• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అత్యున్నత బ్యాంకులో అసిస్టెంట్‌ కొలువులు

డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) 950 అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ అర్హతతో వీటికి పోటీ పడవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షల్లో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. అనుభవం, శాఖాపరమైన పరీక్షల ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశముంది! 

వారానికి ఐదు పని దినాలు, తక్కువ పని వేళలు, ఒత్తిడి లేని విధులు- ఆర్‌బీఐ ప్రత్యేకత. తాజాగా ప్రకటించిన అసిస్టెంట్‌ పోస్టుకు ఎంపికైతే.. రూ.20,700 మూలవేతనం అందుతుంది. దీనికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలూ దక్కుతాయి. అందువల్ల మొదటి నెల నుంచే అన్నీ కలిపి రూ.45 వేల వేతనం పొందవచ్చు. మూడేళ్ల అనుభవం తర్వాత శాఖాపరమైన పరీక్షల ద్వారా గ్రేడ్‌ ఏ, అనంతరం గ్రేడ్‌ బీ స్థాయిలను అందుకోవచ్చు. బ్యాంకుల లావాదేవీలను పరిశీలించడం వీరి ప్రధాన విధి. 

ఎంపిక విధానం గమనిస్తే... ముందుగా ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి ప్రధాన పరీక్ష ఉంటుంది. ఈ దశను దాటిన వారు భాషా నైపుణ్య పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరి. ఈ మార్కులను తుది నియామకాల్లో పరిగణనలోకి తీసుకోరు. ప్రధాన పరీక్ష స్కోరుతో ఉద్యోగాలు భర్తీ అవుతాయి. 

ప్రాథమిక పరీక్ష  

ఈ పరీక్షను వంద మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ప్రశ్నలు వస్తాయి. వీటిని 3 విభాగాల నుంచి అడుగుతారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నుంచి 30, న్యూమరికల్‌ ఎబిలిటీ- 35, రీజనింగ్‌ ఎబిలిటీ- 35 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి ఒక గంట. ఒక్కో విభాగానికి 20 నిమిషాల సమయాన్ని కేటాయించారు. ఇందులో అర్హత సాధించినవారికి ప్రధాన పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. 

ప్రధాన పరీక్ష

200 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున రీజనింగ్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, న్యూమరికల్‌ ఎబిలిటీ, జనరల్‌ అవేర్‌నెస్, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ల్లో ప్రశ్నలు అడుగుతారు. విభాగాలవారీ కేటాయించిన సమయాల్లో వీటిని పూర్తిచేయాలి. జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగానికి 25 నిమిషాలు, కంప్యూటర్‌ నాలెడ్జ్‌కు 20 నిమిషాలు ఉన్నాయి. మిగిలిన ఒక్కో విభాగాన్నీ 30 నిమిషాల్లో పూర్తిచేయాలి. మొత్తం పరీక్ష వ్యవధి 135 నిమిషాలు. 

ప్రాథమిక, ప్రధాన రెండు పరీక్షల్లోనూ రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. ప్రశ్నలు ఆంగ్లం, హిందీ మాధ్యమాల్లో అడుగుతారు. 

లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ

మెయిన్స్‌లో అర్హత సాధించినవారికి భాషా నైపుణ్య పరీక్ష (ఎల్‌పీటీ) నిర్వహిస్తారు. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న కార్యాలయానికి కేటాయించిన భాషలో ఈ పరీక్ష రాయాలి. హైదరాబాద్‌లోని 40 ఖాళీలకు మాత్రమే తెలుగు భాష పరీక్ష రాసే అవకాశం ఉంది. ముంబయి కార్యాలయంలో 128 ఖాళీలు ఉన్నాయి. అయితే వీటికి పోటీ పడడానికి మరాఠీ లేదా కొంకణి భాషలో ఉత్తీర్ణత తప్పనిసరి. హిందీ భాష వచ్చిన వారు చండీగఢ్‌ 78/ కాన్పూర్‌ అండ్‌ లఖ్‌నవూ 131/ నాగ్‌పూర్‌ 56/ న్యూదిల్లీ 75 ఖాళీల్లో ఏదో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని పోటీ పడవచ్చు. 

ప్రణాళిక ఇలా...

ఇప్పటికే బ్యాంకు పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఆర్‌బీఐ కోసం ప్రత్యేకంగా చదవనవసరం లేదు. 

ఇంగ్లిష్, రీజనింగ్, న్యూమరికల్‌ ఎబిలిటీ- ఈ మూడు అంశాలూ ప్రాథమిక, ప్రధాన పరీక్షలు- రెండింటిలోనూ ఉన్నాయి. అందుకని ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండింటికీ ఒకే సన్నద్ధత సరిపోతుంది. 

ప్రతి విభాగానికీ నిర్ణీత సమయాన్ని కేటాయించారు. అందువల్ల రీజనింగ్, న్యూమరికల్‌ ఎబిలిటీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 

ఉన్న వ్యవధిలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి ముందస్తు సాధన ఎంతో అవసరం. 

కనీసం 15 నుంచి 20 వరకు మాక్‌ పరీక్షలు రాయాలి. 

జనరల్‌ అవేర్‌నెస్, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ విభాగాలను ప్రాథమిక పరీక్ష అనంతరం చదువుకుంటే సరిపోతుంది. 

న్యూమరిల్‌ ఎబిలిటీ ప్రశ్నలు సులువుగా ఉన్నప్పటికీ సమాధానం రాబట్టడానికి ఎక్కువ సమయం అవసరమవుతుంది. అందువల్ల తక్కువ వ్యవధిలో సమాధానం గుర్తించడానికి అవకాశం ఉన్న ప్రశ్నలపైనే ముందుగా దృష్టి సారించాలి. సమయం మిగిలితేనే మిగిలినవాటి గురించి ఆలోచించాలి. 

కూడికలు, తీసివేతలు, భాగహారం, గుణింతాలపై పట్టు సాధించాలి. 

అంకెలు, సూక్ష్మీకరణలపై ప్రావీణ్యం పొందితే ఎక్కువ మార్కులు సొంతం చేసుకోవచ్చు. 

రుణాత్మక మార్కులు కారణంగా తెలియని ప్రశ్నలను వదిలేయడమే మంచిది. 

జనరల్‌ మ్యాథ్స్, ఆంగ్లంలోని ప్రాథమికాంశాలను క్షుణ్నంగా చదివి, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేసినవారు ప్రిలిమ్స్‌ గట్టెక్కవచ్చు. 

మెయిన్స్‌లో మెరవడానికి ఇవే అంశాలు లోతుగా అధ్యయనం చేస్తూ జనరల్‌ నాలెడ్జ్, వర్తమాన అంశాలు, కంప్యూటర్స్‌పై దృష్టి పెట్టాలి.  

గమనించండి! 

అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు డిగ్రీ పాసైతే సరిపోతుంది.

వయసు: ఫిబ్రవరి 1, 2022 నాటికి 20 - 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఫిబ్రవరి 2, 1994 కంటే ముందు; ఫిబ్రవరి 1, 2002 తర్వాత జన్మించినవారు అనర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయః సడలింపులు వర్తిస్తాయి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 8

దరఖాస్తు రుసుం: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మన్‌కు రూ.50. మిగిలిన అభ్యర్థులకు రూ.450.

ప్రిలిమినరీ పరీక్షలు: మార్చి 26, 27 తేదీల్లో.

మెయిన్‌ పరీక్ష: మే నెలలో. 

ప్రాథమిక పరీక్ష కేంద్రాలు: ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, చీరాల, విజయనగరం. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌. 

వెబ్‌సైట్‌: https:://opportunities.rbi.org.in
 

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-02-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌