• facebook
  • twitter
  • whatsapp
  • telegram

క్యాట్‌ టాపర్లు ఏం చెప్తున్నారు?

క్యాట్‌ - 2020 విజేతల సూచనలు

మెరుగైన స్కోరు కోసం గణితం, ఆంగ్లం సబ్జెక్టులపై పట్టు అవసరమంటున్నారు కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌) -2020 టాపర్లు. ఉద్యోగం చేస్తూనే చదువుకుంటూ వీరు 99 శాతానికిపైగా పర్సంటైల్‌ సాధించగలిగారు! కొవిడ్‌ దృష్ట్యా గత ఏడాది వివిధ మార్పులు చేసి ఆన్‌లైన్‌లో క్యాట్‌ను నిర్వహించారు. ఈసారీ అదే విధానం కొనసాగే వీలుంది. పరీక్ష ఏ పద్ధతిలో జరిగినా.. పక్కా ప్రణాళిక, వ్యూహాలు  అనుసరిస్తే మంచి స్కోరుకు ఆస్కారముంటుంది. అందుకు అనుసరించాల్సిన పద్ధతులపై క్యాట్‌-2020 విజేతల సూచనలు.. వారి మాటల్లోనే! 

వెర్బల్‌పై అధిక దృష్టి పెట్టా!  

- పవన్‌ కృష్ణారెడ్డి (99.96 పర్సంటైల్‌)

కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు 96, 97 పర్సంటైల్‌ వచ్చేందుకు తర్ఫీదు ఇస్తారు. ఆపై మనం మరింత పట్టు సాధిస్తే 99కు పైగా సాధించవచ్చు.

ఇది నా రెండో ప్రయత్నం. మొదటిసారి 2019లో క్యాట్‌ రాశాను. అప్పట్లో 97.61 పర్సంటైల్‌ సాధించాను కానీ దేశంలో టాప్‌ ఐఐఎంల్లో సీటు సాధించాలంటే ఆ స్కోరు సరిపోదు. అందుకే మరోసారి రాశాను. రెండో ప్రయత్నంలో కిందటి ఏడాది మే నుంచి నా సన్నద్ధత మొదలైందని చెప్పాలి. లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కువ సమయం ప్రాక్టీస్‌ చేసేందుకు వీలైంది. పరీక్ష నిర్వహణ ఆలస్యం కావడంతో ప్రిపరేషన్‌కు సమయం ఎక్కువగా లభించింది. 

నాకు చిన్నప్పట్నుంచీ గణితంపై ఆసక్తి ఎక్కువ. మంచి పట్టు ఉంది. అందుకే గణితంలో సమస్యల సాధనకు సమయం కేటాయిస్తూనే, ఎక్కువగా వెర్బల్‌ (ఇంగ్లిష్‌)పై దృష్టి పెట్టాను. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ వ్యాసాలు ఎక్కువగా చదివేవాణ్ని. వాటిపై ఎక్కువ ఆసక్తి కనబరచడంతో ఎంతసేపు చదివినా బోర్‌ కొట్టేది కాదు. దీంతో ఎక్కువ సమయం ఏకాగ్రతతో చదివాను. వ్యాసాలు వేగంగా చదవడం, సులువుగా అర్థం చేసుకునేందుకు వీలయ్యేది. ఇక గణితంలో ఎక్కువగా లాజికల్‌ రీజనింగ్‌పై ఫోకస్‌ చేశాను ఇందుకు సుడోకు లాంటి పజిల్స్‌ ఎక్కువగా నింపేవాణ్ని.

క్యాట్‌ కోసం సన్నద్ధమయ్యే ప్రతి విద్యార్థీ మాక్‌టెస్టులు ఎక్కువగా రాసేందుకు ప్రయత్నించాలి. దీనివల్ల పరీక్ష విధానం, ప్రశ్నల సరళితోపాటు సమయపాలనపై పట్టు సాధించే వీలుంటుంది. నేను ఎక్కువగా మాక్‌టెస్టులు రాసేందుకు ప్రాధాన్యం ఇచ్చా. నిర్దేశిత సమయంలోగా టెస్టు పూర్తిచేసేలా ప్రాక్టీసు చేసేవాణ్ని. మాక్‌టెస్టులు ఎక్కువగా రాయడం వల్ల ప్రధానంగా ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నామో తెలుసుకునే వీలుంటుంది. వాటిని సరిదిద్దుకుని ప్రయత్నిస్తే మంచి పర్సంటైల్‌ సాధించవచ్చు. నేను మొత్తంగా 20 మాక్‌టెస్టులు రాశాను. అలాగే అంశాల (టాపిక్‌) వారీగా టెస్టులు రాశాను. .

రోజూ 4-5 గంటలు ప్రాక్టీసు చేశాను. మాక్‌ టెస్టులు రోజూ వారీగా కాకుండా నాకు ఆసక్తి ఉన్నప్పుడల్లా రాసేవాణ్ని. 

పరీక్ష కోసం ప్రత్యేకంగా రిఫరెన్సు పుస్తకాలు ఎక్కువగా ఉండవు. లాజికల్‌ రీజనింగ్‌ కోసం అరుణ్‌శర్మ పుస్తకాలు ప్రాక్టీసు చేశా. కోచింగ్‌ సెంటర్ల వద్ద ఇచ్చే టెస్టు పేపర్లు, మెటీరియల్‌ తీసుకుని సాధన చేస్తే సరిపోతుంది. ఇంగ్లిష్‌ కోసం వ్యాసాలు ఎక్కువగా చదివి అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. నేను మాత్రం ఎలాంటి కోచింగ్‌ తీసుకోలేదు. కానీ సెంటర్లు ఇచ్చే టెస్టు పేపర్లు, మెటీరియల్‌ సేకరించి ప్రాక్టీస్‌ చేశాను. 

ఏది కష్టమని భావిస్తే దానిపై దృష్టి పెడితే మంచిది. ముందుగా ప్రాథమికాంశాలపై పట్టు సాధించాలి. అప్పుడు సులువుగా టెస్టులు రాయవచ్చు. కాన్సెప్టులపై పట్టు రాకుండా నేరుగా ప్రశ్నల సాధన కోసం ప్రయత్నించడం మంచిది కాదు.

మాక్‌ టెస్టులు చాలా రాశా!  

- ఎన్‌.సౌజన్య (99.03 పర్సంటైల్‌)

లాజికల్‌ రీజనింగ్‌లో ఏ ప్రశ్నలు వస్తాయో ముందుగా ఊహించలేం కాబట్టి అందుబాటులో ఉన్న ప్రశ్నలు ఎక్కువగా ప్రాక్టీసు చేయాలి. 

తొలుత 2019లో క్యాట్‌ రాశాను. అప్పట్లో పరీక్ష పరంగా అంశాలు సమగ్రంగా తెలుసుగానీ ప్రాక్టీసు సరిపోలేదనిపించింది. అందుకే పర్సంటైల్‌ తక్కువ కావడంతో 2020లోనూ రాయాలని ముందే నిర్ణయించుకున్నా. దానికి తగ్గట్టుగా గత ఏడాది మార్చి నుంచే ప్రాక్టీసు మొదలుపెట్టా. నవంబరు (పరీక్ష తేదీ) వరకు అది కొనసాగింది. గతంతో పోలిస్తే ఈసారికి గణితంపై మరింత పట్టు సాధించాను. ప్రాక్టీసు ఎక్కువగా చేశా. లాజికల్‌ రీజనింగ్, ఇంగ్లిష్‌లపై ఎక్కువగా దృష్టి పెట్టా. సమయపాలన పాటిస్తూ పరీక్ష రాయడం కోసం ఎక్కువగా ప్రాక్టీసు చేశా. 

ఉద్యోగం చేస్తూనే పరీక్షకు ప్రిపేర్‌ అయ్యా. ప్రొఫెసర్‌ శరత్‌ సర్‌ ఉదయం 6- 9.30 గంటల వరకు ఆన్‌లైన్‌ బోధించారు. తర్వాత ఆఫీస్‌ పని ఉండేది. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో గంటపాటు మళ్లీ క్యాట్‌ కోసం ప్రాక్టీసు చేసేదాన్ని. తర్వాత రాత్రి 8 గంటలకు ఆఫీసు విధులు ముగించుకుని మళ్లీ క్యాట్‌ కోసం సన్నద్ధమయ్యా. ఇలా రోజూ రమారమి 6 గంటలపాటు నా సన్నద్ధత సాగేది. తొలుత 2019లో జనవరి నుంచి నవంబరు వరకు ప్రిపేపర్‌ అయ్యా. తర్వాత గత సంవత్సరం మార్చి నుంచి మళ్లీ సీరియస్‌గా సన్నద్ధమయ్యా. 

ప్రిపరేషన్‌ మొదలుపెట్టిన నాలుగు నెలలకు సిలబస్‌ పూర్తయ్యింది. అప్పట్నుంచి సెక్షన్‌ వారీగా టెస్టుపేపర్లు రాశాను. ప్రతి మూడు, నాలుగు రోజులకోసారి ఉదయం మాక్‌టెస్టులు రాసి, సాయంత్రం ఆఫీసు పని అయ్యాక టెస్టు పరంగా ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునేదాన్ని. 

క్యాట్‌-2020లో పరీక్ష విధానంలో జరిగిన మార్పులకు తగ్గట్టుగానే ప్రిపరేషన్‌ సాగించాను. పాత పరీక్ష పద్ధతి ప్రకారం 9 మాక్‌టెస్టులూ; కొత్త పద్ధతి ప్రకారం దాదాపు 20 మాక్‌టెస్టులూ రాశాను. 

పాత, కొత్త పద్ధతుల మధ్య పెద్దగా తేడాలు లేవనే చెప్పాలి. కానీ కొత్త పద్ధతిలో సమయం తగ్గడం వల్ల లాజికల్‌ రీజనింగ్‌కు సమయం సరిపోదని ముందు అనుకున్నా. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, వెర్బల్‌ సెక్షన్‌ పరంగా మాత్రం సమయపరంగా ప్రభావం ఉండదనుకున్నా. అందుకే ముందునుంచీ లాజికల్‌ రీజినింగ్‌పై పట్టు సాధించేలా ప్రిపేర్‌ అయ్యా. పరీక్ష సమయం తగ్గినప్పటికీ, ప్రశ్నలు కూడా తగ్గడంతో ఇబ్బంది అనిపించలేదు.

గణితంపై పెద్దగా పట్టు లేకున్నా ఏడాది మొదటి నుంచి దృష్టి పెట్టి నేర్చుకుంటే పట్టు సాధించడం సులువే. వెర్బల్‌ (ఆంగ్లం)లో ఎక్కువగా విద్యార్థులు ఇబ్బంది పడుతుంటారు. చదవడం ఎక్కువగా ప్రాక్టీసు చేయాలి. నిత్యం వ్యాసాలు చదవాలి. 

లాజికల్‌ రీజనింగ్‌ పరంగా అరుణ్‌శర్మ పుస్తకాలు చదివాను. జీఆర్‌ఈ, జీ-మ్యాట్‌ మెటీరియల్‌ చదివా. అలాగే కెరియర్‌ లాంచర్, టైమ్‌ టెస్ట్‌ సిరీస్‌ పేపర్లు ఎక్కువగా ప్రాక్టీసు చేశాను.

- అమరేంద్ర యార్లగడ్డ (ఈనాడు - హైదరాబాద్)
 

Posted Date : 06-01-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌