• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నీలిట్‌లో నియామకాలు! 

సైంటిస్ట్, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులు

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (నీలిట్‌) సైంటిస్ట్‌-బి, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-ఎ కేటగిరీల్లో మొత్తం 49 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంజినీరింగ్‌/ ఎంఎస్‌సీ/ఎంసీఏ అర్హతలున్నవారు వీటికి  పోటీ పడొచ్చు. ఆసక్తీ, అర్హతలున్న అభ్యర్థులు డిసెంబరు 31, 2020 లోగా దరఖాస్తు చేసుకుని, పరీక్షకు సిద్ధం కావాలి! 

ప్రకటించిన పోస్టులకు గరిష్ఠ వయఃపరిమితి 30 సంవత్సరాలు. కొన్ని కేటగిరీలవారికి గరిష్ఠ వయఃపరిమితిలో సడలింపు ఉంటుంది. 

సైంటిస్ట్‌-బి కేటగిరీ ఉద్యోగులను రాతపరీక్ష, ముఖాముఖి ద్వారా ఎంపిక చేస్తారు. ఇందులో రాతపరీక్షకు 85% వెయిటేజీ, ముఖాముఖికి 15% వెయిటేజీ ఉంటుంది. రాతపరీక్షలో ఉత్తమ మార్కులు సాధించిన వారిని 1:3 నిర్ణీత కేటాయింపులో మౌఖిక పరీక్షకు పిలుస్తారు. అంటే ఒక పోస్టుకు ముగ్గురు అభ్యర్థులను మొత్తం 30 మందిని అనుమతిస్తారు. నియమితులైనవారికి టెన్త్‌ పే స్కేలు ప్రకారం రూ.56,100- రూ.1,77,500 వేతనం ఉంటుంది.

సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-ఎ కేటగిరీ ఉద్యోగులను రాతపరీక్షలో సాధించిన ఉత్తమ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. వీరికి సిక్త్స్‌ పే స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400 వేతనం    లభిస్తుంది. 

దరఖాస్తు ఎలా?

సైంటిస్ట్‌-బి, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-ఎ రెండు పరీక్షలకూ దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఈ రెండు పరీక్షలూ ఒకే స్ట్రీమ్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

ఈ రెండు పరీక్షలకు అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా http://applydelhi.nielit.gov.in వెబ్‌సైట్‌లో 30.12.2020 లోగా దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తు చేసేటపుడు చెల్లుబాటులో ఉన్న ఈమెయిల్, మొబైల్‌ సంఖ్యను పొందుపర్చాలి. 

అభ్యర్థులు సంబంధిత డాక్యుమెంట్లు దరఖాస్తుతోపాటు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. రెండు పరీక్షలూ రాయదలచినవారు ప్రతిదానికీ వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి.

పరీక్ష రుసుము: 

జనరల్‌ కేటగిరీ వారికి రూ.800 

ఎస్‌సీ/ ఎస్‌టీ/ పీడబ్ల్యూడీ/ మహిళ అభ్యర్థులకు రూ.400. పరీక్ష రుసుమును డిమాండ్‌ డ్రాఫ్ట్, పే ఆర్డర్, చెక్‌ లేదా బ్యాంకు చలానా ద్వారా చెల్లించవచ్చు.

విద్యార్హతలు

1. సైంటిస్ట్‌-బి (గ్రూప్‌-ఎ) :  మొత్తం 10 పోస్టులు 

ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ కమ్యూనికేషన్‌/ కంప్యూటర్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌ సెక్యూరిటీ/ కంప్యూటర్‌ అప్లికేషన్‌/ సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ ఇండస్ట్రియల్‌ ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ విభాగాల్లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన పట్టభద్రులు, బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌/ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ అసోసియేట్‌ మెంబర్‌ (లేదా) 

ఎంఎస్‌సీలో ఎలక్ట్రానిక్స్‌ లేదా కంప్యూటర్‌ సైన్స్‌ పట్టభద్రులు (లేదా) 

మాస్టర్స్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌ (ఎంసీఏ) పూర్తిచేసినవారు (లేదా) 

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ కోర్సు బీ స్థాయిలో పూర్తిచేసినవారు.

2. సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-ఎ (గ్రూప్‌-బి) : మొత్తం 39 పోస్టులు

ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ టెలికమ్యూనికేషన్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌ టెక్నాలజీ/ సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ జియోగ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (జీఐఎస్‌)/ డిజైన్‌/ ఇన్ఫర్మాటిక్స్‌/ కంప్యూటర్‌ మేనేజ్‌మెంట్‌/ కంప్యూటర్‌ భాషాశాస్త్రం విభాగాల్లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసినవారు (బీసీ/ బీటెక్‌/ ఎంఎస్‌) (లేదా)

ఎలక్ట్రానిక్స్‌/ అప్లయిడ్‌ ఎలక్ట్రానిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటీలో ఎంఎస్‌సీ చదివినవారు (లేదా) 

మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌ (ఎంసీఏ) పూర్తిచేసినవారు.

పరీక్ష సిలబస్‌

1. ఎలక్ట్రానిక్స్‌ 

ఇంజినీరింగ్‌ మేథమేటిక్స్‌: లీనియర్‌ ఆల్జీబ్రా, కాల్‌క్యులస్, కాంప్లెక్స్‌ వేరియబుల్స్, సంఖ్య పద్ధతులు, ట్రాన్స్‌ఫామ్‌ థియరీ, డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్, సంభావ్యత, గణాంకాలు 

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌: ఎలక్ట్రానిక్‌ డివైజెస్, అనలాగ్‌ సర్క్యూట్స్, డిజిటల్‌   Rsసర్క్యూట్స్, సిగ్నల్స్‌ అండ్‌ సిస్టమ్స్, కమ్యూనికేషన్స్, డిజిటల్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్, కంట్రోల్‌ సిస్టమ్స్, ఎలక్ట్రో మాగ్నటిక్స్, నెట్‌వర్క్స్, మైక్రోప్రాసెసర్స్‌ అండ్‌ మైక్రో కంట్రోలర్స్, కంప్యూటర్‌ ఆర్కిటెక్చర్, ఆర్గనైజేషన్‌

2. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ 

ఇంజినీరింగ్‌ మేథమేటిక్స్‌: మేథమేటికల్‌ లాజిక్, సంభావ్యత, సెట్‌ థియరీ అండ్‌ ఆల్జీబ్రా, కాంబినేటరిక్స్, గ్రాఫ్‌ థియరీ, లీనియర్‌ ఆల్జీబ్రా, న్యూమరికల్‌ మెథడ్స్, కాల్‌క్యులస్‌ 

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ: డిజిటల్‌ లాజిక్, కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్, ఆబ్జెక్ట్‌ ఓరియెంటెడ్‌ టెక్నిక్స్, కంప్యూటర్‌ నెట్‌వర్క్స్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్, ఇంటర్‌నెట్‌ వెబ్‌ ప్రోగ్రామింగ్, ఆపరేషన్‌ సిస్టమ్స్, డీబీఎంఎస్‌

3. కంప్యూటర్‌ సైన్స్‌

ఇంజినీరింగ్‌ మేథమేటిక్స్‌: మేథమేటికల్‌ లాజిక్, సంభావ్యత, సెట్‌ థియరీ అండ్‌ ఆల్జీబ్రా, కాంబినేటరిక్స్, గ్రాఫ్‌ థియరీ, లీనియర్‌ ఆల్జీబ్రా, న్యూమరికల్‌ మెథడ్స్, కాల్‌క్యులస్‌

కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌: డిజిటల్‌ లాజిక్, అనలాగ్‌ అండ్‌ డిజిటల్‌ కమ్యూనికేషన్, ప్రోగ్రామింగ్‌ అండ్‌ డేటా స్ట్రక్చర్స్, అల్గారిదమ్స్, థియరీ ఆఫ్‌ కంప్యూటేషన్, కంపెలర్‌ డిజైన్, ఆపరేటింగ్‌ సిస్టమ్స్, డేటాబేస్, కంప్యూటర్‌ నెట్‌వర్క్స్, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్, కంప్యూటర్‌ ఆర్గనైజేషన్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌

పరీక్ష కేంద్రాలు

అగర్తలా, బెంగళూరు, కాలికట్, చెన్నై, దిల్లీ, గువాహటి, హైదరాబాద్, జయపుర, జమ్మూ, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి. రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు రెండు పరీక్షలు రాయడానికి ఒకే పట్టణంలో పరీక్ష కేంద్రాన్ని ఎంచుకోవాలి. సైంటిస్ట్‌-బి పోస్టుల భర్తీకి నిర్వహించే మౌఖిక పరీక్ష దిల్లీలో జరుగుతుంది.

రాతపరీక్ష విధానం

ఈ పరీక్షను ఆఫ్‌లైన్‌ (ఓఎంఆర్‌) పద్ధతి ద్వారా ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష రాయడానికి మొత్తం 3 గంటల వ్యవధి ఉంటుంది. 

పరీక్షలో మొత్తం 120 బహుళైచ్ఛిక ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 120 మార్కులుంటాయి. 

మొత్తం ప్రశ్నల్లో 65% అభ్యర్థికి సంబంధించిన టెక్నికల్‌ సబ్జెక్టుల నుంచి 35% జనరల్‌ ప్రశ్నలుంటాయి. 

జనరల్‌ అంశానికి సంబంధించిన ప్రశ్నలు ముఖ్యంగా లాజికల్, అనలిటికల్, రీజనింగ్‌ సామర్థ్యాలు, పరిమాణాత్మక, గుణాత్మక సామర్థ్యాలు, జనరల్‌ అవేర్‌నెస్, ఆప్టిట్యూడ్‌ నుంచి అడుగుతారు. 

ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున రుణాత్మక మార్కులుంటాయి.

సన్నద్ధత వ్యూహం

పరీక్ష సిలబస్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, సిలబస్‌ ప్రకారం ఏ అంశాలను చదవాలో అర్థం చేసుకోవాలి. గత ప్రశ్నపత్రాల ఆధారంగా చూస్తే పరీక్షలో కొన్ని కఠినమైన, అతి కఠినమైన ప్రశ్నలు అడిగారు.

సిలబస్, గత ప్రశ్నపత్రాల ఆధారంగా తాము ఏ స్థాయిలో ఉన్నారో గ్రహించి తగిన సన్నద్ధత ప్రణాళికను రూపొందించుకోవాలి.

ఎలక్ట్రానిక్స్‌లో గత ప్రశ్నపత్రాన్ని పరిశీలిస్తే సిగ్నల్స్‌ అండ్‌ సిస్టమ్స్, మైక్రో ప్రాసెసర్స్‌ అండ్‌ మైక్రో కంట్రోలర్స్, ఎలక్ట్రిక్‌ డివైజెస్‌ అండ్‌ నెట్‌వర్క్‌ల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు.

అదేవిధంగా సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-ఎలో కంప్యూటర్‌ ఆర్కిటెక్చర్‌ కూడా ఎక్కువ ప్రాధాన్యమిచ్చి అందులోనూ ఎక్కువ ప్రశ్నలడిగారు. ఎలక్ట్రానిక్స్‌ విషయానికొస్తే ముందుగా సిగ్నల్‌ అండ్‌ సిస్టమ్స్, నెట్‌వర్క్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ డివైజెస్, డిజిటల్‌ సర్క్యూట్స్, మేథమేటిక్స్‌ ముందుగా చదవాలి.

రెండో దశలో అనలాగ్‌ సర్క్యూట్స్, కమ్యూనికేషన్స్, డిజిటల్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్, కంట్రోల్‌ సిస్టమ్స్, ఎలక్ట్రో మేగ్నటిక్స్‌ను చదవాలి. చివరగా మూడో దశలో మైక్రో ప్రాసెసర్స్‌ అండ్‌ మైక్రో కంట్రోలర్స్, కంప్యూటర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఆర్గనైజేషన్‌ చదవాలి. ఈవిధంగా సన్నద్ధం కావడం వల్ల కాన్సెప్టులు సులభంగా అర్థమవుతాయి.

ఉదాహరణకు కమ్యూనికేషన్స్‌ సబ్జెక్టులు అర్థం కావడానికి సిగ్నల్స్‌ అండ్‌ సిస్టమ్స్‌ బేసిక్స్‌ కావాలి. అందుకుగానూ ముందుగా సిగ్నల్స్‌ అండ్‌ సిస్టమ్స్‌ చదివి కమ్యూనికేషన్‌ చదివితే సులభంగా అర్థమవుతుంది.

కంప్యూటర్‌ సైన్స్‌ విషయానికివస్తే గత ప్రశ్నపత్రాల ఆధారంగా అనలాగ్‌ అండ్‌ డిజిటల్‌ కమ్యూనికేషన్, అల్గారిథమ్స్, డిజిటల్‌ లాజిక్, డేటాబేస్, థియరీ ఆఫ్‌ కంప్యూటేషన్‌ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు.
 

Posted Date : 17-12-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌