• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Teacher Jobs: ఉద్యోగం రాని ఉపాధ్యాయ విద్య ఎందుకని!

రాష్ట్రంలో బీఈడీ, డీఈఎల్‌ఈడీకి తగ్గిపోతున్న ఆదరణ 
కన్వీనర్‌ కోటాలో 25 శాతంలోపే సీట్ల భర్తీ
ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ విద్యలోకి ప్రవేశించే అభ్యర్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఒకప్పుడు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఈడీ), డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఎల్‌ఈడీ) సీట్లకు భారీ డిమాండ్‌ ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బీఈడీలో కన్వీనర్‌ కోటా సీట్లలో 20%, డీఈఎల్‌ఈడీలో 25%లోపే సీట్లే భర్తీ అవుతున్నాయి. ఉపాధ్యాయ నియామకాలను ప్రభుత్వాలు ప్రతి ఏటా చేపట్టడం లేదు. ప్రైవేటు పాఠశాలల్లో చేరినా మంచి వేతనాలు లభించడం లేదు. దీంతో బీఈడీ, డీఈఎల్‌ఈడీ చదివేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టులకు గతంలో డీఈఎల్‌ఈడీ వారికి ప్రాధాన్యమిచ్చేవారు. 2020 నుంచి బీఈడీ చేసిన వారికి అవకాశం కల్పించడంతో డిప్లొమా పరిస్థితి మరింత అధ్వానంగా తయారయింది. విద్యార్థులు లేక యాజమాన్యాలు ప్రైవేటు డీఈఎల్‌ఈడీ కళాశాలలను మూసేస్తున్నాయి. బీఈడీ ప్రవేశపరీక్ష రాసి కన్వీనర్‌ కోటాలో చేరే ఏపీ విద్యార్థులు తగ్గిపోతుండటంతో స్పాట్, యాజమాన్య కోటా కింద ఒడిశా, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, బిహార్‌ తదితర రాష్ట్రాల వారిని చేర్చుకుంటున్నారు. 
ఎందుకు ఈ పరిస్థితి?
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలను ప్రతి ఏటా చేపట్టడం లేదు. తెదేపా హయాంలో అయిదేళ్లలో రెండు డీఎస్సీలు వేశారు. 2019లో వైకాపా వచ్చినప్పటి నుంచి ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించలేదు. ఏడాది ఉండే బీఈడీ, డీఈఎల్‌ఈడీ కోర్సులను రెండేళ్లకు పొడిగించడంతో సమయం వృథా అవుతోందని చాలామంది భావిస్తున్నారు. డిగ్రీలో బీఎస్సీ పూర్తి చేసిన వారికి సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తుండటంతో చాలా మంది అటు వెళ్లిపోతున్నారు. బీకాంలాంటి కోర్సులు చేసినవారు అకౌంటెంట్లుగా, మార్కెటింగ్‌ ఉద్యోగాల్లోనూ స్థిరపడుతున్నారు.  
రాష్ట్రవ్యాప్తంగా 2020-21లో 410 బీఈడీ కళాశాలల్లో కన్వీనర్, ఈడబ్ల్యూఎస్‌ కలిపి 27,126 సీట్లు ఉండగా.. ప్రవేశపరీక్షకు 16 వేల దరఖాస్తులే వచ్చాయి. అందులోనూ 3,874 మంది మాత్రమే చేరారు. 
2021-22 సంవత్సరానికి కళాశాలల సంఖ్య 401కి తగ్గిపోయింది. కన్వీనర్‌ కోటాలో 26,256 సీట్లు ఉండగా 13,619 మంది ప్రవేశపరీక్ష రాశారు. 5,421 మంది ప్రవేశాలు పొందారు. ఈ ఏడాది దరఖాస్తుల గడువు ముగిసేసరికి 13,600 దరఖాస్తులు వచ్చాయి. 
రాష్ట్రంలో 745 వరకు డీఈఎల్‌ఈడీ కళాశాలలు ఉండగా.. విద్యార్థులు లేక 2020లో 125 మూతపడ్డాయి. మరో 11 యాజమాన్యాలు స్వచ్ఛందంగా మూసివేశాయి. ప్రస్తుతానికి ప్రైవేటులో 150 కళాశాలలే మిగిలాయి. ఈ ఏడాది కేవలం 20 మాత్రమే అనుమతులు పునరుద్ధరించుకున్నాయి. ఇవి కాకుండా 14 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి.

Posted Date : 18-06-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌