• facebook
  • twitter
  • whatsapp
  • telegram

AP High Schools: తరగతుల విలీనం.. విద్యార్థులపై ప్రభావం

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో మూడు, నాలుగు, ఐదు తరగతుల విలీన ప్రభావం పేద విద్యార్థుల చదువుపై పడనుంది. కొత్తగా కిలోమీటరు పరిధిలోని ఎంపీపీ పాఠశాలల నుంచి ఆయా తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలిపారు. ఇప్పటికే సరిపడా తరగతి గదులు లేక ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అదనంగా విలీనమైన తరగతుల విద్యార్థులు చేరితే గదుల కొరత, వసతుల లేమి వేధించనుంది. విద్యార్థుల సంఖ్య ప్రకారం ఉపాధ్యాయుల ఖాళీలను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. చిన్నారులు సమీప బడికి కాకుండా... దూరంగా ఉండే ఉన్నత పాఠశాలకు రాకపోకలు సాగించడం ఇబ్బందికరమని, ఫలితంగా డ్రాపవుట్స్‌ పెరుగుతాయని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్బందులెన్నో..
ఎన్టీఆర్‌ జిల్లాలో కిలోమీటరు పరిధిలోని 132 ఎంపీపీ పాఠశాలలు, ఆరు ఎంపీయూపీ పాఠశాలల్లో మూడు, నాలుగు, ఐదు తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వల్ల బోధనకు ఆటంకం ఏర్పడనుంది. గతంలో ఎంపీపీ పాఠశాలలను యూపీ పాఠశాలలుగా, యూపీ పాఠశాలలను ఎనిమిదో తరగతి వరకు వర్గోన్నతి చేశారు. ఫలితంగా విద్యార్థులు ఎనిమిదో తరగతి పూర్తయ్యే వరకు ఒకే పాఠశాల వాతావరణంలో ఒత్తిడి లేని విద్య అభ్యసించేవారు. తాజాగా మూడు, నాలుగు, ఐదు తరగతుల విలీనం వల్ల కొందరు పిల్లలు బడికి రాని పరిస్థితి ఎదురవుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంగ్ల మాధ్యమంతో..
జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ)-2020 అమలులో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి 1 - 8 తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయనున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇప్పటివరకు మాతృ భాషలో బోధనకు అలవాటు పడ్డారు. ఒక్కసారిగా అన్ని తరగతులకు ఆంగ్ల మాధ్యమం అమలు వల్ల విద్యార్థులు ఇబ్బంది పడతారని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ప్రభుత్వం పాఠ్య పుస్తకాలను తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ముద్రించినా బోధన పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో సాగుతుంది. దీనిపై ఆన్‌లైన్లో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులను కూడా ప్రారంభించారు.
దశల వారీగా...
ఈ ఏడాది కిలోమీటరు పరిధిలోని తరగతులను విలీనం చేశారు. దశల వారీగా వచ్చే ఏడాది రెండు కిలోమీటర్లు, ఆపై సంవత్సరం 3 కి.మీ.పరిధిలోని ఎంపీపీ పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు. దీనివల్ల ప్రాథమిక పాఠశాలలు మూతపడనున్నాయి. ఉన్న ఎంపీపీ పాఠశాలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మిగిలే అవకాశం ఉంది. 40 కంటే తక్కువ విద్యార్థులున్న ఎయిడెడ్‌ పాఠశాలలను రద్దు చేశారు. నందిగామ మండలంలోని రాఘవాపురం సీఎస్‌ఎస్‌, కమ్మవారిపాలెం ఆర్సీఎం, రామిరెడ్డిపల్లి ఆర్సీఎం, నందిగామ డీబీహెచ్‌ బాలురు, బాలికల ఉన్నత పాఠశాలలను రద్దు చేశారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువులు దూరాభారం కానున్నాయి. గతంలో మాదిరిగానే పాఠశాలలు నిర్వహించాలని తల్లిదండ్రులు, విద్యావేత్తలు కోరుతున్నారు.
సౌకర్యాలున్న బడుల్లోనే విలీనం: సీవీ రేణుక, డీఈవో, ఎన్టీఆర్‌ జిల్లా
మౌలిక వసతులున్న ఉన్నత పాఠశాలల్లోనే మూడు, నాలుగు, ఐదు తరగతులను విలీనం చేశాం. ఉన్నత పాఠశాలల్లోని ల్యాబ్‌లు, గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రేషనలైజేషన్‌ చేస్తాం. దాని ప్రకారం ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తాం.

Posted Date : 18-06-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌