• facebook
  • twitter
  • whatsapp
  • telegram

విజ‌య‌సాధ‌న‌కు విజేత‌ల వ్యూహాలు!

సీఎంఏ ర్యాంక‌ర్ల సూచ‌న‌లు 

సీఎంఏ ఫైనల్‌ పరీక్షలో అఖిలభారత స్థాయి అత్యుత్తమ ర్యాంకులను సాధించటం అద్భుతమైన విజయం. దాన్ని సాధించారు తెలుగు విద్యార్థులు.. నిఖిల్, భార్గవిలు. సీఎంఏతో   పాటు సీఏ చదవటం వీరి ప్రత్యేకత! తమ సన్నద్ధతను వీరెలా సాగించారు? ఏ వ్యూహం  అనుసరించారు? వారి మాటల్లోనే తెలుసుకుందాం!

ప్రాథమిక అంశాలపై పట్టు

ఇద్దే నిఖిల్‌ కుమార్‌రెడ్డి  

ఇంటర్మీడియట్‌ (ఎంఈసీ): 973 మార్కులు.  

సీఎంఏ- ఫౌండేషన్‌: 332 మార్కులు (ఆలిండియా 3వ ర్యాంకు).

సీఎంఏ-ఇంటర్‌: 569 మార్కులు (ఆలిండియా 11వ ర్యాంకు). 

సీఎంఏ-ఫైనల్‌: 732 మార్కులు (ఆలిండియా 1వ ర్యాంకు). 

మాది అనంతపురం జిల్లాలోని ఇనగలూరు గ్రామం. నాన్న మోహన్‌ రెడ్డి, అమ్మ విజయమ్మ వ్యవసాయం చేస్తూ ఉంటారు. 10వ తరగతి వరకూ ఓబులదేవరచెరువులోని జీవనజ్యోతి ఇంగ్లిష్‌ మీడియం స్కూల్లో చదివాను. 10వ తరగతిలో 9.5 గ్రేడ్‌ పాయింట్లు సాధించాను.  

ఓసారి మా స్కూల్లో సీఏ, సీఎంఏ కోర్సులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దాని ప్రభావంతో సీఎంఏ కోర్సును ఎంచుకున్నా. సీఎంఏ ఫౌండేషన్‌ నుంచి సీఎంఏ ఫైనల్‌ వరకు మాస్టర్‌మైండ్స్‌ వారి రివిజన్‌ ఎగ్జామ్స్, స్టడీ అవర్స్‌ షెడ్యూల్స్‌ను అనుసరించాను. ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకు తెచ్చుకోవడంలో ఇవి ప్రధానమైన తోడ్పాటును అందించాయి. 

సీఏ, సీఎంఏలు చదవాలంటే అపారమైన టాలెంట్, అత్యధిక తెలివితేటలూ ఉండాలనేమీ లేదు. కష్టపడే తత్వం, పటిష్ఠ ప్రణాళిక, సమయపాలన ఉంటే చాలు. నేను సీఏ పరీక్షలతోపాటు సీఎంఏ పరీక్షలకు కూడా సన్నద్ధం అవడంవల్ల తక్కువ శ్రమ, ఖర్చులతో రెండింటినీ పూర్తిచేయగలిగాను. సీఏ ఫైనల్‌లో ఆలిండియా స్థాయిలో 41వ ర్యాంకు తెచ్చుకున్నాను.  

ఐఐటీలో కోర్సు పూర్తిచేయటానికి పెట్టే ఖర్చుతో పోలిస్తే సీఏ, సీఎంఏలు చదవటానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఈ కోర్సులు చదవాలంటే ముఖ్యంగా ఉండవలసిన లక్షణాలు- శ్రమించే తత్వం, నిబద్ధత, సహనం. ఇవన్నీ ఉంటే సాధారణ విద్యార్థి కూడా ఈ కోర్సులు పూర్తి చేయగలడని నా నమ్మకం. ప్రాథమిక అంశాల మీద మాత్రం పట్టు బాగా పెంచుకోవాలి. 

సీఎంఏ ఫైనల్‌ పరీక్షలకు స్కానర్‌ (పూర్వపు పరీక్షల ప్రశ్నపత్రాలు), ఎం.టి.పి., ఆర్‌.టి.పి.లను బాగా సాధన చేశాను. స్కానర్‌ను విశ్లేషంచుకోవటానికి తగిన సమయాన్ని కేటాయించాను. పరీక్ష రాసేటప్పుడు సమాధానాన్ని చక్కగా రాస్తూ అవసరమైన వర్కింగ్‌ నోట్స్, కాలిక్యులేషన్స్‌ను పక్కనే రాయాలి. చాలామంది విద్యార్థులు సమాధానం మాత్రమే రాసి వర్కింగ్‌ నోట్స్‌ వేరే ఎక్కడో రాస్తూ అనవసరంగా మార్కులు కోల్పోతున్నారు. 

పరీక్షల సన్నద్ధత సమయంలో కొంతమంది వేర్వేరు పుస్తకాలు, మెటీరియల్స్‌ తిరగేస్తూ ఉంటారు. దీనివల్ల ఆందోళన, అయోమయం తప్ప ప్రయోజనం లేదు. సీఎంఏ ఇన్‌స్టిట్యూట్‌ వారి మెటీరియల్‌లో విద్యార్ధికి అవసరమైనంత సమాచారం ఉంటుంది. అది చదివితే సరిపోతుంది. పరీక్షలు జరిగినన్ని రోజులూ ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు.  

ప్రస్తుతం ఒక కార్పొరేట్‌ సంస్థలో ఉన్నతోద్యోగాన్ని సంపాదించాను. జీవితంలో ఎప్పటికైనా ఒక వ్యాపార సంస్థను స్థాపించి విజయవంతమైన వ్యాపారవేత్త కావాలనేది నా లక్ష్యం. 

సమాధానాలు సూటిగా ఉండాలి

గండ్రేటి వి.ఎస్‌.ఎస్‌.ఎం. భార్గవి  

ఊరు: గరివిడి, విజయనగరం జిల్లా  

వదో తరగతి: 9.5 గ్రేడ్‌ పాయింట్లు.  

ఇంటర్మీడియట్‌ (ఎంఈసీ): 966 మార్కులు. 

సీఎంఏ-ఫైనల్‌: 684 మార్కులు (ఆలిండియా 3వ ర్యాంకు).  

మాది విజయనగరం జిల్లా గరివిడి. మధ్యతరగతి కుటుంబం. నాన్న జి.వి.రమణమూర్తి జి.ఎం (ఎకౌంట్స్‌), ఫెర్రో ఎల్లాయిస్‌. అమ్మ విజయలక్ష్మి స్టాఫ్‌ నర్సు (జి.జి.హెచ్‌). 10వ తరగతి వరకూ గరివిడిలోని శివసాయి హైస్కూల్లో చదివాను. పదో తరగతిలో 9.5 గ్రేడ్‌ పాయింట్లు సాధించాను.  

మా నాన్న ప్రేరణతో సీఏ, సీఎంఏ కోర్సులు చేయాలని నిశ్చయించుకున్నాను. ఈ కోర్సుల్లో ఏదశలోనైనా రాణించాలంటే ముందుగా ప్రాథమిక అంశాలపై మంచి అవగాహన ఉండాలి.

సీఎంఏ ఫైనల్‌ పరీక్షలకు సీఎంఏ ఇన్‌స్టిట్యూట్‌ వారి స్టడీ మెటీరియల్, ఎంటీపీ, ఆర్‌టీపీలను సాధన చేశాను. మాస్టర్‌మైండ్స్‌ నిర్వహించే స్టడీ అవర్స్, రివిజన్‌ పరీక్షలు నేనిలా అఖిల భారత స్థాయిలో తృతీయ ర్యాంకును తెచ్చుకునేందుకు తోడ్పడ్డాయి. వారు ఏం చదవాలి, ఎలా చదవాలి అనేదానిపై ప్రణాళిక ఇచ్చి, మార్గదర్శకంగా నిలిచారు.  

ముందుగా సీఏ కోర్సుకి కోచింగ్‌ తీసుకుంటే సీఎంఏను చాలా సులభంగా పూర్తిచేయవచ్చు. పద్ధతి ప్రకారం చదవడం, తరగతులను శ్రద్ధగా వినడం నా విజయానికి కారణాలుగా భావిస్తున్నాను. సన్నద్ధత సమయంలో ప్రతి అంశానికీ ప్రాముఖ్యం ఇవ్వాలి. అన్ని అంశాలూ పునశ్చరణ సమయంలో చెయ్యగలిగారో లేదో చూసుకోవాలి. ఎంత జవాబు రాశామనే దానికంటే రాసిన సమాధానం ఎంత సూటిగా రాశామన్నదే ముఖ్యం. 

పరీక్షలో సమయపాలన చాలా అవసరం. కొంతమంది కొన్ని ప్రశ్నలకు సమాధానం ఎలా రాయాలో ఆలోచిస్తూ అనవసరంగా సమయాన్ని వృథా చేస్తుంటారు. వచ్చిన సమాధానాలను ముందుగా, వేగంగా రాసి చివర్లో రాని సమాధానాల గురించి ఆలోచించాలి. దీనివల్ల అనవసరంగా సమయం వృథా కాదు.   

ప్రస్తుతం సీఏ ఫైనల్‌ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నాను. భవిష్యత్తులో ప్రాక్టీస్‌ మొదలుపెట్టి మా జిల్లాలో ప్రముఖంగా రాణించాలని నా ఆశయం. 

Posted Date : 15-04-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.