• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పరీక్షలకు తగినట్టు పక్కా ప్రణాళిక!

సర్కారీ కొలువు సాధ్యం ఇలా

 

 

మనదేశంలో ఉద్యోగ నియామకాలకు నిర్వహించే రాత పరీక్షలకు తీవ్రమైన పోటీ ఉంటోంది. అందుకే ఏదో ఒక పోటీ పరీక్ష కాకుండా ఒకటికి మించిన పోటీపరీక్షలకు వ్యూహాన్ని రూపొందించుకోవడం తెలివైన నిర్ణయం! బహుళ పోటీ పరీక్షల్ని ఎదుర్కునే సందర్భంలో  విషయ ప్రణాళికను సమర్థంగా రూపొందించుకోవాలి. అప్పుడే ఆశించిన ఫలితాన్ని పొందవచ్చు! 

 

పోటీ పరీక్షల్లో ఉండే వివిధ పేపర్లు, అందులోని వివిధ రకాలైన సబ్జెక్టులు, వాటన్నిటినీ సమగ్రంగా సరైన పద్ధతిలో అమర్చుకుని ప్రిపరేషన్‌ ఎలా చేయాలి.. అనేది వివరించేదే విషయ ప్రణాళిక. ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించే నేపథ్యంలో విషయ ప్రణాళికను రూపొందించే కిటుకులను కొన్నిటిని గత వారం చూశాం. ఇప్పుడు మరికొన్ని కీలకమైన మెలకువలు చూద్దాం!

 

ఒకే రకం కంటెంట్‌

ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్‌ పరీక్షలకు దాదాపు ఒకే రకమైన విషయం (కంటెంట్‌) ఉంటుంది. జనరల్‌ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్‌ నాలెడ్జ్, కరెంట్‌ అఫైర్స్‌ మొదలైన అంశాలు ఈ పరీక్షల్లో ఉంటాయి. ప్రశ్నల రూపంలో కొంత స్వాభావికమైన తేడా ఉన్నప్పటికీ కంటెంట్‌ నేపథ్యం ఒకటేనని అభ్యర్థులు గమనించాలి. అందువల్ల ఈ అంశాలన్నిటినీ పొందికగా నేర్చుకోవడం ద్వారా ఈ మూడు రంగాల్లో వచ్చే వివిధ రకాల పరీక్షలను కాలానుగుణంగా ఎదుర్కొనే విషయ ప్రణాళిక రచించుకోవాలి. 

ముఖ్యంగా ఈ పరీక్షల్లో పట్టణ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంది. జనరల్‌ ఇంగ్లిష్‌ సబ్జెక్టు, కొన్ని పరీక్షల్లో ప్రాంతీయ భాషల్లో ప్రశ్నపత్రాలు లేకపోవడం ఇందుకు ముఖ్య కారణాలు. అందుకని కంటెంట్‌ ప్రణాళికను తయారు చేసుకునేటప్పుడు ఎక్కువ సమయాన్ని తొలిదశలో ఇంగ్లిష్‌ భాషకు కేటాయించాలి. ఈ భాషపై పట్టు సాధించాక దానికి కేటాయించే సమయాన్ని తగ్గించవచ్చు. ప్రధానంగా గ్రామీణ అభ్యర్థులు అధిక సమయం ఇంగ్లిష్‌ భాషకి కేటాయించి కాలం గడుస్తున్న కొద్దీ సమయాన్ని తగ్గించుకుంటూ మిగతా కంటెంట్‌పై దృష్టి పెట్టేలా ప్రణాళిక వేసుకోవాలి.

వీటిలోని కొన్ని పరీక్షల్లో అభ్యర్థి డిస్క్రిప్టివ్‌ నైపుణ్యాలను కూడా పరిశీలిస్తున్న సందర్భం ఉంది. కాబట్టి కంటెంట్‌ ప్రణాళికను తయారు చేసుకునేటప్పుడు డిస్క్రిప్టివ్‌ స్కిల్స్‌కు కూడా ప్రాధాన్యం ఇస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌ విభాగాల్లో గరిష్ఠ మార్కులు సాధించేందుకు అభ్యర్థి సహజ తెలివితేటలు ఉపకరిస్తాయి. అయితే ఎంత ప్రాక్టీస్‌ చేస్తే అదనంగా అన్ని మార్కులు వస్తాయని గ్రహించాలి. కంటెంట్‌ ప్రణాళిక తయారు చేసేటప్పుడు ఈ విభాగాల్లో ఎక్కువ ప్రాక్టీస్‌ చేసే విధంగా ప్రణాళిక రచించుకోవాలి.

 

ఏ పరీక్షకు ప్రాధాన్యం?

సివిల్స్, గ్రూప్‌-1.. ఈ రెండు రకాల పరీక్షలూ ఎదుర్కొని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని అభ్యర్థులు భావిస్తుంటారు. అయితే ఈ రెండు రకాల పరీక్షల్లో దేని కంటెంట్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రిపరేషన్‌ కొనసాగించాలో అభ్యర్థుల్లో చాలా సందిగ్ధత కనిపిస్తుంటుంది. రెండు రకాలైన పరీక్షలు ఎదుర్కొని ఉద్యోగాలు సాధించాలనుకునేవారు ముందస్తుగా ఏ పరీక్ష ముందుగా జరుగుతుంతో, దేన్ని క్రమబద్ధంగా నిర్వహిస్తారు? అనే అంశాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. ఆపై ఆ పరీక్ష కంటెంట్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తూ సిద్ధమవ్వాలి. 

 

భావ వ్యక్తీకరణ సామర్థ్యం 

ఒకవేళ రెండు పరీక్షలనూ ఒకే నిర్దిష్ట కాలంలో ఎదుర్కోవలసి వస్తే? రెండిట్లోనూ ఉమ్మడిగా ఉన్న అంశాలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చేలా ప్రణాళిక ఉండాలి. ఆ తరువాత పరీక్ష నిర్వహించే తేదీని బట్టి ఆ పరీక్షకు ప్రత్యేకించి ఉండే కంటెంట్‌పె దృష్టి పెడుతూ ప్రణాళిక రూపొందించుకోవాలి. గ్రూప్‌-1 పరీక్షలో ప్రాంతీయ విషయాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ప్రాంతీయ భౌగోళిక ఆర్థిక చారిత్రక అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ సిలబస్‌ ఉంటుంది. అందుకని కాలం దృష్ట్యా గ్రూప్‌-1 పరీక్ష ముందుగా రాయాలనుకుంటే ప్రాంతీయ అంశాలకు ప్రాధాన్యమిస్తూ విషయ ప్రణాళిక రూపొందించుకోవాలి. ఈ రెండు రకాల పరీక్షల్లోనూ విషయ పరిధి, విశ్లేషణ, అనువర్తన స్థాయుల్లో తేడా ఉంటుంది. ఆ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని కంటెంట్‌ సన్నద్ధత ఉండేవిధంగా ప్లాన్‌ చేసుకోవాలి. భావ వ్యక్తీకరణ ప్రధానంగా మార్కులు వచ్చేందుకు దోహదపడుతుంది కాబట్టి ఆ సామర్థ్యం పెంచుకునే దిశగా పుస్తకాల ఎంపిక, ప్రయత్నం ఉండాలి. అందుకు అనుగుణంగా కంటెంట్‌ ప్రణాళిక ఉండేలా జాగ్రత్తపడాలి. 

 

రెండిట్లోనూ నెగ్గాలంటే...

గ్రూప్‌-1 పరీక్ష ప్రధానంగా డిస్క్రిప్టివ్‌గా ఉంటుంది. గ్రూప్‌-2 పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. గ్రూప్‌-2 పరీక్షలో ఉండే కంటెంట్‌ మొత్తం దాదాపుగా గ్రూప్‌-1కి ఉపకరిస్తుంది. అయితే గ్రూపు-1లో ఉండే అనేక కంటెంట్‌ విభాగాలు గ్రూప్‌-2లో కనిపించవు. గ్రూప్‌-1 సిలబస్‌లో దాదాపు 60-70 శాతం చదివి కూడా మంచి విజయాన్ని సాధించవచ్చు. గ్రూప్‌-2లో మొత్తం సిలబస్‌ చదవాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ కోణంలో మారుమూల అంశాలు కూడా పరిగణిస్తూ చదవాలి. ఇది గమనించి కంటెంట్‌ ప్రణాళిక రూపొందించుకుంటే రెండు పరీక్షల్లోనూ విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి. గతంలో చాలామంది ర్యాంకర్లు గ్రూప్‌-1లో, గ్రూప్‌-2లో విజయం సాధించారు.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్, గ్రూప్‌-2 పేపర్లను అనుసంధానం చేసుకుని ఉమ్మడి అంశాలతో మొదటిదశలో అధ్యయనం చేసేలా ప్రణాళిక ఉండాలి. తరువాతి దశలో గ్రూప్‌ 1, 2లలో విడివిడిగా ఉంటున్న అంశాలను కవర్‌ చేసేవిధంగా ప్రణాళిక రూపొందించుకోవచ్చు.

గ్రూప్‌-2 పరీక్షలో ఉండే కంటెంట్‌ మొత్తం దాదాపుగా గ్రూప్‌-1కి ఉపకరిస్తుంది. అయితే గ్రూపు-1లో ఉండే అనేక కంటెంట్‌ విభాగాలు గ్రూప్‌-2లో కనిపించవు. గ్రూప్‌-1 సిలబస్‌లో దాదాపు 60-70 శాతం చదివి కూడా మంచి విజయాన్ని సాధించవచ్చు. గ్రూప్‌-2లో మొత్తం సిలబస్‌ చదవాల్సి ఉంటుంది. 

 

ప్రిలిమినరీ, మెయిన్స్‌ వేర్వేరు కాదు

కొంతమంది అభ్యర్థులు గ్రూప్‌-1ను మాత్రమే రాయాలనుకుంటారు. అయితే ప్రిలిమినరీ, మెయిన్స్‌ల సన్నద్ధత దేనికదే చేయాలా? అనుసంధానం చేయాలా? అని సందిగ్ధతకు లోనవుతూ ఉంటారు. అందువల్ల విషయ ప్రణాళికలను సమర్థంగా రూపొందించుకోలేరు. 

ఇక్కడ తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే- ప్రిలిమినరీ కంటెంట్‌పై బాగా తయారవటం ద్వారా మెయిన్స్‌లో కూడా 30 శాతం మార్కులు తెచ్చుకోవచ్చు. అదేవిధంగా మెయిన్స్‌ ప్రిపరేషన్‌లో ఉండే అనువర్తనాలు, పరిధికి బయట ఉండే విషయాలు అర్థం చేసుకోవటం ద్వారా ప్రిలిమినరీలో కూడా ఇతరుల కంటే అదనంగా మార్కులు తెచ్చుకునే అవకాశంవుంది. 

అంటే.. ప్రిలిమినరీ వేరు, మెయిన్స్‌ వేరు అని భావించకుండా రెండిట్లోనూ ఉమ్మడిగా ఉండే కంటెంట్‌ అంశాలపై మొదటి దశలో దృష్టిపెట్టాలి. ఆబ్జెక్టివ్‌ తరహాలో మొదట సిద్ధమై తరువాత డిస్క్రిప్టివ్‌ తరహాలో తయారయ్యేలా ప్రణాళిక ఉండాలి. ప్రిలిమ్స్‌లో ఆబ్జెక్టివ్‌ కింద తయారయ్యే అనేక అంశాలు మెయి  న్స్‌లో ఒక మార్కు, రెండు మార్కుల ప్రశ్నలకు సమాధానం రాసేలా ఉపకరిస్తాయి. కాబట్టి ప్రిలిమ్స్‌ మెయిన్స్‌లను అనుసంధానించి (ఇంటిగ్రేట్‌ చేసి) చదివే విధానం మేలైనది.

 

ఆబ్జెక్టివ్‌ ధోరణికి అధిక  ప్రాధాన్యం 

ఎస్‌ఐ ఆఫ్‌ పోలీస్, గ్రూప్‌-2- ఈ కాంబినేషన్‌లో ఉద్యోగాలు ఆశించే అభ్యర్థుల సంఖ్య ఎక్కువే. రెండు పరీక్షల్లోనూ ఆబ్జెక్టివ్‌ ధోరణికి అధిక ప్రాధాన్యం ఉంది. అయితే కంటెంట్‌లోని విభాగాలకు వెయిటేజ్‌లో తేడా ఉంటుంది. జనరల్‌ స్టడీస్‌ సంబంధిత విషయాలు గ్రూప్‌-2 స్థాయిలో చదివితే ఎస్‌ఐ ఆఫ్‌ పోలీస్‌ ఉద్యోగానికి ప్రిపరేషన్‌ చాలా సులభం. ప్రధానంగా ఇండియన్‌ ఎకానమీ, ప్రాంతీయ ఎకానమీల విషయంలో గ్రూప్‌-2కు సిద్ధమయ్యే కోణంలో ఎస్‌ఐ ఆఫ్‌ పోలీస్‌ అభ్యర్థులు చాలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. గ్రూప్‌-2లో ఉండే ప్రాంతీయ చరిత్ర, పాలిటీ లోతైన ప్రశ్నలు ఎస్‌ఐ పరీక్ష పరిధికి బయట ఉంటాయి. వాటిని అధ్యయనం చేసేందుకు ప్రత్యేక సమయం కేటాయించగలిగితే గ్రూప్‌-2 పరీక్షలో కూడా రాణించవచ్చు. గ్రూప్‌-2 పరీక్షల్లో కనపడని   అంశాలు ఎస్‌ఐ పరీక్షలో ఉన్నాయి కాబట్టి రెండు పరీక్షలూ రాసే అభ్యర్థులు ఆయా విషయాలకు ప్రత్యేక సమయాన్ని కేటాయించి ప్రణాళిక రచించుకోవాలి.

డీఎస్సీ పరీక్ష రాసే వారు మిగతా పరీక్షలతో అనుసంధానం చేసుకుని కంటెంట్‌ ప్రణాళిక వేసుకోవాలంటే ఇబ్బందే. డీఎస్సీ కంటెంట్‌ పూర్తిగా ఇతర పరీక్షలకు విభిన్నమైనది కాబట్టి ఆ కంటెంట్‌కు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ ప్రణాళిక రచించుకోవటం సరైన నిర్ణయం.

 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ NEET: నీట్‌... ఆ తర్వాత!

‣ మేటి డిగ్రీ కళాశాలలు ఇవే!

Posted Date : 16-11-2021 .

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌