• facebook
  • twitter
  • whatsapp
  • telegram

గూగుల్‌తో కోడింగ్‌ 

ఆన్‌లైన్‌ ప్రోగ్రాం    
స్టైపెండ్‌ సదుపాయం

ఉద్యోగసాధనను సులభతరం చేసే నైపుణ్యాల్లో కోడింగ్‌ ఒకటి. దీనిపై ఆసక్తి ఉన్నవారికి సుప్రసిద్ధ సంస్థ గూగుల్‌ ఆహ్వానం పలుకుతోంది. 2021కి సంబంధించి ‘గూగుల్‌ సమ్మర్‌ ఆఫ్‌ కోడ్‌ (జీఎస్‌ఓసీ)’ ప్రోగ్రాం ప్రకటన విడుదల అయింది. కనీసం 18 సంవత్సరాల వయసు ఉన్నవారెవరైనా దీనిలో పాల్గొనవచ్చు. దరఖాస్తు ప్రక్రియ జనవరిలో మొదలవుతుంది.

గూగుల్‌ సమ్మర్‌ ఆఫ్‌ కోడ్‌.. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రోగ్రామ్‌. ప్రపంచవ్యాప్తంగా 118 దేశాల విద్యార్థులు ఇందులో పాల్గొంటారు. స్టూడెంట్‌ డెవలపర్లను ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌కి పరిచయం చేయడమే ఈ ప్రోగ్రామ్‌ ఉద్దేశం. ఇదో 10 వారాల ప్రోగ్రామింగ్‌ ప్రాజెక్ట్‌. దీనిలో విద్యార్థి ఓపెన్‌ సోర్స్, ఫ్రీ సాఫ్ట్‌వేర్, టెక్నాలజీ సంబంధిత సంస్థలతో కలిసి కోడింగ్‌లో పాల్గొనవచ్చు..

2021 ప్రకటన ఇటీవలే విడుదలైంది. సాధారణంగా దీన్ని వేసవి సెలవుల సమయంలో నిర్వహిస్తారు. అకడమిక్‌ విరామ సమయాన్ని విద్యార్థులు సరైన దిశగా ఉపయోగించుకునేలా చేయడమే దీని ఉద్దేశం. పైగా కొంత మొత్తాన్నీ సంపాదించుకునే వీలుంటుంది. ఎంపికైతే సంస్థలు విద్యార్థికి మెంటర్‌ను ఇస్తాయి. వీరు మొత్తం ప్రక్రియలో విద్యార్థికి మార్గనిర్దేశం చేస్తారు. తద్వారా ఓపెన్‌ సోర్స్‌ కమ్యూనిటీలో భాగమవుతారు. ఆసక్తి ఉంటే కెరియర్‌ను దీనిలోనే కొనసాగించుకోవచ్చు.

ఏమిటిది?
ఇది ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్‌. ఆసక్తి ఉన్నవారు పనిచేయాలనుకుంటున్న ప్రాజెక్టు ఆలోచనను పంచుకోవాల్సి ఉంటుంది. దాని ఆధారంగా సంస్థను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా తన ప్రాజెక్టు ప్రతిపాదన (ప్రపోజల్‌)ను సంస్థతో పంచుకోవాల్సి ఉంటుంది. అది నచ్చితే సంస్థ విద్యార్థికి మెంటర్‌ను ఇస్తుంది. వీరు కలిసి ఆ ప్రాజెక్టుపై పనిచేస్తారు. మెంటర్‌ సంస్థలు ఓపెన్‌ సోర్స్‌ ప్రాజెక్టులకు దరఖాస్తు చేస్తాయి. ఎంపికైతే సంస్థలు విద్యార్థులతో ఆలోచనకు సంబంధించి చర్చలు జరుపుతాయి. గడువు సమయంలోగా కోడింగ్‌ పూర్తిచేసి, సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకుగానూ గూగుల్‌ విద్యార్థులకు స్టైపెండ్‌ కూడా చెల్లిస్తుంది.

ఎవరు అర్హులు?
కనీసం 18 సంవత్సరాల వయసు ఉండాలి. 
కళాశాల, యూనివర్సిటీ, మాస్టర్స్, పీహెచ్‌డీ, కోడింగ్‌ సంబంధిత విద్య.. దేనిలోనైనా మే 17, 2021 నాటికి చదువుతూ/ ప్రవేశం పొంది ఉండాలి. లేదా డిసెంబరు 1, 2020 నుంచి మే 17, 2021లోగా ఎంచుకున్న ప్రోగ్రామ్‌ పూర్తిచేసుండాలి. 
జీఎస్‌ఓసీ ప్రోగ్రామ్‌కు ఇదివరకే రెండు లేదా అంతకుమించిన సార్లు అర్హత పొంది ఉండకూడదు.

ముఖ్య తేదీలు
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జనవరి 30, 2021 
దరఖాస్తు చివరితేదీ: ఫిబ్రవరి 20, 2021
సంస్థల వివరాల వెల్లడి: మార్చి 10, 2021
కోడింగ్‌: జూన్‌ 7, 2021- ఆగస్టు 16, 2021
ఫలితాల వెల్లడి: ఆగస్టు 31, 2021
వెబ్‌సైట్‌: www.summerofcode.withgoogle.com

ఇదీ వరస...

దరఖాస్తు 
ఆసక్తి ఉన్న విద్యార్థులు పనిచేయదలిచిన ప్రాజెక్టు ప్రతిపాదన ఇవ్వాలి.

కోడ్‌
అనుమతి లభించిన విద్యార్థులు మెంటర్‌ మార్గదర్శకత్వంలో సమ్మర్‌ కోడింగ్‌పై పనిచేయాలి.

షేర్‌
అందరికీ తెలిసేలా విద్యార్థులు తమ కోడ్‌ను సమర్పించాలి.  
 

Posted Date : 01-12-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌