• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సంవ‌త్స‌రానికి రూ.12/18ల‌క్ష‌ల జీతం!

సైన్స్‌, ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లు అర్హులు
 

ఏర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) మేనేజర్, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. రెండు విభాగాల్లోనూ కలుపుకుని 368 ఖాళీలు ఉన్నాయి. వీటికి ఎంపికైనవారు రూ.12 నుంచి 18 లక్షల వార్షిక వేతనం అందుకోవచ్చు. సైన్స్, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు పోటీ పడవచ్చు. ఆన్‌లైన్‌ పరీక్ష, సంబంధిత విభాగ పరీక్షల్లో చూపిన ప్రతిభతో నియామకాలుంటాయి. 
 

ప్రభుత్వానికి చెందిన మినీరత్న సంస్థల్లో ఏర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఒకటి. విమానాశ్రయాల సమర్థ నిర్వహణకు ట్రాఫిక్‌ కంట్రోల్, ఆపరేషన్స్, టెక్నికల్‌ విభాగాల సేవలు కీలకం. వీరంతా కార్యాలయాల్లో ఉంటూ విమాన రాకపోకలు, ప్రయాణం అంతా సాఫీగా జరిగేలా చూసుకుంటారు. మేనేజర్లు, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఈ సేవల్లో భాగమవుతారు. మేనేజర్లకు రూ.60 వేలు, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లకు రూ.40 వేలు మూలవేతనం దక్కుతుంది. వీటికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలు అదనం. అన్నీ కలుపుకుని జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు రూ.12 లక్షలు, అదే మేనేజర్లయితే రూ.18 లక్షల వార్షిక వేతనం అందుకోవచ్చు. 
 

ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ పరీక్షలో ప్రతిభ చూపినవారికి ఆ పోస్టు/ విభాగం బట్టి ఇంటర్వ్యూ/ ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ అండ్‌ ఎండ్యూరెన్స్‌ టెస్టు/ డ్రైవింగ్‌ టెస్టు/ వాయిస్‌ టెస్టు ఉంటాయి.
 

ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు?
 

మేనేజర్‌: ఫైర్‌ సర్వీసెస్‌ 11, టెక్నికల్‌ 2
అర్హత: మెకానికల్‌ లేదా ఆటోమొబైల్‌ విభాగంలో బీఈ/బీటెక్‌. అలాగే ఎగ్జిక్యూటివ్‌ స్థాయిలో సంబంధిత విభాగంలో అయిదేళ్ల పని అనుభవం ఉండాలి. 
 

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌: ఏర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ 264, ఏర్‌ పోర్టు ఆపరేషన్స్‌ 83, టెక్నికల్‌ 8 పోస్టులు ఉన్నాయి. 
అర్హత: ఏర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ విభాగానికి మ్యాథ్స్, ఫిజిక్స్‌తో బీఎస్సీ లేదా బీఈ/బీటెక్‌ (ఏదైనా సెమిస్టర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ చదివుండడం తప్పనిసరి) ఏర్‌ పోర్టు ఆపరేషన్స్‌కు సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌తోపాటు ఎంబీఏ పూర్తిచేయాలి లేదా బీటెక్‌ చదివినవారై ఉండాలి. టెక్నికల్‌ ఖాళీలకు మెకానికల్‌ లేదా ఆటోమొబైల్‌లో బీఈ/బీటెక్‌ చదివుండాలి. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లకు ఎలాంటి పని అనుభవం అవసరం లేదు. 
 

అన్ని పోస్టులకు 60 శాతం మార్కులు తప్పనిసరి. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువున్నవారూ అర్హులే.
 

వయసు: నవంబరు 30 నాటికి మేనేజర్లకు 32 ఏళ్లు, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లకు 27 ఏళ్లు మించరాదు. దివ్యాంగులకు పదేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది. 
 

ఎంపిక విధానం
ముందుగా ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రుణాత్మక మార్కులు ఉండవు. పరీక్షలో చూపిన ప్రతిభతో షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలనతోపాటు దరఖాస్తు చేసుకున్న పోస్టు ప్రకారం ఇంటర్వ్యూ, దేహదార్ఢ్య, డ్రైవింగ్, వాయిస్‌ టెస్టు ఉంటాయి. వీటిలోనూ అర్హత సాధించడం తప్పనిసరి. తుది నియామకాలు రాత పరీక్షతోపాటు సంబంధిత విభాగాల్లో చూపిన ప్రతిభ ద్వారా చేపడతారు. ఎంపికైనవారు దేశంలో ఎక్కడి నుంచైనా విధులు నిర్వర్తించడానికి సిద్ధపడాలి. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఏటీసీ), మేనేజర్‌ (ఫైర్‌ సర్వీసెస్‌) పోస్టుల్లో చేరేవారు శిక్షణ అనంతరం కనీసం మూడేళ్లపాటు కొనసాగడం తప్పనిసరి. ఇందుకోసం ఆ పోస్టును బట్టి రూ.7 లేదా రూ.5 లక్షల విలువైన ఒప్పంద పత్రంపై అంగీకారం తెలపాలి.
 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: డిసెంబరు 15 నుంచి స్వీకరిస్తారు. 
దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 14 
దరఖాస్తు ఫీజు: రూ.వెయ్యి. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.170 
పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు. 
వెబ్‌సైట్‌: http://www.aai.aero/
 

Posted Date : 08-12-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌