• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Education: సాధికారతకు సోపానం... డిజిటల్‌ విద్య

కేంద్రం కసరత్తు
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు పనిచేయక ఎంతోమంది పిల్లలు భౌతిక తరగతులకు దూరమయ్యారు. కొన్ని పాఠశాలలు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించినా, సరైన డిజిటల్‌ ఉపకరణాలు అందుబాటులో లేక చాలామంది విద్యార్థులు ఆ చదువులు అందుకోలేకపోయారు. దానికితోడు ఆన్‌లైన్‌ బోధనపై అనుభవం, శిక్షణ లేని ఉపాధ్యాయుల కారణంగా విద్యార్థుల్లో అభ్యసనం పట్ల ఆసక్తి సన్నగిల్లింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని షెడ్యూల్డు కులాలు, తెగలు, బలహీనవర్గాల విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులవల్ల పెద్ద సంఖ్యలో ఆన్‌లైన్‌ తరగతులు వినలేకపోయారు. వారిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలే అధికం. దేశీయంగా కనీస విద్యా సామర్థ్యాలను, నైపుణ్యాలను సాధించడంలో విద్యార్థులు విఫలం కావడంతో అది అభ్యసన సంక్షోభానికి దారితీసింది. గ్రామీణ భారతంలో అయిదో తరగతి విద్యార్థుల్లో కేవలం 47శాతమే రెండో తరగతి స్థాయి పాఠాన్ని చదివే స్థితిలో ఉన్నారని ‘అసర్‌’ నివేదిక తేటతెల్లం చేసింది. ఎనిమిదో తరగతి విద్యార్థుల్లో 43శాతమే అయిదో తరగతి స్థాయి లెక్కలు చేయగలిగే స్థితిలో ఉన్నారు. భారత్‌లో ప్రస్తుత, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పాఠశాల నుంచి ఉన్నత విద్యదాకా బోధన-అభ్యసనలో విప్లవాత్మక మార్పులు అవసరం. అందులో భాగంగా డిజిటల్‌ విద్యను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
కరోనా కష్టకాలంలో విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా కేంద్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో ‘ఒకే దేశం-ఒకే డిజిటల్‌ వేదిక’ పేరుతో కొంతమేరకు ఆన్‌లైన్‌ విద్య అందించగలిగింది. అనుకోని విపత్తుల సమయంలో సాంకేతికత సాయంతో విద్యను అందరికీ సమర్థంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో డిజిటల్‌ విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. అందుకోసం ఒక్కో తరగతికి ఒక్కో టీవీ ఛానల్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న 12 ఛానళ్లను 200కు పెంచేందుకు నిర్ణయించారు. తాజా బడ్జెట్‌లో ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఫలితంగా ఇకపై అన్ని తరగతులకు ఒకేసారి డిజిటల్‌ విద్యాబోధన జరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఛానళ్ల సంఖ్యను పెంచడంవల్ల పేద విద్యార్థులకు ఎక్కువ మేలు కలుగుతుందని కేంద్రం భావిస్తోంది. వాటిద్వారా ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు పాఠాలు బోధిస్తారు.
‣ విద్యార్థుల్లో నైపుణ్య లేమిని అధిగమించేందుకు అన్ని రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన ఐటీఐలలో నైపుణ్యాభివృద్ధి కోర్సులను ప్రారంభించనున్నారు. వృత్తి విద్యాకోర్సుల్లో ఆలోచనా నైపుణ్యాలు, సృజనాత్మకతను పెంపొందింపజేసేందుకు సైన్సు, గణితాల్లో 750 వర్చువల్‌ ప్రయోగశాలలు, 75 ఈ-ప్రయోగశాలలను రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటు చేయనున్నారు. దేశవ్యాప్తంగా ప్రపంచస్థాయి సార్వత్రిక విద్యను ఇంటి వద్దే అందించేందుకు డిజిటల్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబోతున్నట్లు తాజా బడ్జెట్‌లో ప్రకటించారు. దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు దానితో అనుసంధానమవుతాయి. దానికి తోడు గాంధీనగర్‌లోని గుజరాత్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ టెక్‌ (గిఫ్ట్‌) సిటీలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వనున్నారు. నిపుణులైన మానవ వనరులను అందించేలా ఆ వర్సిటీల్లో ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, సైన్స్‌, మ్యాథమెటిక్స్‌, ఇంజినీరింగ్‌, టెక్నాలజీ కోర్సుల బోధనకు అవకాశం కల్పిస్తారు.
‣ దేశీయంగా సాగు రంగంలో డ్రోన్ల వినియోగం, అధునాతన, సేంద్రియ వ్యవసాయం వంటి వాటికి సంబంధించి పాఠ్యాంశాల్లో మార్పు చేర్పులపై సూచనలకోసం ప్రత్యేకంగా కమిటీని నియమించనున్నారు. పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు కేంద్రం 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.63,449.37 కోట్లు కేటాయించింది. 2021-22తో పోలిస్తే ఇది ఎనిమిదిన్నర వేల కోట్ల రూపాయల మేర అధికం. కేంద్రీయ, జవహర్‌ నవోదయ విద్యాలయాలు, సమగ్రశిక్షా అభియాన్‌, ఉన్నత విద్యకు సైతం బడ్జెట్‌లో కేటాయింపులు పెరిగాయి. ప్రపంచస్థాయి మార్కెట్‌ పోటీని తట్టుకొనే స్థాయిలో మన విద్యార్థుల్లో సామర్థ్యాలు, నైపుణ్యాలను పెంపొందించాలని కేంద్ర ప్రభుత్వం లక్షిస్తోంది. ప్రస్తుత సాంకేతిక యుగంలో మన దేశ యువత ప్రపంచస్థాయిలో రాణించాలంటే డిజిటల్‌ విద్యాసాధికారత అత్యవసరం. ఆ దిశగా మేలిమి అడుగులు పడాల్సిన అవసరం ఉంది. 21వ శతాబ్దపు విద్యార్థులు ఆధునిక సాంకేతిక వైజ్ఞానిక రంగాల్లో పురోగతి సాధించగలిగితేనే ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా భారత్‌ నిలబడటానికి ఆస్కారం లభిస్తుంది.

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chat and Google News

Posted Date : 17-02-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌