• facebook
  • twitter
  • whatsapp
  • telegram

తీరాల ర‌క్ష‌ణ‌లో వీరులుగా..!

358 ఇండియ‌న్ కోస్ట్ గార్డ్ నావిక్‌, యాంత్రిక్ పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌ల‌

దేశ స‌ముద్ర జ‌లాల్లో గ‌స్తీ, ఇత‌ర దేశాల నుంచి వ‌స్తువులు, మాద‌క ద్ర‌వ్యాల అక్ర‌మ ర‌వాణా, చొర‌బాట్లు వంటి కార్య‌క‌లాపాల‌ను అడ్డుకోవ‌డంలో ఇండియ‌న్ కోస్ట్ గార్డుల(ఐసీజీ)‌ది కీల‌క‌పాత్ర‌. వీరంతా దేశానికి సాయుధ ద‌ళం, సెర్చ్ అండ్ రెస్క్యూ, మారిటైమ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల‌కు సంబంధించి విధులు నిర్వ‌ర్తిస్తారు. భారత నావికాదళం, మత్స్య శాఖ, రెవెన్యూ శాఖ (కస్టమ్స్), కేంద్ర, రాష్ట్ర పోలీసు దళాల సహకారంతో పని చేస్తారు. స‌ముద్ర తీరాల్లో దేశ ర‌క్ష‌ణకు వీరులుగా పోరాడాల‌ని మీకూ ఉందా..? అందుకు ఇది స‌ద‌వ‌కాశం. భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఈ సాయుధ ద‌ళం ప్ర‌స్తుతం ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. నావిక్‌(జ‌న‌ర‌ల్ డ్యూటీ), నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్‌), యాంత్రిక్ పేర్ల‌తో వీటిని భ‌ర్తీ చేయ‌నుంది.

పోస్టులు-జీత‌భ‌త్యాలు

మొత్తం 358 పోస్టులు ఉన్నాయి. నావిక్‌(జ‌న‌ర‌ల్ డ్యూటీ)లో 260(వేత‌నం రూ.21700, ఇత‌ర అల‌వెన్సులు). నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్‌)లో 50(రూ.21700, ఇత‌ర అల‌వెన్సులు).  యాంత్రిక్ (మెకానిక‌ల్‌)లో 31, యాంత్రిక్ (ఎల‌క్ట్రిక‌ల్‌)లో 07, యాంత్రిక్ (ఎల‌క్ట్రానిక్స్‌)లో 10(రూ.29200+6200, ఇత‌ర అల‌వెన్సులు) భ‌ర్తీ చేయ‌నున్నారు. 

విద్యార్హ‌‌త

ఈ పోస్టుల‌న్నింటికి పురుషులు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం ఉంది. నావిక్ (జ‌న‌ర‌ల్ డ్యూటీ)లో చేరాల‌నుకునే అభ్య‌ర్థులు మ్యాథ్స్‌, ఫిజిక్స్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. దీనికి 18-22 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉన్న వారు అర్హులు. అంటే అక్టోబ‌రు 01, 1999 త‌ర్వాత‌, జులై 31, 2003 ముందు జ‌న్మించి ఉండాలి. నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్‌)కి ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు గుర్తింపు పొందిన పాఠ‌శాల‌ల నుంచి ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త సాధించాలి. వీరి వ‌య‌సు కూడా 18-22 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. కాకుంటే వీరు అక్టోబ‌రు 01, 1999 త‌ర్వాత‌, సెప్టెంబ‌రు 30, 2003 మ‌ధ్య జన్మించి ఉండాలి. యాంత్రిక్ పోస్టుల కోసం ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తో పాటు ఎల‌క్ట్రిక‌ల్/ మెకానిక‌ల్/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలిక‌మ్యూనికేష‌న్ (రేడియో/ ప‌వ‌ర్‌) ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. వీరి వ‌య‌సు కూడా 18-22 ఏళ్ల మ‌ధ్య ఉంటే స‌రిపోతుంది. నావిక్ (జ‌న‌ర‌ల్ డ్యూటీ)కి ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌లె ఈ యువ‌కులూ అక్టోబ‌రు 01, 1999 త‌ర్వాత‌, జులై 31, 2003 ముందు జ‌న్మించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

ఎంపిక ఎలా?

ఈ పోస్టుల‌కు నాలుగు ద‌శల్లో ఎంపిక విధానం ఉంటుంది. వాటిలో మెరిట్ సాధించిన అభ్య‌ర్థుల‌నే తీసుకుంటారు. ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌పోస్టుల‌ను బ‌ట్టి ప‌రీక్ష‌లు ఉంటాయి. 

స్టేజ్-1(రాత ప‌రీక్ష):

నావిక్‌(డొమెస్టిక్ బ్రాంచ్‌) వారికి సెక్ష‌న్-1 ద్వారా నిర్వ‌హించే ప‌రీక్ష‌లో అన్‌రిజ‌ర్వ్‌డ్‌, ఈడ‌బ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్య‌ర్థుల‌కు క‌టాఫ్ మార్కులు 30 కాగా, ఎస్సీ, ఎస్టీల‌కు 27గా నిర్ణ‌యించారు. నావిక్‌(జ‌న‌ర‌ల్ డ్యూటీ) సెక్ష‌న్‌, 2లో అన్‌రిజ‌ర్వ్‌డ్‌, ఈడ‌బ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్య‌ర్థుల‌కు క‌టాఫ్ మార్కులు 30+20=50, ఎస్సీ, ఎస్టీల‌కు 27+17=44 మార్కులు పెట్టారు. యాంత్రిక్‌(ఎల‌క్ట్రిక‌ల్‌) సెక్ష‌న్‌,3లో అన్‌రిజ‌ర్వ్‌డ్‌, ఈడ‌బ్ల్యూఎస్‌, ఓబీసీ వారికి 30+20=50, ఎస్సీ, ఎస్టీల‌కు 27+17=44 మార్కులు‌గా కటాఫ్ నిర్ణ‌యించారు. యాంత్రిక్‌(ఎల‌క్ట్రానిక్స్‌) సెక్ష‌న్‌,4లో అన్‌రిజ‌ర్వ్‌డ్‌, ఈడ‌బ్ల్యూఎస్‌, ఓబీసీ వారికి 30+20=50, ఎస్సీ, ఎస్టీల‌కు 27+17=44 మార్కులు‌గా కటాఫ్ నిర్ణ‌యించారు. యాంత్రిక్‌(మెకానిక‌ల్‌) సెక్ష‌న్‌,5లో  అన్‌రిజ‌ర్వ్‌డ్‌, ఈడ‌బ్ల్యూఎస్‌, ఓబీసీ వారికి 30+20=50, ఎస్సీ, ఎస్టీల‌కు 27+17=44 మార్కులు పెట్టారు. నావిక్‌(డొమెస్టిక్ బ్రాంచ్‌) అభ్య‌ర్థులు మిన‌హా మిగ‌తావారు ఆయా సెక్ష‌న్లలో త‌ప్ప‌నిస‌రిగా ఉత్తీర్ణ‌త సాధించాల్సి ఉంటుంది. 

ప‌రీక్ష విధానం, సిల‌బ‌స్..

రాత ప‌రీక్ష అబ్జెక్టివ్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. ప్ర‌తి ప్ర‌శ్న‌కు నాలుగు ఆప్ష‌న్స్ ఇస్తారు. స‌రైన స‌మాధాన్ని ఎంపిక చేయాలి. ఇందులో రుణాత్మ‌క మార్కులు ఉండ‌వు. 

సెక్ష‌న్‌-1 ప‌రీక్ష:

ఇందులో 60 ప్ర‌శ్న‌ల‌కు 60 మార్కులు ఉంటాయి. ప‌దో త‌ర‌గ‌తి సిల‌బ‌స్ నుంచే ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. మ్యాథ్స్ 20, సైన్స్ 10 ఇంగ్లిష్ 15, రీజ‌నింగ్ 10, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ 5 ప్ర‌శ్న‌లు ఉంటాయి. స‌మ‌యం 45 నిమిషాలు. 

సెక్ష‌న్‌-2 ప‌రీక్ష‌:

50 ప్ర‌శ్న‌ల‌కు 50 మార్కులు. ఇంట‌ర్మీడియ‌ట్ మ్యాథ్స్ నుంచి 25, ఫిజిక్స్ నుంచి 25 ప్ర‌శ్న‌లు అడుగుతారు. స‌మ‌యం 30 నిమిషాలు.

సెక్ష‌న్‌-3 ప‌రీక్ష‌:

ఇందులో కూడా 50 ప్ర‌శ్న‌లకు 50 మార్కులు. ఎల‌క్ట్రిక‌ల్ డిప్లొమా ఇంజినీరింగ్ సిల‌బ‌స్ నుంచి ప్ర‌శ్న‌లుంటాయి. స‌మ‌యం 30 నిమిషాలు.

సెక్ష‌న్‌-4 ప‌రీక్ష‌:

ఎల‌క్ట్రానిక్స్ డిప్లొమా ఇంజినీరింగ్ నుంచి 50 ప్ర‌శ్న‌లు అడుగుతారు. 50 మార్కులుంటాయి. స‌మ‌యం 30 నిమిషాలు.

సెక్ష‌న్‌-5 ప‌రీక్ష‌:

మెకానిక‌ల్ డిప్లొమా ఇంజినీరింగ్ నుంచి అడిగే 50 ప్ర‌శ్న‌ల‌కు 50 మార్కులిస్తారు. స‌మ‌యం 30 నిమిషాలు. 

ఇద్ద‌రు లేదా అంత‌కంటే ఎక్కువ మంది అభ్య‌ర్థులు స‌మాన‌మార్కులు సాధిస్తే *టై బ్రేక్* ద్వారా త‌దుప‌రి స్టేజ్‌కు ఎంపిక చేస్తారు. టై బ్రేక్‌లో భాగంగా సెక్ష‌న్-1లో అత్య‌ధిక మార్కులను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. ఇది నావిక్‌(డొమెస్టిక్ డ్యూటీ), యాంత్రిక్ అభ్య‌ర్థుల‌కు మాత్ర‌మే. అలాగే వారి అర్హ‌త తర‌గ‌తుల్లో సాధించిన మార్కుల శాతంతోపాటు అత్య‌ధిక వ‌య‌స్సు ఉన్న అభ్య‌ర్థులను మెరిట్‌గా నిర్ణ‌యిస్తారు. 

స్టేజ్‌-2 (ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్‌)

ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో భాగంగా అభ్య‌ర్థి పాస్‌, ఫెయిల్‌ను ప్ర‌క‌టిస్తారు. ఇందులో 7 నిమిషాల్లో 1.6 కిలోమీట‌ర్లు ప‌రిగెత్తాలి. 20 స్కాట్ అప్స్‌, 10 పుష్అప్స్ చేయాలి. ఈ మూడూ మ‌ధ్య‌లో విశ్రాంతి లేకుండా చేయాల్సి ఉంటుంది. విశ్రాంతి తీసుకున్న అభ్య‌ర్థుల‌ను ఫెయిల్‌గా ప్ర‌క‌టిస్తారు. అనంత‌రం అర్హ‌త సాధించే అభ్య‌ర్థుల ఒరిజిన‌ల్ డాక్యుమెంట్లు, స‌ర్టిఫికెట్ల వెరిఫికేష‌న్, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్‌ చేస్తారు. 

స్టేజ్‌-3 (డాక్యుమెంట్ వెరిఫికేష‌న్‌)

అభ్యర్థులు ఐసీజీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్లు, ఒరిజిన‌ల్ డాక్యుమెంట్లు స‌రిపోలాయా లేదా అని చూస్తారు. ఈ స్టేజ్‌లో ఫైన‌ల్ మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్‌ ఇండియ‌న్ నేవ‌ల్ షిప్‌(ఐఎన్ఎస్) చిల్కాలో నిర్వ‌హిస్తారు. ఇక్క‌డ ఎవ‌రైనా అభ్య‌ర్థులు అన్‌ఫిట్‌గా తేలితే శిక్ష‌ణ‌కు పంపించ‌రు.

స్టేజ్‌-4(తుది ఎంపిక‌)

అభ్య‌ర్థులు స‌మ‌ర్పించిన త‌మ ఒరిజిన‌ల్‌డాక్యుమెంట్లు, స‌ర్టిఫికెట్ల‌ను ఐసీజీ మ‌రొక్క‌సారి ప‌రీశీలిస్తుంది. వారు స‌మ‌ర్పించిన వివ‌రాలు త‌ప్ప‌ని తేలితే ఏ క్ష‌ణ‌మైనా వారిని స‌ర్వీస్ నుంచి తొల‌గిస్తారు. 

ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి

అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో 05 జ‌న‌వ‌రి 2021 నుంచి ద‌‌ర‌ఖాస్తు చేసుకోవాలి. చివ‌రి తేదీ 19 జ‌న‌వ‌రి 2021. ఒకరు ఒక పోస్టుకు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేయాలి. అందుబాటులో ఉండే ఫోన్ నంబ‌రు, ఈమెయిల్ పొందుప‌ర్చాలి. త‌ప్ప‌నిస‌రిగా ఇండియ‌న్ కోస్ట్ గార్డ్ అడిగే సంబంధిత డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి. ప‌రీక్ష రుసుము రూ.250 ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీల‌కు రుసుము మిన‌హాయింపు. ద‌ర‌ఖాస్తు 1,2 స్టేజ్‌ల్లో అభ్య‌ర్థులు ఏవైనా ఐదు ప్రాంతాల‌ను ప‌రీక్షా కేంద్రాల కోసం కేటాయించుకోవాలి. స్టేజ్‌-1 ప‌రీక్ష‌ మార్చిలో, స్టేజ్‌-2 ప‌రీక్ష‌ ఏప్రిల్ లేదా మేలో, స్టేజ్‌-3,4 ప‌రీక్ష‌ ఆగ‌స్టు, అక్టోబ‌ర్ నెల‌ల్లో ఉంటాయి.

శిక్ష‌ణ ఎలా.. ఎక్క‌డ‌?

ఇండియ‌న్ నేవ‌ల్ షిప్‌(ఐఎన్ఎస్‌), చిల్కాలో ఎంపికైన అభ్య‌ర్థుల‌కు శిక్ష‌ణ ఇస్తారు. నావిక్‌(జ‌న‌ర‌ల్ డ్యూటీ), యాంత్రిక్ పోస్టుల అభ్య‌ర్థుల‌కు ఆగ‌స్టులో, నావిక్‌(డొమెస్టిక్ బ్రాంచ్‌) వారికి అక్టోబ‌ర్‌లో ఉంటుంది. శిక్ష‌ణ‌లో ప్ర‌ద‌ర్శ‌న‌సంతృప్తిక‌రంగా లేకుంటే మ‌ధ్యలో నుంచే పంపించివేస్తారు. 
 

Posted Date : 22-12-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌