• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎన్ఐటీల్లో మాస్టర్స్ డిగ్రీకి మీరు సిద్ధమా?
 

‣ ఎంసీఏ ప్రవేశాలకు నిమ్‌సెట్‌ ప్రకటన విడుదల

జాతీయ స్థాయిలో ప్రఖ్యాత సంస్థలైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (నిట్)ల్లో పీజీ చేస్తే ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయి. మంచి ప్యాకేజీలతో కెరియర్ ప్రారంభించే వీలు కలుగుతుంది. ఆ సంస్థల్లో కోర్సు చేయడానికి ఒక ప్రవేశ పరీక్ష ఉంది. అదే నిట్ ఎంసీఏ కామన్స్ ఎంట్రన్స్ టెస్ట్ (నిమ్ సెట్). ఈ పరీక్షలో అర్హత సాధిస్తే దేశంలోని 11 నిట్‌ల‌లో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) చేయవచ్చు. ఇంటర్మీడియట్ తర్వాత నిట్ లో ప్రవేశించలేకపోయిన వారూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ కలలను సాకారం చేసుకోవచ్చు. ప్రస్తుతం నిమ్ సెట్ - 2021 నోటిఫికేషన్ విడుదలైంది. సైన్స్ లేదా ఇంజినీరింగ్ విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. మూడేళ్ల కాలపరిమితి ఉన్న ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కల నెరవేరాలన్నా, కోరుకున్న సంస్థలో సీటు రావాలన్నా ఈ ప్రవేశ పరీక్షకు సరైన ప్రణాళికతో సిద్ధంకావాలి. 

వరంగ‌ల్‌తోపాటు అగర్తల, కాలికట్, జంషెడ్‌పూర్, కురుక్షేత్ర, పాట్నా, రాయ్‌పూర్, సురత్కల్, తిరుచిరాపల్లి న‌గ‌రాల్లో నిట్ లు ఉన్నాయి. అలాగే ఎంఎన్ఎన్ఐటీ-అలహాబాద్, ఎంఏఎన్ఐటీ-భోపాల్ కూడా ఈ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఈ సంవత్సరం నిట్ - రాయ్‌పూర్ నిర్వహిస్తోంది. 

అర్హత ఏమిటి?

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మ్యాథమేటిక్స్‌/ స్టాటిస్టిక్స్‌తో డిగ్రీ చేసుండాలి. బీఎస్‌సీ/ బీఎస్‌సీ ఆనర్స్‌/ బీసీఏ/ బీఐటీ/ బి.వొకేషనల్‌ (కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌)/ బీబీఏ (కంప్యూటర్‌ ఆప్లికేషన్స్‌) లేదా బీఈ/ బీటెక్‌ వారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ సాయిలో కనీసం 60% మార్కులు లేదా 6.5 సీజీపీఏ సాధించి ఉండాలి. ఎస్‌సీ/ ఎస్‌టీ/ పీడబ్ల్యూడీ వారు కనీసం 55% మార్కులు లేదా 6.0 సీజీపీఏ సాధించి ఉండాలి. తుది సంవత్సరం చదువుతున్నవారూ దరఖాస్తుకు అర్హులే. అయితే సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని- విద్యాసంస నుంచి చదువుతున్నట్టుగా సమర్పించాల్సి ఉంటుంది. ప్రవేశం/ కౌన్సెలింగ్‌ నాటికి సర్టిఫికెట్లు తప్పక సమర్పించాలి. లేదంటే ప్రవేశం రద్దు అవుతుంది.  మూడేళ్ల ప్రోగ్రామ్‌లు- బీఎస్‌సీ/ బీఎస్‌సీ ఆనర్స్‌/ బీసీఏ/ బీఐటీలను దూరవిద్య ద్వారా పూర్తిచేసిన/ పూర్తిచేస్తున్న (ఆఖరి సంవత్సరంవారు) వారూ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. అయితే సంబంధిత విద్యాసంస యూజీసీ/ ఏఐసీటీఈ/ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ (డీఈసీ) గుర్తింపు పొందివుండాలి. ​

దరఖాస్తు విధానం

అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. గడువు ఏప్రిల్ 7, 2021 వరకు ఉంది. పరీక్ష రుసుము రూ.2,500 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.1250 చెల్లిస్తే స‌రిపోతుంది.

ప్రవేశ పరీక్ష విధానం

ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షను మే 23, 2021 ఆదివారం ఆన్‌లైన్‌విధానంలో నిర్వహిస్తారు. పరీక్షలో 120 ప్రశ్నలు ఉంటాయి. వాటిలో మ్యాథమేటిక్స్ (50 ప్రశ్నలు), అనలైటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ (40 ప్రశ్నలు), కంప్యూటర్ అవేర్ నెస్ (10 ప్రశ్నలు), జనరల్ ఇంగ్లిష్ నుంచి 20 ప్రశ్నల చొప్పున వస్తాయి. సమయం రెండు గంటలు ఇస్తారు. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కుల చొప్పున కేటాయిస్తారు. తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. 

ఎంపిక ఎలా?

ఉమ్మడి ప్రవేశ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు. వాటిని బట్టి ఆయా విశ్వవిద్యాలయాలు కౌన్సెలింగ్ నిర్వహిస్తాయి. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు

నిమ్‌సెట్ ప‌రీక్ష‌ను దేశవ్యాప్తంగా 37 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలున్నాయి. 

సంస్థల వారీగా సీట్లు

ప్రవేశాలు కల్పిస్తున్న 11 సంస్థల్లో ఆల్ ఇండియా కోటాలో భాగంగా మొత్తం 951 సీట్లు ఉన్నాయి. వాటిలో నిట్-అగర్తల(30), ఎంఎన్ఎన్ఐటీ-అలహాబాద్(116), ఎంఎన్ఐటీ-భోపాల్(115), కాలికట్(58), జంషెడ్‌పూర్(115), కురుక్షేత్ర(96), ప‌ట్నా(80), రాయ్‌పూర్(110), సూరత్కల్(58), తిరుచిరాపల్లి(115), వ‌రంగల్‌లో 58 సీట్లు ఉన్నాయి. 

ప్రిపరేషన్ ఇలా..

నిమ్‌సెట్ ప్రవేశ పరీక్షకు అభ్యర్థులు ముందస్తు ప్రణాళికతో సిద్ధమవ్వాలి. నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలొస్తాయి కాబట్టి ఆయా విభాగాల ప్రిపరేషన్ సాగించాలి. 

గణితం

సాధారణంగానే గణితం ప్రశ్నలు కాస్త కఠినంగా ఉంటాయి. అందులోనూ మొత్తం 120 ప్రశ్నల్లో గణితంలో నుంచే 50 ప్రశ్నలు అడుగుతారు. అంటే దాదాపు 40శాతం ఇవే. అందుకే మిగిలిన వాటితో పోలిస్తే ఈ విభాగానికి ఎక్కువ సమయం కేటాయించాలి. ఇందులో సెట్ థియరీ, ప్రాబబులిటీ అండ్ స్టాటిస్టిక్స్, ఆల్జీబ్రా, కోఆర్డినేట్ జామెట్రీ, కాల్క్యులస్, వెక్టర్స్, ట్రైగోనోమెట్రి అంశాలకు సంబంధించిన ప్రశ్నలు సాధారణంగా అడుగుతారు. 

అన‌లైటికల్ ఎబిలిటీ & లాజికల్ రీజనింగ్

గణితం తర్వాత అత్యధిక ప్రశ్నలొచ్చే విభాగం ఇదే. ఇందులో గమ్మత్తయిన ప్రశ్నలు ఇచ్చి అభ్యర్థుల తార్కిక ఆలోచన విధానాన్ని పరిశీలిస్తారు. ప్యాసేజ్ ఇచ్చి అందులో నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ విభాగంలో మంచి మార్కులు సాధించాలంటే వీలైనంత ఎక్కువ సాధన చేయాలి. సంప్రదాయ పద్ధతులతోపాటు షార్ట్‌క‌ట్స్‌పై దృష్టి సారించాలి. 

కంప్యూటర్ అవేర్ నెస్

ప్రస్తుత రోజుల్లో కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. కనీసం బేసిక్స్ తెలిసి ఉండాలి. ఇందులో కూడా కంప్యూటర్ దాని విభాగాలు, సీపీయూ, ఇన్‌పుట్/ఔట్‌పుట్‌‌ డివైజెస్, మెమొరీ, బ్యాక్అప్ డివైజెస్‌కు సంబంధించిన ప్రశ్నలిస్తారు. డేటా రిప్రజెంటేషన్ లో భాగంగా క్యారెక్టర్స్, ఫ్రాక్షన్స్, బైనరీ అండ్ హెక్సాడెసిమల్స్ రిప్రజెంటేషన్, బైనరీ అరిధ్ మెటిక్, అడిషన్, సబ్‌ట్రాక్షన్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. వాటిపై అభ్యర్థులు శ్రద్ధవహించాలి. 

జనరల్ ఇంగ్లిష్

అభ్యర్థులకు ఇంగ్లిష్ భాషపై కనీస అవగాహనను ఇందులో గమనిస్తారు. ఇంగ్లిష్ గ్రామ‌ర్ నియమాలు తెలిస్తే సమాధానాలను సులభంగా కనిపెట్టవచ్చు. కాంప్రహెన్షన్, ఒకాబులరీ, వెర్బ్స్, ప్రిపొసిషన్స్, ఆర్టికల్స్, వర్డ్ పవర్, యాంటనిమ్స్, సిననిమ్స్ తదితర అంశాల నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. రూట్ వర్డ్స్ లేదా మైండ్ మ్యాప్ విధానాలు పాటిస్తూ సన్నద్ధత కొనసాగించాలి. కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో ముందుగా ప్రశ్నలను చదివి, గుర్తుంచుకుని తరువాత ప్యాసేజీలో ఇచ్చిన సమాచారాన్ని చదివితే అవసరమైన సమాచారమేదో గుర్తించడం సులభమవుతుంది. ఇందుకు ప్రతిరోజూ తప్పనిసరిగా ఆంగ్ల దినపత్రికలు చదవాలి.

దర‌ఖాస్తు చివ‌రి తేది: ఏప్రిల్ 7, 2021 

వెబ్‌సైట్‌: https://www.nimcet.in/

Posted Date : 12-03-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌