాదించిన అనుభవం... వీటి గురించి మాట్లాడాలిగానీ వ్యక్తిగత అభిరుచులు, అలవాట్ల గురించి మాత్రం కాదు. రెజ్యూమెలో పని అనుభవం గురించి వివరించినప్పుడు చేసిన పనుల గురించి చెప్పొచ్చు. ఇంటర్వ్యూ సమయంలోనూ పరిధికి లోబడి ..చేసిన పనుల గురించి వివరించవచ్చు. 

మెంటర్‌ ఉంటే మంచిదే 

ఉద్యోగాన్వేషణ సమయంలో అనుభవజ్ఞుల సూచనలూ, సలహాలూ ఎంతగానో ఉపయోగపడతాయి. ఎవరి విజయాలు, అద్భుతమైన పనితనం స్ఫూర్తిని నింపుతుందో వాళ్లను మెంటర్‌గా ఎంచుకోవచ్చు. అవసరమైన విషయాల్లో వారి సలహాలు తీసుకోవచ్చు. అయితే అలా ఎంచుకున్న మార్గదర్శి తన విలువైన సమయాన్ని అభ్యర్థి కోసం వినియోగించాల్సి ఉంటుంది. ఎక్స్‌టర్న్‌షిప్‌ కోసం అలాంటి వారి దగ్గర పనిచేస్తూ వారిని నిశితంగా గమనించవచ్చు. వారు పనిచేసే విధానాన్ని గమనించడం వల్ల కొత్త విషయాలెన్నింటినో నేర్చుకునే అవకాశం కలుగుతుంది. 
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉన్నత రక్షణకు... ఉమ్మడి పరీక్ష!

‣ ఉద్యోగ వేటలో... నాయకత్వ నైపుణ్యాలు

‣ రక్షణ దళాల్లో దూసుకుపోదాం!

‣ అవే పాఠాలు.. అలాగే మరోసారి!

Posted Date : 29-12-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌