• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎయిర్‌పోర్ట్‌ అథారిటీలో 400 ఉద్యోగాలు!

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ విభాగంలో 400 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. సైన్స్, ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు వీటికి పోటీపడవచ్చు. ఆన్‌లైన్‌ పరీక్షతో నియామకాలు ఉంటాయి. ఎంపికైనవారు రూ.12 లక్షల వార్షిక వేతనం అందుకోవచ్చు. ప్రకటన, పరీక్ష సన్నద్ధతలపై పూర్తి వివరాలు... 

ప్రభుత్వానికి చెందిన మినీరత్న సంస్థల్లో ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఒకటి ఎయిర్‌పోర్టుల సమర్థ నిర్వహణకు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ) సేవలే కీలకం. ఈ విభాగంలో ఎంపికైనవారు కార్యాలయాల్లో ఉంటూ విమాన రాకపోకలు పర్యవేక్షిస్తూ, ప్రయాణం సాఫీగా జరిగేలా చూస్తారు. ఇందుకు గానూ వీరికి రూ.40 వేల మూలవేతనం దక్కుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలు అదనం. అన్నీ కలుపుకుని వీరు రూ.12 లక్షల వార్షిక వేతనం అందుకోవచ్చు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

ఎంపిక విధానం 

ముందుగా ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రుణాత్మక మార్కులు ఉండవు. పరీక్షలో చూపిన ప్రతిభతో షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలనతోపాటు వాయిస్‌ టెస్టు ఉంటుంది. అనంతరం సైకోయాక్టివ్‌ సబ్‌స్టాన్సెస్‌ టెస్టు నిర్వహిస్తారు. వీటిలోనూ అర్హత సాధించడం తప్పనిసరి. తుది నియామకాలు రాత పరీక్షతోపాటు సంబంధిత విభాగాల్లో చూపిన ప్రతిభ ద్వారా చేపడతారు. ఎంపికైనవారు దేశంలో ఎక్కడైనా విధులు నిర్వర్తించడానికి సిద్ధపడాలి. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఏటీసీ) పోస్టుల్లో చేరేవారు శిక్షణ అనంతరం కనీసం మూడేళ్లపాటు కొనసాగడం తప్పనిసరి. ఇందుకోసం రూ.7 లక్షల విలువైన ఒప్పందపత్రంపై అంగీకారం తెలపాలి.   

పరీక్ష ఇలా

ప్రశ్నపత్రం 120 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 120 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. 

పార్ట్‌ ఏ, బీల నుంచి 60 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. 

ఏలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 20, జనరల్‌ ఇంటలిజెన్స్‌/రీజనింగ్‌ 15, జనరల్‌ ఆప్టిట్యూడ్‌/న్యూమరికల్‌ ఎబిలిటీ 15, జనరల్‌ నాలెడ్జ్‌/అవేర్‌నెస్‌ 10 చొప్పున ప్రశ్నలు వస్తాయి. బీలో ప్లస్‌2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథ్స్‌ నుంచి కాన్సెప్ట్, అప్లికేషన్స్‌లో 60 ప్రశ్నలు ఉంటాయి. 

పార్ట్‌ బీలో ఎక్కువ మార్కులు పొందడానికి 11, 12 తరగతుల మ్యాథ్స్, ఫిజిక్స్‌ పుస్తకాలు బాగా చదవాలి. వాటిలోని ప్రాథమికాంశాలు, అనువర్తనాలపై దృష్టి సారించాలి. 

పార్ట్‌ ఏలో ప్రశ్నలు సైతం తేలికగానే ఉంటాయి. బ్యాంక్‌ క్లర్క్‌ పరీక్ష స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు. 

ఐబీపీఎస్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్న బీఎస్సీ, బీటెక్‌ అభ్యర్థులు జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పరీక్షను సులువుగానే ఎదుర్కోవచ్చు. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. గతంలో నిర్వహించిన జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఏటీసీ ప్రశ్నపత్రాలు వివిధ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయి. వాటిని పరిశీలించడం ద్వారా పరీక్ష, సన్నద్ధతపై అవగాహన పెంచుకోవచ్చు.  

వివరాలు...

ఖాళీలు: మొత్తం 400. వీటిలో విభాగాల వారీ అన్‌ రిజర్వ్‌డ్‌ 163, ఓబీసీ ఎన్‌సీఎల్‌ 108, ఈడబ్ల్యుఎస్‌ 40, ఎస్సీ 59, ఎస్టీ 30, దివ్యాంగులకు 4 కేటాయించారు. 

అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్‌తో బీఎస్సీ లేదా బీఈ/బీటెక్‌ (ఏదైనా సెమిస్టర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ చదివుండటం తప్పనిసరి) కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. 

వయసు: జులై 14, 2022 నాటికి 27 ఏళ్లు మించరాదు. దివ్యాంగులకు పదేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 14

దరఖాస్తు ఫీజు: రూ.వెయ్యి. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.81

పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.

వెబ్‌సైట్‌: http://www.aai.aero/
 

Posted Date : 18-06-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌