• facebook
  • twitter
  • whatsapp
  • telegram

స‌వాళ్ల కాలంలో స‌రిపోయే కెరియ‌ర్‌!

కొత్త అవ‌కాశాలు అందుకోవాలంటే మెరుగైన ప్ర‌ణాళిక అవ‌స‌రం

కొవిడ్‌  ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులను తీసుకొచ్చింది. డిమాండ్‌ ఉన్న కోర్సులు వెలవెలబోయేలా చేసింది. ఢోకా లేదనుకున్న ఉద్యోగాలను దూరం చేసింది. కొన్ని పరిశ్రమలు మూత  బడగా కనుమరుగైనవి ఇంకొన్ని. ఇది పరిస్థితికి ఒక కోణమైతే.. రెండోవైపు కొత్త కెరియర్‌లు పుట్టుకొచ్చాయి. కొత్త అవకాశాలూ ముందుకొచ్చాయి. వీటిని అందుకోవాలంటే.. వేసుకున్న కెరియర్‌ ప్రణాళికలను ఒకసారి సరిచూసుకోవాలి. కొత్త మార్గాలనూ గమనించుకోవాలి!

2020-21 సంవ‌త్స‌రంలో విద్యార్థులు నేర్చుకున్న నైపుణ్యాల‌కూ సంస్థ‌లు కోరుకున్న నైపుణ్యాల‌కూ మ‌ధ్య ఉన్న వ్య‌త్యాసాన్ని విశ్లేషిస్తూ ఈ లెర్నింగ్ వేదిక ఇంట‌ర్న్‌శాల కొన్ని ఆసక్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించింది.

సృజన.. ఇంటర్‌ తాజాగా పూర్తిచేసింది. పాఠశాల స్థాయి నుంచే భవిష్యత్తులో ఎంచుకోబోయే కెరియర్‌ను నిర్ణయించేసుకుంది. కానీ కొవిడ్‌ పరిణామాలతో తన ఆశలు ఆవిరయ్యాయి. ఉజ్వలమైన భవిష్యత్‌ ఉంటుందనుకున్న రంగం కుదేలయింది. ఇప్పుడు ఏం చేయాలా అన్న ఆలోచనలో పడింది.

గౌరవ్‌.. కళాశాల చదువు పూర్తవడంతోనే ఉద్యోగంలో చేరిపోయాడు. అయిదంకెల జీతం. ఈఎంఐతో ఇల్లూ, కారూ సమకూర్చుకున్నాడు. లాక్‌డౌన్‌లో ఉద్యోగమైతే కోల్పోలేదు కానీ.. లేఆఫ్‌లు తప్పలేదు. జీతంలోనూ కోత. వేసుకున్న ఆర్థిక ప్రణాళికలన్నీ ఛిన్నాభిన్నమయ్యాయి.

కొవిడ్‌ మొదటి వేవ్‌ విద్యార్థులూ, ఉద్యోగార్థులూ, ఉద్యోగులూ.. అందరిపైనా ప్రభావం చూపింది. ఆలోచనలు, ప్రణాళికలు అన్నింటినీ తారుమారు చేసింది. సద్దుమణిగిందనుకున్న పరిస్థితిని  ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ మరింత జటిలం చేస్తోంది. దీన్ని తట్టుకుని, భవిష్యత్‌లో ముందుకు సాగాలంటే అందుకు తగ్గట్టుగా సన్నద్ధమవ్వాలి. అందుకు ఏం చేయాలి?

తాజా గ్రాడ్యుయేట్లు 

వీరికి ఉన్నతవిద్య, ఉద్యోగం రెండు అవకాశాలూ ఉంటాయి. ఎంచుకున్న మార్గం ఏదైనా రెండు అంశాలపై దృష్టిపెట్టడం మాత్రం తప్పనిసరి.

1. నేర్చుకోవడం: సమయానికి అనుగుణంగా కొత్తవాటిని నేర్చుకోవడం, వాటిని నిజజీవితంలో ఉపయోగించడం ఇక్కడ ప్రధానం. అలాగే అవసరం లేనివాటిని అన్‌లర్న్‌ చేయడమూ తెలియాలి.

2. నైపుణ్యాలు: భావప్రకటన, సమస్యా పరిష్కారం, క్రిటికల్‌ థింకింగ్, సమాచార సేకరణ, బృందంతో పనిచేయడం మొదలైనవాటిని ఈ దశాబ్దపు నైపుణ్యాలుగా పరిగణిస్తున్నారు. వాటిని చేజిక్కించుకోగలగాలి.

‣ లక్ష్యం ఉన్నతవిద్య అయితే.. ఏమిటి, ఎక్కడ చదవాలన్న ప్రశ్నలు ఎదురవుతాయి. ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా దూర ప్రాంతాల్లో చదువులు కొంత సమస్యే. కాబట్టి, రిమోట్‌ లర్నింగ్‌పై దృష్టిపెట్టొచ్చు. ఇప్పుడు ఎన్నో దేశ విదేశీ సంస్థలు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నాయి. మీరు ఎంచుకున్న సంస్థా ఆన్‌లైన్‌ అవకాశం కల్పిస్తే అందుకోవడం మేలు. అయితే ఇక్కడా ఎంచుకున్న కోర్సుకు ఉన్న ఆదరణ, భవిష్యత్‌లో కల్పించే ఉద్యోగావకాశాల గురించి చూసుకోవాలి. ఆసక్తి మాత్రం ఉండి, అవకాశాలు లేకపోతే మరో ఆప్షన్‌ను ఎంచుకోవాల్సిందే.

‣ ఉద్యోగం లక్ష్యమైతే.. వెంటనే ఉద్యోగ వేటలో పడిపోకండి. ముందుగా ఏ పరిశ్రమలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో దానికి అవసరమైన నైపుణ్యాలు మీలో ఉన్నాయో లేదో చూసుకోండి. లేనివాటిని మెరుగుపరుచుకోండి. కొవిడ్‌ దానిపై చూపిన ప్రభావాన్ని అంచనా వేయండి. అంటే.. ఉద్యోగుల తొలగింపు, జీతాల్లో కోత, లేఆఫ్‌లు వంటివి ఏమైనా ఉన్నాయేమో పరిశీలించుకోండి. భవిష్యత్‌ పరిస్థితుల్లో తట్టుకుని నిలవగలదో లేదో కూడా చూసుకోవాలి. తట్టుకుంటుందీ అనుకున్నప్పుడే ఉద్యోగ ప్రయత్నానికి సిద్ధం కండి. రెజ్యూమె, కవర్‌ లెటర్‌లను అందుకు తగ్గట్టుగా సిద్ధం చేసుకోండి. పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా మీ నైపుణ్యాలు ఉన్నాయనిపించేలా వాటిని సిద్ధం చేసుకోవాలి. వీటిల్లో అనుకున్న విధంగా లేవనిపిస్తే.. వేరే కెరియర్‌కు ప్రయత్నించడమో, తగ్గ నైపుణ్యాలను నేర్చుకోవడమో ప్రారంభించాలి. ఆపైనే ఉద్యోగం గురించి ఆలోచించాలి. ఇది సమయం వృథా చేసేదేమీ కాదు. పైగా రెజ్యూమెకు అదనపు విలువ చేకూర్చేదే.

ఉద్యోగులు 

కొవిడ్‌ ప్రతికూల ప్రభావం బాగా పడినవారిలో వీరూ ఒకరు. ఉద్యోగాలే కోల్పోయినవారు కొందరైతే.. లేఆఫ్‌లు వంటివి ఎదుర్కొన్నవారు ఇంకొందరు. కారణం ఏదైనా రెండు సందర్భాల్లోనూ ఉద్యోగ భరోసానే సమస్య. వీరు ప్రయత్నించదగ్గవాటిల్లో కెరియర్‌ మార్పు ఒకటి. ఇది  పెద్ద నిర్ణయం కాబట్టి, ఆచితూచి అడుగులు వెయ్యాలి. 

ఆసక్తి లేకపోవడం, ఉద్యోగావకాశాలు తక్కువగా ఉండటం, అభివృద్ధికి అవకాశాలు లేకపోవడం.. ఇలా ప్రతి కారణాన్నీ జాబితాగా రాసిపెట్టుకోవాలి. ప్రస్తుత పరిస్థితి ఆధారంగానే నిర్ణయానికి రావొద్దు. భవిష్యత్‌లో కొన్నేళ్లపాటు మెరుగ్గా ఉంటుందో లేదో కూడా చూసుకోవాలి. కొంత పరిశోధన చేస్తే ఈ వివరాలను తెలుసుకోవడం అంత కష్టమేమీ కాదు. ఇంటర్నెట్‌ సమాచారం, ప్రభుత్వ ప్రచురణలు ఇందుకు సాయపడతాయి. ఆ రంగంలోని వ్యక్తులు, మీ గురించి బాగా తెలిసిన వారితోనూ ఈ విషయంలో సంప్రదించవచ్చు. సంబంధిత రంగ నిపుణులు మార్గనిర్దేశం చేయడానికి సాయపడతారు. మీ గురించి బాగా తెలిసినవారి సాయమూ కోరొచ్చు. పరిశ్రమ కోలుకుంటుందన్న నమ్మకం ఉంటే.. ఖాళీ సమయంలో ఆసక్తి ఉన్న వేరే దాన్నీ ప్రయత్నించవచ్చు. కొత్త  కెరియర్, వ్యాపారం.. ఇలా ఏది చేసినా మంచిదే!

విద్యార్థులు 

‣ ఏ విధంగా?: ఆసక్తి, ఆకర్షణ.. ఈ రెండిట్లో దేని ఆధారంగా కెరియర్‌ను ఎంచుకుంటున్నారో గమనించుకోవాలి. దాని ద్వారా వచ్చే లాభాలు, పేరు ప్రఖ్యాతులను చూసి ఎంచుకోవాలనుకోవడం ఆకర్షణ. మనస్ఫూర్తిగా మెచ్చి, దాని గురించి లోతుగా తెలుసుకుని, ఆ రంగంలో ఏదో ఒకటి సాధించాలనుకుంటే అది ఆసక్తి. ఆకర్షణ సమయాన్నిబట్టి మారొచ్చు. కాబట్టి, ఆసక్తికి ప్రాధాన్యమివ్వాలి. కేవలం పరిచయం ఉన్న/ బాగా తెలిసిన వాటికే ప్రాధాన్యం ఇవ్వొద్దు. ముందుగా అర్హత ఆధారంగా అందుబాటులో ఉన్న అన్ని రకాల కోర్సుల గురించి తెలుసుకోవాలి. కొన్ని అసలు పరిచయం లేకపోవచ్చు. ఉదా: ఇప్పుడు వైరాలజీ, ఇమ్యునాలజీ, జెనెటిక్స్, కొత్త టెక్నాలజీలకు ఆదరణ పెరుగుతోంది. ఇలా అన్నింటి గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఒక్కోసారి ఇలాంటివి లోతుగా తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగిస్తాయి. ఇలా అనిపించిన వాటన్నింటినీ ఒక జాబితాగా రాసుకోవాలి. 

‣ సామర్థ్యం ఉందా?: ఒక కెరియర్‌లో విజయం సాధించడానికి ఆసక్తి మాత్రమే కూడా సరిపోదు. అది తమకు నప్పుతుందో లేదో; స్వభావానికి తగినదో కాదో కూడా చూసుకోవాలి. ఎందుకంటే.. మీకు ఫైనాన్స్‌ అంటే ఆసక్తి అనుకుందాం. కానీ లెక్కలు ఒక పట్టాన అర్థం కావు. అలాంటప్పుడు దాన్ని కెరియర్‌గా ఎంచుకోవడం మంచిది కాదు. ఇందుకు సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ టూల్స్‌ సాయం తీసుకోవచ్చు. ఇవి రెండు విధాలుగా.. విద్యార్థి తన గురించి తాను తెలుసుకోవడానికీ, తను చదివిన/ తనకు పట్టున్న అంశాల ఆధారంగా కెరియర్ల గురించి అవగాహన తెచ్చుకోవడానికీ సాయపడతాయి.

‣ అవకాశాలెలా?: ఆసక్తి, చదవగలిగే సామర్థ్యం ఉన్నాయి. సరే! మరి ఉపాధీ ఉండాలిగా! దాన్నీ చూసుకోవాలి. ప్రస్తుత పరిస్థితినే తీసుకోండి. ఎంతో మంచి ఉద్యోగాలు, జీతభత్యాలు ఇవ్వగలిగే సంస్థలూ తమ ఉద్యోగులను తొలగించాయి. ఎంతోమంది లేఆఫ్‌లను ఎదుర్కొన్నారు. కారణం- వాటిపై పడిన ఆర్థిక ప్రభావమే. ఇప్పటికీ ఇంకొన్ని రంగాలు పరిస్థితి చక్కబడటం కోసం ఎదురు చూస్తున్నాయి. కాబట్టి, ఎలాంటి పరిణామం ఎదురైనా తట్టుకోగలిగినవాటికే ప్రాధాన్యం ఇవ్వాలి. కొన్నేళ్లపాటు ఉపాధికి ఢోకా ఉండదనుకున్నవాటినే ఎంచుకోవాలి.

Posted Date : 05-05-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌