• facebook
  • twitter
  • whatsapp
  • telegram

బ్యాంకు, బీమా.. కేంద్ర కొలువుల ధీమా!

కొత్త ఏడాది నియామకాల తీరు

ఈ నూతన సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగార్థుల ఆశలు ఏమేరకు ఫలించనున్నాయి? ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగాలు, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్షల ద్వారా కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని భర్తీ అయ్యే అవకాశం ఉంది? ఈ కొలువులను లక్ష్యంగా చేసుకున్నవారు రాతపరీక్షల సన్నద్ధతకు ఎలా ముందడుగు వేయాలి? తెలుసుకుందాం!

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల పార్లమెంట్‌లో చేసిన ప్రకటన ప్రకారం- డిసెంబరు 1, 2021 నాటికి వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 41,177 ఆఫీసర్, క్లర్క్‌ల ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీల్లో కొన్నింటిని 2021లో ఎస్‌బీఐ నిర్వహించిన పీవో, జూనియర్‌ అసోసియేట్స్‌ పరీక్షల ద్వారా, మరికొన్నింటిని ఐబీపీఎస్‌ 2021-22లో నిర్వహిస్తోన్న పీవో, క్లర్క్‌ పరీక్షల ద్వారా భర్తీ చేయనున్నారు. 20 వేల నుంచి 25 వేల ఖాళీలు వీటి ద్వారా భర్తీ అయ్యే అవకాశం ఉంది. మిగిలిన ఖాళీలతోపాటు 2022 ఏప్రిల్‌ 1 తర్వాత రాబోయే ఖాళీలు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ, ఐబీపీఎస్‌ నిర్వహించే పరీక్షల ద్వారా భర్తీ అవుతాయి. ఇవి కూడా 40 వేల నుంచి 50 వేలు ఉండే అవకాశం ఉంది.

వీటితోపాటు రిజర్వ్‌ బ్యాంక్‌లోని అసిస్టెంట్స్, ఆఫీసర్ల ఖాళీలు, ఇన్సూరెన్స్‌ కంపెనీల్లోని క్లర్కు, ఆఫీసర్‌ ఖాళీలు 2021లో భర్తీ చేయలేదు. ఈ నియామకాలు కూడా 2022లో పూర్తయ్యే అవకాశం ఉంది. అంటే.. 2022లో భారీ సంఖ్యలోనే బ్యాంక్, ఇన్సూరెన్స్‌ ఖాళీలు భర్తీ కానున్నాయి.

కేంద్రప్రభుత్వ సంస్థల్లో.. 

కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ జులై నెలలో పార్లమెంట్‌లో ఒక ప్రకటన చేస్తూ మార్చి 1, 2020 నాటికి వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 8,72,243 ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, యూపీఎస్సీ ద్వారా 78,264 ఖాళీలు భర్తీ అయ్యాయి. ఎక్కువ సంఖ్యలో నియామకాలను జరిపే ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ 2021-22లో నియామకాలు జరపలేదు. కాబట్టి దాదాపు ఎనిమిది లక్షల ఖాళీలు భర్తీ అవ్వాల్సి ఉంది. వీటన్నింటినీ కాకపోయినా ఎక్కువ సంఖ్యలోనే 2022లో కొలువుల నియామకం జరిగే అవకాశం ఉంది.

ఎస్‌ఎస్‌సీ క్యాలండర్‌ విడుదల

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ 2021-22 సంవత్సరానికి తాను నిర్వహించబోయే పరీక్షల క్యాలండర్‌ను విడుదల చేసింది. దీనిలో ఎస్‌ఎస్‌సీ నిర్వహించబోయే సీజీఎల్, సీహెచ్‌ఎస్‌ఎల్, ఎంటీఎస్, జేఈ, దిల్లీ పోలీస్, ఇతర కేంద్ర బలాల భర్తీ తదితర పరీక్షల నోటిఫికేషన్లు, పరీక్షలు నిర్వహించే సమయాన్ని పేర్కొన్నారు. ఎస్‌ఎస్‌సీ- సీజీఎల్‌ నోటిఫికేషన్‌ ఇప్పటికే విడుదలైంది. దరఖాస్తుకి జనవరి 23 చివరి తేదీ. మొదటి దశ (టైర్‌-1) పరీక్షను ఏప్రిల్‌లో నిర్వహిస్తారు.  సీహెచ్‌ఎస్‌ఎల్‌ నోటిఫికేషన్‌ ఫిబ్రవరి 1, ఎంటీఎస్‌ నోటిఫికేషన్‌ 22 మార్చిన విడుదల అవుతాయి. ఎస్‌ఎస్‌సీ 2021-22 క్యాలండర్‌ పరీక్షల ద్వారా చాలావరకు ఖాళీలు భర్తీ అవనున్నాయి.

పరీక్ష రాసేవరకూ ఉత్సాహం

లక్షల సంఖ్యలో కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు 2022లో భర్తీ అయ్యే అవకాశం ఉంది. నూతన సంవత్సరంలో కేంద్రప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యంగా ఉన్నట్లయితే మీ సన్నద్ధతను వెంటనే ప్రారంభించండి. సీజీఎల్‌ నోటిఫికేషన్‌ వచ్చింది. సీహెచ్‌ఎస్‌ఎల్, ఎంటీఎస్‌ నోటిఫికేషన్లు రాబోతున్నాయి. వీటి పరీక్షలు వరుసగా మే, జూన్‌ నెలల్లో జరగనున్నాయి. కాబట్టి కాలయాపన లేకుండా ప్రణాళికను రచించండి. దాని ప్రకారం సన్నద్ధతను ప్రారంభించాలి. ఎంత ఉత్సాహంగా సన్నద్ధతను ప్రారంభిస్తారో అదే ఉత్సాహం పరీక్ష రాసే వరకు ఉండేలా చూసుకోవాలి. ఆరంభ శూరత్వంలా ఉండకూడదు. ఇలా ఒక ప్రణాళికతో ప్రారంభించి కష్టపడి చదివితే లక్షల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ అయ్యే 2022లో ఒక ఖాళీ మీ పేరు మీద ఉండే అవకాశం కలుగుతుంది! 

సన్నద్ధత ఏ విధంగా?

పోటీ పరీక్షల్లో బీఎస్‌ఐఆర్‌ పరీక్షలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. బీఎస్‌ఐఆర్‌ అంటే- బ్యాంకింగ్, స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్, ఇన్సూరెన్స్, రైల్వే. 

వీటిలో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌ పరీక్షలు ఒకే విధంగా ఉంటాయి. 

ఎస్‌ఎస్‌సీ, రైల్వే పరీక్షలు ఒకే విధంగా ఉంటాయి. 

బ్యాంకింగ్, స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ పరీక్షలు 70-80 శాతం ఒకే విధంగా ఉంటాయి. సబ్జెక్టులు, సిలబస్, పరీక్షా విధానంలో చాలా పోలికలుంటాయి. రెండింటిలో ఉమ్మడిగా ఉన్న సబ్జెక్టులు ముందుగా సన్నద్ధమైతే ప్రయోజనకరం. రెండింటిలోనూ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, వెర్బల్‌ రీజనింగ్, ఇంగ్లిష్‌లు ఉంటాయి. 

రీజనింగ్‌: ఉమ్మడిగా కోడింగ్‌-డీకోడింగ్, బ్లడ్‌ రిలేషన్స్, డైరెక్షన్స్, పజిల్స్, బ్యాంకింగ్, సిట్టింగ్‌ అరేంజ్‌మెంట్, లాజికల్‌ రీజనింగ్‌లోని స్టేట్‌మెంట్‌ సంబంధ ప్రశ్నలు, సిలాజిజమ్, వెన్‌ డయాగ్రమ్‌ల నుంచి ప్రశ్నలుంటాయి. వీటికి అదనంగా ఎస్‌ఎస్‌సీలో క్లాక్స్, కేలండర్స్, సిరీస్‌లోని అనాలజీ, క్లాసిఫికేషన్‌ మొదలైన ప్రశ్నలు, నాన్‌-వెర్బల్‌ రీజనింగ్‌లో బొమ్మల ఆధారమైన క్యూబ్స్, మ్యాట్రిక్స్, మిర్రర్, వాటర్‌ ఇమేజెస్, పేపర్‌ కటింగ్, ఫోల్డింగ్, సిరీస్‌ మొదలైన ప్రశ్నలుంటాయి. 

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: ఈ విభాగంలో సింప్లిఫికేషన్స్, నంబర్‌ సిరీస్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, అరిథ్‌మెటిక్‌ల నుంచి ప్రశ్నలుంటాయి. అరిథ్‌మెటిక్‌లో పర్సంటేజీ, ఏవరేజి, రేషియో-ప్రపోర్షన్, పార్టనర్‌షిప్, నంబర్‌ సిస్టమ్, ఏజెస్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, సింపుల్, కాంపౌండ్‌ ఇంటరెస్ట్, టైమ్‌-వర్క్, టైమ్‌-డిస్టెన్స్, మెన్సురేషన్, అలిగేషన్‌-మిక్చర్స్‌ ముఖ్యమైనవి. వీటన్నింటి నుంచీ ప్రశ్నలుంటాయి. వీటికి అదనంగా ఎస్‌ఎస్‌సీలో ప్యూర్‌ మ్యాథమేటిక్స్‌ నుంచి,  ట్రిగొనామెట్రీ, జామెట్రీ, ఆల్జీబ్రాల నుంచి ప్రశ్నలుంటాయి.

ఇంగ్లిష్‌: ఈ విభాగంలో దాదాపు రెండింటిలోనూ ఒకేవిధమైన ప్రశ్నలుంటాయి. గ్రామర్‌ ఆధారిత ప్రశ్నలు, ఒకాబులరీ, కాంప్రహెన్షన్‌ ప్రశ్నలు ఉంటాయి. గ్రామర్‌ ఆధారంగా ఉండే ప్రశ్నల్లో సెంటెన్స్‌ కరెక్షన్, రీ అరెంజ్‌మెంట్‌ ఆఫ్‌ వర్డ్‌/సెంటెన్సెస్, స్పెల్లింగ్‌ మిస్టేక్స్, ఫిల్లర్స్, క్లోజ్‌ టెస్ట్‌ మొదలైనవి ఉంటాయి. వీటితోపాటు ఐబీపీఎస్‌ పీఓ, ఎస్‌బీఐపీఓ మెయిన్స్‌ పరీక్షల్లో, ఎస్‌ఎస్‌సీ-సీజీఎల్‌ టైర్‌-3 పరీక్షలో డిస్క్రిప్టివ్‌ ఇంగ్లిష్‌ ఉంటుంది. దీంట్లో లెటర్‌ రైటింగ్, ఎస్సే రైటింగ్, ప్రెసీ, అప్లికేషన్‌ రైటింగ్‌లు ఉంటాయి. 

రెండు పరీక్షల్లో ఉమ్మడిగా ఉండే వీటిని బాగా ప్రిపేర్‌ అయితే 70-80 శాతం ఉమ్మడి ప్రిపరేషన్‌ పూర్తవుతుంది. ఆయా పరీక్షల్లో అదనంగా ఉన్న సబ్జెక్టులకు తయారైతే రెండు పరీక్షలూ బాగా రాసేయొచ్చు. బీఎస్‌ఐఆర్‌ పరీక్షలన్నీ రాసినప్పుడే ఎక్కువ అవకాశాలకు పోటీపడే వీలుంటుంది. 

ఇలా ఈ సబ్జెక్టులన్నింటికీ ఒక ప్రణాళికతో సిద్ధమవ్వాలి. ఇప్పటికే ఎస్‌ఎస్‌సీ-సీజీఎల్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎస్‌ఎస్‌సీ నిర్వహించే ఇతర పరీక్షల ప్రకటనలూ త్వరలో రాబోతున్నాయి. కాబట్టి వెంటనే సన్నద్ధత మొదలుపెట్టి బాగా కష్టపడితే 2022 సంవత్సరంలోనే ప్రభుత్వోద్యోగం సంపాదించే అవకాశం ఉంటుంది! 


 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

ఎస్‌బీఐ - స్టడీ మెటీరియ‌ల్‌

ఎస్ఎస్‌సీ - స్టడీ మెటీరియ‌ల్‌

ఐబీపీఎస్ - స్టడీ మెటీరియ‌ల్‌

2022లో లక్షకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు - వీడియో

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-01-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌