• facebook
  • twitter
  • whatsapp
  • telegram

యాక్చూరియ‌ల్ సైన్స్ ఎంచుకుంటారా?.

ఏసెట్ ప్ర‌క‌ట‌న విడుద‌ల‌
క‌నీస విద్యార్హ‌త‌: ఇంట‌ర్మీడియ‌ట్‌

యాక్చూరియల్‌ సైన్స్‌లో ఆసక్తి ఉన్నవారికోసం యాక్చూరియల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఏసెట్‌) నిర్వహిస్తున్నారు. యాక్చూరియల్‌ కోర్సుల్లో చేరడానికి ఏసెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. ఇంటర్‌ అర్హతతో పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ పరీక్షకు ప్రకటన వెలువడింది. ఆ వివరాలు చూద్దాం. 

అంకెలపై ఆసక్తి, గణితంపై పట్టు, తర్క పరిజ్ఞానం ఉన్నవారు యాక్చూరియల్‌ సైన్స్‌ కోర్సులో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. బీమా, అనుబంధ రంగాలు, ఆర్థిక, మదింపు సంస్థల్లో కెరియర్‌ ఆశించేవారూ ప్రయత్నించదగ్గ కోర్సు యాక్చూరియల్‌ సైన్స్‌. ఇంటర్‌ విద్యార్హతతో ఈ కోర్సులో చేరవచ్చు. ఇందుకోసం ముందుగా ప్రవేశ పరీక్షలో అర్హత పొందాలి. 

పరీక్ష ఏ విధంగా?

ఏసెట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. కొవిడ్‌ నేపథ్యంలో ఇంటి నుంచే రాసుకోవచ్చు. పరీక్ష వ్యవధి 3 గంటలు. ఇందులో 70 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున సెక్షన్‌ ఎలో 45 ప్రశ్నలు అడుగుతారు. సెక్షన్‌ బిలో 20 ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నకు రెండేసి మార్కులు కేటాయించారు. సెక్షన్‌ సిలో 5 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కోదానికి 3 మార్కులు. సబ్జెక్టులవారీ మ్యాథ్స్‌ 30, స్టాటిస్టిక్స్‌ 30, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ 15, ఇంగ్లిష్‌ 15, లాజికల్‌ రీజనింగ్‌ 10 మార్కులకు ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు. 

పరీక్షలో అర్హత సాధించడానికి కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్, చదవాల్సిన రిఫరెన్స్‌ పుస్తకాలు వెబ్‌సైట్‌లో లభిస్తాయి. స్కోరు మూడేళ్లపాటు చెల్లుబాటవుతుంది. ఈ వ్యవధిలోగా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యాక్చురీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐఏఐ)లో సభ్యత్వాన్ని పొందవచ్చు. ఇలా చేరినవాళ్లు యాక్చూరియల్‌ సైన్స్‌ కోర్సులో వివిధ పేపర్లను పూర్తిచేసుకోవడానికి వీలవుతుంది.  

13 పేపర్లు...

ప్రవేశ పరీక్షలో అర్హత సాధించినవారు యాక్చూరీ ఫెలో కావడానికి వివిధ దశల్లో 13 పేపర్లు పూర్తిచేయాలి. స్టేజ్‌ 1 కోర్‌ ప్రిన్సిపల్స్‌లో 7, స్టేజ్‌ 2 కోర్‌ ప్రాక్టీసెస్‌లో 3 పేపర్లు అందరికీ ఉమ్మడిగా ఉంటాయి. ఈ రెండు దశలనూ పూర్తిచేసినవారిని అసోసియేట్‌గా పరిగణిస్తారు. స్టేజ్‌ 3 స్పెషలిస్ట్‌ ప్రిన్సిపల్స్‌లో 8 పేపర్లు ఉంటాయి. వీటిలో నచ్చిన రెండింటిని ఎంపిక చేసుకుని పూర్తిచేయాలి. స్టేజ్‌ 4 స్పెషలిస్ట్‌ అడ్వాన్స్‌డ్‌లో ఏదైనా ఒక పేపర్‌ పూర్తిచేయాలి. నాలుగు దశలూ (13 పేపర్లు) పూర్తిచేసుకుంటే ఫెలోగా వ్యవహరిస్తారు. అయితే ఒక్క స్టేజ్‌-1 పాసైనా కొలువు లభిస్తుంది. 13 పేపర్లూ పూర్తిచేసుకున్నవారికి నెల వేతనం లక్షల్లో ఉంటుంది. వీరికి ఇన్సూరెన్స్, రీ ఇన్సూరెన్స్, ఫైనాన్స్, అకడమిక్, రెగ్యులేటరీ.. తదితర సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి.

ముఖ్యమైన తేదీలు

అర్హత: ఇంటర్‌ ఉత్తీర్ణత. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్లు: ఫిబ్రవరి 27 సాయంత్రం 3 వరకు స్వీకరిస్తారు.

పరీక్ష తేదీ: మార్చి 27.

ప్రవేశపత్రాలు: మార్చి 12 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఫలితాలు: ఏప్రిల్‌ 3న వెలువడతాయి

వెబ్‌సైట్‌: http://www.actuariesindia.org/index.aspx

Posted Date : 20-01-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌