• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కొలువుకు పిలుపా? 

నియామకాల మాటున నకిలీలు

ఉద్యోగ పరిస్థితులు నెమ్మదిగా చక్కబడుతున్నాయి. నియామకాలు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. నియామకాల ప్రకటనల కోసం ఎదురు చూస్తున్నవారికి ఇది శుభవార్తే. పైగా ఈసారి తాజాగా చదువు పూర్తిచేసుకున్నవారితోపాటు, ఉద్యోగాలను కోల్పోయినవారూ పోటీలో ఉన్నారు. దీంతో ఉద్యోగ ప్రకటనల వివరాలు తెలియగానే ఆతృతగా దరఖాస్తు చేసుకునేవారే ఎక్కువ. దీన్ని ఆసరాగా తీసుకుని, మోసాలకు పాల్పడుతున్నవారూ ఉన్నారు. కాబట్టి, అవకాశం అందుకోవాలనే ప్రయత్నంలో హడావుడి పడితే వలలో చిక్కుకున్నట్టే. అడుగు వేసేముందు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి.

కిరణ్‌.. ఎంబీఏ విద్యార్థి. ప్రాజెక్టు సబ్మిషన్‌ అలా పూర్తయి, సర్టిఫికెట్‌ చేతికి రావడమే ఆలస్యం. ఇంతలో లాక్‌డౌన్‌ వచ్చింది. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌కు అవకాశం లేకుండా పోయింది. ఉద్యోగ ప్రయత్నాలకు ఆస్కారం లేదు. దీంతో ముందుగా మంచి రెజ్యూమెను సిద్ధం చేసుకుని, ఉద్యోగాధారిత వెబ్‌సైట్లలో నమోదు చేసుకున్నాడు. తన మెయిల్‌కు ఓ ప్రముఖ సంస్థ నుంచి ఇంటర్వ్యూకు పిలుపు వచ్చింది. సంస్థ పరిచయం, వివిధ పోస్టుల వివరాలు, జీతభత్యాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. అనుభవం అవసరం లేదు. ఇంటర్వ్యూ వేదిక బెంగళూరు. ఇంటర్వ్యూలో మొత్తం మూడు రౌండ్లు (ప్రొఫైల్‌ స్క్రీనింగ్‌ అండ్‌ డాక్యుమెంటేషన్, హెచ్‌ఆర్‌ రౌండ్, మేనేజర్‌ రౌండ్‌). నమోదు ప్రక్రియలో భాగంగా రూ.10,000 కట్టమన్నారు. ఆ మొత్తాన్ని ఇంటర్వ్యూ పూర్తయ్యాక తిరిగి అభ్యర్థికి అందజేస్తామన్నారు. మొత్తం 160 పోస్టులకుగానూ 180 మందిని ఇంటర్వ్యూ నిమిత్తం ఎంపిక చేశారు. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబరు, ఈమెయిల్‌ ఐడీ వివరాలిచ్చారు. మొత్తంగా ఇదీ ఇంటర్వ్యూ కాల్‌ లెటర్‌ సారాంశం.

అసలే ఉద్యోగాలు లేని సమయం. పైగా పేరున్న సంస్థ నుంచి ఇంటర్వ్యూకు పిలుపు వచ్చింది. పోటీపడేవారి సంఖ్యా తక్కువే. జీతభత్యాలు బాగున్నాయి. ఇంటర్వ్యూ సంబంధించిన వివరాలకు హెచ్‌ఆర్‌ ఫోన్‌ చేసి కనుక్కున్నాడు. ఇంటర్వ్యూ ప్రదేశం, ఉద్యోగ నియామకాల వివరాలన్నీ తెలుసుకున్నాడు. దీంతో చెల్లించేది పెద్ద మొత్తంగా భావించలేదు. వెంటనే ఆన్‌లైన్‌లో అడిగిన మొత్తాన్ని చెల్లించేశాడు. తీరా ఇంటర్వ్యూ తేదీనాటికి చెప్పిన సమయానికి వేదికకు చేరితే అక్కడ ఇంటర్వ్యూ ఆనవాళ్లే కనిపించలేదు. హెచ్‌ఆర్‌ నంబరుకు ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో జరిగిన మోసం అర్థమైంది. లాక్‌డౌన్‌ సమయంలో జాబ్‌ మార్కెట్‌లోకి ప్రవేశించబోతూ బ్రేక్‌ పడినవారూ.. ఉద్యోగాలు కోల్పోయినవారూ చాలామంది ఉన్నారు. దీంతో సాధారణంతో పోలిస్తే ఉద్యోగాలకు పోటీపడేవారి సంఖ్య పెరిగింది. ఈ స్థితిలో తాజా అభ్యర్థులతోపాటు అనుభవం ఉన్నవారూ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూ పిలుపు రాగానే తొందర్లో తప్పు చేస్తున్నవారే ఎక్కువ. దీంతో ఉద్యోగం ఊసు లేకపోగా జేబు ఖాళీ చేసుకుంటున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. కొంత పరిశీలన, పరిశోధన అవసరమవుతాయి.

ఇలాంటప్పుడే అనుమానించాలి...

అనుభవం అవసరం లేదు: తాజా గ్రాడ్యుయేట్లను కోరే సంస్థలన్నింటినీ అనుమానించాల్సిన పనిలేదు. కానీ విద్యార్హతలు, హోదాకు సంబంధించి తక్కువ సమాచారం ఇవ్వడం, కావాల్సిన నైపుణ్యాల ఊసే లేకపోతే మాత్రం అనుమానించాల్సిందే.

గొప్ప అవకాశంగా కనిపిస్తే: మంచి ఉద్యోగాలు దొరకడం నిజంగా కష్టం. వాటికోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ ఏమాత్రం కష్టపడకుండా అవే వచ్చి చేరుతున్నాయంటే మాత్రం అనుమానించాల్సిందే.
ఉదాహరణకు- ఇక్కడ అభ్యర్థి దరఖాస్తు చేసుకోవడం ఉండదు. సంస్థ ప్రతినిధులే అభ్యర్థిని సంప్రదిస్తారు. అభ్యర్థి రెజ్యూమె తమకు ఆన్‌లైన్‌లో లభ్యమైనట్లుగా చెబుతారు. నేరుగా ఉద్యోగాన్ని ఆఫర్‌ చేయడమో, ఇంటర్వ్యూకు ఆహ్వానించడమో చేస్తారు. వారి మాట ఉద్యోగం దాదాపుగా ఖాయం అన్నట్లుగానే ఉంటుంది. 

మంచి జీతాలు: ప్రైవేటు సంస్థలకు సంబంధించి చాలావరకూ అభ్యర్థి నైపుణ్యాలను అంచనా వేశాకే జీతభత్యాలను నిర్ణయిస్తాయి. అలాగని జీతాలను ముందుగానే వెల్లడించిన సంస్థలన్నీ బోగస్సే అని నమ్మాల్సిన పనిలేదు. కానీ.. ఉదాహరణకు- తాజా అభ్యర్థులకు పెద్ద మొత్తంలో జీతం ఆఫర్‌ చేసే సంస్థలు చాలా అరుదు. తాజా గ్రాడ్యుయేట్లు ఏడాదికి కోట్ల రూపాయల జీతంతో ఎంపికయ్యాడు అని విన్నా, వార్తాపత్రికల్లో చదివినా అక్కడా విద్యార్థిని అర్హతలు, నైపుణ్యాలు అంచనా వేశాకే సంస్థలు జీతభత్యాలను నిర్ణయిస్తాయి. కాబట్టి, ఈ విషయంగా ఆలోచించాల్సిందే.

నగదు సంబంధిత లావాదేవీలు: సంస్థ ఏదైనా అభ్యర్థిని ఎంచుకునేటప్పుడు వారికి జీతమిచ్చి పనిచేయించుకోవాలనుకుంటుందే తప్ప ఎదురు డబ్బులివ్వమని అడగదు. అలా అడిగితే అనుమానించాల్సిందే. ఇంకొందరు తమ నుంచి ఏదైనా సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయమనో, పరికరాలు, ఇన్సూరెన్స్, శిక్షణ నిమిత్తం అని అడుగుతుంటారు. అభ్యర్థిని కనీసం చూడకుండానే ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేయాల్సిందిగా అడుగుతుంటారు. కాబట్టి, గమనించుకోవాలి. అలాగే ఏ సంస్థా అభ్యర్థి బ్యాంకు, కార్డు (డెబిట్‌/ క్రెడిట్‌) వివరాలను అడగదు. 

జాబ్‌ డిస్క్రిప్షన్‌: స్కామర్లు మోసం చేయడాన్నీ చాలా తెలివిగా చేస్తున్నారు. అందుకే ఎక్కువమంది మోసపోవడానికి కారణమవుతోందనేది నిపుణుల మాట. అందుకే జాబ్‌ డిస్క్రిప్షన్‌ను చేర్చుతున్నారు. కానీ గమనించాలి కానీ దానిలోనూ లోపాలు కనిపిస్తాయి.
ఉదాహరణకు- అభ్యర్థిని ఇంటర్వ్యూకు ఎంపిక చేశామని చెప్పారంటేనే ప్రత్యేకంగా ఏ విభాగానికి సంబంధించో వారికి అవగాహన ఉంటుంది. అలా కాకుండా వివిధ ఉద్యోగాల జాబితా మాత్రమే ఇచ్చి ఊరుకోవడమో, లేదా ఎవరైనా దరఖాస్తు చేసుకునేలా ఉన్నా అనుమానించాల్సిందే. వీటిలో దాదాపుగా ప్రత్యేకమైన విద్యార్హతలు, అనుభవాల ఆనవాళ్లు ఉండవు. ప్రత్యేకంగా ఒక హోదాకి ఎంపిక చేసేటపుడు సంస్థలకు తమ అభ్యర్థి నుంచి ఆశించే నైపుణ్యాలపై పూర్తి అవగాహన ఉంటుంది. అలా కాకుండా వయసు, సిటిజన్, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఇలా సాధారణంగా అడిగే నైపుణ్యాలే ఉంటే.. ఒకసారి ఆగి ఆలోచించుకోవాలి.

చిన్న చిన్న పొరపాట్లు: సంస్థలు తమ నుంచి వెళ్లే ప్రతి డాక్యుమెంట్‌నూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి. చేసే చిన్న పొరపాటు సంస్థ ప్రతిష్ఠకు భంగంగా భావిస్తారు. అందుకే ఈ విషయంగా నైపుణ్యం ఉన్నవారిని ఎంచుకుంటారు. కాబట్టి, సంస్థ పంపే ఈమెయిల్‌లో పొరబాట్లకు ఆస్కారం ఉండదు. అందుకున్న ఇంటర్వ్యూ కాల్‌ లెటర్‌లో సంస్థ ఈమెయిల్, కాంటాక్ట్‌ వివరాలు లేకపోవడం, హెచ్‌ఆర్‌ ఈమెయిల్, మొబైల్‌ నంబరుకు మాత్రమే పరిమితమవడం, స్పెల్లింగులు, విరామ చిహ్నాలను తప్పుగా ఉపయోగించడం, వ్యాకరణ పరంగా దోషాలు- ఇవన్నీ సంస్థ నకిలీదనే విషయాన్ని పట్టిస్తాయి. సాధారణంగా ఇంటర్వ్యూపరంగా కాల్‌ అందుకున్నపుడు సంస్థలు అభ్యర్థికి అనుకూలమైన సమయాన్ని అడుగుతాయి. అతను చెప్పిన సమయం ఆధారంగా ఇంటర్వ్యూ నిర్వహిస్తుంటాయి. ఇది ఫోన్‌ కాల్‌ ఇంటర్వ్యూలో సాధారణంగా జరిగే పరిణామం. ఇంటర్వ్యూకు ఎంపికైన విషయాన్ని తెలియజేసే ఉద్దేశమైతే పనివేళల్లోనే (సాధారణంగా ఉదయం 8 నుంచి సాయంత్రం 7గం.లోపు) కాల్‌ చేస్తారు. మరీ ఉదయాన్నే లేదా రాత్రివేళల్లో వచ్చినా అనుమానించొచ్చు.

మోసాల బారిన పడకుండా...

ఉద్యోగ వివరాలు ఆసక్తికరంగా అనిపిస్తే లోతైన పరిశోధన చేయాలి. సంస్థ, అక్కడ పనిచేసే ఉద్యోగుల గురించి తెలుసుకోవాలి. హెచ్‌ఆర్‌ వివరాలు ఉంటే వాటిని సంస్థ వెబ్‌సైట్‌లో వెతకడం లాంటివి చేయాలి. లింక్‌డిన్‌ సాయమూ తీసుకోవచ్చు. అవసరమైతే సంస్థ వెబ్‌సైట్‌లో ఉంటే అధికారిక ఈ-మెయిల్‌కు మెయిల్‌ చేయడం ద్వారా కూడా ధ్రువీకరించుకోవచ్చు.

సంస్థ పేరుతో గూగుల్‌లో వెతకొచ్చు. సంస్థకు సంబంధించి ఏ వివరాలు వస్తున్నాయో గమనించుకోవాలి. కంపెనీ పేరుకు స్కాంను జోడించి వెతికినా అంతకుముందు ఏవైనా మోసాలు జరిగియేమో తెలుస్తుంది. చాలావరకూ స్కామర్లు అసలు సంస్థల లోగోలనూ ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటప్పుడు ఉద్యోగ వివరాలతో సెర్చ్‌ చేయొచ్చు. ఇక్కడ ఉద్యోగ ప్రదేశం, అందించే జీతాల వివరాలనూ గమనించాలి. ఏమైనా ఫీజులు వగైరా వసూలు చేస్తున్నారేమో కూడా చెక్‌ చేసుకోవాలి.

తెలిసినవారు, బంధువుల్లో ఎవరైనా సంస్థలో పనిచేస్తున్నారేమో తెలుసుకుని, వారి ఆధారంగా సమాచారాన్ని పొందొచ్చు. ఎవరూ తెలిసినవారు లేకపోతే సంస్థ పేరుతో లింక్‌డిన్‌లో వెతకొచ్చు. వారితో మాట్లాడటం ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.  

Posted Date : 10-11-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌