• facebook
  • twitter
  • whatsapp
  • telegram

వినిపించినా.. కనిపించినా ఇదీ వ్యూహం!

ఫోన్, వీడియో ఇంటర్వ్యూల్లో మెలకువలు

గత ఏడాది ఎన్నో కొత్త మార్పులను తెచ్చింది. వాటిలో ఉద్యోగ నియామక ఎంపిక ప్రక్రియ ఒకటి. రాతపరీక్షతోపాటు ఇంటర్వ్యూలు టెలిఫోన్, వర్చువల్‌ బాట పట్టాయి. పేరుకు పాతవే అయినా.. గతంలో కొన్ని పెద్ద సంస్థలు మినహా వీటిని ఉపయోగించినవి తక్కువే! ముఖ్యంగా ఫ్రెషర్ల విషయంలో ఈ అవకాశం మరీ తక్కువ. ఇవే తప్పనిసరి అవుతున్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

టెలిఫోనిక్, వీడియో.. ఇంటర్వ్యూలు! నిజానికి ఇవి కొత్తగా పరిచయమైనవేం కాదు. కానీ చాలావరకూ సంస్థలు వన్‌ టూ వన్‌/ వ్యక్తిగత ఇంటర్వ్యూలకే ప్రాముఖ్యం ఇచ్చేవి. వీడియో ఇంటర్వ్యూలను చాలావరకూ ప్రత్యేక సందర్భాల్లోనో, పెద్ద స్థాయి ఉద్యోగాలకో నిర్వహించేవారు. ఇక టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ విషయానికొస్తే.. వీడియోతో పోలిస్తే దీని వినియోగం ఎక్కువే. సాధారణంగా తొలిదశ స్క్రీనింగ్‌లో భాగంగా ఉపయోగించేవారు. దీనిలలో ఎంపికైనవారికి ఆపై వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహిస్తుండేవారు. కానీ కొవిడ్‌ పరిస్థితి ఎదురయ్యాక చిన్నా, పెద్ద సంస్థలతో సంబంధం లేకుండా నియామకాల విషయంలో ఈ రెండే తప్పనిసరి మార్గాలయ్యాయి.

పరిస్థితి మెరుగయ్యాకా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 60% ఉద్యోగ ఎంపికలు ఈవిధంగానే కొనసాగించే అవకాశముందనేది కొన్ని అధ్యయనాల అంచనా. కాబట్టి, ఉద్యోగార్థులు ఈ పరిస్థితులకు ముందుగానే సన్నద్ధమై ఉండటం మంచిది. అప్పుడే తీరుతో సంబంధం లేకుండా కొలువు మార్గాన్ని సుగమం చేసుకోగలుగుతారు.

ఫోన్‌లో ముఖాముఖి

దీని విషయంలో అభ్యర్థికి కొన్ని ప్రత్యేక సవాళ్లు ఎదురవుతాయి. మామూలు సమయంలోలా ఇక్కడ ఇంటర్వ్యూయర్‌ ముఖ కవళికలు, శరీర భాషలను అంచనా వేసే అవకాశముండదు. దీంతో అభ్యర్థి ప్రతిస్పందనల విషయంలోనూ కొంత తికమక ఏర్పడుతుంది. కానీ కొన్ని అంశాల్లో సాధన చేస్తే దీన్ని సులువుగా నెగ్గొచ్చనేది నిపుణుల సూచన.

ముందుగా...

ఫోన్‌లో చార్జింగ్, సిగ్నల్స్, ఫోన్‌ వచ్చే సమయానికి అందుబాటులో ఉండటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇంటర్వ్యూకు ముందే ఫోన్‌లో కాల్‌ వెయిటింగ్‌ ఆప్షన్‌ డిజేబుల్‌ చేసి ఉంచుకోవాలి. ల్యాండ్‌ ఫోన్‌ అయితే ఇంట్లో ముందస్తుగానే తెలియజేయాలి. కాల్‌ మీరే స్వీకరించేలా చూసుకోవాలి.

ఇంటర్వ్యూయర్‌ నంబరును ముందుగానే తెలుసుకుని ఉండాలి. అనుకోకుండా కాల్‌ మధ్యలోనే కట్‌ అయితే ఇది పనికొస్తుంది. 

ఇంటర్వ్యూ సమయాన్ని తెలుసుకుని ఉండాలి. అనుకోని పని ఎదురైతే ముందస్తుగా సమాచారాన్ని అందివ్వాలి. ఇవన్నీ అభ్యర్థిపై వ్యతిరేక ప్రభావం పడకుండా చేస్తాయి.

ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి పేరు, అతని హోదానూ తెలుసుకోవాలి. ఇంటర్వ్యూ ఎంతవరకూ కొనసాగే అవకాశముందో కూడా అడిగి తెలుసుకోవచ్చు.

వాతావరణం

నిశ్శబ్దంగా, ఏకాగ్రతకు భంగం కలిగించని వాతావరణానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కిటికీలు మూసి ఉంచుకోవడం, శబ్దం వచ్చే వీలుంటే ఫ్యాన్‌ సహా ఆఫ్‌ చేసి ఉంచడం లాంటివి చేయాలి. మీ మాట ఇంటర్వ్యూయర్‌కీ, ఇంటర్వ్యూయర్‌ మాట మీకూ స్పష్టంగా వినిపించేలా చూసుకోవాలి. వీలైనంత వరకూ సౌకర్యంగా ఉండే కుర్చీలో కూర్చుని మాట్లాడేలా చూసుకోవాలి. చేతితో పట్టుకుని కాకుండా హెడ్‌సెట్‌ ద్వారా అయితే ఇంకా సులభంగా ఉంటుంది. పేపర్, పెన్‌ లాంటివి అందుబాటులో ఉంచుకోవాలి. 

వీడియోలో.. 

వీటికే వర్చువల్‌ ఇంటర్వ్యూలుగా పేరు. దీనికీ, సాధారణ ఇంటర్వ్యూకూ పెద్దగా తేడా ఉందని భావించనక్కర్లేదు. విధానం ఏదైనా నేరుగా ఇంటర్వ్యూయర్‌ను చూస్తూ మాట్లాడే అవకాశం ఇక్కడ ఉంటుంది. కాకపోతే కొన్ని అదనపు జాగ్రత్తలు అవసరవుతాయి. అవేంటంటే..

ఇంటర్నెట్‌ కనెక్షన్‌

ఏ సాఫ్ట్‌వేర్‌ ద్వారా (జూమ్, గూగుల్‌ హ్యాంగవుట్స్‌ మొదలైనవి) ఇంటర్వ్యూ ఎదుర్కొంటున్నారో ముందుగానే తెలుసుకుని వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుని ఉంచుకోవాలి. కెమెరా, మైక్రోఫోన్‌ వంటివాటినీ ముందుగానే చెక్‌ చేసి పెట్టుకోవాలి. ఇంటర్వ్యూకు ఒకరోజు ముందు, గంట ముందు వీటిని పరిశీలించుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే ముందుగానే ఇంటర్వ్యూయర్‌కు విషయాన్ని తెలియజేయాలి. సిస్టమ్‌ చార్జింగ్‌నూ ముందస్తుగానే సరిచూసుకోవాలి. 

వస్త్రధారణ

ముఖాముఖి ఇంటర్వ్యూలో ఏవిధమైన వస్త్రధారణకు ప్రాముఖ్యమిస్తారో దాన్నే ఇక్కడా అనుసరించాలి. వర్క్‌సూట్‌/ మరీ సంప్రదాయ దుస్తులకే ప్రాధాన్యమివ్వాలనేం లేదు. కానీ పని వాతావరణానికి సరిపోయేలా ఉండాలి. వీడియో ఇంటర్వ్యూ కాబట్టి ముదురు రంగులకు ప్రాధాన్యం ఇవ్వొచ్చు.

శరీరభాష

పేరుకు వీడియో ఇంటర్వ్యూ అయినా సాధారణ ఇంటర్వ్యూ లాగానే ఇక్కడా శరీర భాషకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రశ్న అడగ్గానే క్విజ్‌లోలా సమాధానం చెప్పేయాలన్న ఆత్రమూ అక్కర్లేదు. కొద్దిగా ఆలోచించుకునీ చెప్పొచ్చు. అలాగే  నిటారుగా కూర్చోవడం, ఐ కాంటాక్ట్‌ కొనసాగించడం చేయాలి.

సెట్‌ చేసుకోవాలిలా!

వీడియోను మొహం మాత్రమే కనిపించేలా పెట్టుకోవద్దు. కనీసం శరీరంలో సగభాగం కెమెరాలో కనిపించేలా ప్లేస్‌మెంట్‌ చూసుకోవాలి. అంటే కంప్యూటర్‌ టేబుల్‌ మీద పెట్టే ఏర్పాటు చేసుకోవాలి. 

పరిసరాల శబ్దాలు ఏకాగ్రతను దెబ్బతీసే అవకాశం లేకుండా చూసుకోవాలి. 

ఈ సమయంలో కుటుంబ సభ్యులూ, పెంపుడు జంతువులూ ఇంటర్వ్యూ గదిలోకి రాకుండా ఉండేలా జాగ్రత్త పడాలి. ఇలాంటి ఆకస్మిక ఆగమనాలు ఇంటర్వ్యూయర్‌కూ ఇబ్బందిని కలిగిస్తాయి. 

సరైన వెలుతురు ఉండేలా చూసుకోవాలి. 

కూర్చునే వెనుక భాగంలోనూ గదిలోనివన్నీ కనిపించేవిధంగా కాకుండా వీలైనంతవరకూ ఖాళీగానో, గోడనో ఉండేలా చూసుకోవాలి. 

మొబైల్‌ ఫోన్‌ను సైలెంట్‌ మోడ్‌లో పెట్టుకోవాలి.

విధానం ఏదైనా.. ఇవి తప్పనిసరి

పరిశోధన

ఇంటర్వ్యూ ఏ విధానంలో జరిగినా.. ముందస్తు సన్నద్ధతకు ప్రాధాన్యమివ్వాలి. దీనిలో సంస్థ గురించిన పరిశోధన అత్యంత ప్రధానం. సంస్థ ఉద్దేశం, సంస్కృతి, తాజా ప్రాజెక్టులు వంటి అంశాలన్నింటికీ ప్రాధాన్యం ఇవ్వాలి. సంస్థ అధికారిక వెబ్‌సైట్, సోషల్‌ మీడియా పేజీలను పరిశీలిస్తే ఈ సమాచారం తెలుస్తుంది.

ఎలా చెబుతున్నారు?

టెలిఫోన్‌/ వీడియో ఏదైనా నవ్వుతూ మాట్లాడటానికి ప్రయత్నించాలి. ఇంటర్వ్యూ మొత్తం ఒకే స్వరస్థాయిలో పూర్తిచేయగలగాలి. దీనికి సంబంధించి ముందుగా సాధన చేసుకోవడం మంచిది. అలాగని ప్రశ్నలకు సమాధానాలు అప్పజెబుతున్నట్లుగా ఉండకూడదు. ఇంటర్వ్యూ ఒక ప్రక్రియ అన్నట్లుగా కాకుండా సహజంగా కొత్త వ్యక్తితో జరిపే సాధారణ సంభాషణలాగానే భావించాలి. అప్పుడే ఒత్తిడి లేకుండా ఇంటర్వ్యూ సజావుగా సాగుతుంది.

సాధన చేశారా?

ఇంటర్వ్యూలో వ్యక్తిగతం, వృత్తిగతం రెండు రకాల ప్రశ్నలూ అడుగుతారు. వీటిలో కొన్ని ప్రశ్నలు తరచూ అడిగేవి ఉంటాయి. ఉదాహరణకు- అభ్యర్థి బలాలు, బలహీనతలు, గెలుపు-ఓటములు, ఎందుకు వారినే ఎంచుకోవాలి? హాబీలు, తమ సంస్థనే ఎంచుకోవడానికి కారణం.. ఇలాంటివి. వీటికి ముందస్తుగా సన్నద్ధమవ్వాలి.

నిజాయతీగా 

ఉద్యోగార్థికి ఇంటర్వ్యూ చాలాముఖ్యం. ఉద్యోగ భవితవ్యాన్ని నిర్ణయించే ప్రక్రియ ఇది. దీన్ని ఎలాగైనా విజయవంతంగా పూర్తిచేయాలన్న తపన సాధారణమే. పైగా ఈ తరహా ఇంటర్వ్యూల్లో ఎదురుగా వ్యక్తి ఉండరు. కాబట్టి, తెలియని సమాధానాలకు సెర్చ్‌ చేయడం ద్వారా చెప్పడమో, పుస్తకాల సాయం తీసుకోవడం లాంటిది చేయొద్దు. నిజానికి ఇంటర్వ్యూయర్లు ఈచర్యని సులువుగానే కనిపెట్టగలరు. తెలియని సమాధానాలకు నిజాయతీగా తెలియదనే చెప్పండి. అభ్యర్థి పరిజ్ఞానంతోపాటు తీరుకూ ప్రాధాన్యముంటుందని గ్రహించాలి.

ప్రశ్నలు సిద్ధమా?

ఇంటర్వ్యూలో భాగంగా అభ్యర్థిని సందేహాలుంటే అడగమని చెబుతారు. వాటినీ ముందుగానే సిద్ధం చేసుకోవాలి. అలాగే మొత్తం సంభాషణలో భాగంగా ఎదురైన/ క్షుణ్ణంగా తెలుసుకోవాలనిపించిన అంశాల గురించీ అడగొచ్చు. కానీ సులువుగా వెబ్‌సైట్‌కు వెళ్లినా తెలిసేవీ, అంతకు ముందు వివరించినవాటినే తిరిగి అడగొద్దు. ఉద్యోగం, ప్రాజెక్టులు, ఎంపిక తీరు వంటివాటిపై ప్రశ్నలు ఉండేలా చూసుకోవాలి.

పూర్తయ్యాక..

ఇంటర్వ్యూ పూర్తయ్యాక ఇంటర్వ్యూ సాగిన తరువాత ఫాలోఅప్‌ మెయిల్‌ పంపొచ్చు. వారు కేటాయించిన సమయానికీ, చూపిన ఓపికకూ థాంక్స్‌ చెబుతూనే ఇంకా ఏమైనా అదనంగా ప్రశ్నలు అడగాలనుకుంటే తాను సిద్ధంగానే ఉన్నట్లుగా ఆ మెయిల్‌/ మెసేజ్‌ సాగాలి. 

Posted Date : 25-01-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌