• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అంగ్రూ ఎన్ఆర్‌ఐ కోటా డిగ్రీ ప్రవేశాలు

సెప్టెంబ‌రు 30 వరకు దరఖాస్తుకు గడువు  

 

 

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (అంగ్రూ) ఎన్‌.ఆర్‌.ఐ. కోటాలో డిగ్రీ సీట్ల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. బీఎస్సీ(ఆనర్స్‌) అగ్రికల్చరల్, బీటెక్‌ (అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌), బీటెక్‌ (ఫుడ్‌టెక్నాలజీ), బీఎస్సీ(ఆనర్స్‌) కమ్యూనిటీ సైన్స్‌ కోర్సుల్లో 10 శాతం సీట్లను ఎన్‌.ఆర్‌.ఐ. కోటా కోసం ప్రత్యేకంగా కేటాయించారు. ఎన్‌.ఆర్‌.ఐ. ధ్రువీకరణలో కొన్ని సడలింపులు, సీట్ల సంఖ్య పెంపుతో పాటు ఫీజు తగ్గించి ఎన్‌.ఆర్‌.ఐ. కోటాలో సీట్లను  అందుబాటులోకి తెచ్చారు.

 

ఏపీఈఏపీసెట్‌ ర్యాంకులు వెల్లడించిన నేపథ్యంలో ఆశించిన ర్యాంకు సాధించలేకపోయిన విద్యార్థులూ, వివిధ కారణాలతో సెట్‌ రాయనివారూ కూడా నేరుగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో ఎన్‌.ఆర్‌.ఐ. కోటా ద్వారా వ్యవసాయ విద్యలో డిగ్రీ ప్రవేశాల కోసం ఆసక్తి వ్యక్తమవుతోంది. విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయుల పిల్లలతో పాటు వారు సిఫారసు చేసిన, బంధుత్వం కలిగిన విద్యార్ధులకు కూడా ప్రవేశం లభిస్తుంది. ఇంటర్మీడియట్‌/ దీనికి సమానమైన కోర్సు పూర్తి చేసినవారు అర్హులు. ప్రవేశం పొందాలనుకున్న విద్యార్థుల కనీస వయసు 2021 డిసెంబరు 31 నాటికి 17 సంవత్సరాలు, గరిష్ఠంగా 22 సంవత్సరాలుగా నిర్ణయించారు. 

 

అందుబాటులో ఉన్న సీట్లు

బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చరల్‌: 56

బీటెక్‌ (అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌): 11

బీటెక్‌ (ఫుడ్‌టెక్నాలజీ): 11

బీఎస్సీ(ఆనర్స్‌) కమ్యూనిటీ సైన్స్‌: 8 

 

ఫీజు, దరఖాస్తు విధానం 

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎన్‌.ఆర్‌.ఐ. కోటా ద్వారా సీటు సాధించిన విద్యార్థులు సెమిస్టర్‌కు 2500 అమెరికన్‌ డాలర్ల ట్యూషన్‌ ఫీజుతో పాటు సాధారణ విద్యార్థులు చెల్లించే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్‌ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. ఔత్సాహిక అభ్యర్థులు https://angrau.ac.in/ ను సందర్శించి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు ఎన్‌.ఆర్‌.ఐ, వీసా, పాస్‌పోర్టు,   ఎన్‌.ఆర్‌.ఐ. ప్రవేశం పొందగోరే విద్యార్థి తల్లిదండ్రుల నిబంధనల ధ్రువీకరణ పత్రం(అఫిడవిట్‌)లను సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తుపత్రం, ధ్రువీకరణ పత్రాలు, ఆఫిడివిట్‌లు ఈనెల 30 లోపు ‘రిజిస్ట్రార్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిపాలన భవనం, లాం, గుంటూరు, 522034’ చిరునామాకు చేర్చాలి. - న్యూస్‌టుడే, తిరుపతి (పశువైద్య విశ్వవిద్యాలయం)

 

అందుబాటులో ఫీజు - డాక్టర్‌ విష్ణువర్థన్‌రెడ్డి, ఉపకులపతి, అంగ్రూ

ఎన్‌.ఆర్‌.ఐ. కోటాలో కల్పించే ప్రవేశాలకు సంబంధించిన రుసుములు ఈ ఏడాది తగ్గించాము. ఎక్కువమంది ఇతర రాష్ట్రాలను సీట్ల కోసం ఆశ్రయిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నాము. దేశంలో ఎన్‌.ఆర్‌.ఐ. కోటా సీట్లు అందిస్తున్న వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో అంగ్రూ ఫీజులు తక్కువగా ఉండేలా చేశాము. ఏటా 5 వేల అమెరికన్‌ డాలర్లు లేదా దానికి సమానమైన ఇండియన్‌ కరెన్సీ ట్యూషన్‌ ఫీజుగా వసూలు చేయనున్నాము. ఇతర విశ్వవిద్యాలయాలతో పోల్చితే ఇది తక్కువే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ, ఫుడ్‌ టెక్నాలజీ, వ్యవసాయ ఇంజినీరింగ్, కమ్యూనిటీ సైన్స్‌ కళాశాలల్లో ప్రవేశం ఉంటుంది. జాతీయ స్థాయిలో ఎవరైనా దరఖాస్తుకు అర్హులే.  
 

Posted Date : 21-09-2021 .

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌